(Telugu) మరొకరి వ్యాపారంలో భాగస్వామిగా మారడం.

[:te]పోయినసారి మనం కలిసినప్పుడు సంపద సాధించాలంటే పెట్టుబడి పెట్టడమే ఉత్తమమైన మార్గం అని అనుకున్నాము. పెట్టుబడి పెట్టడానికి మనంతట మనం ఏదైనా వ్యాపారం చేయడం ఒక మార్గం అయితే, ఇతరులు చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా ఉండటం మరో మార్గం అని కూడా చెప్పుకున్నాము. అయితే చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారు స్వంతగా వ్యాపారం చేయడం చాలా కష్టసాధ్యమైన పని. ఇక మిగిలింది మరొకరి వ్యాపారంలో భాగస్వామిగా మారడం. ఇది కూడా అంత సులభమేమీ కాదు. వ్యాపారంలో లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి కాబట్టి, మనం పెట్టుబడిగా పెట్టే డబ్బు నష్టమైపోకుండా జాగ్రత్త వహించాలి.

రామాంజనేయులు చాలాకాలంగా కూరగాయలు, ఊరగాయలు అమ్ముతుండేవాడు. అతని షాప్ చుట్టూ చాలా అపార్ట్మెంట్లు వుండటం వల్ల వ్యాపారం బాగా సాగేది. కొంత కాలం క్రితం అందరూ కూరగాయలు కొనుక్కునేవారు, ఊరగాయలు ఇంట్లో పెట్టుకునేవారు. అందువల్ల అతని వ్యాపారంలో కూరగాయలు ఎక్కువ లాభాలు ఇస్తుండేది. క్రమంగా కూరగాయల అమ్మకాలు తగ్గిపోయి ఊరగాయ అమ్మకాలు పెరగసాగాయి. విషయం ఏమిటా అని ఆరా తీశాడు రామాంజనేయులు.

అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఒకప్పుడు ఆ చుట్టుపక్కల వుండే అపార్ట్మెంట్లలో కుటుంబాలు ఎక్కువగా అద్దెకు వుండేవి. ఆ ఇళ్ళలలో రోజూ కూరలు, పులుసులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద కాలేజీలు రావడంతో అక్కడ చదువుకునే కుర్రాళ్ళంతా ఆ అపార్ట్మెంట్లలో చేరారు. నలుగురైదుగ్గురు కలిసి ఒక ఇల్లు చొప్పున అద్దెకు తీసుకున్నారు. పగలంతా కాలేజీలో చదువుకోని సాయంత్రం ఇల్లు చేరే ఈ కుర్రాళ్ళకి వంట వండుకునే ఓపికలేక అంత అన్నం ఉడకేసుకోని, ఊరగాయలతో తినేస్తున్నారు. అందువల్ల కూరగాయల అమ్మకాలు తగ్గి ఊరగాయల అమ్మకాలు పెరిగాయి.

ఇది తెలుసుకున్న రామాంజనేయులు ఈ పిల్లలకి ఉపయోగపడేలా, తన వ్యాపారం అభివృద్ధి చెందేలా ఒక ఆలోచన తట్టింది. కూరగాయలు అమ్మే బదులు ఒక మెస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికి అవసరమయ్యే సరంజామా, రోజూ కూరగాయలు వగైరా కొనడానికి అవసరమయ్యే డబ్బు మొత్తం అంతా కలిపి మూడు లక్షలు అవసరం అవుతాయని లెక్కవేశాడు. చేతిలో లక్ష రూపాయలే వుండటంతో దానితో ఏమీ చెయ్యలేనని ఊరుకున్నాడు.

ఒకరోజు ఊరగాయ కొనుక్కోడానికి వచ్చిన రాహుల్ అనే ఎంబీయే చదువుకునే కుర్రాడితో ఈ విషయం చెప్పి బాధపడ్డాడు. రాహుల్ కి కూడా ఈ వ్యాపారం బాగా సాగుతుందని నమ్మకం ఏర్పడింది. కానీ అతని దగ్గర కూడా అంత డబ్బు లేదు. ఎంబీయే చదివిన తెలివితేటల్ని ఉపయోగించి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ వ్యాపారం పెట్టడానికి అవసరమయ్యే మూడు లక్షలకుగాను లక్ష రామాంజనేయులు దగ్గర వుంది కాబట్టి మిగిలిన రెండు లక్షలు సేకరించే పనిలో పడ్డాడు. అతని కాలేజిలో మిత్రులు, ఆ చుట్టుపక్కల వున్న కొంతమంది కుర్రాళ్ళను కలిసి తలా పదివేలు ఇవ్వమని కోరాడు. తనతో కలుపుకొని ఇరవైమంది తలా పది వేలు ఇవ్వడంతో రెండు లక్షలు సమకూరింది. రామాంజనేయులు మెస్ మొదలైంది.

ముందు ఊహించినట్లుగానే వ్యాపారం జోరుగా సాగింది. ఆరునెలల్లో రెండు లక్షల లాభం వచ్చింది. అందులో యాభై వేల రూపాయలతో ఉదయం టిఫిన్ సెంటర్ కూడా పెట్టాడు రామాంజనేయులు. మిగిలిన లక్షన్నరలో తన వాటా యాభై వేలు తీసుకోని, మిగతా లక్ష రాహుల్ కి ఇచ్చాడు. రాహుల్ తో కలిపి ఇరవై మంది మిత్రులు తలా ఐదు వేలు పంచుకున్నారు.

కొంతకాలం గడిచింది. మెస్సులో అమ్మకాలు సరిగ్గా అవటంలేదని పుకారు మొదలైంది. డబ్బులు పెట్టినవాళ్ళందరూ నష్టాలు వస్తాయని భయపడసాగారు. కొంతమంది ఇక ఈ వ్యాపారం వద్దని తమ పదివేలు వెనక్కి ఇచ్చేయమని అడగసాగారు. దాంతో కంగారుపడ్డ రామాంజనేయులు, ఆ విషయాలన్నీ వివరంగా మాట్లాడానికి సాయంత్రం అందరూ మెస్ కి రండని పిలిపింలిచాడు. సాయంత్రమయ్యింది. ఇరవైమంది రావాల్సింది,ఆరుగ్గురే వచ్చారు. ఇదేమిటి అని రామాంజనేయులు ఆశ్చర్యపోయాడు. రాహుల్ అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు.

“ఇక నుంచి ఈ మెస్సు, ఈ వ్యాపారం నాది. నీ భాగం మూడోవంతు మాత్రమే కాబట్టి లాభం వచ్చినప్పుడు నీ భాగం తీసుకో. ఇక ఈ మెస్ వైపు కూడా రావద్దు” అన్నాడు.

ఏమిటీ దారుణం? అప్పటిదాకా ఇరవై మంది భాగస్వాములు వున్న రామాంజనేయులు మెస్సు ఒక్కసారిగా రాహుల్ ది ఎలా అయిపోయింది? అసలు ఈ లెక్కలకి మనం చెప్పుకునే విషయాలకీ ఎంటి సంబంధం?

ఈ కథ అర్థం చేసుకోడానికే కొంచెం ఇబ్బందిగా వుంది. కానీ స్థూలంగా ఇది స్టాక్ మార్కెట్ గురించి, షేర్ల గురించి అని అర్థం అవుతోంది. అవి కూడా ఇలాగే అర్థం చేసుకోడానికి కష్టంగా వుంటాయి కాబట్టి నీ కథలో ఒక్కో అంశాన్ని జాగ్రత్తగా గమనించడం అవసరం. ఇందులో రామాంజనేయులు పెట్టిన మెస్సు ఒక కంపెనీ అనుకుందాం. అప్పుడు అతను లెక్క వేసిన మూడు లక్షలు ఆ కంపెనీ విలువ అనుకుందాం. దీన్నే కాపిటలైజేషన్ అంటారు. అతని తగ్గర వున్న లక్ష ఓనర్స్ ఈక్విటీ (పెట్టుబడి) అనుకుంటే, మిగిలిన రెండులక్షలు సమీకరించడానికి అతను మరో ఇరవై మంది సహాయం తీసుకున్నాడు. వీళ్ళు ఆ పెట్టుబడిలో ఇరవయ్యో భాగాన్ని పంచుకున్నారు (షేర్ చేసుకున్నారు). అలా పంచుకున్నప్రతి భాగమూ ఒక షేర్ అనుకోవచ్చు. కొనుక్కున్న ఇరవై మందిని షేర్ హోల్డర్స్ అంటారు.

సరిగ్గా ఇదే విధంగా ఏదైనా కంపెనీ కావాల్సిన పెట్టుబడిని భాగాలుగా చేసి, ఆ ఒక్కొక్క భాగాన్నీ విడిగా అమ్ముతుంది. ఈ కథలో అందరూ సమానంగా, ఆ భాగం విలువ ఎంతో అంతే ఇచ్చి పంచుకున్నారు. కానీ వాస్తవంలో కంపెనీ పేరును బట్టి, ఆ కంపెనీ ఎంత లాభాలు సంపాదిస్తుందో అన్న నమ్మకాన్ని బట్టి కొనేవాళ్ళు ముందుకు వస్తారు. చేసిన భాగాల కంటే కొనే వాళ్ళు ఎక్కువ వుంటే అప్పుడు అది కొనుక్కోడానికి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ఇన్వస్టర్లు ముందుకు వస్తారు. పది రూపాయలు ఖరీదు చేసే భాగాన్ని ఇరవై ఇచ్చి కొనుక్కోడానికి కూడా సిద్ధపడతారు. అదే షేర్ విలువ పెరగడం. షేర్ విలువ పెరిగినప్పుడు అమ్మేసుకుంటే లాభాలు వస్తాయి కాబట్టి, షేరు విలువ తక్కువ వున్నప్పుడే కొనేసుకోని దాని విలువ పెరగగానే అమ్మేసేవాళ్ళు కూడా వుంటారు. అమ్మకుండా తమ దగ్గరే వుంచుకోని ఆ కంపెనీ సంపాదించిన లాభాలలో వాటా తీసుకునేవాళ్ళు కొంతమంది వుంటారు. మన కథలో ఇరవైమంది ఆరునెలల తరువాత ఇలాగే లాభాలను పంచుకున్నారు కదా. దీన్ని డివిడెండ్ అంటారు.

మళ్ళీ కథలోకి వద్దాం. మొదటిసారి లాభాలు పంచుకున్న తరువాత మెస్సు నష్టాలలో నడుస్తోందని అభిప్రాయం మొదలైంది. ఇలాంటప్పుడు డబ్బు పెట్టినవారికి లాభాలు రావు అన్న అనుమానం వస్తుంది. అలాంటప్పుడే వీలైనంత త్వరగా ఆ షేర్లను అమ్మేసుకుని బయటపడాలని ప్రయత్నిస్తారు. మన కథలో పదివేలు పెట్టి కొన్న భాగాన్ని నష్టపోతామన్న భయంతో తొమ్మిదివేలకో, ఎనిమిది వేలకో కూడా అమ్మేయడానికి వాళ్ళు సిద్దపడి వుంటారు. ఇలా అమ్మేవాళ్ళు పెరిగిపోవడం వల్ల షేర్ విలువ పడిపోతుంది.

షేర్ విలువ పెరగడానికి, తగ్గడానికి ఆ కంపెనీ వ్యాపారం కారణం కావాలి తప్ప పుకార్లు, నమ్మకాలు కాకూడదు. కానీ షేర్ మార్కెట్లో పుకార్లు, నమ్మకాల మీద చాలా వ్యాపారం నడుస్తుంది. మన కథలో రాహుల్ ఇదే అవకాశం అని మిగిలినవాళ్ళు అమ్ముతున్న భాగాలనే తనే కొనుకున్నాడు. అందువల్లే అందరినీ పిలిపించినప్పుడు (షేర్ హోల్డర్ మీటింగ్) కేవలం ఆరుగ్గురే వచ్చారు. అంటే మిగిలిన పధ్నాలుగుమంది భాగం, తన భాగం కలుపుకోని లక్షన్నర విలువ చేసే భాగాలు రాహుల్ దగ్గరే వున్నాయన్నమాట. రామాజనేయిలు దగ్గర లక్ష విలువ చేసే భాగం, మిగిలిన ఐదుగ్గురి దగ్గర యాభై వేలు విలువ చేసే భాగం మిగిలాయి. వ్యాపారంలో అత్యధికభాగం రాహుల్ దగ్గరే వున్నాయి కాబట్టి ఆ వ్యాపారం రాహుల్ సొంతమైపోయింది.

ఇలాంటి ఎంతో మంది వ్యాపారస్థులు తమ తమ కంపెనీ షేర్లను అమ్మడానికి, కొనుగోలు చెయ్యడానికి వీలుగా ఒకచోట పెడితే దాన్నే స్టాక్ మార్కెట్ అంటారు. అక్కడ ఎవరికి కావాల్సినన్ని షేర్లు (కొనేవాళ్ళు వుంటే) అమ్ముకోవచ్చు , (అమ్మేవాళ్ళు వుంటే) కొనుక్కోవచ్చు. ఇందాక చెప్పినట్లు ఈ కొనుక్కోవడం, అమ్మడం కేవలం ధర మీదే కాకుండా కంపెనీ పేరు ప్రతిష్టల మీద, కంపెనీ గతంలో సాధించిన విజయాలు/లాభాల మీద, ఆ కంపెనీలో వుండే వాళ్ళ సామర్థ్యం మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద, ఇంకా అనేక కారణాల మీద ఆధారపడి వుండాలి. ఆ కంపెనీ గురించి అంత వివరంగా సమగ్రమైన విశ్లేషణ చెయ్యలేని వాళ్ళు ఆ షేర్ల్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. తెలిసీ తెలియని వ్యాపారంలో భాగస్వామిగా చేరడం వల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా వుంటుంది.
ఈ కథలోనే మరో సంగతి కూడా వుంది. సాధారంణంగా స్టాక్ మార్కేట్ గురించి మాట్లాడేటప్పుడు బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని అంటుంటారు. ఈ కథలో మెస్ పరిస్థితుల గురించి తెలుసుకున్న రాహుల్ ఒక రకంగా ప్రవర్తిస్తే, అతని మిత్రులు మరోరకంగా ప్రవర్తించారు. రాహుల్ కి ఆ పరిస్థితులు లాభాలు తెచ్చిపెట్టేవిగా కనిపించాయి. అందుకే అతను మిగిలిన వాళ్ళ దగ్గర వాటాలు కొనుక్కున్నాడు. అదే విషయం తెలిసిన మిగిలిన మిత్రులు నష్టాలు రాబోతున్నాయని ఊహించి వాళ్ళ దగ్గరున్న వాటాలను అమ్మేశారు. స్టాక్ మార్కెట్ లో ఏదైనా ఒక సందర్భంలో లాభాలు వస్తాయి అని అంచనా వేసేవాళ్ళను బుల్స్ అని నష్టాలు వస్తాయని అంచనా వేసేవాళ్ళను బేర్స్ అని అంటారు.

బుల్స్ లాభాలు వస్తాయని ఊహిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర వున్న షేర్లను అమ్మకుండా దాచుకుంటారు. ఇంకా అవకాశం వస్తే షేర్లు కొనడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల షేర్ ధర పెరుగుతుంది. ఇలా అనేక షేర్ల ధరలు పెరిగితే మార్కెట్ కూడా పెరుగుతుంది. దీన్నే బుల్లిష్ మార్కెట్ అంటారు. అదే విధంగా బేర్స్ ఎక్కువగా వున్నప్పుడు, అమ్మే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఎక్కువ షేర్లు అందుబాటులోకి వచ్చి ధర పడిపోతుంది. దీన్ని బేరిష్ మార్కెట్ అంటారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రత్యేకంగా బుల్స్ అని బేర్స్ అని వేరు వేరుగా వుండరు. ఒక వ్యక్తి తన అంచానాలను బట్టి ఒకోసారి బుల్ గానూ ఒకోసారి బేర్ గానూ అవతారం ఎత్తుతాడు. మన కథలో లాగా వాళ్ళకు అందే సమాచారం ద్వారా ఇది జరుగుతుంది. అయితే ఈ సమాచారం ఎంత వరకు నిజం అని ఆలోచించే అవకాశం చాలాసార్లు వుండకపోవచ్చు. అంత అవగాహన కూడా పెట్టుబడిదారుడిలో వుండకపోవచ్చు. అందుకే చాలాసార్లు పుకార్ల వల్ల కూడా షేర్ అతలాకుతలం అవుతుంటుంది. కొంతమంది పెద్ద పెద్ద ముదుపరులు, బ్రోకర్లు ఒకోసారి కంపెనీలు కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి స్వలాభం కోసం మిగిలినవాళ్ళని ప్రభావితం చేస్తారు. మన కథలో రాహుల్ అలా చేసి వుంటాడని నా అనుమానం. ఒకవేళ నిజంగా రామాంజనేయులు వ్యాపారం నష్టాల్లో వుంటే మిగిలిన వాటాలని అతను ఎందుకు కొంటాడు? కేవలం నష్టం రాబోతోందన్న అనుమానం మిగిలినవారిలో కలిగించి తద్వారా అతను లాభపడ్డాడు.

అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రామాంజనేయులు. అందుకు కారణం అవగాహన లేకపోవటం. స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఎక్కువగా లాభాలు సంపాదించడానికి, డబ్బుని సంపదగా మార్చుకోడానికి స్టాక్ మార్కెట్ సహాయం అనివార్యమే కానీ, అవగాహన లేకుండా అందులోకి దిగితే రామాంజనేయులు లాగా నష్టపోవాల్సివస్తుంది. ఇంత రిస్క్ లేకుండా స్టాక్ మార్కెట్ వల్ల లాభపడేందుకు సులువైన మార్గం వుంది. దాని గురించి మరోసారి చెప్పుకుందాం.
సంపద సాధించే క్రమంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిపెట్టడం అనివార్యమే కానీ ఆ స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకుండా అందులో దిగితే నష్టమే ఎక్కువగా వుంటుంది. ఒక కంపెనీ గురించి, ఆ కంపెనీ చేసే వ్యాపారం గురించి, ఆ వ్యాపారాన్ని ప్రభావితం చేసే ఆర్థిక, అర్థ, సామాజిక, రాజకీయ అంశాల గురించి సమగ్రంగా విశ్లేషించగలిగితేనే షేర్ మార్కెట్ లో లాభాలు పొందవచ్చు.

స్టాక్ మార్కెట్ లో మొదటిసారి పెట్టుబడి పెట్టాలనుకున్నవాళ్ళకోసం ఈ చిట్కా. ఇంటర్నెట్ లో ఎన్నో సైట్లు స్టాక్ మార్కెట్ గేమ్ నడుపుతుంటాయి. అందులో వాస్తవంగా స్టాక్ మార్కెట్లో వున్న షేర్లే వుంటాయి కానీ డబ్బులు బదులు పాయింట్లతో ముదుపు చేయవచ్చు. ఇందులో డబ్బు సంపాదించేది ఏమీ వుండదు కానీ, స్టాక్ మార్కెట్ అనుభవాన్ని పొందవచ్చు. కనీసం ఆరునెలలు తరువాత ఈ అనుభవంతో అసలు మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము