అచ్చ తెలుగు పండుగ - అట్లతద్ది
భారతీయుల ప్రతి పండుగా వారి జీవనవిధానానికి ప్రతీక. అందులో భక్తి ఎంతగా కనిపిస్తుందో, సంస్కృతీ అంతే స్పష్టంగా ఉంటుంది. పైన ఆచారంలా తోచినా ఆరోగ్య రహస్యాలూ ఇమిడి ఉంటాయి. ఒక్క అట్లతద్దిని గమనిస్తే చాలు... ఈ మాటలలో వాస్తవం ఏమిటో తెలిసిపోతుంది. వ్రత కథ పూర్వం ఒక రాజకుమారి తన స్నేహితురాళ్లతో కలిసి మంచి భర్తని పొందేందుకుగాను అట్లతద్ది నోముని నోచుకుంది. నోములో భాగంగా ఉపవాసం ఉన్న రాజకుమారి ఆకలికి తాళలేక సాయంవేళకే సొమ్మసిల్లిపోయింది. రాజకుమారి అలా శోషగా పడి ఉండటాన్ని చూడలేని ఆమె సోదరుడు, చంద్రోదయం అయిపోయిందని నమ్మించి ఆమె ఆహారం తీసుకునేలా చేశాడు. కాలక్రమేణా రాజకుమారికీ, ఆమె స్నేహితురాళ్లకీ పెళ్లిళ్ల జరిగాయి. ఆ రోజు నోము నోచుకున్నవారందరికీ మంచి భర్తలు లభించగా... రాజకుమారికి మాత్రం ముసలి భర్తి లభించాడు. అంత శ్రద్ధగా నోము చేసుకున్నా కూడా తనకి ఈడుజోడు కానీ భర్త లభించడం చూసి రాజకుమారి క్రుంగిపోయింది. తన వల్ల పొరపాటు ఎక్కడ జరిగిందంటూ పార్వతీపరమేశ్వరులను వేడుకుంది. అంతట ఆ ఆదిదంపతులు ప్రత్యక్షమై జరిగిన లోపాన్ని వివరించి, ఈసారి ఆ వ్రతాన్ని ఎలాంటి లోపం లేకుండా చేస్తే భర్త యవ్వనవంతుడవుతాడని చెప్పారు. రాజకుమార...