శ్రీకాకుళంలో ఆముక్తమాల్యద
కృష్ణానది కేవలం ప్రజల దాహార్తిని మాత్రమే తీర్చలేదు. వారి ఆధ్మాత్మికత తృష్ణను సైతం తీర్చిన పుణ్యక్షేత్రాలెన్నింటికో నెలవుగా మారింది. కృష్ణాతీరం కేవలం వ్యవసాయానికి మాత్రమే ఊతమివ్వలేదు. సాహిత్యాన్ని సైతం పండించింది. దానికి ఆముక్తమాల్యద గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ విశేషాలు... పంచమహాకావ్యం తెలుగునాట పంచమహాకావ్యాలలో కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదను ఒకటిగా భావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగతా నాలుగు కావ్యాలను రాసింది కూడా ఆయన ఆస్థానకవులే (అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు, ముక్కు తిమ్మన). అంతటి ప్రతిభావంతులైన కవులను గుర్తించి, వారితో సంభాషించగల ప్రతిభ ఉన్న కృష్ణరాయలకు స్వయంగా కావ్యాన్ని రచించగల నేర్పు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది! శ్రీకాకుళం- కృష్ణదేవరాయలు కృష్ణాతీరాన వెలసిన శ్రీకాకుళం, దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి. ఇందులో వెలసిన ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారికే సొంతమైన దైవం. కృష్ణదేవరాయల వారు తన దండయాత్రలలో భాగంగా ఒకమారు విజయవాడను చేరుకున్నారట. అక్కడకి దగ్గరలోనే ఉన్న శ్రీకాకుళ ప్రసక్తిని విని ఆంధ్రమహావిష్ణువుని దర్శించుకుని అక్కడే విడిద...