ఇల్లు కొనాలంటే

జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు కదా. సంపాదించిన డబ్బుని అనుభవించడం కూడా ఆవసరమే. అనుభవించాలంటే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినా ఆనందాన్ని ఇచ్చే ఒక ముఖ్యమైన ఖర్చు గురించి నీకు ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను.

ఇద్దరు మిత్రులు కిరణ్, చరణ్ అని ఇద్దరు స్నేహితులు వుండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఇంజనీర్లయ్యారు. కిరణ్ నాగపూర్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. చరణ్ కి పూణేలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇద్దరూ ఉరు వదిలి వెళ్ళేటప్పుడు కలుసుకున్నారు.

“ఉద్యోగం వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఎలాగూ పెళ్ళి సంబంధాలు చూస్తారు. ఈలోగా ఎలాగైనా మంచి ఇల్లు కొనుక్కోని స్థిరపడాలి” అన్నాడు కిరణ్.

“నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇల్లు కొనడం అంటే ఇరవై ముఫై సంవత్సరాల పాటు జీతంలో ముఖ్యమైన భాగాన్ని వడ్డీగా కట్టడమే. ముఫై లక్షలు అప్పు చేస్తే దాదాపు డెభ్బై రెండు లక్షలు కట్టాలి. అందుకే తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు కొంటారు, తెలివైన వాళ్ళు అందులో అద్దెకు వుంటారు అని ఆర్థిక నిపుణుడు వార్నర్ బఫెట్ అన్నాడు. నేను ఎప్పటికీ అద్దె ఇంట్లోనే వుంటాను” అన్నాడు చరణ్.

ఎవరి అభిప్రాయం వారిది అనుకోని ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నట్టుగానే కిరణ్ సొంత ఇల్లు కొనుక్కోని అందులో వుండసాగాడు. చరణ్ అద్దె ఇళ్ళలోనే వుంటూ కాలక్షేపం చేయసాగాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎప్పటికప్పుడు కలుద్దామని అనుకుంటూనే ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారు. మాటల సందర్భంలో ఇళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది.

“ఏమైనా నువ్వు చాలా తెలివిగా ఆలోచించావురా. ఇల్లు కొనకూడదని నువ్వు చెప్పినా వినకుండా ఇల్లు కొన్నాను. నువ్వు చెప్పినట్లే సంవత్సరాల తరబడి వడ్డీలు అసలు కట్టేసరికి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పుడు నాకంటూ సొంత ఇల్లు ఏర్పడింది కానీ, చేతిలో నయా పైసా లేదు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ముందు వున్నాయి. వాటిని తల్చుకుంటేనే భయం వేస్తోంది” అన్నాడు కిరణ్.

“అదేంట్రా అలా అంటావు? నీ దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు వుంది. నా దగ్గర వున్న సొమ్మంతా కలిపినా పది లక్షలకి మించదు. ప్రతి నెలా అద్దెలు కట్టడానికే నా డబ్బు అంతా అయిపోయింది. నువ్వు చెప్పిన మాట విని నేను కూడా ఇల్లు కొనుక్కోని వుంటే ఎంత బాగుండేది అని ప్రతి రోజు అనుకుంటుంటాను” అన్నాడు చరణ్.

ఈ కథ చాలా విచిత్రంగా అనిపించటం లేదూ? ఒకరు ఇల్లు కొనుక్కోవాలని, మరొకరు ఇల్లు కొనుక్కోకూడదనీ చెప్పారు. కానీ చివర్లో కొనుక్కోవాలని చెప్పే కిరణ్ కొనడం తప్పని అనుకుంటే , కొనుక్కోకూడదని చెప్పిన చరణ్ కొనుక్కోని వుంటే బాగుండేదని అంటున్నారు. ఇలా ఎందుకు జరిగింది? అసలు సొంత ఇల్లు కొనుక్కోవడం మంచిదేనా కాదా?

సొంత ఇల్లు అన్నది ప్రతి మధ్యతరగతి మనిషి కల. ఆ మాటకొస్తే ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అయితే సొంత ఇల్లు ఎందుకు వుండాలి అన్న ప్రశ్నకు మాత్రం రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. కాస్త వయసు మళ్ళినవాళ్ళు సొంత ఇంటిలో సుఖం ఇంకెక్కడా వుండదని చెప్తే, నడి వయస్కులు అది మంచి పెట్టుబడి కదా అంటారు. వయసులో వున్న వాళ్ళను ఇదే ప్రశ్న అడిగితే ఇల్లు స్టేటస్ సింబల్ అని కూడా చెప్తారు. కారణం ఏమైనా ఇల్లు కావాలన్న కోరిక అందరిలోనూ వుంటుంది. నువ్వు చెప్పిన కథలో కిరణ్ అలాంటివాడే. అలా కాకుండా సొంత ఇల్లు అవసరం లేదని, ఇల్లు కొనుక్కునే స్థోమత వుండి కూడా ఇల్లు కొనుక్కోకుండా వుండిపోయే వాళ్ళు కూడా వున్నారు. మన కథలో చరణ్ అలాంటివాడు. వీళ్ళిద్దరి ఆలోచనలలోనూ కొంత నిజం వుంది. ముందు అదేమిటో తెలుసుకుందాం.

మధ్యతరగతి వారికి ఇల్లు కొనుక్కోవడం అంటే అప్పు చెయ్యడమే. హోమ్ లోన్ అంటే పదిహేను నుంచి ముఫై సంవత్సరాలపాటు ప్రతి నెలా ఈ.ఎమ్.ఐ అనే ఒక భారాన్ని మొయ్యడానికి ఒప్పుకోవడమే. ప్రతి నెల తిండికి వున్నా లేకపోయినా, అనారోగ్యం వచ్చినా, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు లాంటి ముఖ్యమైన ఖర్చులు వచ్చినా... ఏం జరిగినా ఈ.ఎమ్.ఐ. కట్టాల్సిందే. ఈ కమిట్మెంట్ చాలామందిని భయపెడుతుంది. ఇల్లు కొనుక్కోకూడదని కొంతమంది నిర్ణయించుకోడానికి ఇదొక కారణం. సొంత ఇల్లు కొనుక్కుంటే ఊరికి కాస్త దూరంలో వుండాల్సివస్తుందని, అదే అద్దెకు తీసుకుంటే ఊరి మధ్యలో వుండచ్చని కొంతమంది వాదిస్తారు. అలా చేస్తే ఆదా అయ్యే పెట్రోల్ డీజిల్ ఖర్చులు లెక్క వేసి, దానికి సొంత ఇంటికి పెట్టాల్సిన రిపేర్ల ఖర్చులను కలుపుకుంటే అద్దె ఇల్లే లాభసాటిగా కనిపించే అవకాశం వుంది. అదనంగా ఊరికి దగ్గరగా వున్నందుకు అందుబాటులో వుండే స్కూళ్ళు, హాస్పిటల్స్ వగైరా వివరాలు కూడా చెప్తారు. ఇల్లు కొనకూడదని చెప్పే సిద్దాంతాలలో రాబర్ట్ కియోసాకి (రిచ్ డాడ్ పూర్ డాడ్) అనే రచయిత చెప్పే సిద్ధాంతం ప్రముఖమైనది. ఇల్లు కొనడం కేవలం ఒక ఖర్చు మాత్రమేనని, ఖర్చుపెట్టినా ఇల్లు ఆస్థి (ఎసట్) కాదని అది కేవలం మరింత వ్యయాన్ని తీసుకొచ్చేదని (లయబిలిటి) ఈయన వాదిస్తాడు. అమెరికాలో ఇల్లు కొని సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల గురించి ఇంటర్నెట్ లో చాలా కథలు వున్నాయి. మొత్తం మీద జీతంలో ఎక్కువ భాగం ఇంటి రుణానికి పెట్టి చేతిలో డబ్బులేని పరిస్థితి (కాష్ పూర్) రాకూడదని వీళ్ళు వాదిస్తారు. ఇవన్నీ ఇల్లు ఎందుకు కొనకూడదో చెప్పే వాదాలు.

వీటన్నింటిలో కొంత నిజం వున్నప్పటికీ, ఇవి పూర్తి నిజాలు కాదు. ముఖ్యంగా మన దేశంలో వీటిలో చాలా వరకు చెల్లుబాటు కావు. అందుకు మొదటి కారణం – ఇక్కడ మనం ఇంటిని కేవలం ఒక ఆస్థిగానో, పెట్టుబడిగానో చూడము. ఇల్లు మనకి ఒక సెంటిమెంట్, ఒక స్టేటస్, ఒక సామాజిక అవసరం. కేవలం చనిపోయేటప్పుడు అద్దె ఇంట్లో వుంటే ఇబ్బందులు వస్తాయని రిటైర్మెంట్ డబ్బుతో ఇల్లు కొనుక్కోని ఆ తరువాత అనారోగ్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు వున్నారు. ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేసి, కాస్త స్థిరపడిన తరువాత ఇల్లు కొనుక్కునేవారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వెంటనే, పెళ్ళి కాక ముందే ఇల్లు కొనేస్తున్నారు. ఇది సామాజికంగా వచ్చిన మార్పు. ఇలాంటి మార్పుల వల్ల మన దేశంలో ఇల్లు కొనడం అనివార్యమైపోయింది. ఇవన్నీకాక, భారతదేశ ప్రభుత్వం ఇంటి రుణాలపైన, వడ్డీల పైన ఇచ్చే పన్ను రాయితీలు, బ్యాంకులు ఇచ్చే తక్కువ వడ్డీ రేట్లు కూడా ఇల్లు కొనడానికి దోహదం చేస్తున్నాయి. మనకు దొరికే అన్ని రకాల రుణాలలో అన్నింటికన్నా తక్కువ వడ్డీ కట్టేది ఇంటి రుణానికే. (ఇంటి రుణాలపైన వడ్డీ రేట్లు 9.5%నుంచి 10.5% దాకా వున్నాయి)

ముఫై లక్షల రుణం, 10.5% వడ్డీ లెక్కన తీసుకుంటే నెలకి ముఫై వేలు చొప్పున ఇరవై ఏళ్ళ పాటు అంటే డెభై రెండు లక్షలు కట్టాల్సిన మాట నిజమే. కానీ ఈ రోజు ముఫై వేల విలువ వచ్చే సంవత్సరానికి వుండదు. ద్రవ్యోల్బడం కారణంగా డబ్బు విలువ తగ్గిపోతుంది. మరో వైపు ఆదాయపు పన్ను వల్ల వచ్చే లాభం ఎలాగూ వుంది. సొంత ఇంట్లో వుండటం వల్ల మిగిలే అద్దె కూడా లాభమే కదా. ఇవన్నీకలిపి లెక్కేస్తే ఇంటి రుణం పైన కట్టే వడ్డీ 3% కూడా వుండదు. ఆ రకంగా చూస్తే ఒక ఐదారేళ్ళ తరువాత ఇంటి రుణం పెద్ద భారంగా కనిపించదు.

ఇలా ఇల్లు కొనడానికి కారణాలు, కొనకపోవడానికి కారణాలు చెప్పుకుంటూపోతే అదే ఒక పుస్తకంగా తయారౌతుంది. అందువల్ల ఆ వాదన పక్కనపెట్టి ఇల్లు కొనాలంటే ఏం చెయ్యాలో మాట్లాడుకుందాం. ఒక ఇల్లు కొనడానికి ముందు ఇల్లు కొనాలనుకుంటున్న వ్యక్తి తన ఆర్థిక స్థితి గురించి అంచనా వేసుకోవాలి. ఈ అంచనా ఆధారంగానే ఇల్లు కొనడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవాలి. ఈ అంచనా సరిగ్గా వేసుకోకుండా, తాహతుకు మించి ఇల్లు కొనుక్కుంటే ఆ వ్యక్తి ఆర్థికంగా ఊబిలోకి దిగినట్లే. అందులో నుంచి బయటపడాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది.

ముందు చరణ్ ని తీసుకుందాం. ఇతను చేసేది స్థిరమైన గవర్నమెంట్ ఉద్యోగం. నెల నెలా సంపాదనకు దాదాపు ఎలాంటి ఆటంకం వుండదు. ఇలాంటివాళ్ళు ఇల్లు కొనడానికి ఆలోచన చెయ్యవచ్చు. భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు, క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ వంటి అప్పులు లేని వాళ్ళు, ఒకే వూరిలో స్థిరంగా వుండేవాళ్ళు, ఇంటి డౌన్ పేమెంట్ కట్టడానికి చేతిలో డబ్బు వున్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పకుండా హోమ్ లోన్ పెట్టి ఇల్లు తీసుకునే ఆలోచన చెయ్యవచ్చు. స్థిరమైన సంపాదన లేనివాళ్ళు, ఇప్పటికే అప్పులు వున్నవాళ్ళు, ఇంటి రుణం తీసుకున్న తరువాత మరో రుణం చెయ్యాల్సిన అవసరం వున్న వాళ్ళు, కనీసం ఐదు నుంచి ఏడేళ్ళు కొనుక్కున్న సొంత ఇంటిలో వుండే అవకాశం లేనివాళ్ళు ఇల్లు కొనుక్కోకపోవడమే మంచిది. కేవలం అద్దెలు వస్తాయని ఇల్లు కొనుక్కోవడం అవివేకం. మన కథలో కిరణ్ ఇలాంటి తప్పులే చేసి వుంటాడు. అందువల్లే ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యాడు.

ఇల్లు కొనుక్కోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అందులో అన్నింటికన్నా మొదటిది ఒక బడ్జెట్ నిర్ణయించుకోవడం. ఇందులో కూడా చాలామంది చేసే పొరపాటు ఇంటి బడ్జెట్ అంటే కేవలం ఇల్లు కొనడానికి లేదా కట్టించడానికి అయ్యే ఖర్చుని మాత్రమే పరిగణన లోకి తీసుకోవడం. ఇల్లు కొనడానికి బడ్జెట్ అంటే ఇల్లు వెతకడానికి అయ్యే ఖర్చు నుంచి, రిజిస్ట్రేషన్ కి, ఇన్సూరెన్స్ కి (లోన్ తీసుకున్నప్పుడు తప్పకుండా తీసుకోవాలి), నెల నెల అయ్యే ఖర్చులు, రిపేర్లు వంటి వాటికి, అభిరుచికి అనుగుణంగా చేయించాలనుకుంటున్న మార్పుల ఖర్చుల దాకా అన్నింటినీ లెక్కవేసుకోవాలి. ఇలా లెక్క వేసుకోకుండా ఇల్లు కట్టడం మొదలుపెట్టి, ఆ తరువాత లోన్ సరిపోక నగలు అమ్మడం, వేరే అప్పులు చెయ్యడం వంటివి చెయ్యకూడదు. ఒక హోమ్ లోన్ తీసుకున్న తరువాత కనీసం ఐదు నుంచి పదేళ్ళపాటు ఎలాంటి అప్పు తీసుకోకూడదు.

ఇంటి బడ్జెట్ సిద్ధం అయ్యాక ఎంత లోన్ గా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకులు సాధారణంగా పది నుంచి ఇరవై శాతం డౌన్ పేమెంట్ కట్టమని అడుగుతాయి. కొన్ని సంస్థలు డౌన్ పేమెంట్ వద్దనికూడా చెప్తాయి. కాస్త ఆర్థిక పరిజ్ఞానంతో ఆలోచిస్తే డౌన్ పేమెంట్ ఎంత కడితే అంత మంచిది. అలాగని డబ్బులు వున్నాయని మొత్తం ఒకే పేమెంట్ ఇచ్చి ఇల్లు కొనుక్కోకూడదు. అన్నింటికన్నా చౌకైన రుణాన్ని వద్దని తరువాత క్రెడిట్ కార్డ్లు, పర్సనల్ లోన్లు తీసుకోవటం అవివేకమే అవుతుంది. మొత్తం ఇల్లు కొనడానికి అవసరమయ్యే డబ్బులో ఎనభై శాతం అప్పుగా తీసుకోని, మిగిలింది డౌన్ పేమెంట్ గా ఇవ్వటం మంచిది.

ముందుముందు రాబోయే ఖర్చులను అంచనా వేసుకోని అందుకు కొంత డబ్బు సిద్ధంగా వుంచుకోవాలి. అలాగే రెండు మూడు నెలలకు సరిపోయే ఈ.ఎమ్.ఐ సొమ్ముని పక్కన పెట్టాలి. ఇంటి రుణం తీసుకున్న కొత్తల్లో కొంత ఆర్థిక ఒడిదుడుకులు వుంటాయి. అవి సర్దుకునేదాకా కొంత సొమ్మును దాచుకోవడం మంచిది. ఇల్లు కట్టేటప్పుడు మంచి మార్బుల్ వేయించాలని, ఇంటీరియర్ డెకరేషన్ చేయించాలని అనిపిస్తుంది. చాలా మంది కొత్త ఇంటితో పాటు కొత్త ఫర్నిచర్ కొనాలని ప్రయత్నిస్తారు. ఇవన్నీ ముందు వేసుకున్న ఇంటి బడ్జెట్ లో వుంటేనే ఖర్చు చెయ్యాలి. ఇల్లు సొంతమైన తరువాత నెల నెల ఈ.ఎమ్.ఐ. కడుతూనే, వీలైనంత ఎక్కువ డబ్బు కట్టడానికి ప్రయత్నించాలి. వెయ్యి రూపాయలు మిగిలినా అది అప్పు తీర్చడానికి వాడాలి. ఈ.ఎమ్.ఐ. ద్వారా వడ్డీ కట్టేస్తాము కాబట్టి ఆ పైన కట్టే ప్రతి రూపాయి అసలుని తగ్గించి లోన్ కాల పరిమితిని తగ్గిస్తుంది. ముఖ్యంగా లోన్ మొదట్లో ఇలా కడితే ఆ లాభం లక్షల్లో వుండే అవకాశం వుంది. వీలైతే రుణ కాల పరిమితి లోపే మొత్తం చెల్లించి రుణ విముక్తులు కావటం (ఫోర్ క్లోజర్) మంచిది.

ఇల్లు కొనుక్కోవడం అంటే ఇంత ప్రణాలిక వుంది. ఇలాంటి ఆలోచన ఏదీ లేకుండా ఇల్లు కొనడం వల్లే కిరణ్ అసంతృప్తిగా వున్నాడు. అసలు ఇల్లు కొనాలన్న ఆలోచన చెయ్యనందుకు చరణ్ అసంతృప్తిగా వున్నాడు.

ఇల్లు కొనుక్కోవాలా వద్దా అన్న మీమాంస సహజం. బ్యాంకులు, ప్రభుత్వం, సమాజం ఇల్లు కొనుక్కోవడం అనివార్యమన్న స్థితిని తీసుకొచ్చాయి. తమ తమ ఆర్థిక స్థితిని అంచనా వేసుకోని, డౌన్ పేమెంట్ నుంచి ఫోర్ క్లోజర్ దాకా ప్రణాలిక వేసుకోని ఇల్లు కొనే ఆలోచన చెయ్యాలి. ఈ ఆలోచన లేకుండా ఇంటి రుణం తీసుకుంటే దీర్ఘ కాలం పాటు అప్పుల ఊబిలో ఉండిపోవాల్సి వస్తుంది.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము