(Telugu) ఆర్థికాభివృద్ధికి షేర్లలో పెట్టుబడి తప్పనిసరి.

[:te]ఎంతటివాళ్ళైనా, వాళ్ళు ఎంత కష్టపడినా మానవ సహజమైన కొన్ని లక్షణాలవల్ల నష్టపోతుంటారు. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఈ లోపాలను అధిగమించలేము. ఆ విషయం అర్థం అయ్యేలా నీకు ఒక కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను.

పూర్వం కోసలరాజ్యంలో కల్యాణి అని చాలా గొప్ప అందగత్తె వుండేది. అందంతో పాటే అందంగా వుంటానన్న గర్వం అదనంగా వుండేది. క్రమంగా అది పొగరుగా రూపాంతరం చెందింది. ఇది ఇలా వుంటే కల్యాణికి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఆమె తండ్రి అనుకున్నాడు. అదే విషయం కల్యాణితో అన్నాడు.

“ఏమిటి నాన్నా మీ చాదస్తం. నాకున్న అందానికి మన్మధుడు లాంటి ఏ అందాల రాజకుమారుడో కోరి వచ్చి నన్ను పెళ్ళి చేసుకుంటాడు” అంది. అనడమే కాదు, కల్యాణి ఆ విషయాన్ని మనసారా నమ్మేది కూడా. ఎప్పుడు ఏ రాజకుమారుడు వస్తాడా అని ఎదురుచూస్తూ వుండేది.

ఆమె తండ్రి ప్రయత్నం ఫలించిందో, లేక నిజంగానే ఆమె అందాన్ని ఇష్టపడ్డారో కానీ ఎనిమిది మంది రాజకుమారులు తమని పెళ్ళి చేసుకోమని వర్తమానం పంపారు. ప్రతాప్ అనే ఒక రాజకుమారుడు మిగిలిన వారిలా తన వర్తమానం, చిత్రపటం పంపకుండా తానే స్వయంగా వచ్చి ఆమెను కలవాలని అనుకున్నాడు. అతను వచ్చేసరికి కల్యాణి ఎనిమిది మంది రాజకుమారుల చిత్రపటాలను పరిశీలించి తండ్రితో తన అభిప్రాయం చెప్తోంది.

“నాన్నా, వీళ్ళా నన్ను పెళ్ళి చేసుకునేది? నా అంత అందగత్తె ఈ భూమి మీద ఇంత వరకు పుట్టలేదు, పుట్టబోదు. అలాంటి నేను ఇంత అనాకారుల్ని ఎలా చేసుకుంటాను” అంటూ తన తిరస్కారం ప్రకటించింది. నిజానికి ఆ ఎనిమిది రాజకుమారులు చాలా అందంగా వున్నారు. అయినా కల్యాణి కాదంది. ఇదంతా గమనించిన ప్రతాప్ ఒక పథకం ఆలోచించాడు.

మర్నాడు ప్రతాప్ ఒక నౌకరులా తయారయ్యి కల్యాణి దగ్గరకు వెళ్ళాడు.

“అమ్మాయిగారూ, మీకోసం మరో చిత్రపటం తీసుకొచ్చాను. ఇందులో మీరు ఊహించని బొమ్మ వుంటుంది. అది చూడగానే మీరు ఎవరిని పెళ్ళి చేసుకోవాలో నిర్ణయం వెంటనే తీసేసుకుంటారు. నా మాట విని ఏకాంతంలో ఇందులో వున్న బొమ్మని చూడండి” అని చెప్పాడు. రాజకుమారి సరే అంది.

అన్నట్టుగానే తన అంతఃపురంలో ఏకాంతంగా ఆ చిత్రపటాన్ని చూసింది. ఆ తరువాత రెండు రోజులపాటు ఆమె బయటికి కూడా రాలేదు. మూడో రోజు వస్తూనే ఆ చిత్రపటాన్ని తెచ్చిన ప్రతాప్ ని పెళ్ళి చేసుకుంటానని ప్రకటించింది. అది విని అంతా ఆశ్చర్యపోయారు.

మహా మహా సుందరులైన రాజకుమారులని కాదన్న కల్యాణి ప్రతాప్ ని చేసుకోడానికి ఎందుకు సిద్ధపడింది? చిత్రపటం పేరుతో ప్రతాప్ ఏమిచ్చాడు?

“మన కథలో కల్యాణి అందగత్తే కాదు, అహంభావి కూడా. తాను ప్రపంచసుందరిననీ, అందువల్ల ఏ రాజకుమారుడో వచ్చి పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది. అందులో తప్పులేదు. అయితే ఆమెను చేసుకోడానికి సిద్ధపడి చిత్రపటాలను పంపిన రాజకుమారులు కూడా అందగాళ్ళే అని చెప్పావు కదా. అయినా ఆమె తిరస్కరించిందంటే ఆమె కోరిక ఆశ స్థాయిని దాటి దురాశ స్థాయికి చేరిందన్నమాట. అంటే తన స్థాయి ఏమిటో గుర్తించకుండా, అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆశిస్తోంది. ఇది తెలుసుకున్న ప్రతాప్ ఆమెకు, ఆమె అసలు స్థాయిని పరిచయం చెయ్యాలనుకున్నాడు.

నేను ఊహించేది నిజమే అయితే ప్రతాప్ ఆమెకు ఇచ్చింది ఒక అద్దం అయ్యుంటుంది. అద్దాన్ని ఇవ్వడం ద్వారా ఆమెను ఆమెకు చూపించి, తాను నిజంగానే అందగత్తేనా పరిశీలించుకోమని చెప్పకుండానే చెప్పాడు. తన స్థాయిని ఒకసారి పరిశీలించుకున్న తరువాత, తాహతుకు మించిన కోరికలు కోరదనీ, తప్పకుండా ఆలోచనలోపడుతుందని అతని పథకం. అతని పథకం ఫలించి కల్యాణి అందం మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి తెలివితేటలతో తనని మార్చిన ప్రతాప్ నే పెళ్ళి చేసుకుంది.

ఆ కథలో కల్యాణి సంగతి ఏమైనా, ఇందులో వున్న ఆర్థిక పాఠాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇంతకు ముందు మనం కలిసినప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే లాభపడే అవకాశం ఎక్కువ అని కూడా చెప్పుకున్నాము. కానీ చాలామంది త్వరగా డబ్బు సంపాదించాలనే వుద్దేశ్యంతో స్టాక్ మార్కెట్లో షేర్లు కొని ఏ రోజుకి ఆ రోజు అమ్ముతూ, కొంటూ వ్యాపారం చేస్తారు. దీనినే ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు. దీనిలో నష్ట పోయేందుకు అవకాశం ఎక్కువ అని కూడా అనుకున్నాము.

ఇప్పుడు కథలో వున్న నీతిని స్టాక్ మార్కెట్ కు అనుసంధానం చేసి చూస్తే మనకు ఒక ముఖ్యమైన ఆర్థిక పాఠం బోధపడుతుంది. అది చెప్పుకోడానికి చాలా చిన్నదీ, మనందరికీ బాగా తెలిసిందే – “దురాశ దుఃఖానికి చేటు”. ఈ నీతి స్టాక్ మార్కెట్ కే కాదు, ఏ ఆర్థిక పథకానికైనా, ఏ ఆర్థిక ప్రణాలికకైనా అన్వయించవచ్చు. డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు. కానీ డబ్బు వస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలని దురాశకు లోను కావడం తప్పు. కల్యాణి అందమైన రాజకుమారుణ్ణి పెళ్ళి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎనిమిది అవకాశాలు వచ్చినా తిరస్కరించడం తప్పు.

కథలో ప్రతాప్ ఇచ్చిన అద్దం ఎలాంటి పని చేస్తుందో, స్టాక్ మార్కెట్ కూడా అలాంటి పనే చేస్తుంది. అద్దం ఒక మనిషి బాహ్య స్వరూపాన్ని కళ్ళ ముందు నిలబెడితే, స్టాక్ మార్కెట్ మనిషి అంతః స్వరూపాన్ని కళ్ళ ముందు నిలబెడుతుంది. ఒక మనిషిలో ఎంత ఆశ వున్నదీ, ఎంత దురాశ వున్నదీ స్టాక్ మార్కెట్ ద్వారా తెలిసిపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఫలానా షేరు కొన్నాడనుకుందాం. దాని ధర వెంటనే పెరిగి వందకు ముఫై రూపాయలు లాభం వచ్చే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ షేరుని అమ్ముతాడా అమ్మడా అన్నది ఆ వ్యక్తి ఎంత లాభాన్ని ఆశిస్తున్నాడో తెలియజేస్తుంది. అది అతని ఆశకి, దురాశకి మీటర్ లాంటిది.

స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేవాళ్ళలో చాలా మంది ఒక నియమం పెట్టుకుంటారు. తన డబ్బుమీద పది శాతం, లేదా అంత కన్నా ఎక్కువ లాభం వస్తే ఇక ఆ రోజు ట్రెడింగ్ ఆపేయాలి అని. అలాగే నష్టం పది శాతానికి మించితే కూడా ట్రేడింగ్ ఆపేయాలని అనుకుంటారు. కానీ చాలామంది లాభాలు వస్తుంటే ఇంకా లాభాలు వస్తాయన్ని ఆశతో మరింత డబ్బు పెడుతుంటారు. చిత్రంగా నష్టానికి గురైనప్పుడు కూడా ఆగరు. పోయిన డబ్బుని ఎలాగైనా సంపాదించేదాకా ఆపకూడదని ఇంకా షేర్లు కొంటుంటారు. వాళ్ళు అలా చేయడం వల్ల లాభపడ్డారా, నష్టపోయారా అన్నది ముఖ్యం కాదు. అనుకున్న నియమాన్ని పాటించలేదు అన్నది ఇక్కడ గమనించాల్సింది. ఒక నియమాన్ని అనుకున్న తరువాత ఆ నియమం ప్రకారం వెళితే సామాన్యంగా లాభాలు వస్తాయి. లాభాల మాట ఎలా వున్నా, కనీసం నష్టాలు అదుపులో వుండే అవకాశం వుంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ లో సంయమనం చాలా అవసరం. సంయమనం లేని వాళ్ళు, నియమానుగుణంగా నడవలేని వాళ్ళు స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టకపోవటమే మంచిది.

స్టాక్ మార్కెట్లో చాలా స్పష్టంగా కనిపించే విషయం మరొకటి వుంది. మార్కెట్ తప్పు చేసినవాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది. డబ్బుతో వ్యవహారం కాబట్టి ఆ శిక్ష ఆర్థిక నష్టమేనని ప్రత్యేకంగా చెప్పే పని లేదు. స్టాక్ మార్కెట్లో చిన్న తప్పు, పెద్ద తప్పు అన్న వ్యత్యాసం వుండదు. ఒకోసారి చిన్న తప్పుకు కూడా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక షేర్ విలువ సాయంత్రంలోగా పెరుగుతుందని ఊహించి ఒక వ్యక్తి భారీగా ఆ షేర్లు కొనుకున్నాడనుకుందాం. కానీ సాయంత్రం ధర పెరిగినా, ఇంకా పెరగచ్చు అన్న ఊహతో అమ్మకుండా మర్నాటి వరకు ఆపాడనుకుందాం. మర్నాడు ఆ షేరు విలువ సగానికి పడిపోతే, అతని పెట్టుబడిలో యాభైశాతం నష్టపోతాడు. అదే మరొకరు కేవలం మతిమరపు వల్ల షేర్లు సమయానికి అమ్మకపోయినా నష్టం అంతే వుంటుంది. అత్యాశతో అమ్మకుండా వున్న వ్యక్తికీ, మతిమరపు వల్ల పొరపాటు చేసిన వ్యక్తికీ ఒకే రకంగా నష్టం వస్తుంది.

ఇలా అత్యాశ కలిగి వుండటం, సంయమనం లేకపోవటం, తెలివితేటల మీద అవసరానికి మించిన నమ్మకం, తెలిసైనా తెలియకుండానైనా చేసే పొరపాట్లు ఇలాంటి అన్ని సందర్భాలలో నష్టం తీవ్రంగా వుంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ ను అద్దంతో పోల్చవచ్చు. మార్కెట్లో డబ్బు పెడుతున్న ముదుపరి స్వభావాన్ని మార్కెట్ కళ్ళ ముందు నిలబెడుతుంది. సంపద సాధించే విషయం ఎలా వున్నా ఆత్మ విమర్శ చేసుకోడానికి స్టాక్ మార్కెట్ బాగా ఉపయోగపడుతుంది. సరిగ్గా మన కథలో అద్దం చేసే పని మార్కెట్ కూడా చేస్తుందన్నమాట.

ఆ విషయాన్ని అలా పక్కన పెడదాం. సంపద సాధించడాలంటే షేర్లలో (ఈక్విటీ) ఖచ్చితంగా ముదుపు చెయ్యాలని మనం చెప్పుకుంటూనే వున్నాం. అలా కాకపోతే ఆర్థికాభివృద్ధి చాలా నెమ్మదిగా వుంటుందని కూడా అనుకున్నాం. కానీ, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అనీ, అందులో డబ్బులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ అనీ అంటున్నాము. ఈ రెండింటిని కలపడం ఎలా అంటే – స్టాక్ మార్కెట్లో రిస్క్ వున్న మాట వాస్తవమే అయినా, అది స్వల్పకాలిక పెట్టుబడులకు మాత్రమే. దీర్ఘకాలిక పెట్టుబడులలో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు వీలైనన్ని రోజులు వాటిని తీయకుండా వుంచడం ఉత్తమమైన మార్గం. అలాగే వయసుని బట్టి రిస్క్ ఎపిటైట్ ఎంతుందో చూసుకోని అంతే డబ్బు ముదుపు చెయడం ఇంకో సూచన.

ఇవన్నీ చెప్పినా, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు పెడుతూ తీస్తూ చేసే ఇంట్రాడే ట్రేడింగ్ చాలామందిని ఆకర్షిస్తుంది. సంపద సాధించడానికి ఇదే సరైన మార్గం అనిపిస్తుంది. కాస్త పెట్టుబడితో అనూహ్యమైన లాభాలు సంపాదించవచ్చని అనిపిస్తుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్లో నేరుగా షేర్లు కొంటూ అమ్ముతూ అదే వ్యాపారంగా చెయ్యాలనుకుంటే కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది - తాము చేస్తున్నపని దాదాపు గ్యాంబిలింగ్ (జూదం) లాంటిదనీ, వ్యాపారం కాదని గుర్తించాలి. నష్టాన్ని తట్టుకోగల శక్తి వున్నప్పుడే ఇలాంటి ట్రేడింగ్ చెయ్యడానికి సిద్ధపడాలి.

స్టాక్ మార్కెట్లో నేరుగా డబ్బు పెట్టాలనుకుంటే ఆయా షేర్లను విశ్లేషించడం తెలిసి వుండాలి. ఇందుకు ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్ అనే రెండు ప్రముఖ విధానాలు ఎక్కువగా వాడుతుంటారు. ఫండమెంటల్ ఎనాలసిస్ లో ఆ కంపెనీ ఎలా పనిచేస్తోంది, ఎలాంటి మేనేజ్మెంట్ ఆ కంపెనీని నడుపుతోంది, ఆ కంపెనీ ఉత్పత్తులకి డిమాండ్ ఎలా వుంది, కాంపిటిషన్ ఎలా వుంది, దేశ ఆర్థిక పరిస్థితి ఎలా వుంది వంటి ప్రశ్నలతో విశ్లేషణ సాగుతుంది. అదే టెక్నికల్ ఎనాలసిస్ లో స్టాక్ మార్కెట్ డేటా ఆధారంగా, ఎన్ని షేర్లు అమ్ముడుపోతున్నాయి, షేర్ విలువ ఎలా తగ్గుతోంది, ఎలా పెరుగుతోంది వంటి వివరాలతో విశ్లేషణ చేస్తారు. ఇవి కాక ఇంకా ఎన్నో విధానాలు వున్నాయి. వీటి గురించి అవగాహన లేకుండా కూడా స్టాక్ మార్కెట్లో నేరుగా ప్రవేశించడం ఏ మాత్రం మంచిది కాదు.

మనం కథలో రాజకుమారి కల్యాణిలా వ్యవహరించాలి. కేవలం అందానికి మోజుపడి రాజకుమారులను ఆశించిన కల్యాణి చివరికి తప్పు తెలుసుకోని, అందం కన్నా తెలివితేటలే ముఖ్యమని నిర్ణయించుకుంది కదా. అలాగే పైపై జిలుగులతో కనపడే స్టాక్ మార్కెట్ లాభాలను నమ్మి, అత్యాశతో అందులో నేరుగా దిగడం సరికాదు. తెలివితేటల ఆధారంగా విశ్లేషణ చేయగల సామర్థం వుంటేనే స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టచ్చు.

ఆర్థికాభివృద్ధికి షేర్లలో పెట్టుబడి తప్పనిసరి. అయితే, నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి, అవగాహన లేకుండా, అత్యాశతో వ్యవహరించడం మంచిది కాదు. ఇలాంటి పెట్టుబడులలో తక్కువకాలంలో ఎక్కువలాభాలు సంపాదించాలనుకోవడం అవివేకం.
చిల్లర చిట్కాలు

స్టాక్ మార్కెట్ గురించి ఎన్నో సిద్ధాంతాలు వున్నాయి. ఏ షేర్ ను ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మాలో చెప్పే పుస్తకాలు కోకొల్లలుగా దొరుకుతాయి. అయితే ఎఫీషియంట్ మార్కెట్ హైపోథసిస్ సిద్ధాంతం వాటిల్లో చిత్రమైనది. ఆ సిద్ధాంతం ప్రకారం మార్కెట్లో షేర్ల విలువను ముందుగా ఊహించండం అసాధ్యం. ఇదే నిజమైతే మిగిలిన అన్ని రకాల విశ్లేషణలు వ్యర్థమే కదా. అందుకని స్వల్పకాలికమైన ఎలాంటి పెట్టుబడిని స్టాక్ మార్కెట్లో పెట్టకపోవడమే ఉత్తమం.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము