శంకర జయంతి......ఆది శంకరాచార్య...
ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు) కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాల...