ప్రపంచాన్ని జయించే ముందు, మనసులో స్వేచ్ఛని పొందు!
సింధునదీతీరంలో మకాం వేసిన అలగ్జాండర్, కొందరు సాధువుల జ్ఞానానికి ఆశ్చర్యపోయి, వారిని సగౌరవంగా విడిచిపెట్టేశాడని మనం ఇంతకు ముందు చదివాం. అయితే వాళ్ల జ్ఞానానికి ముగ్ధుడైన అలెగ్జాండర్ `మిమ్మల్ని ఇంత గొప్పగా ప్రభావితం చేసిన గురువు ఎవరు?` అని అడిగాడు. దానికి వారు `రాజా! ఆయన పేరు దండమిస్. అదుగో ఆ కనిపించే అడవులలో సంచరిస్తుంటాడు. రాలిన పళ్లని తింటూ, సెలయేరుల్లో దాహం తీర్చుకుంటూ ఉంటాడు. పిల్లవాడు తల్లి నుంచి పాలు తాగినంత స్వేచ్ఛగా, ఈ సృష్టి నుంచి అతను ప్రశాంతతను పొందుతున్నాడు.` అని చెప్పారు. `అయితే ఆ రుషిని నా దగ్గరకి తీసుకురండి` అని తన దగ్గర ఉన్న ఆన్‌సిక్రిటస్ అనే రాతగాడిని పంపించాడు. ఆన్‌సిక్రిటస్ దర్జాగా దండమిస్‌ని వెతుక్కుంటూ బయల్దేరాడు. కొద్దిసేపటికి అడవిలో ఒకచోట నిశ్చలంగా ఆకుల మీద పడుకుని ఉన్న దండమిస్ అతనికి కనిపించాడు. ``ఓ రుషీ! ఈ ప్రపంచంలోని ప్రజలందరికీ రాజు, దైవసమానుడు అయిన అలగ్జాడర్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు కనుక ఆయన ఆజ్ఞను పాటిస్తే అద్భుతమైన బహుమతులతో మిమ్మల్ని ముంచెత్తుతాడు. లేదంటే మీ తల తీసేందుకు కూడా వెనుకాడడు`` అ...