(Telugu) ఆర్థిక వ్యవహారాలలో వ్యక్తి పొరపాట్లు

[:te]ఆర్థిక విజయాన్ని సాధించాలంటే అందుకు తగ్గ కృషితోపాటు, అందుకు సంబంధించిన పరిజ్ఞానం కూడా చాలా అవసరం.

పరీక్షలు – ఫలితాలు
పవన్ కాలేజీలో చేరాడన్న మాటే కానీ ఏ రోజూ చదువుమీద ధ్యాస పెట్టింది లేదు. పేరుకు తగ్గట్టే గాలికి తిరిగేవాడు. ఎంతసేపూ ఆటలు, అల్లరి అన్నట్లుగా వుండేవాడు. అన్ని అలాగే జరిగిపోతే అది కాలేజి ఎందుకు అవుతుంది? ఒక శుభ ముహూర్తాన పరీక్షలు వచ్చి పడ్డాయి. పవన్ ఏమీ చదవకుండా వెళ్ళి పరీక్ష రాశాడు. మరో వారానికి లెక్చరెర్ మార్కులు ఇచ్చేశాడు. ఇరవై మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు.

అదే సమయంలో పావని అనే అమ్మాయి కూడా కాలేజిలో చేరింది. ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాడు పవన్. ఎవరూ లేని టైమ్ చూసి ప్రొపోజ్ కూడా చేసేశాడు. ఆ అమ్మాయి ఏ మాత్రం తొణకకుండా - “మన కాలేజిలో నెలకి ఒక పరీక్ష పెడతారు కదా. అందులో ఎనభై శాతం మార్కులు తెచ్చుకోని చూపించు. అప్పుడు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను ” అంది

మొదటిసారి పరీక్ష ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈసారి కష్టపడాలి అనుకున్నాడు. అతి కష్టం మీద పుస్తకం తెరిచి ఓ నాలుగు ఛాప్టర్లు చదువుకున్నాడు. దాంట్లో నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చినా నలభై మార్కులైనా వస్తాయని ఊహించాడు. కానీ పరీక్షలో మూడే ప్రశ్నలు వచ్చాయి. రెండో నెల ఫలితం - పాతిక మార్కులు. మూడో నెల ఇలా కాదని ఇంతకు ముందు సంవత్సరాలలో పెట్టిన పరీక్షా పేపర్లు తెచ్చుకోని అందులో తరచుగా వచ్చే ప్రశ్నలను మాత్రం జాగ్రత్తగా చదివాడు. అతను ఊహించినట్లుగేనే చాలా ప్రశ్నలు వాటిలో నుంచే వచ్చాయి. ఆ నెల మార్కులు యాభై పైనే వచ్చాయి.

తరువాత పరిస్థితి మారిపోయింది. పవన్ ధ్యాస అమ్మాయి నుంచి చదువుల వైపుకి మళ్ళింది. గతం ఫలితం వచ్చిన ట్రిక్కునే మళ్ళీ నెల కూడా ప్రయోగిందాచాడు. కానీ ఈ సారి తరచుగా అడిగే ప్రశ్నలు ఒక్కటి కూడా రాలేదు. ఫలితం పది మార్కులు. ఐదో నెల పరీక్షలకీ పుస్తకం మొత్తం క్షుణ్ణంగా చదవాడు పవన్. పరీక్ష బాగా రాశాడు. ఫలితం అరవై శాతం మార్కులు వచ్చాయి. ఈ పద్ధతి బాగుందని ఆ తరువాత నెల కూడా ఇలాగే బాగా చదువుకున్నాడు, లెక్చరర్ల సహాయం తీసుకున్నాడు. అంతా బాగానే వుంది అనుకుంటుండగా ఒక ఘోరం జరిగింది. పరీక్ష రోజు ఉదయం ఏక్సిడెంట్ జరిగి హాస్పిటల్ పాలయ్యాడు. ఫలితం సున్నా మార్కులు.

హాస్పిటల్లో వున్న పవన్ ని పరామర్శించడానికి వచ్చారు పావని, ఆమె స్నేహితురాలు.

“పోనీ ఈసారి కాపీ కొట్టైనా ఎనభై మార్కులు తెచ్చుకో” అంది పావని స్నేహితురాలు సలహాగా.

“కాపీ కొట్టాల్సిన అవసరమే లేదు. ఈసారి నేను చేసిన అన్ని రకాల ప్రయత్నాలను కలిపి వాడబోతున్నాను. పరీక్షలో ఎనభై మార్కులు గ్యారెంటీ” అన్నాడు పవన్.

“ఎనభై మార్కులు అవసరమే లేదు.. నేను నీ ప్రేమని ఇప్పుడే అంగీకరిస్తున్నాను” అంది పావని.

పరీక్షలలో ఎనభై మార్కులు వస్తే తప్ప ప్రేమ గురించి ఆలోచించను అన్న పావని ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ ప్రేమని ఎందుకు అంగీకరించింది? జాలి పడిందా లేక నిజంగానే ఇష్టపడిందా?

పావని ప్రేమని పొందడానికి పవన్ అన్ని ప్రయత్నాలు చేశాడు. ప్రతి ప్రయత్నంలో కొద్ది కొద్దిగా అభివృద్ధిలోకి వస్తూనే వున్నాడు. అంటే క్రమంగా గాడిన పడుతున్నాడన్నమాటే కదా? పావని ఎనభై మార్కులు రావాలని అన్నది అంటే, ఆ కోరిక వెనుక ఉద్దేశ్యం అతను అల్లరి చిల్లరిగా తిరగడం మానేసి చదువు మీద ధ్యాస పెట్టాలనే కానీ ఖచ్చితంగా ఎనభై మార్కులు వచ్చి తీరాలని కాదు. కథ చివర్లో ఏక్సిడెంట్ కారణంగా పరీక్ష రాయలేదు కానీ, రాసి వుంటే దాదాపు ఎనభై మార్కులు వచ్చేవే. ఇవన్నీ ఆలోచించి పావని అతని ప్రేమని అంగీకరించి వుండవచ్చు.

అదలా పక్కన పెడితే, ఇందులో వున్న ఆర్థిక పాఠాన్ని మనం చెసే పొదుపు, ముదుపులకు వర్తించి చూసుకోవచ్చు. ఇందులో పవన్ ఆరు రకాల ప్రయత్నాలు చేశాడు. మొదట ఏమీ చదవకుండా పరీక్ష రాశాడు. తరువాత కొన్ని చదివి మినిమం మార్కులు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కాస్త రీసర్చ్ చేసి చదివి మంచి మార్కులే తెచ్చుకున్నాడు. నాలుగో సారి మళ్ళీ పాత పేపర్ల ఆధారంగా ప్రిపేర్ అయ్యాడు కానీ, దెబ్బతిన్నాడు. ఐదోసారి పుస్తకమంతా చదివాడు, ఆరోసారి లెక్చరర్ల సహాయం కూడా తీసుకున్నాడు. ఈ ఆరు రకాల ప్రయత్నాలనీ మన ఆర్థిక ప్రణాలికలకు కూడా అన్వయించవచ్చు.

పవన్ చేసిన ప్రయత్నాలను ముందు స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలుకు అన్వయించి చూద్దాం. పవన్ చేసిన ఆరు రకాల ప్రయత్నాలలో వేటిలోనూ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాడు. అందుకు కారణాలను పరిశీలిస్తే మూడు రకాల కారణాలు కనపడతాయి. మొదటిది మితిమీరిన నమ్మకంతోనో లేక అత్యాశతోనో ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోవడం. ఇలాంటప్పుడు కలిగే నష్టాలకు ఆ వ్యక్తి మాత్రమే బాధ్యుడు అవుతాడు. ఏ మాత్రం చదవకుండా పరీక్ష రాసి ఇరవై మార్కులు పొందడం ఉదాహరణ. ఇలాగే అవగాహన లేకుండా కేవలం అదృష్టాన్ని నమ్మో మితిమీరిన ఆత్మ విశ్వాసంతోనో స్టాక్ మార్కెట్ లో షేర్లు కొని నష్టపోయేవాళ్ళు ఈ కోవలోకే వస్తారు. కాస్త పరిశీలన, అవగాహన, నేర్చుకోవాలన్న తపన, ప్రయత్నం ఇవన్నీ వుంటే ఈ రకం నష్టాలను అధిగమించవచ్చు.

రెండో కారణం వ్యక్తికి సంబంధించినది కాదు. పవన్ రాసిన మూడో పరీక్షలో అతని ప్రిపరేషన్ సరిగానే వున్నా, ప్రశ్నలే క్లిష్టమైనవి, ఇంతకు ముందు ఎప్పుడూ రానివి వచ్చాయి. ఇందుకు కారణం పరిశీలిస్తే అలాంటి పేపర్ ఇవ్వాలన్న నిర్ణయం (ప్రశ్నాపత్రాలు తయారు చేసిన) ఆ సంస్థ తీసుకోని వుంటుంది. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినది కాక, సంస్థకు సంబంధించిన కారణం అవుతుంది. దీనినే స్టాక్ మార్కెట్ కొనుగోళ్ళకు కూడా వర్తింపజేయవచ్చు. స్టాక్ మార్కెట్లో వుండే ఒకో కంపెనీ ఒకో సందర్భంలో ఒకో నిర్ణయం తీసుకుంటూ వుంటుంది. ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఆధారంగా వ్యాపారం అభివృద్ధి చెందవచ్చు, చెందకపోనూ వచ్చు. అలాగే ఆ కంపెనీ షేర్ విలువ పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇది కంపెనీ చేతుల్లో వుంది. ఇందుకు ట్రెండుని పరిశీలించడం, కంపెనీ వివరాలను విశ్లేషించడం వంటివి చేసి నష్టాన్ని అదుపుచేసుకోవచ్చు. పవన్ పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం, లెక్చరర్ల సహాయం తీసుకోడం అలాంటిదే.

ఇక మూడో కారణం వ్యక్తి కానీ, సంస్థ కానీ కాదు. ఇది ఎవరి చేతుల్లో లేని, ఎవరి అవగాహనకు అందని శక్తులది. అవి అనివార్యమైనవి, ఊహించలేనివి. పవన్ కథలో చివర్లో జరిగిన ఏక్సిడెంట్ లాంటివి ఇదే కోవ కింద వస్తాయి. స్టాక్ మార్కెట్ లాంటి ఇన్వస్ట్మెంట్ లో కూడా మన అవగాహనకు అందని ఎన్ని ప్రభావాలు వుంటాయి. వీటిని పూర్తిగా అధిగమించడం అసాధ్యం. ఉదాహరణకు ఏదో దేశంలో సంభవించిన భూకంపం వల్ల ఆ దేశం ఎగుమతులు తగ్గిపోయి, ఆ కారణంగా ముడి సరుకు దొరకక మరో దేశంలో ఒక కంపెనీ మూతపడితే, ఆ మూత పడ్డ కంపెనీకి సాఫ్ట్ వేర్లు తయారు చేసే ఒక భారతీయ కంపెనీ షేరు విలువ పడిపోవచ్చు. ఇవి ఊహించగలగడం అసాధ్యం. హర్షద్ మెహతా కుంభకోణం, సబ్ ప్రైమ్ క్రైసిస్ లాంటి సందర్భాలలో వేలాదిమంది ఇన్వస్టర్లు లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.

ఇలాంటి ఊహకందని వైపరీత్యాలలో కూడా తట్టుకుని నిలబడేలా మన ఆర్థిక వ్యవహారాలను సిద్ధం చేసుకోవాలి. షేర్ల విషయానికే వస్తే, గతంలో ఇలాంటి విపరీతమైన సందర్భాలలో కూడా బాగా నిలబడిన షేర్లను కొని పెట్టుకోవడం ఒక తరహా. వీటినే బీటా షేర్లు అంటారు. స్టాక్ మార్కెట్ లాంటివి ఒక్కసారిగా కూలిపోయినప్పుడు భయపడకుండా మళ్ళీ మార్కెట్ నిలదొక్కుకునేదాకా (నమ్మకం వుంటేనే) ఎదురుచూడటం మరో తరహా. ఏది ఏమైనా ఇలాంటి ఒక ప్రమాదం వుంటుందని, అది ఎప్పుడైనా రావచ్చని తెలుసుకోని సిద్ధంగా వుండటం ప్రతి ముదుపరి చెయ్యాల్సిన పని.

ఇప్పటిదాకా మనం పవన్ కథని కేవలం స్టాక్ మార్కెట్ కు మాత్రమే అన్వయించి చూశాం. ఇదే కథని పూర్తి ఆర్థిక ప్రణాలికకు అన్వయించి కూడా చూడచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కథలలో రిస్క్ ఎపిటైట్ ఆధారంగా, వయసు ఆధారంగా రకరకాల పథకాలలో డబ్బులు పెట్టడం మంచిదని చెప్పుకున్నాం. అందులో బ్యాంక్ డిపాజిట్ల నుంచి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇలాంటి పథకాలలో కొన్ని రిస్క్ వున్నవి కొన్ని రిస్క్ లేనివి. కానీ ఇన్ని రకాల పథకాలలో పెడితే నష్టపోయే అవకాశం దాదాపు లేదు. ఒకవేళ నష్టపోయినా ఆ నష్టం తీవ్రంగా వుండదు. మన కథలో పవన్ పుస్తకమూ చదివి, పాత ప్రశ్నాపత్రాలు చదివి, లెక్చెరర్ల సహాయం కూడా తీసుకోని తప్పకుండా ఎనభై శాతం తెచ్చుకుంటానని పవన్ అన్నాడు కదా. సరిగ్గా అలాగే అన్ని రకాల పథకాలలో డబ్బులు పెడితే నెగ్గుకు రావచ్చు.

చివర్లో పవన్ చెప్పిన మరో మాట కూడా ఆచరణీయమైనదే. పావని స్నేహితురాలు కాపీ కొట్టి మార్కులు సంపాదించమని సలహా ఇస్తే అది అవసరం లేదని అన్నాడు కదా. సరిగ్గా అలాగే అత్యాశతో, సులభమైన మార్గాలలో డబ్బు సంపాదించగలమని అనుకోవడం కేవలం భ్రమ. కాపీ కొడుతూ పట్టుబడ్డ విద్యార్థి తన సంవత్సరం చదువును, సమయాన్ని ఎలా కోల్పాతాడో, చీటింగ్ చేసే స్కీముల్లో డబ్బు పోగొట్టుకుంటే కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటారు. సులభంగా డబ్బులు వచ్చే మార్గాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. వుంటే అందరూ అదే పని చేస్తుండేవాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా వున్నా అది చట్టవ్యతిరేకమైన పనో, నష్టపోవడానికి సమానావకాశాలు (లేదా ఎక్కువ) వున్న జూదంలాంటివి అయ్యుంటాయి. వాటి జోలికి వెళ్తే సంపాదించుకున్న సొమ్ముతో పాటు, పరువు ప్రతిష్టలను కూడా కోల్పోవాల్సి వస్తుంది.” అంటూ ముగించాడు విక్రమార్కుడు.

ఆర్థిక వ్యవహారాలలో వ్యక్తి పొరపాట్లు వల్ల నష్టం రావచ్చు, మనం డబ్బులు పెడుతున్న సంస్థల వల్ల నష్టం రావచ్చు, వీటికి బాహ్య ప్రపంచంలో వున్న ఊహించలేని ప్రభావాల వల్ల దేనివల్లైనా కూడా నష్టం రావచ్చు. మొదటిది జాగ్రత్తతో, రెండొవది కాస్త అవగాహన పెంచుకోవడంతో అరికట్టవచ్చు. మూడో రకం నష్టాలు రాకుండా వుండాలంటే చాలా వివరమైన విశ్లేషణ, సంసిద్ధత అవసరం అవుతాయి. [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము