కనకధారాస్తవము
ఇది శ్రీఆదిశంకరులచే విరచితము. ఆయన ఒక పేదరాలి ఇంటికి బిక్షకై వెడలినపుడు ఆమె వద్ద ఆ సమయమున ఏమియు లేకపోవుట వలన జగద్గురువును రిక్త హస్తములతో పంపుటకు మనస్కరించక ఒక ఉసిరికాయను భక్తితో బిక్షాపాత్రలో ఉంచెను. ఆచార్యులు ఆమె పరిస్థితిని దివ్యదృష్టితో గమనించి ఆమె పేదరికమును తొలగించుటకు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారాస్తవము పఠించినారు. అంతట లక్ష్మీదేవి సాక్షాత్కరించి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆమె పేదరికమును పోగొట్టినది. "తమకు అవసరమైన ధనమింత" అని శ్రీ అమ్మవారితో చెప్పుకొని ఈ స్తోత్రమును ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో - అనఁగా దినమునకు మొత్తము మూడు సారులు - అట్లు 40 రోజుల పాటు ఎడతెగక అమ్మవారి ఎదుట కూర్చుండి చదివినచో అవసరమైనంత ధనము తప్పక లభించునని అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పియున్నారు. అట్లే దీనిని జీవితాంతము పారాయణ చేయువారి కుటుంబములు కుబేర సమానములై వర్ధిల్లును. పారాయణ పద్ధతి : కుల, మత, వర్గ, వయో, లింగాది విచక్షణ లేకుండా ఎవరైనను దీనిని పారాయణ చేయవచ్చును. కాని నియమములను తప్పనిసరిగా పాటింపవలెను. దేవాలయములో గాని, నివాస గృహమునందున్న పూజామందిరములో గాని పారాయణ చేయవలెను. ఇతర ప్రదేశములు నిషిద్ధము. ప...