(Telugu) ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలు

[:te]ఇన్సూరెన్స్ తీసుకోవడంలో వున్న సాధకబాధకాలు నీకు నిజంగా తెలుసా? ఈ అనుమానం తీర్చుకోవడం కోసం నేను నీకు ఒక కథ చెప్తాను.

ఆ ఊర్లో లచ్చమ్మ నోటికి భయపడనివాళ్ళు లేరు. ఎప్పుడు ఎక్కడ ఎవరు దొరికినా వాళ్ళను తిట్టిపోయడం ఆమె అలవాటు. అందుకని ప్రతి ఒక్కళ్ళూ ఆమె అంటే భయపడి దూరం పరిగెత్తేవాళ్ళు. అలా భయపడేవాళ్ళలో మొదటి పేరు శంకరయ్యది. తీరా చూస్తే శంకరయ్య ఆ లచ్చమ్మకి స్వయానా భర్తగారు. ఆమె అంటే భయంలేని వాళ్ళలో మొదటి వ్యక్తి ఆ ఊరి సర్పంచి పాపారాయుడుగారు. ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని సరైన అవకాశం కోసం ఆయన చూస్తున్నాడు.

ఒకరోజు రాజయ్య అనే రైతు పొలానికి వెళ్ళాలని హడావిడిగా సైకిల్ తొక్కుతూ పొరపాటున కిందపడ్డాడు. సైకిల్ చక్రానికి ఏదో అడ్డంపడటం వల్లే పడిపోయానని అతను అనుకున్నాడు. తీరా చూస్తే అతని సైకిల్ కింద పడి ఒక కోడి పుంజు చనిపోయింది. ఆ పుంజు ఎవరిదా అని అటూ ఇటూ చూశాడు. ఆ పక్కనే ఉన్న ఇంటిలోనుంచి శంకరయ్య ఆ పుంజు తనదేనంటూ వచ్చాడు. రాజయ్య ముందు భయపడ్డా, ఆ తరువాత సమయానికి లచ్చమ్మ అక్కడలేదని తెలుసుకోని మనసులోనే సంతోషించాడు. పైగా ఏదో మాయచేసి తప్పించుకోడానికి ఇదే మంచి అవకాశం అని అతనికి అర్థం అయ్యింది.

“ఒరే శంకరయ్యా… నా పొరపాటువల్లే నీ పుంజు చచ్చిపోయింది కాబట్టి దాని ఖరీదు ఎంత అయితే అంత ఇచ్చేస్తాను. దాన్ని విలువ ఎంతో చెప్పు” అన్నాడు.

శంకరయ్య అమాయకంగా – “పోతేపోనీలేరా… రెండొందలు పెట్టి కొన్న పుంజు… చచ్చాక ఇంక విలువేముంటుంది… పోనీలే…” అన్నాడు. రాజయ్య తన అదృష్టానికి తానే మురిసిపోతూ అక్కడ్నుంచి కదలబోయాడు. సరిగ్గా అప్పుడే జరగకూడనిది జరిగిపోయింది. లచ్చమ్మ అక్కడికి వచ్చింది. చచ్చిన పుంజుని చూసి రాగాలు తీస్తూ ఏడుపు లంకించుకుంది. నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టింది, దుమ్మెత్తిపోసింది, కోపంలో మొగుణ్ణి నాలుగు దెబ్బలు కూడా వేసింది.

రాజయ్య ఆమెకు నచ్చజెప్పి – “అమ్మా, నేను దాని ఖరీదు ఇస్తానని చెప్పాను కానీ శంకరయ్యే వద్దంటున్నాడు. ఇదిగో రెండొందలు” అంటూ ఇవ్వబోయాడు.

“ఏమయ్యా నేను నా మొగుడిలాగా తెలివితక్కువదానిలా కనపడుతున్నానా? ఈ పుంజు విలువ రెండొందలా? దాన్ని కోడిపందాల కోసం పెంచుకున్నాను. ఒక్క పందెం గెలిస్తే వెయ్యి రూపాయలు. అలా సంవత్సరానికి మూడు పందాలు వేసినా కనీసం ఐదేళ్ళు పందాలు వేస్తుంది. అందులో సగం ఓడిపోయినా ఏడున్నర వేలు సంపాదిస్తుంది. అదీ కాక ఈ పుంజు మా ఇంట్లో పెట్టలతో జత కట్టిందంటే ఎన్నెన్ని గుడ్లు? ఆ గుడ్ల నుంచి మళ్ళీ పందెం కోళ్ళు… అవన్నీ లెక్కేసుకుంటూ పోతే నువ్వు నాకు ఇవ్వాల్సింది వేలల్లో తేలుతుంది నేను కాబట్టి పేచి పెట్టకుండా వదిలేస్తున్నా. నాకు నువ్వు చేసిన నష్టం మొత్తానికి ఏడు వేలు ఇచ్చి కదులు” అంది. రాజయ్య బిత్తరపోయాడు. మాటలు పెరిగి వాదన మొదలైంది. విషయం పంచాయితీ దాకా వెళ్ళింది.

జరిగిందంతా తెలుసుకున్న సర్పంచ్ పాపారాయుడు లచ్చమ్మకి బుద్ది చెప్పడానికి ఇదే సరైన సమయం అని అర్థం చేసుకున్నాడు. లచ్చమ్మ చెప్పే విషయాన్నీ, రాజయ్య చెప్పే విషయాలనీ విడి విడిగా విన్నాడు.

“జరిగిన సంఘటనలన్నీ పరిశీలించిన తరువాత రాజయ్య శంకరయ్యకు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మాట్లాడితే శంకరయ్యే రాజయ్యకి ఒక వంద ఎదురిచ్చి, అతని సైకిల్ రిపేర్ చేయించాలి” అని తన తీర్పుని ప్రకటించాడు.”

కథ మొత్తం విన్నావు కాబట్టి నేనేం ప్రశ్న అడగబోతున్నానో నీకు ముందే తెలిసిపోయి వుంటుంది. పాపారాయుడి తీర్పులో వున్న మతలబు ఏంటి? నేను ముందే చెప్పినట్లు ఈ కథలోనే ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఒక రహస్యం వుంది. అదేమిటో కూడా నువ్వు విప్పి చెప్పాలి.

“పాపారాయడు తన తీర్పు ద్వారా లచ్చమ్మ స్వార్థానికి, అత్యాశకీ సరైన బుద్ది చెప్పాడు. కానీ, అసలు ఆయన లెక్కలకు ఆధారం ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయమే. శంకరయ్య కోడి పుంజుని రెండొందలకు కొన్నానని ముందే చెప్పాడు. దాన్ని పందాల కోసమని పెంచుతున్నామని లచ్చమ్మే స్వయంగా ఒప్పుకుంది. పందెంలో గెలిచేందుకు ఎంత అవకాశం వుందో, ఓడిపోయేందుకు కూడా అంతే అవకాశం వుంటుంది. ప్రాబబిలిటీ సూత్రం ప్రకారం రెండిటికీ అవకాశం సమానం కాబట్టి ఎంత డబ్బులు వచ్చే అవకాశం వుందో అంత డబ్బు పోయే అవకాశం కూడా వుంది. అంటే దాంట్లో లాభపడేది లేదు. ఇక అది పందెం కోడి అంటున్నారు కాబట్టి దాన్ని పెట్టలతో కలవనివ్వరు. దాని వల్ల పెట్టలు పెట్టే గుడ్లు, వాటివల్ల వచ్చే ఆదాయం ఇదంతా బూటకం. మిగిలింది రాజయ్య సైకిల్ కింద పడి చచ్చిన కోడి. బయట మటన్ కొట్లో ఒక కోడి ఖరీదు మూడొందలైనా వుంటుంది. శంకరయ్య కొన్నది రెండొందలకే కాబట్టి వంద రూపాయల లాభం వస్తుంది. ఆ లాభాన్నే రాజయ్యతో పంచుకోమని పాపారాయుడు చెప్పాడు. సైకిల్ చక్రంలో కోడిపుంజు పడటం వల్లే సైకిల్ కిందపడి దానికి రిపేర్‍కి వచ్చింది కాబట్టి ఆ ఖర్చు కూడా పుంజు యజమానే పెట్టుకోవాలని తీర్పు చెప్పాడు.

సరదాగా చెప్పుకోడానికి కథ బాగానే వుంది కానీ, కోళ్ళను పందేలకు వాడటానికి నేను వ్యతిరేకం. పైగా అది డబ్బుని పోగొట్టే అలవాటు కాబట్టి దాని జోలికి కూడా నేను వెళ్ళను. అది అలా పక్కనపెడితే, ఈ కథలో వున్న ముఖ్యమైన ఇన్సూరెన్స్‍ సూత్రం గురించి చెప్తాను విను.

"లచ్చమ్మ నోటు దురుసు వల్ల కోడినీ, డబ్బునీ రెండింటినీ పోగొట్టుకుంది కానీ, ఆమె కోడి పుంజు విలువ లెక్కేసిన విధానం మాత్రం సరైనదే. ఇదే రకంగా ఒక మనిషి విలువను కూడా లెక్కేయవచ్చు. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్న తరువాత వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న – “ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి?” అని. చాలామంది ఎంత ప్రీమియం కట్టగలము అని మొదలుపెడతారు. ఇది పూర్తిగా తప్పు. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు లేకుండా పోతే, ఆ కుటుంబం అదే విధమైన జీవనశైలిని కొనసాగించడానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని మనం గతంలో చెప్పుకున్నాం కదా. అందువల్ల ఒక కుటుంబం ప్రస్తుతం ఎలాంటి జీవనాన్ని గడుపుతోందో అదే రకమైన జీవనాన్ని జీవితాంతం కొనసాగించడానికి అవసరమైనంత డబ్బులు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

ఒక కుటుంబంలో మనిషి చనిపోవడం వల్ల వచ్చే లోటు ఎవరూ భర్తీ చెయ్యలేరు. సామాజిక, మానసికంగా లోటును కాకపోయినా ఆర్థికంగా ఆ లోటును భర్తీ చెయ్యడానికే ఇన్సూరెన్స్ వుంది. అందుకోసమైనా సరైన మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం వుంది. దీని కోసం ఒక మనిషి జీవితకాలపు ఆర్థిక విలువను లెక్కించాలి. ఇది సరిగ్గా లచ్చమ్మ లెక్కేసినట్లే లెక్క వేయాలి. దీన్నే హ్యూమన్ లైఫ్ వాల్యూ (Human Life Value (HLV)) అంటారు.

అయితే కేవలం ఒక మనిషి ప్రస్తుత జీతాన్ని సంపాదించబోయే సంవత్సరాలతో గుణిస్తే ఈ విలువ రాదు. ఇందులో చాలా విషయాలున్నాయి. మొదటిది ప్రతి సంవత్సరం పెరిగే జీతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.. ఆ తరువాత ద్రవ్యోల్పణం (inflation) సుమారుగా ప్రతి సంవత్సరం ఎంత వుంటుందో వూహించాలి, ఆ మేరకు ఆ రాబోయే జీతాన్ని తగ్గించుకోవాలి (discounting) ఆ తరువాత అప్పటి వరకు ఆ వ్యక్తి సంపాదించిన ఆస్థుల విలువను తగ్గించాలి. అంటే ఫిక్స్డ్‌డిపాజిట్లు, షేర్ల విలువలు, అప్పటికే వున్న ఇన్సూరెన్స్ ఇలాంటివి. అలా తగ్గించిన తరువాత దానికి అతను చేసిన అప్పులను జోడించాలి.. అది ఒక వ్యక్తి లైఫ్ వాల్యూ.."

వుదాహరణకి 30 సంవత్సరాల వ్యక్తి మరో ఇరవై ఏళ్ళు పని చెయ్యాలనుకుంటున్నాడు అనుకుందాం. అతని జీతం ప్రస్తుతం సంవత్సరానికి 10 లక్షలు.. ప్రతి సంవత్సరం 10 శాతం జీతం పెరుగుతూ వస్తోందనుకుందాం. ద్రవ్యోల్పణం 9% వుంటుందనుకుంటే అప్పుడు జీతం వాస్తవ పెరుగుదల (real growth) 10-9 అంటె 1% వస్తుంది. పదిలక్షల జీతాన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళితే ఇరవై ఏళ్ళకు 2.2 కోట్లు అవుతుంది. అప్పటికే అతను సంపాదించిన ఆస్థుల విలువ యాభై లక్షలు వుంటే దాన్ని మినహాయించుకోవాలి. అప్పుడు విలువు 1.7 కోట్లు అవుతుంది. దానికి చేసిన అప్పులు జోడించాలి. సుమారు ముఫై లక్షలు ఇంటి రుణం వుందనుకుంటే అతని మొత్తం విలువ సుమారుగా రెండు కోట్లు అవుతుంది.

చాలా మంది ఆర్థిక నిపుణులు ఇంత మొత్తానికి బీమా చేయింఛుకోమని చెప్తారు కానీ అది అవసరం లేదు. ఈ లెక్క ప్రకారం ఈ రోజు ఆ వ్యక్తి జీవిత కాలపు సంపాదన విలువ రెండు కోట్లు. అది కాలం గడుస్తున్న కొద్దీ, అతను సంపాదిస్తూ వుంటాడు కాబట్టి తగ్గుతూ వస్తుంది. అలాగే సంపాదించిన ఆస్థుల విలువ పెరుగుతూ వుంటుంది కాబట్టి అప్పుడు కూడా బీమా తగ్గించుకోవాల్సి వస్తుంది. మొదట్లో రెండు కోట్లు ఇన్సూరెన్స్ తీసుకుంటే తరువాత తగ్గించుకోవడం అన్ని పాలసీలలో సాధ్యపడకపోవచ్చు. సుమారుగా పై ఉదాహరణలో (పది లక్షల సంపాదనకి) కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించుకోమని సూచించవచ్చు.

ఒక మనిషి విలువ కట్టేటప్పుడు అతని సంపాదనే కాకుండా అతను చేసిన అప్పులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఇంటి రుణాలు, పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులు ఆ అప్పుకు సరిపోయేంత ఇన్సూరెస్ తోసుకోమని సలహా ఇస్తారు. సరైన మొత్తంలో ఇన్సూరెన్స్ లేకుండా అప్పు చేసి, ఆ తరువాత ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబం ఆర్థిక స్థితిని కొనసాగించడం అటుంచి, అప్పు భారం అదనంగా మీదపడుతుంది. అందుకే ఇన్సూరెన్స్ ఎంతకు తీసుకోవాలో నిర్ణయించేటప్పుడు అప్పులను కూడా జోడించడం కీలకం.

"అసలు ఇలా లెక్కెయ్యకుండా మొత్తంగా ఏ యాభై లక్షలకో, రెండు కోట్లకో ఇన్సూరెన్స్ చేస్తే సరిపోదా? ఇంత లెక్కలు వెయ్యటం అవసరమా? అని అనుమానం రావచ్చు. ఒక మనిషి అసలు విలువ కన్నా తక్కువ ఇన్సూరెన్స్ వుంటే దాని వల్ల నష్టాలు ఇంతకు ముందే చెప్పాను. దీని వల్ల కుటుంబానికి ఏ ప్రయోజనమూ వుండదు. అదే విధంగా అవసరానికి మించి కూడా ఇన్సూరెన్ వుండటం కూడా మంచిది కాదు. ఎక్కువ ఇన్సూరెన్స్ కావాలంటే ఎక్కువ ప్రీమియం కట్టాలి. ఇది ఒక రకంగా నష్టమే కదా. అది కాక అవసరానికి మించి ఇన్సూరెన్స్ వుండటం వల్ల ప్రమాదం కూడా వుంది. ఒక మనిషి బ్రతికున్నప్పటికంటే చనిపోయిన తరువాత ఎక్కువ విలువ చెయ్యకూడదని అని ఇన్సూరెన్స్‍లో ఒక నియమం వుంది. అంటే ఒక మనిషి జీవితంకాలంలో సంపాదించలేనంత సొమ్ముకు ఇన్సూరెన్స్ తీసుకుంటే అతని బతికినదానికన్నా చనిపోయినప్పుడే కుటుంబానికి ఎక్కువ లాభం వుంటుంది. మనిషి ప్రాణానికి విలువని తగ్గించేలా ఆ మనిషి విలువను మించి ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు కూడా.

ఇది ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలు.

సంపాదించే కుటుంబసభ్యుడి మరణం సంభవించినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కృంగిపోకుండా కాపాడేది ఇన్సూరెన్స్ పథకం. వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముందు ముందు అతని సంపాదన ఎలా వుండబోతోందో ఊహించి, దానిలో నుంచి సంపాదించిన ఆస్థుల విలువ తగ్గించి, అప్పుల విలువ జోడించి తన ఆజీవిత ఆర్థిక విలువ (Human Life Value) లెక్క వేసుకోవాలి. దాని ఆధారంగా ఇన్సూరెన్స్ కవర్ ఎంతుండాలో నిర్ణయించుకోవాలి.

ఇప్పటిదాకా మీరు తీసుకున్న అన్ని ఇన్సూరెన్స్ పాలసీలలో కలిపి మీకు జీవిత బీమా ఎంత వుందో లెక్క వేయండి. ఆ తరువాత మీ కుటుంబం నెలకు ఎంత సొమ్ము ఖర్చుపెడుతోందో లెక్క వేయండి. ఇప్పుడు మీ బీమా మొత్తం కలిపి ఎన్ని నెలలు మీ కుటుంబ పోషణకు సరిపోతుందో లెక్కవేయండి. మీ ఇన్సూరెన్స్ వల్ల ఎన్ని నెలల ప్రయోజనాన్ని కొనుకున్నారో మీకే అర్థం అవుతుంది. [:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము