(Telugu) ఆషాడభూతి కథ

[:te]పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఒకడుండేవాడు. అతడు బాగా చదువుకున్నవాడు, అనేక విషయాలు తెలిసినవాడు. చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండేవాడు. భక్తుల కథలు, దేవుని కథలు వినిపిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు వినడానికి జనులు తండోపతండాలుగా వచ్చేవారు. వారు భక్తితో దేవశర్మకి పండ్లు, ఫలాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు. కానుకలు తెచ్చిన వారితో దేవశర్మ "ఎందుకు నాయనా ఇవన్నీ, ఎందుకు తల్లీ మీకీ శ్రమ" అని పైకి పలుకుతూ లోలోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు. పండ్లు, ఫలాలు తిన్నన్ని తిని కొన్నిటిని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు. డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచేవాడు. ఎప్పుడూ ఆ బొంతను పైన కప్పుకొని కూర్చొనేవాడు.

ఒకనాడు "ఆషాడభూతి" అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఆ సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు. అతడు దేవశర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతనిని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేయతలతో సేవలు చేయనారంభించాడు. కొన్నాళ్ళకు సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది. తానెక్కడికి పోయినా శిష్యుని వదిలి వెళ్ళేవారు కాదు.

ఒకనాడు గురుశిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్ళారు. మరునాడు తిరిగి తమ ఊరు వస్తున్నారు. కొంతదూరం వెళ్ళగానే ఆషాడభూతి "గురువుగారూ! ఎంత అపచారం జరిగింది. రాత్రి మనం నిద్రించిన ఇంటివారి చీపురు పుల్ల ఒకటి నా సంచికంటుకొని వచ్చింది. అక్కడ నేనది గమనించలేదు. ఎంత ఘోరం జరిగిందో చూడండి. గడ్డి పరకైనా పరుల సొమ్ము పాము వంటిది కదా! పరధనాన్ని కాజేయటం కన్నా పాపం లేదు అని తమబోటి పెద్దలు చెపుతారు కదా! తమరు సెలవిస్తే నేనిప్పుడే వెళ్లి ఈ సొమ్మును ఆ ఇంటివారికి ఇచ్చివస్తా"నని వెనకకు పరుగెత్తి దారిలో కొంతసేపు గడిపి తిరిగి వచ్చాడు.

అప్పుడు గురువుగారు "శిష్యా! నీ బుద్ధి మెచ్చుకోదగినది. ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే అభిప్రాయం గల నీ వంటి శిష్యుడు లభించటం నిజంగా నా అదృష్టం" అని పొగిడాడు. ఇంతలో సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసుకొనే నిమిత్తం దేవశర్మ తన బొంతను, ఇతర సామగ్రిని ఆషాడభూతి చేతికి ఇచ్చి "నాయనా! వీనిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చొనుము. నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వస్తాను" అని చెప్పి వెళ్ళాడు. అదే మంచి సమయమని భావించి ఆషాడభూతి బొంతతో సహా పారిపోయాడు.

కొంతసేపటికి దేవశర్మ గట్టుపైకి వచ్చి చూడగా ఆషాడభూతి కనపడలేదు. "శిష్యా ఆషాడభూతీ! ఎక్కడున్నావు నాయనా? త్వరగా రా నాయనా!" అని గొంతు చించుకొని కేకలు వేశాడు. ఎంతగా అరిచి గీ పెట్టినా ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియలేదు. మంచివాడని ఉత్తముడని శిష్యుణ్ణి నమ్మి ఎన్నాళ్ళగానో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గునికి అప్పగించానే" అనిదేవశర్మ ఎంతగానో దుఃఖించాడు.

ఈ లోకంలోఆషాడభూతి వంటి నమ్మక ద్రోహులుంటారు. కాబట్టి తొందరపడి ఎవరినీ నమ్మరాదు. తాడెక్కేవాడికి తల తన్నేవాడు ఉంటాడు. దానము భోగము ఎరుగని లోభివాడు కూడబెట్టిన ధనం చివరకు దొంగలపాలై తీరుతుంది" అని ఈ కథ సారాంశం.

దమనకుని వలన పై కథలు విన్న కరటకుడు "ఈ కథలు సరే! మరి నీవిప్పుడు ఏంచేయదలచావు? అని అడిగాడు. దానికి దమనకుడు "వెంటనే సంజీవక-పింగళకుల స్నేహం చెడగొట్టాలి, దానికేదైనా ఉపాయం ఆలోచించాలి. ఎంత కష్టమైన పనైనా ఉపాయంతో ఇట్టేసాధించవచ్చు. పూర్వం ఒక కాకి ఉపాయంతో పామును చంపించింది. ఆ కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము