నరనారాయణ జయంతి
ఈ లోకంలో బ్రహ్మ చేస్తున్న సృష్టికి సహకరించేందుకు కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు. వీరిలో ఒకరు ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతి తన సోదరుడు దక్ష ప్రజాపతి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి నరుడు, నారాయణుడు అనే కవల పిల్లలు జన్మించారు. నరుడు, నారాయణుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి. విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహునిగా అవతరించిన విషయం తెలిసిందే! సగం నరుడిగానూ, సగం సింహరూపంలోనూ ఉన్న ఈ అవతారంలో నరరూపం నరునిగానూ, సింహరూపం నారాయణునిగానూ ఉండిపోయారని కూడా చెబుతారు. మానవజన్మకు లభించే ఒక అదృష్టం... సృష్టికర్త మీద మనసుని లగ్నం చేసి తపస్సులో మునిగిపోవడం. ఆ అదృష్టాన్ని తాము కూడా అనుభవించాలని అనుకున్నారో, మానవులకు ఆదర్శంగా నిలవాలనే అనుకున్నారో... నరనారాయణులు తపస్సులో మునిగిపోయారు. అలా హిమాలయాల సమీపంలోని ఒక వనంలో వీరిరువురూ తపస్సు సాగించారు. ఆ వనమంతా రేగుచెట్లతో నిండిపోయి ఉంది. ఆ రేగుపళ్లనే ఆహారంగా తీసుకుంటూ వారు తమ తపస్సుని సాగించారట. రేగుపండుకి బదరీఫలం అన్న పేరు ఉంది కాబట్టి, ఇక్కడ తపస్సు ఆచరించిన నరనారాయణులకి బదరీనాథుడన్న పేరు స్థిరపడింది. నరనారాయ...