(Telugu) సంపద అంటే డబ్బుతో కూడబెట్టేది మాత్రమే కాదు

[:te]రామవరం శివార్లలో వున్న వీర్రాజు పొలం చివర ఒక మర్రి చెట్టు మొలకెత్తింది. చెట్టు పెరిగి పెద్దదైన తరువాత కష్టం చేసిన రోజు అలసట తీర్చుకునేందుకు నీడ దొరుకుతుందని వీర్రాజు ఆ చెట్టుకి నీళ్ళు పట్టాడు, దడి కట్టాడు. చెట్టు పెరిగి పెద్దదైంది. అయితే అదో చిత్రమైన మర్రి చెట్టు. మామూలుగా మర్రి అంటే పెద్ద పెద్ద కొమ్మలతో, ఊడలతో నాలుగు వైపులకీ విస్తరించాలి కదా! అది అలా కాకుండా చెట్టంతా ఒకచోటే ఉండిపోయి, ఒక కొమ్మ మాత్రం తెగ పెరుగుతూ పోయింది. కొన్నాళ్ళకి వీర్రాజు పొలంలో కన్నా పక్కన వున్న పొలంలో ఎక్కువ నీడ పడసాగింది. అయినా సరే వీర్రాజు ఆ చెట్టును అలా వదిలేశాడు.

ఇదిలా వుంటే రామవరం దగ్గర్లో వున్న పట్టణంలో భూపతి అనే పెద్దమనిషి వున్నాడు. ఆయనకు ప్రత్యేకమైన వస్తువులను సేకరించడం అంటే ఎంతో ఇష్టం. ఎవరెవరో మహాకవి వాడిన కలము, ఇంకెవరో మహారాజావారి కత్తి ఇలాంటి వస్తువులు ఎన్నో ఆయన సేకరించాడు. ఆయన ఇంటి ఆవరణలోనే అతి పెద్ద గుమ్మడికాయ కాసే గుమ్మడిపాదు, తట్టల కొద్దీ పూలు విరగబూసే మల్లెతీగ ఇలాంటి మెక్కలు చెట్లు అనేకం వున్నాయి. అలాంటి భూపతికి వీర్రాజు పొలంలో వున్న చిత్రాల మర్రిచెట్టు గురించి తెలిసింది. వెంటనే ఇద్దరు మనుషుల్ని పంపించి ఆ వివరాలు ఏమిటోకనుక్కోని రమ్మన్నాడు. ఆ ఇద్దరూ ఆ పొలానికి వెళ్ళి వచ్చారు.

మొదటివాడు శేషయ్య మాట్లాడుతూ –“అయ్యగారూ, అది చాలా విచిత్రమైన చెట్టు. అది మొదలైంది ఒకచోట ముగిసేది మరో చోట. ఇంత విచిత్రమైన చెట్టు మన ఆవరణలో వుండాలి. తమరు ఊ అంటే వెంటనే వేర్లతో సహా పెకిలించి తీసుకొచ్చి మన ఇంటి ముందు నాటుతాను” అన్నాడు. రెండోవాడు కామయ్య ఒప్పుకోలేదు.

“అయ్యా అది చాలా విచిత్రమైన చెట్టు. అందులోనూ మర్రిచెట్టు. మనింటిలో అట్టాంటి చెట్టు వుండటానికి వీల్లేదు” అన్నాడు. భూపతి ఈ ఇద్దరి అభిప్రాయాలు విన్న తరువాత మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. క్రమంగా ఆ ఇద్దరూ చెప్పిన విషయాలు స్పష్టంగా అర్థమవ్వసాగాయి. చివరికి చిరునవ్వు నవ్వుతూ – “ఆ చెట్టు మనకి అవసరం లేదు” అని తేల్చేశాడు.

భూపతికి ప్రత్యేకమైన వస్తువులు సేకరించడం అలవాటు కదా? మరి అలాంటప్పుడు వీర్రాజు పొలంలో పెరిగిన విచిత్రమైన మర్రి చెట్టుని ఎందుకు కాదన్నాడు?
దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?

ఒకవైపు భూపతికి ప్రత్యేకమైన వస్తువులు సేకరించడం అలవాటు. మరో వైపు వీర్రాజు పొలంలో విచిత్రమైన చెట్టు వుంది. విచిత్రమైనంత మాత్రాన అది ప్రత్యేకమైనది కాదు కదా? మరో రకంగా చెప్పాలంటే ఆ మర్రి చెట్టులో ఏదో లోపం వుండటం వల్లే అలా అడ్డంగా, అర్థంపర్థం లేకుండా పెరిగింది. భూపతి సేకరించినవన్నీ అపురూపమైనవి, అరుదైన ప్రత్యేకతలు కలిగినవే కానీ లోపం వల్ల విచిత్రంగా కనిపించేవి కావు. అందుకే ఆయన రెండో మనిషి మాట విని ఆ చెట్టు అక్కర్లేదని నిర్ణయించాడు.

ఆర్థికంగా ఎదగడం అవసరమే కానీ కేవలం ఆర్థికంగా మాత్రమే ఎదిగితే చిత్రమైన మర్రి చెట్టులా తయారవుతాము. చూసేవాళ్ళకు అది లోపంగా కనిపిస్తుందే తప్ప, ప్రత్యేకంగా అనిపించదు. ఇదే కథలో సారాంశం.

సంపద సాధించాలని అనుకోవడం వెనుక వుండే అంతరార్థం ఏమిటి? మనకి ’కావాల్సినంత’ డబ్బు వుంటే సుఖంగా సంతోషంగా వుండచ్చు అనే కదా? అంటే సుఖాన్ని, సంతోషాన్ని డబ్బుతో సాధించుకోవచ్చు అని నమ్ముతున్నట్లే కదా? ఇది అన్నివేళలా నిజం కాదు. డబ్బుతో కొనుక్కోగలిగిన సంతోషాలు ఎలా వున్నాయో, డబ్బుతో కొనుక్కోలేని సంతోషాలు కూడా అలానే వున్నాయి. కాబట్టి కేవలం డబ్బు సంపాదించడం మీదే ధ్యాస వున్న వ్యక్తిని కుటుంబంలోనూ, సమాజంలోనూ విచిత్రంగా చూస్తారు. పిసినారి అనో, డబ్బు పిచ్చోడు అనో హేళన చేస్తారు. వీర్రాజు విచిత్రపు మర్రిచెట్టులాంటి వ్యక్తితో కలవటానికి ఎవరూ ఇష్టపడరు. అన్నింటికన్నా ముఖ్యంగా అతనికి ఎలాంటి విలువ ఇవ్వరు.

అసలు సంపద సంపాదించడం వెనుక కారణం సంతోషంగా వుండటం అయితే, ఆ సంతోషం ఆర్థిక సంపద కన్నా పెద్ద సంపద అని అనుకోవచ్చు కదా? మరి సంతోషాని కారణం ఎక్కడుంది? ఆరోగ్యంగా వుండటంలో సంతోషం వుంది. జ్ఞానం సంపాదించడంలో సంతోషం వుంటుంది. ఆధ్యాత్మికంగానో, తాత్వికంగానో మనసుని స్థిరం చేసుకోని కోరికలను అదుపులో పెట్టుకోవడంలో సంతోషం వుంది. అనింటికన్నా ముఖ్యంగా మనల్ని ప్రేమిస్తూ, మనకోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధంగా వున్న కుటుంబం, స్నేహితుల మధ్య సమయం గడపటంలో ఆనందం వుంది. వీటన్నింటిని సంపదలుగా గుర్తిస్తే కేవలం ఆర్థిక సంపద మాత్రమే కాక ఆరోగ్య సంపద, ఆనంద సంపద, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపద, ఆత్మీయ సంపద వంటివి ఇంకా ఎన్నింటినో గుర్తించగలుగుతారు. కేవలం ఆర్థిక పురోగతి మీదే ధ్యాస పెట్టి మిగిలిన విషయాలను పట్టించుకోని వాళ్ళు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. కానీ ఒకే దిశలో ఎంత ఎదిగినా అది లోపంలా కనిపిస్తుందే తప్ప ప్రగతిలా కనిపించదు. సరిగ్గా వీర్రాజు విచిత్రపు మర్రి చెట్టు విషయంలో జరిగింది కూడా అదే.

ఇందులో మరో ప్రత్యేకత మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరోగ్య, ఆనంద, ఆధ్యాత్మిక, ఆత్మీయ సంపదలు అన్నీ ఆర్థిక సంపదతో కూడా ముడిపడి వున్నాయి. ఆరోగ్యం సంగతే చూడండి. వయసులో వున్నప్పుడు శరీరాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం సంపాదన మీదే ధ్యాస పెట్టినవాళ్ళను గమనించండి. ఇలాంటి వాళ్ళకు వయసు త్వరగా మీద పడిపోతుంది. ఊబకాయం, మధుమేహం లాంటి అనారోగ్యాలు వచ్చి చేరతాయి. తినగలిగే వయసులో తినకుండా వద్దనుకున్నవి, ఇప్పుడు డాక్టర్లు వద్దంటారు. సంపాదన మొత్తం మందులకీ, హాస్పిటల్ ఖర్చులకి సరిపోతుంది. నిర్లక్ష్యం చేసిన ఆరోగ్యం తిరగబడ్డప్పుడు అది ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. మరో రకం సంపద ఆధ్యాత్మికమైనది. ఇది ఆర్థికంగా దెబ్బతీయకపోవచ్చు. కానీ, ఆధ్యాత్మికంగా తాత్వికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కేకొద్దీ మనిషికి తన మనసు మీద నియంత్రణ పెరుగుతుంది. కోరికలు బాధించడం తగ్గుతుంది. వీటివల్ల ఖర్చులు తగ్గుతాయి. అత్యంత ప్రమాదకరమైన “దురాశ” స్థానంలో “తృప్తి” వచ్చి చేరుతుంది. అదే అర్థిక అభివృద్ధికి మరింతగా తోడ్పడుతుంది.

ఆత్మీయ సంపద డబ్బుకు ఏ మాత్రం సంబంధించినది కాదు. కానీ ఇది లేని జీవితంలో ఎంత డబ్బు వున్నా వెలితిగానే వుంటుంది. ఆర్థిక స్థితి ఎలా వున్నా జీవితానికి పరిపూర్ణత తీసుకురాగలగిన ఈ సంపదలను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి ఎంత సాధించినా తృప్తి కలుగదు. కుటుంబం, సన్నిహితులు, స్నేహితులు మన అభివృద్ధిని కోరుకుంటారు. మనం సాధించే విజయాలు (అర్థికం అయినా కాకపోయినా) తమదే అనుకుంటారు. మనల్ని అభినందిస్తారు, మరింతగా ముందుకెళ్ళాలని ప్రోత్సహిస్తారు. ఇలాంటి ప్రోత్సాహం ఎలాంటి లక్ష్యాన్ని అయినా త్వరగా చేరుకునేందుకు దోహదం చేస్తుంది. ఆ విధంగా చూస్తే ఆర్థిక వృద్ధిలో కూడా వీరి ప్రభావం ఖచ్చితంగా వుంటుంది.

వీటన్నింటిలో అతి ముఖ్యమైనది ఒకటుంది. అది జ్ఞాన సంపద. ఇది నిజమైన సంపద. ఒకసారి సంపాదిస్తే అది పోయేది వుండదు. ఖర్చు కాదు, దొంగలు తీసుకెళ్ళలేరు, ఇంకొకరికి పంచినా తరగదు. ఈ సంపద సాధించే మార్గాలు మూడు. జ్ఞానం వున్న గొప్ప వ్యక్తులను కలవడం, గొప్ప ప్రదేశాలను చూడటం, మంచి పుస్తకాలు చదవటం. ఇందులో గొప్ప వ్యక్తులను కలవడం అందరికీ సాధ్యం కాదు. అవకాశం దొరకకపోవచ్చు. అవతలి వ్యక్తిలోని జ్ఞానాన్ని గుర్తించలేని స్థాయిలో వుండవచ్చు. ఇంకెన్నో జరగచ్చు. అలాగే గొప్ప ప్రదేశాలను చూడటం కూడా అందరికీ కుదరదు. పరిమితమైన జీవితంలో ఎన్ని ప్రదేశాలను చూడగలము? అందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువేమి కాదు. ఇక మిగిలింది పుస్తకం. ఇది సులభమైనది. అందుబాటులోనే వుంటుంది. ఖర్చు ఎక్కువ కాదు. అందువల్ల పుస్తకం చదవటం జ్ఞాన సంపదను పెంచే అతి ముఖ్యమైన పనిముట్టు.

కేవలం డబ్బు మాత్రమే వున్న వ్యక్తికి మిగిలిన సమాజం నుంచి భయం, అసూయ మాత్రమే లభిస్తాయి. అదే జ్ఞానము, ఆరోగ్యము, ఆనందము కలిగిన వ్యక్తికి గౌరవం లభిస్తుంది. అదే వ్యక్తి ఆత్మీయ సంపదను కూడా సాధిస్తే అతనికి సమాజం నుంచి ప్రేమ, అనుబంధం కూడా లభిస్తాయి. అందువల్ల కేవలం డబ్బు సంపాదన మీద మాత్రమే ధ్యాస పెడితే ఒకవేళ కోరుకున్నంత సాధించి కోటీశ్వరుడైనా ఆ విజయాన్ని అనుభవించలేని పరిస్థితికి రాకుండా చూసుకోవాలి. అప్పుడే నిజమైన సంపద సాధించినట్లు.

సంపద అంటే డబ్బుతో కూడబెట్టేది మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా సంపదే. అనుబంధాలు కూడా సంపదే. జ్ఞానం కూడా సంపదే. కేవలం ఆర్థిక సంపద మీదే ధ్యాసపెట్టిన మనిషి లోపాలతో ఎదుగుతాడే తప్ప నిజంగా ఎదగలేడు. కేవలం ఆర్థికంగానే కాక ఆనందాన్ని ఇచ్చే అన్ని విషయాలలో ముందంజ వేయడమే నిజమైన సంపద రహస్యం. [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము