(Telugu) ఓటమి నుంచి నేర్చుకోవడం ఎలా — వల్లభాయి పటేల్ జీవితంలో పాఠం

[:te]










మనం భవిష్యత్తు గురించి ఏర్పరుచుకున్న ఊహలు, మన సామర్థ్యం గురించి పెట్టుకున్న నమ్మకాలు చెదిరిపోయేలాంటి ఓటమి ఎదురైతే ఎవరైనా జంకుతారు. కుంగిపోవడం, ఆ పనుల నుంచి పూర్తిగా తప్పుకోవడం, డిప్రెషన్‌లోకి వెళ్ళపోవడం కనిపిస్తూంటుంది. కానీ చరిత్రలో తిరుగులేని విజయాలు సాధించిన ఏ మనిషి జీవితం చూసినా విజయాల కన్నా పరాజయాలే ముఖ్యమని తెలుస్తుంది. సామాన్యంగా ఏ మనిషికీ ఏ గొప్ప పనీ చేసేందుకు సహజంగా సమర్థత ఉండదు. ఆ పనిచేయడానికి ఓ పది లక్షణాలు కావాల్సివస్తే మహా అయితే అందులో ఓ అయిదారు ఉంటాయి, మిగిలినవి ఓటముల ద్వారా నేర్చుకుని ముందుకు వెళ్తారు. ఓటమి చెందినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలి అన్నదానిపై వల్లభ్‌భాయ్ పటేల్ జీవితం నుంచి ఉదాహరణ చూద్దాం.


1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 550కి పైగా చిన్న పెద్ద సంస్థానాలు దేశంలో భాగంగా ఉండేవి. వాటన్నిటికీ స్వతంత్రం వచ్చేసింది. టెక్నికల్‌గా అవన్నీ పాకిస్తాన్‌, భారతదేశంలా వేరే దేశాలు అయిపోయే అవకాశం ఏర్పడింది. భారతదేశం ఏర్పాటు అవుతూనే తనలోనే ఇన్ని చిన్న చిన్న రాజ్యాలు రాచపుండులా ఉండే ప్రమాదం ఏర్పడితే దాన్ని అత్యంత సమర్థంగా పరిష్కరించినవాడు — అప్పటి సంస్థానాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వల్లభాయ్ పటేల్. 550 రాజ్యాల్లో రాజులు, దివాన్లు, రాచకుటుంబంలో బలమైన జనాలు రకరకాల జనాలతో వ్యవహరించి సంవత్సరం తిరిగేసరికల్లా 550 సంస్థానాల్లో ఒకటి రెండు మినహా అన్నిటినీ భారత యూనియన్‌లో కలిసిపోయేందుకు ఒప్పించడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఘన విజయం. ఐతే ఇంతటి సామర్థ్యం అలవోకగా వచ్చేసిందా వల్లభాయ్ పటేల్‌కి అంటే కాదని చెప్పాలి. అతన్ని మలిచిన ఓ ఓటమి, దాని వెనుక ఓ కథ ఉంది.


అసలేం జరిగిందంటే -


వల్లభాయ్ పటేల్ స్వంత ప్రాంతం గుజరాత్‌లో రాజ్‌కోట్ అనే సంస్థానం ఉండేది. బ్రిటీష్‌ వారికి సామంతుల్లాంటివాళ్ళు ఈ సంస్థానాధీశులు. సంస్థానాధీశుడైన ఠాకూర్ ధర్మేంద్ర సింహ్‌ బలహీనుడు, అసమర్థుడు. అప్పుల్లో మునిగిపోయిన ఆయన దాన్నించి బయటపడేందుకు వీరావాలా అనే ఓ జిత్తులమారిని దివాన్‌గా పెట్టుకున్నాడు. అతను ప్రజలను దారుణంగా పీడిస్తూండడంతో ప్రజామండలి ఏర్పాటుచేసుకుని తిరగబడ్డారు. పటేల్ వారి పోరాటానికి మద్దతునిచ్చాడు. పటేల్‌తో తియ్యగా మాట్లాడి, బ్రిటీష్‌వారికి వీరావాలా ఫిర్యాదు చేశారు. ఎవరైనా సమర్థుడైన అధికారిని పంపమనడంతో సర్ పాట్రిక్ కేడల్ అనే బ్రిటీషర్‌ని దివానుగా వేశారు. కానీ కొత్త దివాను వీరావాలా అనుకున్నట్టు ఆడే మనిషి కాదు. అతను వచ్చిన కొన్నాళ్ళకే వీరావాలా పదవి వదిలి పోవాల్సివచ్చింది.


వీరావాలా ఓ ఎత్తు వేశాడు. దాని ప్రకారం బ్రిటీష్‌ రెసిడెంట్‌, దివాన్లకు ముందుగా తెలియకుండా సంస్థానాధీశుడు-పటేల్‌ కలిసి సంస్థానంలో ప్రజలకు అనుకూలంగా అమలుచేయబోయే సంస్కరణలు అంగీకరిస్తూ ఓ పత్రంపై సంతకాలు చేశారు. వీరావాలా‌ తంత్రం ప్రకారమే జరిగినా అతని పేరు బయటపడలేదు. ఈ సంఘటన ఉపయోగించుకుని పటేల్ నమ్మదగ్గవాడు కాదంటూ రెసిడెంటును రెచ్చగొట్టాడు. రెసిడెంట్, దివాన్లకు పటేల్ మీద చెప్పిపెట్టాడు. చివరకు వారి మధ్య విభేదాలు సృష్టించాడు. మరోపక్క చేసుకున్న ఒప్పదం మూడురోజులకే రద్దుచేశాడు, సందట్లో దివాన్‌ పదవి ఊడగొట్టి తాను ఆ అధికారం మళ్లీ చేజిక్కించుకున్నాడు. పాట్రిక్ పదవి పోగొట్టేందుకు పటేల్‌ని పావుగా వాడుకున్నాడు. ఒప్పందం రద్దుకావడంతో కాంగ్రెస్ వారు, ప్రజలు ప్రభుత్వంపై పోరాటాలు మొదలుపెట్టారు. అణచివేత సాగింది. చివరకు వైశ్రాయ్‌ కలగజేసుకోవాలంటూ గాంధీ నిరాహారదీక్ష చేశాడు. విచారణలో ఠాకూర్-వీరావాలా చేసింది తప్పని తేలింది. వైశ్రాయ్ సంస్కరణల అమలుకు హామీ ఇచ్చాడు. ఈసారి పైఎత్తు వేస్తూ వల్లభాయ్ కులాన్ని ఉపయోగించుకున్నాడు వీరావాలా. సంస్కరణల అమలు కమిటీలో పటేల్ పక్షపాతం చూపాడంటూ ముస్లిములు, భయ్యత్‌లనే కులాలవారిని రెచ్చగొట్టాడు. భయ్యత్‌లు రెచ్చిపోయి పటేల్‌పై హత్యాయత్నం చేయబోయారు. కులాల చీలిక బయలుదేరింది. చివరకు గాంధీ తనకు వైశ్రాయ్ ఇచ్చిన హామీని వదిలివేసుకోవాల్సి వచ్చింది. దాన్ని పటేల్ భారమైన మనస్సుతో, మౌనంగా ఆమోదించాడు. భావ్‌నగర్‌, బరోడాలాంటి ఇతర సంస్థానాల్లో కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మొత్తంగా మైసూర్, ఔంధ్‌ లాంటి ఒకటిరెండు సంస్థానాల్లోనే విజయం సాధించగలిగాడు.


ఇలా 1939 చివర్లో వీరావాలా చేతిలో ఘోరంగా దెబ్బతిని, సంస్థానాల్లో పరాజయాలు చవిచూసిన పటేల్ ఆత్మ విమర్శ చేసుకుని 1947నాటికల్లా సంస్థానాలతో ఎలా వ్యవహరించాలో. అక్కడి పాలకులు, దివాన్లు, స్థానికంగా బలంగా ఉండే వర్గాలు, ప్రజలు ఇలా రకరకాల సమీకరణాలను ఎలా నిర్వహించాలో అర్థంచేసుకున్నాడు. 500కి పైగా ఉండే చిన్నా పెద్దా సంస్థానాలన్నిటినీ భారత యూనియన్‌లో కలిసిపోయేలా ఒప్పించి స్వతంత్ర భారతదేశపు తొలి, కీలకమైన ఘన విజయాన్ని సాధించాడు. నిజానికి పటేల్‌కు ఓటమి ఎదురుకాకుంటే ఈ విజయం దక్కేది కాదు. తనను తాను పునర్విమర్శించుకుని, ఏ విషయాల్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాడు కాబట్టే విజయం దక్కింది. ఇదే సూత్రం మనకైనా వర్తిస్తుంది. జీవితం మనకి ఏదైనా గొప్ప బాధ్యత, ఘన విజయం కట్టబెట్టాలనుకుంటే తప్ప ఓటమి పాలు చేయదు. కాబట్టి ఓటమికి కుంగిపోకుండా, ఏ ఓటమి అయినా మనం చేసిన పొరపాట్లు, మనలో ఉన్న లోపాలే కారణమని భావించి సరిదిద్దుకోవాలి. ఓడిపోయినప్పుడు ఎవడూ కూడా తన పొరపాటే ఓటమికి కారణం అనుకోడు. సాకులు వెతుక్కునేవాడికి ఎప్పుడూ ఎదుటివాడిలోనో, పరిస్థితుల్లోనో తప్పులు కనిపిస్తాయి. కానీ ఓటమి నీ విజయానికి మెట్టు కావాలంటే ఒంటబట్టాల్సిన మొదటి సూత్రం పరిస్థితులు, చుట్టూఉన్నవాళ్లు, ప్రత్యర్థులు ఎలాంటివాళ్ళైనా పొరపాటు మనలోనే ఉంటుంది. పటేల్ కూడా సింపుల్‌గా వీరావాలాని తిట్టేసుకుని వదిలెయ్యొచ్చు, కానీ ఎవరో వీరావాలాని దుర్మార్గుడని తిడుతూంటే అడ్డుపడ్డాడు. పొరపాటు మనలో చూస్తేనే ఆత్మవిమర్శకు అవకాశం ఉంటుంది. ఎప్పుడూ, ఏం జరిగినా తప్పు నీమీదే పెట్టుకోవడం ముఖ్యం. ఇక ఓటమి లాంటి అద్భుతమైన వరం నిష్ప్రయోజనం అయిపోవడానికి మరో సమస్య — ఆ సమస్యకు దూరంగా పారిపోవడం. ఏ విషయంలో ఓటమి పాలయ్యాడో ఆ రంగాన్ని, అంశాన్ని వదిలేసి తప్పించుకుంటే, క్రమంగా అన్నిరంగాల్లోనూ ఓటమే ఎదురవుతుంది. ఇంక చేయదగ్గది ఏదీ ఉండదు. మన పొరపాట్లు దిద్దుకుని, అదే రంగంలో ధైర్యంగా ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుంది.

[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము