పరివర్తన

చిన్నప్పుడు నాలుగైదు తరగతుల్లో తెలుగు వాచకంలో ఒక కథ ఉండేది. కథ పేరు పరివర్తన అని గుర్తు.

ఒక ఊర్లో సుశీల అనే కల్లా కపటం లేని సాధు స్వభావం కలిగిన అమ్మాయి ఉంటుంది. (నాకింకా బాగా గుర్తు కల్లా కపటం అనే పదం అదే మొదటిసారి వినడం :-) సుశీల భర్త అహంకారి, తోటివారిని మోసం చేసి డబ్బు సంపాదించే రకం. అందరితో పాటు సుశీలని కూడా కష్టపెడుతూ ఉండేవాడు. సుశీల వాళ్ళ ఊరి నడిబొడ్డులో ఉన్న ఒక మర్రిచెట్టుకి ఉన్నట్టుండి కొత్తగా మహిమ వచ్చిందని ఊరంతా కోడై కూస్తుంది. ఎవరైనా మర్రిచెట్టు కిందకి వెళ్ళగానే వారి వారి మనస్తత్వం వ్యక్తిత్వాన్ని బట్టి రూపం మారిపోతోందట. మళ్ళీ మర్రిచెట్టు కింద నుంచి దూరంగా వచ్చేస్తే ఎప్పట్లాగే వాళ్ళ నిజరూపం వచ్చేస్తుందట. ఊర్లో అందరూ ఆ వింత ఏదో చూద్దామని మర్రిచెట్టు చుట్టూ గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారట. చాలామంది కుక్కల్లాగా, పిల్లుల్లాగా రకరకాలుగా మారిపోతుండటం చూసి జనాలు విరగబడి నవ్వుతుంటారు.
ఇదంతా చూసి సుశీల భర్తకి మర్రిచెట్టు కిందకి వెళ్ళి తానూ ఎలా మారతాడో చూసుకోవాలని కుతూహలం ఏర్పడుతుంది. కానీ ఊర్లో వాళ్ళందరి ముందు వెళ్ళడానికి ఇష్టపడక ఒక రోజు అర్ధరాత్రి పూట సుశీలని వెంటబెట్టుకుని మర్రిచెట్టు దగ్గరికి వెళతాడు. ఇద్దరూ కలిసి చెట్టు కిందకి చేరగానే సుశీల భర్త పెద్ద బ్రహ్మ రాక్షసుడిగా మారిపోతాడు. సుశీల మాత్రం ఏమీ మారకుండా తన నిజరూపంలోనేఉంటుంది. భర్త బ్రహ్మరాక్షస రూపాన్ని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత సుశీల భర్త చెట్టు నీడ నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేస్తాడు. తనలో ఇంత క్రూరత్వం ఉందనీ, సుశీల కల్లా కపటం లేని మనసు వల్లే తను రూపం మారలేదని అర్థం చేసుకున్నాక అతనిలో పశ్చాత్తాపం కలిగి పరివర్తన చెందుతాడు. ఇక నుంచి మంచి మనిషిలా మారి బతకాలనినిర్ణయించుకుంటాడు.
ఇదీ కథ!
నాకు అప్పుడప్పుడూ ఈ కథ గుర్తొస్తూ ఉంటుంది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన పలు రకాల సౌకర్యాల మూలంగా ప్రపంచంలో నలుమూలల ఉన్నవారినందరినీ ఒక చోటకి చేరుస్తోంది ఇంటర్నెట్ లోకం. కానీ పై కథలో మర్రిచెట్టు కిందకి చేరగానే రూపాలు మారిపోయిన మనుషుల్లాగే ఇంటర్నెట్ నీడలో మనుషులు రూపాంతరం చెంది కనిపిస్తుంటారు. ఆ కనిపించే రూపాల వెనక దాగున్న నిజమైన వ్యక్తి ఎవరు ఏమిటో అంచనా వెయ్యగలగడం, అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యంగా మారిపోతోంది. ఈ మాయాలోకంలో ఎదురుపడే ఇందరి మధ్యలో ఒకరో ఇద్దరో సుశీల లాంటి వాళ్ళ పరిచయం, స్నేహం పొందగలిగితే అదృష్టవంతులమే కానీ ఆ సంభావ్యత ఎంతని ఎలా లెక్కగట్టడం? అది ఎప్పటికప్పుడు కొత్త ప్రశ్నే ఎందుకంటే మరి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త రూపాల్లో ఎదురుపడుతుంటారు కాబట్టి ఇదీ లెక్క అని తేల్చడం సాధ్యమయ్యే పని కాదు కదా! కానీ పై కథలోలా మర్రిచెట్టు కింద కనిపించే కొత్త ​రూపాలు సరదాగా ఉండి ​ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేవైతే నష్టమేముందీ, అయినా ముసుగులు బయట మాత్రం ఉండవా అంటే ఉండొచ్చు. కానీ ఈ మయసభ లాంటి లోకంలో బోల్తా పడటం బయటి ప్రపంచంలో కన్నా మరింత సులువు కదా! :-) ​

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము