(Telugu) సంపాదనని సంపదగా మార్చుకోవాలంటే

[:te]కోటేశ్వరరావు ఎప్పుడో కొన్న పొలం ఇప్పుడు అనుకోకుండా మంచి ధర పలకసాగింది. కొత్తగా రాజధాని ఆ పక్కనే పెడుతున్నారని వార్త రావడంతో ఆ పొలానికి కోటి రూపాయలు ఇస్తామంటున్నారు చాలామంది. నిజానికి కోటేశ్వరరావుకి ఆ పొలం అమ్మాలన్న ఆలోచన ఏ మాత్రం లేదు. కాకపోతే అమ్మాలని అతడు నిర్ణయించుకోడానికి మూడు కారణాలు వున్నాయి. మొదటి కారణం అతని ఆర్థిక పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగం చెశాడు కాబట్టి పెన్షన్ వస్తోంది. ఆయన, భార్య పార్వతి సంతోషంగా కాలం గడపడానికి అది చాలు. కాకపోతే ఏదైనా అనారోగ్యమో, అనుకోని మరో పెద్ద ఖర్చో వచ్చి పడిందంటే చేతిలో నయాపైసా లేదు. కూతురు గిరిజ ఏ నిముషంలో అయినా కాన్పుకి రావచ్చు. అప్పుడు ఎంత ఖర్చౌతుందో తెలియదు. అందుకోసమన్నా పొలం అమ్మి కాస్త డబ్బు చేతిలో వుంచుకోవాలని ఆలోచన మొదలైంది.

రెండో కారణం పొలం పని చేసే ఓపిక లేకపోవడం. కోటేశ్వరరావు స్థిరపడింది గుంటూరులో. పొలం వున్న ఊర్లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కౌలుకి ఇచ్చినా తీసుకునేవాళ్ళు లేరు, కూలీలు అసలే దొరకట్లేదు. అంత శ్రమపడి వ్యవసాయం చేసినా గిట్టుబాటు అయ్యే దిగుబడి వుంటుందని నమ్మకం లేదు. అందువల్ల కూడా ఈ పొలాన్ని అమ్మేస్తేనే మేలేమో అని అనుకున్నాడు. ఈ రెండు కారణాల కన్నా ముఖ్యమైనది, బలమైనది కొడుకు బలరామ్ చేస్తున్న వత్తిడి. మంచి ధర వున్నప్పుడే అమ్మేస్తే, ఆ డబ్బుతో తను ఉద్యోగం చేస్తున్న బెంగుళూరులో ఇల్లు కొనుక్కోవాలని అతని ఆలోచన. అందుకే ఉదయం సాయంత్రం ఫోన్ చేసి పొలం బేరం పెట్టారా అని అడగటం మొదలుపెట్టాడు.

కారణం ఏమైతేనేం పొలాన్ని అమ్మేశాడు. వాళ్ళు ఊహించినట్లే కోటి రూపాయలు చేతికొచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా కోటేశ్వరరావు ఆ డబ్బు కుటుంబ సభ్యులకి పంచిపెట్టాడు. ఇరవై లక్షలు తన ఖాతాలో వేసుకున్నాడు. నలభై లక్షలు భార్య పార్వతికి ఇచ్చాడు. పదిహేను లక్షలు కొడుకుకి, ఇరవై ఐదు లక్షలు కూతురికీ ఇచ్చాడు. అలా ఎందుకు పంచాడో ఆయన వివరించిన తరువాత కుటుంబసభ్యులందరూ ఆయన్నే సమర్థించడంతో అంతా సుఖంగా సంతోషంగా కాలం గడుపుతున్నారు.

కోటేశ్వరరావు చేతికి వచ్చిన డబ్బుని ఇలా పంచడంలో వున్న ఆంతర్యమేమిటి? దీనిలో ఏదైనా ఆర్థిక సూత్రం వుందా? అదేమిటి?

కోటేశ్వరరావు పరిస్థితి దాదాపు అందరు తల్లిదండ్రులకు వర్తిస్తుంది. పిల్లలు ఎక్కడో వేరే రాష్ట్రాలలోనో, వేరే దేశాలలోనో వుండటం, సొంత ఊర్లో వున్న ఆస్థుల్ని అమ్మేయాలని ప్రయత్నించడం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. చేతిలో వున్న ఆస్థిని అమ్మాలా వద్దా అన్న మీమాంస పెద్దవాళ్ళలో వుంటోంది. అది ఆ ఆస్థితో ఏర్పడ్డ అనుబంధం వల్ల కావచ్చు, అమ్మిన డబ్బులు అయిపోయాక తమకు ఆధారం లేకుండాపోతుందేమో అని భయం వల్ల కావచ్చు. అనుబంధం అయితే చెప్పగలిగింది ఒకటే – ఆస్థులతో అనుబంధం పెట్టుకోకూడదు. ఇది అందరికీ తెలిసినా కష్టసాధ్యమైనది. కానీ తప్పదు. ఆస్థి అమ్మిన తరువాత తమ నీడ వుండదేమో అన్న భయం మాత్రం అవసరం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా బ్యాంకులు “రివర్స్ మార్ట్ గేజ్” లోన్లు ఇస్తున్నాయి. ఇంటిని బ్యాంక్ వారు తాకట్టు పెట్టుకోని, బతికినంతకాలం నెల నెల డబ్బులు పెన్షన్ లా ఇస్తారు. ఇంటి యజమాని భర్త అయితే ఆయన మరణానంతరం భార్యకి కూడా జీవితాంతం డబ్బులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆమె కూడా మరణించాక ఆ ఆస్థి బ్యాంక్ సొంతం అవుతుంది. ఒకరిమీద ఆధారపడకుండా, ఆస్థిని పిల్లలకు ధారాదత్తం చేయకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా జీవితంలోని చివరి అంకం గడపడానికి ఈ పథకం బాగా పని చేస్తుంది.
ఏది ఏమైనా కోటేశ్వరరావు పొలం అమ్మాలని అనుకున్నాడు కాబట్టి అతని ఆలోచన ప్రకారమే ఈ సమస్యని పరిశీలిద్దాం. పొలం అమ్మగా వచ్చిన సొమ్మును అతను నాలుగు భాగాలు చేశారు. వందలో ఇరవై శాతం తన దగ్గరే వుంచుకున్నాడు. నలభై శాతం భార్య పార్వతికి, దాదాపు పదిహేను శాతం కొడుకు అభిరామ్ కి, షుమారు ఇరవై శాతం కూతురు గిరిజకి ఇచ్చాడు. మామూలుగా ఏదైనా ఆస్థి చేతికి అందితే దాన్ని కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా పిల్లలకి సమానంగా పంచి ఇవ్వడం జరుగుతూ వుంటుంది. కానీ కోటేశ్వరరావు మాత్రం సమానంగా ఇవ్వకుండా వేరు వేరు మొత్తాలని ఇవ్వడం కొంచెం ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ కోటేశ్వరరావు చాలా తెలివిగా ఆలోచించాడు.

మొదట తన అవసరాలు, ముఖ్యంగా రిటైర్మెంట్ జీవితం గడపడానికి అవసరమైన డబ్బుని (Retirement Savings) ఇరవై శాతంగా గుర్తించి దానిని పక్కన పెట్టాడు. మిగిలిన దానిలో సగం, అంటే మొత్తంలో నలభై శాతం భార్య చేతిలో పెట్టాడు. ఇవి రోజు వారీ ఖర్చులకీ, సరుకులు సామాన్లకి, ఈ.ఎమ్.ఐ.లకి వగైరాలకి. ఇవి దాదాపుగా ప్రతి నెలా తప్పని స్థిరమైన/అనివార్యమైన ఖర్చులు (Fixed/Essential Expenses). ఇక్కడ భార్య స్థిరమైన ఖర్చులకు ప్రతీక. అలాగే కొడుకు భవిష్యత్తుకు ప్రతీక. అంటే భవిష్యత్తులో రాబోయే ఖర్చులకు పదిహేను లక్షలు కేటాయించాడు కోటేశ్వరరావు. అంటే ఇది పొదుపు ముదుపులకు (Savings and Investments)కు సంబంధించినది. ఇక నాలుగో భాగమైన కూతురు సంగతి. ఈమెకు పెళ్ళై మరో కుటుంబంలో భాగం అయిపోయింది. అందువల్ల ఈమె ఖర్చులు ఎప్పుడూ వుండవు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు స్థొమతని బట్టీ చీరో, నగో కొనివ్వడం, మనవలు మనమరాళ్ళు వుంటే పండగలకు పబ్బాలకు వాళ్ళకు ఏమైనా కొనిపెట్టడం ఇలాంటివి తప్పవు. అంటే ఈమెకు సంబంధించిన ఖర్చులను స్థోమతని బట్టి అదుపుచేసుకోవచ్చు. నియంత్రణకు సంబంధించిన ఖర్చులు (Flexible Expenditure) ఇవి. ఈ విభాగానికి కోటేశ్వరరావు దాదాపు పాతిక శాతం డబ్బుని కేటాయించాడు.

ఈ కథలో పాత్రలను వదిలేసి గమనిస్తే రిటైర్మెంట్ కోసం ఇరవై శాతం, అనివార్యమైన రోజువారీ ఖర్చులకు నలభై శాతం, భవిష్యత్తుకోసం చేసే పొదుపు, ముదుపుల కోసం పదిహేను శాతం, నియంత్రించుకోగలిగిన జీవన సరళికి సంబంధించిన (Lifestyle Expenses) ఖర్చులకోసం ఇరవై ఐదు శాతం వచ్చేలా విభాగం చేశాడు. దీనినే ఆర్థిక సూత్రంగా మలుచుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి నెలా వచ్చే ఆదాయాన్ని ఇదే విధంగా కేటాయించుకుంటే సంపద సాధించడం సులువుగా మారుతుంది. వీటన్నింటిని ఒకసారి విడివిడిగా పరిశీలిద్దాం.

రిటైర్మెంట్ కోసం 20%: ఉద్యోగస్థులకు జీతం ఇచ్చేటప్పుడే పీ.యఫ్. పేరుతో కొంత సొమ్ము తీసుకుంటారు. అదికాక కొంత సొమ్ము గ్రాట్యుటీ పేరుతో పక్కన పెడతారు. ఈ రెండూ కాక మరికొన్ని పథకాలలో చేరి రిటైర్మెంట్ నాటికి సరిపడా డబ్బులు వుండేలా చూసుకోవాలి. ఈక్విటీ (మ్యూచువల్ ఫండ్స్), రియల్ ఎస్టేట్ లాంటి దీర్ఘకాలిక పథకాలలో ఆదా చేయడం, వయసులో వున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వంటి వాటి ద్వారా రిటైర్మెంట్ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు

అనివార్యమైన ఖర్చులకు 40%: ఇవి తప్పనిసరి ఖర్చులు. ప్రతినెలా కట్టే అద్దెలు, పిల్లల ఫీజులు, వంట సామాన్లు మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. వీటిలో నియంత్రించుకునే అవకాశం వున్న ఖర్చులు చాలా తక్కువ. కారు వాడకం తగ్గించి పెట్రోల్ ఖర్చు ఆదా చేయడం, కరెంట్ జాగ్రత్తగా వాడుకోని బిల్ తగ్గించుకోవడం చెయ్యచ్చు కానీ దాని ఫలితం చాలా తక్కువ. నెల సంపాదనలో నలభై శాతం ఈ ఖర్చులకి తప్పదు. అవకాశం వుంటే సంపాదన పెంచుకోని ఈ ఖర్చులను అదుపులోకి తీసుకురావచ్చు.

పొదుపు-ముదుపులకు 15%: ఇది మనకు చాలా ముఖ్యమైన విభాగం. ఇందులో పదిహేను నుంచి ఇరవై శాతం సంపాదన ఉండాలన్నది చాలామంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. రిటైర్మెంట్ కోసం ఒక విభాగం చేశాం కాబట్టి మిగిలిన పొదుపు ముదుపు పథకాలకి పదిహేను శాతం జీతాన్ని కేటాయించవచ్చు. ఇందులో కూడా వయసు ఆధారంగా ఈక్వీటీలో డబ్బులు పెట్టకపోతే తరువాత చేతికి అందే డబ్బు అప్పటి అవసరాలకు సరిపోకుండా పోవచ్చు. అసలు ఈ విభాగంలో డబ్బులే పెట్టకపోతే ఆ డబ్బు తరువాత విభాగమైన లైఫ్ స్టైల్ ఖర్చుల్లో చేరుతుంది.

లైఫ్ స్టైల్ ఖర్చులకి 25%: కార్లు, షికార్లు, సినిమాలు, పండగలు, ప్రయాణాలు (ముఖ్యంగా విహారయాత్రలు) మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. గమనిస్తే ఇప్పటి మన ఖర్చుల్లో ఇవే అధిక భాగం కనపడతాయి. వీటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. ప్రతి నెలా కొనే నిత్యవసరాలు రెండో విభాగంలో వుంటే అదే సూపర్ మార్కెట్ లో కొనే కూల్ డ్రింక్, రెడీ మేడ్ చిరుతిళ్ళు, బాసుమతి బియ్యం లాంటివి చివరి విభాగంలోకి వస్తాయి. హోటల్ కి వెళ్ళి భోజనం చేస్తే రెండో విభాగం. పిజ్జాలు, బర్గర్లు తింటే చివరి భాగం. ఈ ఖర్చుల్ని నియంత్రించుకోవడంలోనే సంపద త్వరగా సాధించేందుకు అవకాశం వుంది.

పైన చెప్పిన విధానంలో కాకుండా యాభై శాతం అనివార్యమైన ఖర్చులకి, ఇరవై శాతం రిటైర్మెంట్ కోసం పొదుపుతో సహా ఆర్థిక పథకాలకి, ముఫై శాత్రం లైఫ్ స్టైల్ ఖర్చులకని సంపాదనని కేటాయించవచ్చు. ఇంకో ఎన్నో రకాల బడ్జెట్ ప్లాన్లు వివిధ ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అన్నీ అందరికీ సరిపోవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆలోచించి ఈ బడ్జెట్ ప్లాన్ వేసుకోవడం మంచిది. ఉదాహరణకి ఒక వుక్తి సంపద సాధించాలి అని నిర్ణయించుకునే సరికే అప్పుల్లో వుంటే ఆ వ్యక్తి పైన చెప్పిన విభాగాన్ని వదిలేసి, ఎక్కువ శాతం డబ్బుని అప్పులు తీర్చడానికి వాడాలి. చివరి రెండు భాగాలైన పొదుపు ముదుపు, లైఫ్ స్టైల్ ఖర్చులు మొత్తం అప్పు తీర్చడానికి వాడచ్చు. మొత్తం మీద ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి కానీ అందరికీ ఒకటే మంత్రం పనిచెయ్యదు.
కాకపోతే పైన చెప్పిన సూత్రం స్థూలంగా డబ్బు ఎక్కడికి పోతోంది, ఎంత డబ్బుని ఎటు మళ్ళించాలో తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.

సంపాదనని సంపదగా మార్చుకోవాలంటే ఆ డబ్బుని నాలుగు విభాగాలు చెయ్యాలి. రిటైర్మెంట్ కోసం సుమారు 20%, నిత్య అవసరాల కోసం 40%, పొదుపు ముదుపులకోసం 15%, లైఫ్ స్టైల్ ఖర్చులకోసం 20% ఖర్చుపెట్టవచ్చు. అయితే ఈ ఖర్చులన్నీ ఇదే శాతాలలో కాకుండా అవకాశం, అవసరం, ఆర్థిక స్థితి ఇవన్నీ ఆలోచించుకోని ఎవరికి వారే నిర్ణయం తీసుకోవడం మంచిది.
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము