(Telugu) స్టాక్ మార్కెట్ లో తెలివిగా పెట్టుబడి చెస్తేనే ప్రగతి సాధ్యం అవుతుంది

[:te]సంపద సాధనలో అత్యంత కీలకమైన రహస్యం వ్యాపారంలో భాగస్వామిగా మారటమేనని మనం గతంలో చెప్పుకున్నాము. అలా మారేందుకు స్టాక్ మార్కెట్ మంచి మార్గమని కూడా అనుకున్నాము. అయితే స్టాక్ మార్కెట్ లో జొరబడిన ప్రతివాళ్ళు లాభాలతో బయటికి రాలేదు. కొందరు డబ్బు నష్టపోతే మరి కొంత మంది పరువుని కూడా పోగొట్టుకున్నారు. కొన్ని దారుణమైన సందర్భాలలో ప్రాణాలను సైతం పోగొట్టున్నారు. ఇలా జరగకుండా వుండాలంటే మనకి స్టాక్ మార్కెట్ పనితీరు గురించి స్పష్టమైన అవగాహన వుండాలి. అందుకే నీకు నేను ఒక కథ చెప్పదలిచాను.

అచ్చుపేట రైతుబజార్ మొదట్లో అప్పలకొండ చిలక ప్రశ్న చెప్తుండేవాడు. అతను చాలా గొప్పగా జాతకం చెప్తాడని పేరు. జాతకం అంతా చిలక తెలివితేటల వల్లేనని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది అది అప్పలకొండ తెలివితేటలని అంటుంటారు. అప్పలకొండ సొంత వూర్లో వుండే సింహాచలానికి ఈ రెండింటి మీద నమ్మకంలేదు.
“ఆ ఊర్లో జనానికి బుద్ధి లేదు అందుకే ఏమీ చేతకాకపోయినా ఈడి యాపారం సాగుతోంది” అనేవాడు. చూస్తుండగానే అప్పలకొండ సొంతూరిలో ఆస్థులు కొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని సింహాచలం అచ్చుపేటకి బయల్దేరి వచ్చాడు. సింహాచలం చెప్పిన విషయం విన్న అప్పలకొండ –
“రేపు నువ్వు నాతోపాటే రైతు బజారు దగ్గరకురా. అక్కడ కూర్చోని నేను ఎలా ప్రశ్న చెప్తున్నానో గమనించు. దానిబట్టి నీకు అంతా అర్థం అయిపోతుంది.” అని చెప్పాడు.

అనుకున్నటుగానే మర్నాడు ఇద్దరూ రైతుబజారు మొదట్లో కూర్చున్నారు. సింహాచలం జాగ్రత్తగా జరిగేవన్నీ గమనిస్తూ కూర్చున్నాడు. అప్పలకొండ, రైతుబజారులోకి వస్తున్నవాళ్ళని అసలు పట్టించుకోలేదు. కూరగాయలు కొనుకున్న తరువాత బయటికి వెళ్ళబోతున్న వాళ్ళనే పలకరించడం మొదలు పెట్టాడు. స్థూలంగా ఇదీ సంభాషణ -

“ఎలా వుందండీ ఈరోజు మార్కెట్టు?” అని అడుగుతాడు.

“ఏం మార్కెట్టో, ఏం రేట్లో... మండిపోతున్నాయి. కాప్సికం కిలో ముఫై రూపాయాలంట..” అంటారు కొంతమంది. ఇంకొంతమంది “ఫర్లేదండీ టమాటాలు ఎనిమిదే” అంటారు. అలా వాళ్ళని మాటల్లో పెట్టి కూర్చోపెట్టేవాడు. ఆ తరువాత వాళ్ళలో చాలామంది అతని దగ్గర జోస్యం చెప్పించుకునేవాళ్ళు. ఆ తరువాత అతను చెప్పిన విషయాలు చాలా కరెక్ట్ వున్నాయని అడిగినంత డబ్బులు ఇచ్చేవాళ్ళు.

ఇదంతా గమనించిన సింహాచలానికి ఏమీ అర్థం కాలేదు.

“ఏముందీ... కూరగాయల మార్కెట్టుకి వచ్చినవాళ్ళని పట్టుకోని కూరగాయల రేట్లు ఎలా వున్నాయి అని కబుర్లలో దింపుతున్నావు. వాళ్ళు త్వరగా నీ బుట్టలో పడిపోతున్నారు. ఇంతవరకూ బాగానేవుంది. కానీ నీకు సరిగ్గా జాతకాలు చెప్పడం కూడా రాదు కదా? అయినా నువ్వు చెప్పేవన్నీ కరెక్టేనని ఎందుకు అంటున్నారో అర్థం కాని చిక్కుప్రశ్నలా వుందే” అన్నాడు.

దానికి అప్పలకొండ నవ్వేసి – “చిక్కు ప్రశ్న కాదు బావా చిలకా ప్రశ్న” అన్నాడు. అప్పలకొండ వ్యాపార రహస్యం ఏమిటో చెప్పమని నేను అడుగుతానని నీకు ముందే అర్థం అయిపోయింది కదా.

“అప్పలకొండ నిజంగా చాలా తెలివైనవాడు. చిలక ప్రశ్న చెప్పడం అంటే జోస్యం చెప్పించుకునే వాళ్ళ ప్రశ్నలను వినడం కాదు, జోస్యం చెప్పేవాళ్ళే ప్రశ్నలు వేసి సమాధానం కనిపెట్టడం అని తెలుసుకున్నాడు. అందుకే రైతుబజార్ నుంచి బయటికి వస్తున్నవాళ్ళని ప్రశ్నలు వేసి పలకరిస్తున్నాడు. అతను అడిగిన మొదటి ప్రశ్నే కీలకమైనది. మార్కెట్టులో రేట్లు ఎలా వున్నాయి అని అడిగినప్పుడు వాళ్ళు రేట్లు ఎక్కువగా వున్నాయనో, తక్కువగా వున్నాయనో చెప్తారు. దీని వల్ల అతనికి కొన్ని ప్రయోజనాలు వుంటాయి. మొదటిది బయటికి వచ్చినవాళ్ళు ఏ మనఃస్థితిలో (మూడ్ లో) వున్నారో తెలిసిపోతుంది. ధరలు ఎక్కువగా వున్నాయని బాధపడేది సగటు మనిషి కాబట్టి, అతనికి తను ఆర్థికంగా ఎదుగుతాడా లేదా అన్న అనుమానం వుంటుంది. ఆ విషయం అర్థం చేసుకోని అప్పలకొండ తన జోస్యంలో దానికి సంబంధించిన విషయాలు చెప్తాడు. అదే ఒక ధనవంతుడు వచ్చి ధరలు తక్కువగానే వున్నాయంటే ఆ ప్రకారంగా మార్చి జోస్యం చెప్తాడు. ఇది అతని టెక్నిక్. వాళ్ళు కొన్న కూరగాయల గురించి కూడా తెలిస్తే ఇంకా కొన్ని ఊహించగలడు. ఉదాహరణకు కాకరకాయలు, బొప్పాసకాయలు కొని బంగాళాదుంపలు, అరటిపళ్ళు కొనకపోతే వాళ్ళకు షుగర్ వుందనీ అనుమానిస్తాడు. ఆ ప్రకారంగా వాళ్ళ గురించి కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాడు.

ఇప్పుడు మనం మన ఆర్థిక పాఠంలోకి వద్దాం. ఏదైనా ఒక వ్యాపారంలో భాగస్వామి అవడానికి స్టాక్ మార్కెట్ అనువైనదని ఇంతకు ముందు మనం చర్చించాం కదా. ఆ స్టాక్ మార్కెట్ ను అర్థం చేసుకోడానికి ఈ కథ ఉపయోగపడుతుంది. ఈ కథలో అప్పలకొండ “ఎలా వుందండీ ఈరోజు మార్కెట్టు?” అని అడిగే ప్రశ్న ముఖ్యమనది అనుకున్నాం కదా. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళ మాటలు వింటే సరిగ్గా ఇదే ప్రశ్న మనకి వినపడుతుంది. టీవీ బిజినెస్ వార్తల్లో కూడా “ఈ మార్కెట్ పెరిగింది లేదా తగ్గింది” అని వినపడుతుంది. అలా చెప్పేందుకు నిదర్శనంగా సెన్సెక్స్ పెరిగింది అనో పడిపోయింది అనో చెప్తుంటారు. అప్పలకొండ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు మార్కెట్లో రేట్లు పెరిగాయనో తగ్గాయనో చెప్పినట్లే ఇది కూడా వుంటుంది.

అసలు సెన్సెక్స్ అంటే ఏమిటి? – సెన్సెక్స్ అనేది సెన్సిటివ్ ఇండెక్స్ అనే మాటకు సంక్షిప్తరూపం. స్టాక్ మార్కెట్లో వున్న అన్ని షేర్లు ఒకేలా పెరగటమో తగ్గటమే చెయ్యవు కదా. మనం ఇంతకు ముందెప్పుడో చెప్పుకున్నట్లు ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల నుంచి ఆ కంపెనీలో జరిగే చిన్న మార్పు వరకు ఒక్కొక్కటి ఒక్కో రకంగా కంపెనీ ఆదాయ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఆ షేరును కొనేవాళ్ళు పెరగచ్చు, అమ్మేవాళ్ళు పెరగచ్చు. ఆ కారణం షేరు విలువ పెరగచ్చు, తగ్గచ్చు. సెన్సెక్స్ లో వున్న ఐదువేల పైచిలుకు కంపెనీలలో ఎన్ని తగ్గాయి ఎన్ని పెరిగాయి అని రోజువారీగా విశ్లేషించుకోవడం సామాన్య ముదుపరులకి సాధ్యపడకపోవచ్చు. అందుకోసమే కొన్ని ముఖ్యమైన షేర్లను మాత్రం ఒక శాంపిల్ గా ఎంచుకోని వాటి పెరుగుదల, తగ్గుదలను సెన్సెక్స్ అని వ్యవహరిస్తారు.

బెండకాయలు కొనేటప్పుడు కాయలు లేతగా వున్నాయో లేదో తెలుసుకోడానికి అన్ని కాయలు చివర్లో విరిచి కొనలేం కదా, శాంపిల్ కింద కొన్ని విరిచి ఒక అవగాహనకు వస్తాం. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ కూడా సరిగ్గా అలాంటిదే. సెన్సెక్స్ లో వున్న షేర్ల విలువ పెరిగితే మొత్తంగా సెన్సెక్స్ విలువ పెరుగుతుంది. సెన్సెక్స్ పెరిగింది అంటే స్టాక్ మార్కెట్లో వున్న షేర్ల విలువ కూడా పెరిగినట్లే అనుకోవచ్చు. కానీ బెండకాయల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా పడినా ఒకటో రెండో ముదురుకాయలు వచ్చినట్లు, సెన్సెక్స్ కి భిన్నంగా వెళ్ళే షేర్లు వుంటాయని గమనించుకోవాలి.

సెన్సెక్స్ గురించి మరికొంత తెలుసుకుందాం. ఇది 1986లో మొదలుపెట్టారు. 1990 నాటికి సెన్సెక్ విలువ వెయ్యి రూపాయలు. 92 నాటికి అది మూడువేలు చేరింది. 2006లో పదివేలు దాటింది. 2007లో ఇరవై వేలు దాటింది. ప్రస్తుతం ముఫైవేల ప్రాంతంలో వుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. 1990లో ఎవరైనా సెన్సెక్ లో వున్న షేర్లలో, అవి వున్న నిష్పత్తిలో వెయ్యి రూపాయలు పెట్టి వుంటే అవి ఈ రోజుకి ముఫైవేలు అయ్యుండేవి. అంటే పాతికేళ్ళలో ముఫైరెట్లు! ఇదే స్టాక్ మార్కెట్ మహిమ. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. ఇందులో ఎన్నో రిస్కులు, ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు వున్నాయి. అన్నింటికంటే మొదటది అన్ని షేర్లను మనకు ఇష్టం వచ్చినట్లు కొనుక్కోలేము. కొన్నింటిని పదుల్లో, కొన్నింటిని వందల్లో కొనాలి. పైగా సెన్సెక్స్ లో వున్న షేర్లు అంటే వాటి ధర చాలా ఎక్కువగా వుంటుంది. అంత ఎక్కువ ధర వున్న షేర్లను అంత మొత్తంలో కొనాలంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇందుకు పరిష్కారంగానే మ్యూచువల్ ఫండ్స్ వున్నాయి. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం.

మరో ముఖ్యమైన సమస్య. నష్టం వచ్చే అవకాశం. పైన చెప్పిన సెన్సెక్ ప్రగతిలోనే దాని పతనం కూడా దాక్కోని వుంది. ఉదాహరణకి 2007 డిసెంబరులో ఇరవై వేలు దాటిన సెన్సెక్ విలువ 2008-09 ప్రాంతంలో ఎనిమిది-తొమ్మిది వేల మధ్య కొట్టుమిట్టాడింది. అంటే 2007 డిసెంబరులో ఎవరైనా సెన్సెక్స్ షేర్లలో డబ్బులు పెట్టి వుంటే అవి మరో సంవత్సరం రెండు సంవత్సరాలలో సగం కన్నా ఎక్కువ నష్టపోయేవాళ్ళు. ఇక్కడ ముఖ్యమన విషయం ఏమిటంటే షేరు ధర తగ్గగానే ఎవరూ నష్టపోరు. షేరు ధర తగ్గిందన్న భయం, ఇక ముందు ముందు పెరగదేమోనన్న అనుమానం వుండి, షేరుని అమ్మేసినప్పుడే నష్టం వస్తుంది. అమ్మనంతకాలం నష్టం వచ్చింది అనుకోవడం, అలాగే లాభం వచ్చింది అనుకోవడం కూడా సరికాదు. ఇందాక చెప్పినట్లు 2007లో కొన్న షేర్ల విలువ 2009లో పడిపోయినా నిబ్బరంగా అలాగే వుంచుకోని వుంటే 2011నాటికి మళ్ళీ లాభాలను చూసే వాళ్ళు.
ఇందులో ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. 2005 నుంచి 2007 వరకు స్టాక్ మార్కెట్ మంచి దూకుడు మీద సాగింది. ఆ తరువాత ఎక్కడో అమెరికాలో జరిగిన సబ్ ప్రైమ్ క్రైసిస్ కారణంగా కుదేలైనా మళ్ళీ సంవత్సరంలోనే పుంజుకోని ఇప్పుడు మళ్ళీ జోరు మీద వుంది. ఈ జోరు వెనుక దేశంలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా ప్రపంచీకరణ, వేరే దేశాలతో వ్యాపారలావాదేవీలు జరగడం తదితర కారణాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా భారత దేశాలు ఇలాంటి అభివృద్ధి సాధిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాస్త కాలంలో ముందుకు దూకిన సెన్సెక్స్ ఆధారంగా పెట్టుబడులు పెట్టడం కూడా అంత మంచిదికాదు.

మరి ఇలాంటి పెట్టుబడులు ఎలా చేయాలో సెన్సెక్స్ ద్వారానే నేర్చుకోవచ్చు. సెన్సెక్స్ ముఫై ఏళ్ళ చరిత్రలో ఏ రోజు అయినా తీసుకోని ఆ రోజు నుంచి పది సంవత్సరాల వ్యవధి తీసుకోని గమనిస్తే ఖచ్చితంగా లాభాలలో వుండే అవకాశం వుంది. అంటే షేర్లలో పెట్టిన డబ్బు దీర్ఘకాలికమైతే నష్టపోయే అవకాశాలు దాదాపు లేనట్లే. స్టాక్ మార్కెట్లో నష్టపోయి దివాలా తీసినవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్ (ఒకే రోజు కొనుగోలు, అమ్మకం) చేసే వాళ్ళే వుంటారు. ఇది తెలివైన పెట్టుబడి కాదు. తెలివితేటలు ఆధారంగా ఆడే జూదం. దీనికి ఎంతో పరిజ్ఞానం, విశ్లేషణా శక్తి, సమయం, సంయమనం వీటన్నింటినీ మించి అదృష్టం కూడా కావాలి. అలా కాకుండా దీర్ఘకాలిక (కనీసం పదేళ్ళు) పెట్టుబడి పెట్టినవారు నష్టపోవటం అరుదు.

సెన్సెక్స్ నేర్పే మరో పాఠం ఏమిటంటే, స్టాక్ మార్కెట్ లో పెట్టి డబ్బు ఒక నిర్దిష్టమైన అవసరానికి, ఒక నిర్దిష్టమైన రోజు వెనక్కి తీసుకుంటానని ఎప్పుడూ అనుకోవద్దు. ఉదాహరణకు కూతురు పెళ్ళి కోసం స్టాక్ మార్కెట్లో డబ్బులు దాచిపెట్టి సరిగ్గా ముహూర్తానికి రెండు రోజుల ముందు షేర్లు అమ్మడానికి వెళ్తే ఆ రోజు ప్రపంచంలో ఏ మూలో జరిగినే ఏదో మార్పు వల్ల మన దేశంలో సెన్సెక్స్ కూలిపోవచ్చు. అలాంటప్పుడు డబ్బుల అవసరం అనివార్యం కాబట్టి షేర్లు అమ్మితే నష్టం వస్తుంది. అదే అమ్మాయి పెళ్ళి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి అంటే అమ్మాయి పెళ్ళికి సుమారు ఓ సంవత్సరం లేదా రెండు సంవత్సరాల ముందు నుంచి స్టాక్ మార్కెట్ ను పరిశీలిస్తూ తన దగ్గర వున్న షేర్లకు మంచి ధర పలుకుతున్నప్పుడు అమ్మేసి ఆ డబ్బుని డిపాజిట్ రూపంలో పెట్టుకోవడం మంచి పని. అప్పుడు లాభం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

స్టాక్ మారెక్ట్ గురించి, సెన్సెక్స్ గురించీ తెలుసుకున్నాం కాబట్టి ఇక ఇందులో డబ్బులు పెట్టేందుకు ఉత్తమ మార్గాలేమిటో తెలుసుకోవడమే తరువాయి.

స్టాక్ మార్కెట్ లో తెలివిగా పెట్టుబడి చెస్తేనే ప్రగతి సాధ్యం అవుతుంది. స్టాక్ మార్కెట్ పనితీరుని స్థూలంగా తెలుసుకోడానికి సెన్సెక్స్ ఉపయోగపడుతుంది. షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టి, మార్కెట్ ఎగుడు దిగుడులను చూసి భయపడకుండా స్థితంగా వుంటే నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ.

మీకు నచ్చిన ఏవైనా ఐదు షేర్లను ఎంచుకోండి. పది సంవత్సరాల క్రితం వాటి మొత్తం విలువ ఎంత వుందో చూడండి. మీరు సరిగ్గా అంత డబ్బుని వాటిలో పెట్టారనుకోండి. ఇప్పుడు అవే షేర్ల విలువ తెలుసుకోని వాటిని మొత్తం ఎంత వుందో చూడండి. పదేళ్ళలో మీ డబ్బు ఎంత పెరిగివుండేదో మీకే అర్థం అవుతుంది. [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము