కోపం ఒక శాపం!
ఓ ఊళ్లో ప్రశాంత్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను పేరుకి మాత్రమే ప్రశాంత్. కోపం మాత్రం ముక్కుమీదే ఉండేది. రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం, అవతలి వాళ్ల వయసుకీ, వ్యక్తిత్వానికీ గౌరవం ఇవ్వకుండా నానా మాటలు అనడం… ఇదీ ప్రశాంత్ గుణం. ప్రశాంత్ చూడటానికి ముచ్చటగా ఉండేవాడు, ఏ పనిని మొదలుపెట్టినా సమర్థవంతంగా పూర్తిచేసేవాడు. కానీ ఏం లాభం! కోపం వస్తే విచక్షణ లేని పశువుగా మారిపోతాడు. ప్రశాంత్ గురించి ఊరంతా చెడుగా చెప్పుకుంటుంటే అతని తల్లిదండ్రులకు బాధగా ఉండేది. కానీ నయాన భయాన ఎంతగా నచ్చచెప్పినా వాళ్లు ప్రశాంత్‌లో మార్పుని తీసుకురాలేకపోయారు. చివరికి ప్రశాంత్ తండ్రికి ఓ ఉపాయం తట్టింది. ఆ సాయంత్రం ప్రశాంత్‌ను పిలిచి “ఎన్నిరోజులు ఎదురుచూసినా నీలో మార్పు రావడం లేదు బాబూ!” అన్నాడు దీనంగా. “ఏం చేసేది నాన్నా! కోపం వస్తే నన్ను నేను మర్చిపోతాను. కోపాన్ని అదుపుచేసుకోవడం నా వల్ల కావడం లేదు” అని అంతే దీనంగా బదులిచ్చాడు ప్రశాంత్. “సరే దీనికి నేనో ఉపాయాన్ని ఆలోచించాను విను. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో మన పెరటిగోడ దగ్గరకి వెళ్లి నీ బలమంతా ఉపయోగించి ఓ మేకుని కొట్టు. అలా నీ కోపం చల్లారుతుందేమో చూద్దాం” అన్నాడు ...