(Telugu) మధ్వాచార్యులు

[:te]మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరియు భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు.

పుట్టుక / బాల్యము
మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది. ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
దక్షిణభారత యాత్ర
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పుర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.

రచనలు
తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి ప్రముఖమైనవి

గీతాభాష్యం గీతాతాత్పర్యం బ్రహ్మసూత్రభాష్యం అణువ్యాఖ్యానం న్యాయవివరణం అణుభాష్యం దేశోపనిషద్భాష్యం మహాభారతతాత్పర్యనిర్ణయం యమకభారతం దశప్రకరణం తంత్రసారం ద్వాదశస్తోత్రం కృష్ణార్ణవామృతం సదాచారస్మృతి జయంతినిర్ణయం ప్రణవకల్పం న్యాసపద్ధతి తిథినిర్ణయం కందుకస్తుతి
ద్వైత వాదం
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం. భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:
సాలోక్యం – జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం సామీప్యం – భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం సారూప్యం – భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం సాయుజ్యం – భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.
ద్వైతమత ప్రభావం
మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు.దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.

నిర్యాణం
మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ.శ.1317లో శిష్య సమేతంగా బదరి నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.

***************************************************************************************************

శ్రీ మధ్వ నవమి

మాఘశుక్ల నవమి ‘మధ్వ నవమి’గా ప్రసిద్ధం. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం- శ్రీమధ్వాచార్యుల శ్రీవారి అవతారం. ఆయన ఆశ్వయుజ విజయదశమి నాడు 1238లో దక్షిణ కన్నడ పజక క్షేత్రంలో జన్మించారు. వాసుదేవుడని నామకరణం చేశారు. పన్నెండో ఏట అక్షితప్రేక్ష తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. ఆ వయస్సులోనే సకల శాస్త్ర జ్ఞానం సంపాదించుకున్నందువల్ల గురువులు వాసుదేవుడికి పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యే మార్గానికి చిహ్నంగా- శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.

శూన్యవాదం, నిరీశ్వరవాదం ప్రబలి, జాతిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఆయన సదాచారాన్ని ప్రబోధించారు. ప్రభువుకు సత్కర్మలను నివేదించమని భక్తులకు ఆదేశించారు. వేదం కేవలం కర్మకాండ కాదు, నిత్య జీవన విధానానికి అన్వయించదగ్గ ఒక దివ్య ప్రబంధమని నిర్వచించారు. ఒక అనుష్ఠాన వేదాంతిగా భగవద్గీత, బ్రహ్మసూత్ర, మహాభారత, భాగవత పురాణ ఇత్యాది గ్రంథాలకు విపుల వ్యాఖ్యానాలు సమకూర్చారు. ప్రథమ హనుమ, ద్వితీయ భీమ, తృతీయ పూర్ణప్రజ్ఞ అన్న విశ్వాసం మేరకు

శ్రీమధ్వాచార్యులు ఎన్నో మహిమలను ప్రదర్శించారంటారు. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.
రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యులవారే. నేటికీ అనునిత్యం సుప్రభాత సేవలతో శ్రీకృష్ణ సేవా కార్యక్రమాలు ఆ క్షేత్రంలో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయి. అలా జరగటానికి అనువుగా, ఎనిమిది మఠాలను శ్రీమధ్వాచార్యులు ఏర్పాటుచేసి, ఎనమండుగురు తీర్థులను ప్రతినిధులుగా చేశారు. హృషీకేశ తీర్థులు పాలకూర్ మఠానికి, నరసింహ తీర్థులు అడమారు మఠానికి, జనార్దన తీర్థులు కృష్ణపుర మఠానికి, ఉపేంద్ర తీర్థులు పుట్టిగె మఠానికి, వామన తీర్థులు షిరూర్ మఠానికి, విష్ణుతీర్థులు సోడె మఠానికి, రామతీర్థులు కనిమార్ మఠానికి, అధోక్షజ తీర్థులు పెజావర మఠానికి అధిపతులై, గురువు ఆజ్ఞ మేరకు ‘పర్యాయ’ క్రమంలో కృష్ణుణ్ని కొలవటం గమనించదగ్గ విశేషం. ఈ పర్యాయ కార్యక్రమం ఇప్పటికీ క్రమం తప్పకుండా కొనసాగుతూ ఉంది.

శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవిత కాలంలో మూడు పర్యాయాలు బదరీ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరి యాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వనవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశవ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అటు అతివాదానికి ఇటు మితవాదానికి మధ్యే మార్గంగా శ్రీమధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతం ఒక హితవాదమనే చెప్పాలి. అహం బ్రహ్మాస్మి అయితే నువ్వెవరివి అన్న ప్రశ్నకు, కేవలం శరణాగతి అయితే నీ గతేమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా తత్వవాదాన్ని ఆచార్యులవారు అనుసంధించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలతోపాటు కర్తవ్య కర్మ ఆచరణ ద్వారా శ్రీచరణాలు చేరవచ్చునని మార్గదర్శనం చేశారు.

జగత్తు మాయా మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే. పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వతంత్రుడు. జీవోత్తముడు ఆచార్యుడు. ధర్మమార్గంలో, ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వులకు శిరోధార్యం.
జీవిత కాలంలో ఆనందానుభూతి పొందగల సులభతరమైన భక్తిమార్గాన్ని ఆయన బోధించారు. అందుకే ఆచార్యులవారికి ఆనంద తీర్థులన్న నామధేయం బహుళ ప్రచారంలో ఉంది.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

ఉపనయనము