(Telugu) పద్యం 2

[:te]ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైన గాక వొగిఁదరుచైనం
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలుపుట్టి సమస్తంచెడిపోవుట సహజము.
చూశారుగా ఈ పద్యంలో నీతి. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఏ పని అయినా ఎవరు చేయాలో వాళ్లు చేయాలి. అలాగేఒకేసారి ఎక్కువమంది తల దూర్చకూడదు. అలా చేస్తే అది ఖచ్చితంగా నష్టానికే దారి తీస్తుంది చివరికి. ఇంగ్లీషులో కూడా ఇదే అర్ధాన్నిచెప్పే ఒక ప్రసిద్ధ సామెత ఉంది. "Too many cooks spoil the broth" అని. ఎక్కువమంది ఒకే వంటలో వేలు పెడితే ఎలా ఉంటుందండీమరి?? నువ్వు ఉప్పు వేసావా? కారం వేసావా? అది వేస్తే ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. అనుకుంటూ ఒకటికి రెండు సార్లు వేసి లేదామర్చిపోయి..అందరి పాక శాస్త్ర ప్రావీణ్యం పోటాపోటీగా ఉపయోగించి చివరికి మొత్తం పారబోయాల్సి వస్తుంది.అంతేగా మరి..!

ఇదే కాకుండా..ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే.. ఒకేసారి చాలామంది బోలెడు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి అన్నివిరుద్ధమైన భావాల్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఎక్కువ కంగారుని, అయోమయాన్ని, భయాన్ని కలిగిస్తారు. ఒకేసారి అందరూ రకరకాలుగాచెప్పడం వల్ల పాపం సదరు వ్యక్తికి అసలేమి చేయాలో పాలుపోదు. ఎవరు ఏమి చెప్పినా చివరికి అసలు పరిస్థితిలో ఉన్న వ్యక్తే కదాఏదయినా చేయాల్సింది లేదా ఎదుర్కోవాల్సింది..!

సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొంచెం లోతుగా ఈ సలహాల సంగతి చూద్దాం..! మనకి ఏదయినా సమస్య వచ్చినప్పుడు వేరేవారి సలహాలుఅడగడం మంచిదే కానీ.. అందరి అభిప్రాయాల్నీ మనం పాటించాల్సిన అవసరం లేదు. అంటే నా ఉద్దేశ్యం.. వారందరి కోణాల్లోంచి మనంసమస్యని చూసి, తద్వారా ఎక్కువ అయోమయంలోకి వెళ్ళకూడదు అని. వాళ్ల సలహాలన్నీ అభిప్రాయాలుగా మాత్రమే గ్రహించాలి కానీమన సమస్యకి పరిష్కారాలుగా కాదు. అందరు చెప్పినవి విని.. చివరిగా మాత్రం మనకు సరి అనిపించేదే చెయ్యాలి. ఎందుకంటే మనంచేసిన ఏ పని వల్లనైనా లభించే ఫలితాన్ని.. మనమే అనుభవిస్తాం. కాబట్టి మన ఆలోచనలు, నిర్ణయాలు, వాటి ఫలితాల బాధ్యత కూడానూటికి నూరు శాతం మనదే అవుతుంది. మరెవరి సలహా వల్లో నష్టం జరిగింది అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది.

అసలు మనం ఒకరిని సలహా అడిగే ముందు మనకి వారిపై పూర్తి నమ్మకం ఉండాలి. వాళ్లు ఈ సమస్య గురించి మనకంటే వివేకంగాఆలోచించగలరు అనీ.. మన శ్రేయోభిలాషులనీ.. మనం నమ్మాలి. అలాంటి ఆత్మీయులతోనే మనం సొంత సమస్యలను చెప్పుకోవాలి.అంతేగానీ.. బాధలో ఉన్నాం కదా అని.. కొద్దిగా ముఖపరిచయం ఉన్నవారందరి దగ్గరా.. మన స్వవిషయాలు చర్చించకూడదు. మీరు మరీచెప్తారండీ.. మనందరం ఎంతో చదువుకున్నాం.. గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం. విశాల ప్రపంచాన్ని చూస్తున్నాం. అలా సొంత సమస్యలనిఅందరి దగ్గరా మాట్లాడేసేవారు ఉన్నారా అని మీరు అనుకుంటే.. టమాటా పప్పులో కాలేసినట్టే :) బోలెడంతమంది ఉన్నారని మీరునమ్మాలి. అంతే కాకుండా చాలామంది అలా చేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించలేరు కూడా..అది మరీ జాలిపడాల్సిన సంగతి..! PG లుచదివి, అయిదంకెల జీతాన్నిగడిస్తూ ఇలా చేసే తెలివైన వారిని చాలా మందిని నేను చూసాను. ఎందుకంటే తెలివితేటలకీ, మనిషివ్యక్తిత్వానికీ సంబంధం లేదని నా అభిప్రాయం. అది చాలావరకు నిజం కూడా.. ఉదాహరణకి వాళ్ల భర్తతోనో, అత్తతోనో, లేదా..కనీసంస్నేహితులతోనో చిన్న భేదాభిప్రాయం వచ్చిందనుకోండీ .. వెంటనే మనతో అనేస్తారు. తను ఇలాంటి వాడు, అలాంటి వాడు..నన్నిలాబాధపెట్టాడు..అసలు తనతో ఉండడమే వ్యర్ధం..ఇంకా..ఇలా చాలా చాలా..మొదటిసారి మనం చాలా బాధ పడిపోతాం.. ఓదారుస్తాం.. మళ్ళీవెంటనే రెండు రోజుల్లో అసలేమి జరగనట్టు అంతా చాలా గొప్పగాఉంది..సూపర్..అని చెప్తారు. మళ్లీ రెండు రోజులకి ఇంకో విషయమూఇలాంటిదే జరుగుతుంది. ఇలా పదే పదే జరిగాక మనకి వాళ్ల మీద ఉన్న సదభిప్రాయం పోతుంది. వాళ్లు నిజంగా పెద్ద సమస్యతో వచ్చినామనం మొదటిసారిలా ఫీల్ అవ్వలేము. అంటే.. చివరికి వాళ్ల పరిస్థితి నాయనా..పులి కథలాగా అవుతుందన్నమాట. నిజానికి అలాంటివారికి ఏదో సలహా ఇచ్చి సహాయపడదాము అనుకోడం కూడా తప్పే అని నా ఉద్దేశ్యం. దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు కూడా. మనసమయం, ఆలోచన రెండూ వ్యర్థం.. అంతే..! ఎందుకంటే వాళ్లు మారాల్సిన అవసరాన్ని వాళ్లు ఎప్పటికీ గుర్తించలేరు. ఈ కోణంలోఆలోచిస్తే.. సలహాలు తీసుకోవడంలోనే కాదు..ఇవ్వడంలో కూడా సరైన వ్యక్తులనే ఎంచుకోవాలి సుమా.. అనిపిస్తుంది.
మీరేమంటారు మరి..![:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత