(Telugu) సంపద సాధించడంలో అత్యంత కీలకమైనది, అత్యంత లాభదాయకమైనది – పెట్టుబడి.

[:te]సంపద సాధించాలన్న నీ దృఢనిశ్చయం ఎంతో గొప్పది. నీ పట్టుదలతో పాటు, ఆర్థిక విషయాలను తెలుసుకోవాలన్న నీ తపన, తెలుసుకున్న సూత్రాలను అవలంబించడంలో నీ నిజాయితీ నన్నెంతగానో సంతోషపెడుతున్నాయి. అయితే సంపద సృష్టించడానికి అత్యంత కీలకమైన ఒక రహస్యం వుంది. అది తెలుసుకుంటేనే ఆర్థిక ప్రగతి సాధ్యమౌతుంది. ఆ ముఖ్యమైన రహస్యం నీకో తెలుసో లేదో

సుభీక్షాపురంలో సోంబాబు అనే పెద్దమనిషి వున్నాడు. ఆయనకు మొదట్నుంచీ టైలర్ షాపు పెట్టాలని కోరిక. అందుకే వడ్డీవ్యాపారి వీరబాబు దగ్గర డబ్బులు అప్పు చేసి ఇంటిదగ్గరే ఒక మిషన్ కొనుక్కోని పని ప్రారంభించాడు. ఆ ఊరికి సోంబాబు ఒక్కడే టైలర్ కావటంతో ఊర్లో జనం అంతా అతని దగ్గరే బట్టలు కుట్టించుకోవడం మొదలుపెట్టారు. దాంతో సోంబాబు లాభాల బాటలోపడ్డాడు. త్వరలోనే వీరబాబు అప్పు వడ్డీతో సహా తీర్చేశాడు. కొంతకాలం గడిచింది. సోంబాబు బట్టలు చాలా బాగా కుడతాడని పేరుపడిపోయింది. ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల వుండే గ్రామాలనుంచి కూడా జనం రావటం మొదలైంది. సోంబాబుకి ఇది మంచి అవకాశంలా కనపడింది. వెంటనే వీరబాబు దగ్గరకు వెళ్ళాడు.

“వీరబాబుగారూ, గిరాకీ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇంటి దగ్గర సరిపోవటంలేదు. సెంటర్లో ఒక షాపు తీసుకోని, ఇద్దరు పిల్లల్ని పెట్టుకోని మూడు మిషన్లతో “సోంబాబు టైలర్స్” పెట్టాలనుకుంటున్నాను. తమరు డబ్బులు అప్పు ఇప్పించండి” అని అడిగాడు. వీరబాబు సంతోషంగా ఒప్పుకున్నాడు. సోంబాబు డబ్బులు తీసుకెళ్ళి టైలర్ షాపు పెట్టాడు. ఇలా ప్రతిసారీ సోంబాబు అప్పులు చేసి, సమయానికి తీర్చడంతో వీరబాబు వడ్డీ వ్యాపారం కూడా బాగా పెరిగింది.

ఆ తరువాత కొంతకాలానికి సోంబాబు కూతురు చంద్రకళ అతనికి అందివచ్చింది. ఆడవాళ్ళ బట్టలు కుట్టడంలో తండ్రికన్నా పెద్ద పేరు సంపాదించింది. చంద్రకళ, వీరబాబు కొడుకు నాగరాజు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం వీరబాబుకి కానీ, సోంబాబుకి కానీ తెలియదు.

ఇలా వుండగా చంద్రకళ పేరుతో బొటీక్ తెరవాలనీ, అందుకు అప్పు కావాలని వీరబాబు ఇంటికి వెళ్ళాడు సోంబాబు. సమయానికి వీరబాబు ఇంట్లో లేడు. నాగరాజు సోంబాబుతో మాట్లాడి, అతని అవసరం తెలుకున్నాడు.
“ఇక నుంచి మీకు అప్పులు ఇవ్వటం కుదరదు. అందుకు బదులుగా నేను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను. నేనే ఆ అమ్మాయి చేత బొటీక్ పెట్టిస్తాను.” అన్నాడు. సోంబాబు సంతోషంగా ఒప్పుకున్నాడు. సాయంత్రంగా ఇల్లు చేరిన వీరబాబు అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. తనకి చెప్పకుండా పెళ్ళి కుదుర్చుకున్నాడని కాక, తన ఠంచనుగా వడ్డీ వచ్చే మంచి గిరాకీ పోయిందని గట్టిగా కేకలేశాడు. ఇదంతా చూసి నాగరాజు పగలబడి నవ్వాడు.

“నీ దగ్గర డబ్బులు వున్నాయి కానీ తెలివితేటలు లేవు. ఇప్పుడు నేను చేసిన పని వల్ల వడ్డీ పోతోందని ఏడుస్తున్నావు కానీ మనకే ఎక్కువ లాభం వుంటుందని తెలుసుకోలేకపోతున్నావు” అంటూ మళ్ళీ నవ్వాడు.

వీరబాబు వడ్డీ వ్యాపారానికి అత్యధిక లాభాన్ని ఇస్తున్నది సోంబాబు చేసే అప్పు. ఇప్పుడు అప్పు ఇవ్వకపోవటం ద్వారా వీరబాబు ఆదాయానికి నాగరాజు గండికొట్టాడు కదా? ఆ విషయం ఒప్పుకోక, ఇంకా మనకే లాభం అంటాడేమిటి? నాగరాజు ఎందుకు అంతలా నవ్వాడు? ఈ కథలో దాగివున్న ఆర్థికపాఠం ఏమిటి?.

“నాగరాజు తెలివితేటలు అమోఘం. అటు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడు, ఇటు తండ్రికి నష్టం రాకుండా చూసుకున్నాడు. కానీ వీరబాబు ఈ పెళ్ళి వల్ల లాభం వస్తుందని తెలుసుకోలేకపోయాడు. అందుకే నాగరాజు నవ్వాడు. నాగరాజు చంద్రకళని పెళ్ళి చేసుకోని జీవితభాగస్వామిని చేసుకుంటున్నాడు. అలాగే ఆమె చేత తన డబ్బుతో (లేదా తన తండ్రి డబ్బుతో) వ్యాపారం పెట్టించి ఆమె వ్యాపారంలో తను భాగస్వామి అవుతున్నాడు. ఈ పెళ్ళి తరువాత చంద్రకళ చేసే వ్యాపారంలో వచ్చే లాభాలు వీరబాబుకీ, నాగరాజుకి కూడా చెందుతాయి కదా. అందుకే ఈ పెళ్ళి వల్ల నష్టం కాక లాభం వస్తుందని నాగరాజు చెప్తున్నాడు. ఇది వీరబాబు అర్థం చేసుకోని నాగరాజు, చంద్రకళల వివాహం చేస్తాడనే ఆశిద్దాం.

కథలో మన తెలుసుకోవాల్సిన ఆర్థికపాఠం ఏమిటో ఇప్పుడు చెప్తాను. ఇందులో సోంబాబుకి వ్యాపార అవసరాలకి రెండు రకాలుగా డబ్బు అందుతోంది. ఒకటి అప్పు రూపంలో, రెండోది పెట్టుబడిరూపంలో. నెల నెల వడ్డీ కట్టే ఒప్పందం మీద వీరబాబు అప్పు ఇస్తుంటే, లాభాలలో భాగం ఇచ్చే ఒప్పందం మీద నాగరాజు పెట్టుబడి పెడుతున్నాడు. అప్పుకి పెట్టుబడికి వున్న ప్రధానమైన వ్యతాసం ఇక్కడ మనం గుర్తించాలి. ముందు వ్యాపారం చేసే సోంబాబు వైపు నుంచి చూద్దాం. వ్యాపారంలో లాభమొచ్చినా నష్టం వచ్చినా అప్పు ఇచ్చిన వాళ్ళకి నెల నెలా వడ్డీ కట్టాల్సిందే. కానీ పెట్టుబడి పెట్టినవాళ్ళకి లాభం వచ్చినప్పుడే భాగం ఇవ్వాలి. నష్టం వస్తే ఆ నష్టంలో కూడా పెట్టుబడిదారుడు భాగం పంచుకుంటాడు. అందువల్ల డబ్బు తీసుకునేవాడికి పెట్టుబడిగా తీసుకోవడమే మంచిదిగా అనిపిస్తుంది.

ఇదే విషయాన్ని డబ్బులు ఇచ్చేవారి వైపు నుంచి చూస్తే, అప్పుగా డబ్బు ఇస్తే నెల నెల ఠంచనుగా వడ్డీ వస్తుంది. అదే డబ్బుని పెట్టుబడిగా పెడితే లాభం వచ్చినప్పుడే భాగం వస్తుంది. ఇలా చూస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళకి అప్పుగా ఇవ్వడమే మేలు అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఉదాహరణకి ఇదే కథలో సోంబాబు అప్పు మీద 12% వడ్డీ ఇస్తున్నాడనుకుందాం. కానీ ప్రతి సంవత్సరం అతని వ్యాపారంలో 18% లాభాలు వస్తుంటే అప్పుడు డబ్బులు ఇచ్చేవాడి ఆలోచన ఎలా వుంటుంది? అదే లాభాలు సంవత్సరానికి 24% వుంటే అప్పుడు ఎలా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడమే మంచిదని అనుకుంటాడు.

అయితే వ్యాపారం అన్న తరువాత లాభం వచ్చే అవకాశంతో పాటు నష్టం వచ్చే అవకాశం కూడా వుంటుంది. దీన్నే రిస్క్ అంటారు. గతంలో మనం చెప్పుకున్న రిస్క్ ఎపిటైట్ ఆధారంగా ప్రతి మనిషీ నష్టాన్ని తట్టుకునే స్థోమతని బట్టీ పెట్టుబడి ఎంత పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. దానితో పాటే రిస్క్ తగ్గించుకునేందుకు మార్గాలను కూడా వెతకచ్చు. అతను డబ్బులు పెట్టబోయే వ్యాపరం ఎలాంటిది? దీన్ని నిర్వహించే వారు ఎంత సమర్థులు? గతంలో ఎంత లాభాలు గడించింది? ఆ వ్యాపారం/కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు ఏమిటి? వాటికి మార్కెట్ లో ఎంత డిమాండ్ వుంది? ఈ వ్యాపారానికి పోటీదారులు వున్నారా? వాళ్ళు ఈ వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశం వుందా? ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త కొత్త చట్టాల వల్ల లాభాలు తగ్గే అవకాశాలు వున్నాయా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోని సంతృప్తికరంగా వుంది అనుకున్న తరువాతే డబ్బులు పెట్టుబడిగా పెట్టవచ్చు. అప్పుడు నష్టం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

మన కథలో సోంబాబు వ్యాపారం బాగా సాగుతుండటం, అతనికి చుట్టుపక్కల ఊర్లలో ఉన్న పేరు, చంద్రకళ పనితనం ఇవన్నీ చూస్తుంటే బొటీక్ వ్యాపారం బాగా సాగుతుందని అనిపిస్తోంది. బహుశా అందుకే నాగరాజు తన తండ్రికి అదే ఎరగా వేసి తన ప్రేమని విజయవంతం చేసుకున్నాడు. రేపు బొటీక్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను కూడా అందుకుంటాడు.

ఇదంతా కంపెనీలలో/వ్యాపారాలలో పెట్టుబడికి సంబంధించింది. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి నేరుగా కంపెనీలలో పెట్టుబడి పెట్టడం సాధ్యపడకపోవచ్చు. ఆ కంపెనీ/వ్యాపారం గురించి సమాచారం సేకరించడం చేతకాకపోవచ్చు. వీటన్నింటికీ పరిష్కారాలు వున్నాయి. వాటి గురించి వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా వ్యాపారంలో భాగస్వామిగా వుండటం వల్ల ఎక్కువ శాతంలో లాభాలు సంపాదించే అవకాశం వుంటుంది. ఉదాహరణకి ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద పది శాతం వడ్డీ ఇస్తోందనుకుందాం. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నవాడు కనీసం ఈ పదిశాతం కన్నా ఎక్కువ లాభం వచ్చేట్లైతేనే ఆ వ్యాపారాన్ని చేస్తాడు. లేకపోతే వ్యాపారం చెయ్యాల్సిన డబ్బుని బ్యాంక్ లోనే పెడతాడు కదా? అంటే బ్యాంకులు, పోస్టాఫీసులు ఇచ్చే వడ్డీ కన్నా విజయవంతంగా నడిచే కంపెనీలలో లాభ శాతం ఎక్కువగా వుంటుంది. ఇది గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం.

ఇదే విషయాన్ని మన వ్యక్తిగత ఆర్థిక ప్రణాలికలో చూస్తే మనం దాచుకునే డబ్బు బ్యాంక్ డిపాజిట్లలో, పోస్టాఫీసుల్లో మాత్రమే పెట్టుకుంటే ఆర్థిక ప్రగతి అంతంతమాత్రంగానే వుంటుంది. ద్రవ్యోల్బణాన్ని (ధరల పెరుగుదల) మించి లాభాలు వచ్చే ఆర్థిక పథకంలో డబ్బులు పెట్టాలని మనం గతంలో అనుకున్నాం. కానీ ద్రవ్యోల్బణానికి మించి ఒకటి రెండు శాతం ఆదాయాన్ని ఇచ్చినంత మాత్రాన అవి మనల్ని ధనవంతులుగా చెయ్యలేవు. ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణం పది నుంచి పదకొండు శాతం మధ్య వుంది. అంటే పదకొండు శాతం కన్నా తక్కువ వడ్డీ ఇచ్చే పథకాలలో డబ్బుని దాచుకోవడం వల్ల ఆ డబ్బు విలువ పడిపోతుందే తప్ప పెరగదు. ఇలాంటప్పుడే అత్యధిక లాభాలు ఇచ్చే పెట్టుబడులు అవసరం అవుతాయి. సంపద సాధించాలంటే అత్యంత కీలకమైనది పెట్టుబడి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి ఆర్థిక ప్రగతిని ఇవ్వడానికీ, సంపాదన సుస్థిరం చేసుకోడానికి, నష్టపోకుండా వుండటానికి పనికొస్తే, మరో కంపెనీలో పెట్టుబడి పెట్టడం సంపద సాధించడం కోసమే సూచించబడింది.

మన డబ్బు మనకోసం డబ్బు సంపాదించాలని మనం ఒకసారి చెప్పుకున్నాం. అదే డబ్బుని మరో కంపెనీలో పెట్టుబడిగా పెడితే ఆ డబ్బు మరికాస్త డబ్బుని సంపాదించడానికి కష్టపడుతుంది. ఆ డబ్బే కాకుండా ఆ కంపెనీ ఓనరు నుంచి, పనివాడు దాకా అంతా ఆ పెట్టుబడి మీద లాభం సంపాదించాలనే కష్టపడతారు. కంపెనీ ప్రగతితో పాటే మన డబ్బు కూడా పెరుగుతుంది. అందువల్ల మనకి వచ్చే లాభాలు అధికంగా వుంటాయి. మరో రకంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎదగబోయే కంపెనీలో డబ్బుపెట్టడం అంటే మన ఆర్థిక ప్రగతికి పునాది వేసినట్లే. గతంలో రిలయన్స్ లాంటి చాలా కంపెనీలలో చాలా కొద్ది మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి కూడా ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు ఎన్నో వున్నాయి.

ఇలా పెట్టుబడి పెట్టాలంటే దానికి కంపెనీని, ఆ వ్యాపారాన్ని విశ్లేషించడం తెలియాలి. అప్పుడే నాగరాజులా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. లేకపోతే వీరబాబులాగా మంచి అవకాశాన్ని చేజార్చుకుంటారు. మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్ వంటి సాధనం వుంది. తద్వారా పుట్టిన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వున్నాయి. వాటన్నింటి గురించి తెలుసుకొని తెలివిగా పెట్టుబడి పెట్టాలి. వీటి గురించి ముందు ముందు మాట్లాడుకుందాం.
ఇదంతా వింటే పెట్టుబడుల మీద లాభాలు సంపాదించడం చాలా సులభం అని అనిపించవచ్చు. కానీ వ్యాపారం అన్న తరువాత లాభం నష్టం రెండూ వుంటాయి. మనం ఊహించలేని ఎన్నో కారణాలు వ్యాపారానికి నష్టం కలిగించవచ్చు. ఎక్కడో ఏదో దేశంలో జరిగిన చిన్న మార్పు వల్ల మన దేశంలో వున్న ఒక కంపెనీ మూసెయ్యాల్సి రావచ్చు. అప్పటిదాకా ఎంతో లాభాలు ఇస్తుందని నమ్మిన కంపెనీ అసలుకే లేకుండా పోవచ్చు. ఇలాంటి సమస్యలు వున్నాయని గుర్తుంచుకోని చేతిలో వున్న డబ్బు పూర్తిగా కాకుండా రిస్క్ ఎపిటైట్ ఆధారంగా కొంత డబ్బునే పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి రిస్కులను అధిగమించేందుకు కొన్ని మార్గాలు వున్నాయి. వాటి గురించి కూడా వివరంగా మరోసారి చెప్తాను

సంపద సాధించడంలో అత్యంత కీలకమైనది, అత్యంత లాభదాయకమైనది – పెట్టుబడి. ఏదైనా ఒక కంపెనీలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం అంటే ఆ కంపెనీ ఆర్థిక ప్రగతికి మన ఆర్థిక ప్రగతిని ముడెయ్యడమే. అందుకే క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరీ పెట్టుబడి పెట్టాలి. అందులో నష్టం వచ్చే అవకాశం కూడా వుంది అని గుర్తెరిగి వుండాలి.
చిల్లర చిట్కాలు

మీ దగ్గరకు వచ్చే డబ్బులో అప్పుగా వచ్చేవి ఎన్ని, పెట్టుబడిగా వచ్చేవి ఎన్ని గమనించుకోండి. అలాగే మీదగ్గర నుంచి వెళ్ళే డబ్బులో అప్పుగా వెళ్ళేవి ఎన్ని, పెట్టుబడిగా వెళ్ళేవి ఎన్ని చూసుకోండి. మనకి వచ్చే డబ్బులో పెట్టుబడి ఎక్కువ వుండాలి. మన దగ్గర్నుంచి వెళ్ళే డబ్బులో అప్పు ఎక్కువగా వుండాలి. మన దగ్గర్నుంచి పెట్టుబడిగా డబ్బు వెళ్ళాలంటే ఆ పెట్టుబడి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది అయివుండాలి, ముందు ముందు మరింత లాభసాటిగా మారే అవకాశం వుండాలి.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత