(Telugu) నరసింహ శతకము - శేషప్పకవి
[:te] * అడవి పక్షులకెవ్వఁ డాహారమిచ్చెను - మృగజాతికెవ్వఁడు మేఁతఁ బెట్టె? వనచరాదులకు భోజనమెవ్వడిప్పించెఁ - జెట్లకెవ్వఁడు నీళ్ళు చేది పోసె? స్త్రీలగర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె - ఫణులకెవ్వఁడు పోసెఁ బరఁగపాలు? మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించెఁ - బసులకెవ్వఁడొసంగెఁ బచ్చిపూరి? జీవ కోట్లనుఁ బోషింప నీవెగాని, వేఱెయొక దాత లేఁడయ్య వెదకిచూడ! భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర! * అతిలోభులను భిక్ష మడుగబోవుట రోత - తన ద్రవ్య మొకరింట దాచ రోత గుణహీనుడగువాని కొలువుఁ గొల్చుట రోత - యొరుల పంచల క్రింద నుండ రోత భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోత - గుఱిలేని బంధులగూడ రోత యాదాయములు లేక యప్పుఁదీయుట రోత - జారచోరుల గూడి చనుట రోత యాదిలక్ష్మీశ! నీ బంటు నైతినయ్య! యింక నెడబాపు జన్మం బదెన్న రోత భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర! * అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే - పసుల నార్జించుట పాడి కొరకె సతినిఁ బెండ్లాడుట సంసారసుఖముకే - సుతులఁ బోషించుట గతుల కొరకె సైన్యమున్ గూర్చుట శత్రు భయంబుకే - సాము నేర్చుటలెల్లఁ జావు కొరకె దానమిచ్చుటయు ముందటి సంచితమునకే - ఘనముగా చదువుట కడుపు కొరక...