(Telugu) మధుర లాలస - మణికంధరుడి తపోభంగం

[:te]

(జరిగిన కథ - ద్వారకలో కృష్ణుణ్ణి చూడటానికి, శిష్యుడు మణికంధరుడితో వెళ్తున్న నారదుడు రంభా నలకూబరుల్ని కలుస్తాడు. రంభకి గర్వభంగం చెయ్యాలనుకుంటాడు. కలభాషిణి రంభానలకూబరులు విమానంలో మాట్లాడుకున్న కొన్ని విషయాల గురించి నారదుణ్ణడుగుతుంది. నారదుడు ద్వారకలో సంగీతం నేర్చుకుని తిరిగి వెళ్తూ ఏ స్త్రీ రూపం కావాలనుకుంటే ఆ రూపం వచ్చే వరం కలభాషిణికి ఇస్తాడు. ఒకరోజు కలభాషిణి తోటలో ఉండగా ఓ సిద్ధుడు సింహం మీద ఆకాశంలోంచి దిగుతాడు. ఆమె గతచరిత్రని వల్లిస్తూ కుశలమడుగుతాడు. ఇక చదవండి.)


“అయ్యా! మీకేవో గొప్ప శక్తులున్నట్టున్నాయి. నువ్వు కపిలముని లాటి సిద్ధుడివో లేకపోతే స్వయంగా దేవుడివేనో! మీ పేరేమిటో విశేషాలేమిటో వినాలనుంది నాకు”


“నా పేరు మణిస్తంభుడు. నువ్వు చెప్పిన వాళ్ళలో ఎవణ్ణీ కాను. కేవలం మామూలు సిద్ధుణ్ణి”


“మీ మాటలు ఒక్కొక్కటి వింటుంటే నాకు మతిపోతోంది. ఇవి మామూలు సిద్ధులకి ఎలా తెలుస్తాయి? మరో విషయం మీరిందాక మణికంధరుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడన్నారు. అదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది”


“అమ్మాయీ! నాకు దూరదృష్టి, దూరశ్రవణ శక్తులున్నాయి. అందువల్ల నేను ఉన్నచోటునుంచి కదలకుండా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. నీ గురించి నేను చెప్పిన వన్నీ నిజమే కదా! ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళాక మణికంధరుడు ఏం చేశాడో చెప్తాను విను.


“నువ్వు వాళ్ళ దగ్గర్నుంచి వచ్చెయ్యటం తోటే నారదుడు మణికంధరుణ్ణి చూసి అన్నాడు “శిష్యా! నువు నేర్చుకున్న సంగీతానికి న్యాయం జరగాలంటే నువ్వు చెయాల్సింది ఎప్పుడూ ఆ విష్ణువుని కీర్తిస్తూ పాడుతూ ఉండటం. సంగీతం కన్నా ఆయనకి ఇష్టమైంది ఇంకోటి లేదు. అందుకే నేనూ, విశ్వావసుడు, తుంబురుడు, చివరకు ఆ సరస్వతీ దేవీ ఎప్పుడూ అదే పన్లో ఉంటాం. నిజంగా నీ అదృష్టం కాకపోతే శ్రీకృష్ణుడంతటి వాడు తనంతట తను నీకు సంగీతం నేర్పుతాడా! కనక ఆ విద్యని నువ్వు సరైన విధంగా వాడుకో, నీ కోరికలు తీరతాయి….


ఇక నే వెళ్ళి స్వర్గంలోనో బ్రహ్మ లోకంలోనో కైలాసంలోనో లేకపోతే ఈ గొడవంతా మొదలైన ఆ వైకుంఠంలోనో మదమెక్కి మిడిసిపడుతున్న తుంబురుణ్ణి గానవిద్యలో ఓడించి నా కష్టాలకి ఫలితం దక్కించుకోవాలి” అన్నాడు హుషారుగా.


“అతనలా అనేసరికి మణికంధరుడు కుతూహలంతో “అంటే తుంబురుడికీ మీకూ ఏదో పోటీ ఉందన్నమాట! నాతో ఎప్పుడూ చెప్పలేదే?” అనడిగాడు.


దానికి నారదుడు ఇలా చెప్పుకొచ్చాడు


“ఒకనాడు వైకుంఠంలో విష్ణువు కొలువు తీరాడు.

దేవతలు, మునులు, యోగులు సభంతా నిండిపోయారు.

నేనూ, తుంబురుడు, విశ్వావసుడు లాటి వీణాధరులం కూడా అక్కడున్నాం.


విష్వక్సేనుడు బెత్తం పట్టుకుని సభని అదుపు చేస్తున్నాడు.

దివ్య వారాంగనలు నాట్యాలు చేస్తున్నారు.

అంతలో మేఘాల మధ్య మెరుపు లాగా సఖుల మధ్య ఉండి లక్ష్మీదేవి అక్కడికి వస్తున్నది.


ఆమె అలా కనిపించిందో లేదో ఇలా వేత్రధరులు వచ్చి జనాన్ని బెత్తాల్తో బాదేశారు.

శివుడు, బ్రహ్మ లాటి వాళ్ళే దూరంగా పారిపోయారంటే ఇక మాలాటి వాళ్ళ విషయం చెప్పాలా? తలా ఓ దిక్కు పరిగెత్తాం.


ఇంతలో ఎవరో వచ్చి “ఓయ్‌ తుంబురుడా! ఎక్కడున్నావ్‌ ! ఇటు రావయ్యా!” అని అతన్ని లోపలికి తీసుకుపోయారు.

“అతన్నెందుకు పిలిచుంటారు?” అని అందరూ చెవులు కొరుక్కుంటుంటే, “ఎందుకేమిటి? విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి తుంబురుడి చేత ప్రత్యేకంగా పాడించుకుని వింటున్నారు” అని అక్కడికి దగ్గర్లో ఉన్న వాళ్ళన్నారు.


నాకు మనసు భగ్గుమంది.


ఇక కొంతసేపటికి తుంబురుడు బయటికొచ్చాడు.

ఇప్పుడతని ఒంటినిండా మెరుగుపూత, మెళ్ళో కొత్త పతకం, బుజాన కొత్త గుడ్డలు!

అందరూ అతని చుట్టూ చేరి పొగడటం!

నాకు ఒళ్ళు మండి పోయింది.


“తగుదునమ్మా అని ఒక్కడివే వెళ్ళి పాడటమే కాకుండా ఒంటి నిండా బహుమానాలు తగిలించుకుని అందరికీ చూపిస్తూ మరీ వస్తావా! ఓరి పాపీ!” అని పళ్ళు పటపట కొరుక్కుని ఏదో ఒక విధంగా వాడితో పోట్లాట పెట్టుకుని సంగీతంలో ఓడించాలని నిర్ణయించుకున్నా.


ఐతే ఎందుకైనా మంచిదని వెంటనే బయటపడకుండా కొన్నాళ్ళు మామూలుగా ఉండి ముందుగా అతని పాటలో బలహీనతల్ని తెలుసుకోవాలని యుక్తి పన్నా.

ఆ పని మీదే ఓ రోజు అతని ఇంటికెళ్ళా.

అప్పుడే అతను తన వీణని మేళవించి బయట వుంచి లోపలికెళ్ళాడు.


ఇదీ బాగుంది, ఈ వీణ ఎలాటిదో చూద్దామని నేను దాన్ని పలికిద్దును కదా దాని అపూర్వమైన శ్రుతులు వినేసరికి నాలో ఆశ్చర్యం, భయం, లజ్జ కలిగాయి.


సిగ్గుతో వెంటనే తిరిగొచ్చేశాను.


“ఆహా! నిజానికి నాకన్నా గొప్ప విద్య తన దగ్గర ఉన్నా కూడా నాతో కలిసి పాడేటప్పుడు ఎప్పుడూ నన్ను మించటానికి చూడలేదు! పైగా నేను గొప్పవాణ్ణని అందరూ అంటున్నా కిక్కురు మనలేదు! ఇప్పుడు విష్ణువు పిలిపించి పాడించే వరకూ బయటపడలేదు. నీరు కొద్దీ తామరన్నట్టు నిజంగా గొప్పవాళ్ళు ఎవరి దగ్గర ఎంత అవసరమో అంత విద్యే ప్రదర్శిస్తారు కదా!” అని ఆశ్చర్యపడ్డాను.


ఇక అప్పట్నుంచి అతన్తో సమానమైన విద్య సంపాయించాలని ఎన్ని పాట్లు పడ్డానో! ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతమందినో కలిశాను. ఏమీ లాభం కలగలా.

చివరికి ఆ విష్ణుమూర్తే దిక్కని ఆయన్ని గురించి ఎంతోకాలం తపస్సు చేశాను.


అప్పుడాయన ప్రత్యక్షమైతే “తుంబురుణ్ణి సంగీతంలో గెలవాలనే” వరం కోరుకున్నాను. దానికాయన “ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా ద్వారకలో పుడతాను. అప్పుడు వచ్చి నన్ను కలువు, నీ కోరిక తీరుస్తాను” అన్నాడు. ఇలా చివరికి ఇప్పుడు నా కోరిక తీరబోతోంది” అని ముగించాడు నారదుడు.


“అదంతావిన్న మణికంధరుడు ఆలోచనలో పడ్డాడు.

“మరి తుంబురుడు ఒక్కసారి వైకుంఠంలో పాడటమే అంత గొప్ప విషయమైతే ఇక ఎప్పుడూ వైకుంఠంలోనే ఉండి పాడగలిగే అదృష్టం ఎలా కలుగుతుందో కదా!” అని పైకే అనేశాడు.


ఆ మాటతో నారదుడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

“భేష్‌, భేష్‌! నీకీ ఆలోచన రావటమే బ్రహ్మాండంగా ఉంది. సామాన్యంగా ఎంత చదివి ఎన్ని తెలుసుననుకున్న వాళ్ళైనా వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్టు మళ్ళీ వాళ్ళనీ వీళ్ళనీ కొలవటానికి తయారౌతారు.


అలా కాకుండా వైకుంఠంలో విష్ణువుని పూజిస్తూ ఉండాలంటే పెద్ద వాళ్ళ నించి నేను విన్న ఆలోచన ఇది

శక్తి కొద్దీ కృష్ణార్పణంగా మంచి పన్లే చెయ్యటం, చెడ్డ పన్లు చెయ్యకపోవటం, విష్ణువు మీద భక్తి, ఆయన భక్తుల్తో స్నేహం, ఆయన వెలిసిన దివ్యక్షేత్రాలు చూడటం, బ్రహ్మచర్యం, తపస్సు, వైరాగ్యం వీటిలో కొన్ని పాటించినా చాలునని. కాబట్టి నువ్వు నీకున్న గొప్ప సంగీత విద్యతో తిరుపతి, శ్రీరంగం లాటి క్షేత్రాల్లో విష్ణు సంకీర్తనలు చెయ్యి. నీకు శుభం జరుగుతుంది” అని చెప్పి

ఆ ఉద్రేకంలో పులకరిస్తూ కృష్ణుడి గురించి పాడుతూ ఆడుతూ తన్మయంగా ఎటో వెళ్ళిపోయాడు నారదుడు.

అది చూసిన మణికంధరుడు కూడా “ఆహా! ఈ నారదుడెంత అదృష్టవంతుడు! ఇతనికి ఎంత భక్తి!” అనుకుని అతను దూరం వెళ్ళేవరకు అతన్నే చూస్తూ నిలబడి ఇక తను కూడా తీర్థయాత్రలకి బయల్దేరాడు.


“అలా వెళ్ళిన మణికంధరుడు యమునా నదిని చూశాడు. ఆనందించాడు. అక్కడ కూర్చుని విష్ణువు గురించి గొప్పగా పాడాడు. మధుర, హరిద్వారం, సాలగ్రామ పర్వతం, బదరికాశ్రమం, నైమిశారణ్యం, కురుక్షేత్రం, ప్రయాగ, కాశి, అయోధ్య, గంగా సంగమం చూసి అన్ని చోట్లా స్నానాలూ, దానాలూ చేశాడు. సముద్రం పక్కనే ఉన్న నీలాచలానికి వెళ్ళి అక్కడ ఇంద్రద్యుమ్నం అనే సరస్సులో రోహిణీ కుండంలో స్నానం చేశాడు.

గానంతో జగన్నాథుణ్ణి కొలిచాడు.

తర్వాత శ్రీకూర్మం, సింహాచలం, అహోబలం, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాడు.

అక్కడ మహామహిమలున్న స్వామి పుష్కరిణిలో స్నానించాడు. క్షితి వరాహ మూర్తిని కొలిచాడు. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి వెళ్ళాడు.


మృదువైన పాదాలు, మెరుగు అందెలు, బంగారు దుప్పటి, ముప్పేట మొలతాడు, మణుల వడ్డాణం, బొడ్డులో మాణిక్యం, వైజయింతి పూమాల, వక్షాన లక్ష్మి, వరదహస్తం, కటిహస్తం, మిగిలిన రెండు చేతుల్లో శంఖ చక్రాలు, తార హారాలు, చక్కటి కంఠం, నవ్వు ముఖం, మకరకుండలాలు, తామర కళ్ళు, అందాల ముక్కు, కలికి కనుబొమ్మలు, ముత్యాల నామం, రత్నాల నుదురు ఇవన్నీ ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహాన్ని అంగాంగం చూసి తపించి పులకించి ఆయన గురించి మూడు రాత్రింబగళ్ళు పరవశంతో పాడి అక్కడున్న జనాన్నందర్నీ ఆనందాశ్చర్యాల్లో ముంచేశాడు.


అక్కడినుంచి కాంచీపురంలో ఏకామ్రనాథుణ్ణీ, కామాక్షినీ సేవించాడు. కరిగిరి కి వెళ్ళి కన్నుల పండుగ్గా వరదరాజ దేవుణ్ణి చూసి పాడి ఆనందించాడు. ఆ కాంచీపురం నుంచి సస్యశ్యామలంగా ఉన్న చోళ మండల మహా గ్రామాల్ని దాటుతూ కావేరీతీరం చేరాడు. కావేరిని పొగిడి ఇంతింతని వర్ణించలేని అద్భుతాలున్న శ్రీరంగం చేరుకున్నాడు.

పాటల్ని ఆశువుగా పాడి ఆ శ్రీరంగనాథుణ్ణి సేవించాడు.

అక్కణ్ణుంచి తూర్పుగా కుంభకోణం వెళ్ళి విష్ణువునీ, కుంభేశ్వరుడినీ పూజించాడు. దర్భశయనంలో రాముణ్ణి కొలిచాడు.


తర్వాత సేతుబంధం వెళ్ళి రామేశ్వరుణ్ణి ఆరాధించాడు.

అప్పటికీ తృప్తి కలక్కపోగా ఇనుమడిస్తున్న భక్తి ఆవేశంతో అక్కడికి పడమరగా చక్కగా దట్టంగా పెరిగివున్న ఒక పూలతోటలో కూర్చుని విష్ణువు గురించి తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు.

తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు అతను చేసిన అద్భుతమైన గానాన్ని నేను ఒళ్ళంతా చెవులుగా విన్నాను. ఇప్పుడతని తపస్సు వల్ల నాకా అదృష్టం పోయింది.


అదుగో, ఇప్పుడతను పద్మాసనంలో కూర్చుని గొప్ప సమాధి అవస్థలో ఉన్నాడు” అంటూ మణికంధరుడి వ్యవహారమంతా వినిపించాడు మణిస్తంభుడు కలభాషిణికి.

(ఇక్కడ మనం “మణికంధరుడు”, “మణిస్తంభుడు” అనే పేర్ల గురించి జాగ్రత్తగా లేకపోతే కలగాపులగమై పోయే అవకాశం ఉంది. మొదటివాడు గంధర్వుడు, నారదుడి శిష్యుడు, ఈ కథకి నాయకుడు; రెండో వాడొక సిద్ధుడు. ఇతను కూడా కథలో ఒక ముఖ్య పాత్ర ధారే.)

ఆ కథంతా విని ఆశ్చర్యంలో మునిగిపోయింది కలభాషిణి.

“ఐతే మీకళ్ళకతను ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాడా?” అనడిగింది ఇంకా నమ్మలేక.

“నీకనుమానంగా ఉంటే నీ చెలికత్తెల్ని అవతలికి పంపించు. వాళ్ళ ప్రవర్తనంతా కళ్ళక్కట్టినట్టు నీకు చెప్తాను. తమాషా చూద్దువు గాని” అని బలవంతంగా ఇద్దరు చెలికత్తెల్ని దూరంగా పంపించి వాళ్ళ పనులు, మాటలు అన్నీ చెప్పి నిజమే నని నిరూపించాడు.

ఆ తర్వాత, ” “దగ్గర వాళ్ళ గురించి చెప్పగలిగాడు గాని బాగా దూరంగా ఉన్న విషయాలు చూడగలడా?” అని నీకు అనుమానం రావొచ్చు. కానీ ఆ అనుమానం తీర్చే దారి లేదు కదా!” అని కొంచెం బాధ పడ్డాడు.

ఐతే అంతలోనే “నువ్వు మణికంధరుడి తపసు గురించి చెప్పిందాంట్లో ఒక్క ముక్క కూడ అబద్ధం లేదు” అని చెప్పింది ఆ పక్కనే చెట్టు మీద నుంచి ఒక చిలక!

“ఆశ్చర్యంగా ఉందే! నువ్వెక్కడి నుంచొచ్చావ్‌? అతను చెప్పేది నిజమని నీకెలా తెలుసు?” అని ఆ చిలకని అడిగింది కలభాషిణి.

అప్పుడా చిలక, “అసలు నాది స్వర్గంలో నందనవనం. శ్రీకృష్ణుడు పారిజాతపు చెట్టుని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేటప్పుడు మిగిలిన పక్షులన్నీ పారిపోయినా నా భార్య ప్రసవసమయం గనక ఏమైతే అయిందని ఒక తొర్రలో వుండిపోయింది. పిల్లలు పెరిగి వాళ్లకి యీకలు వచ్చేదాకా తీసుకెళ్ళటం వీలుగాక ఇక్కడి తోటల ముందు నందనవనం ఎందుకూ చాలకపోయినా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు గనక నేను అటూఇటూ రాకపోకలు సాగిస్తున్నాను. అలా ఇంతకుముందు నేను నా భార్య దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ “మణికంధరుడి” మాట వినపడి ఏమిటోనని ఆగాను.


ఎందుకంటే ఇందాక ఇంద్రుడు, శచీదేవి నందనవనంలో ఉండగా చారుడొకడు వచ్చి, “దేవరా, నేనుండే తోటలోకి ఒకతను వచ్చి కొన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడా తపస్సు చాలా తీవ్రరూపంలో ఉంది. “ఆతోటలో చేసే తపస్సు ఎనిమిది నెలల్లో సిద్ధిస్తుంది గనక జాగ్రత్తగా ఉండమ”ని మీరిదివరకు చెప్పారు గనక ఈ విషయం మీకు చెప్దామని వచ్చాను” అన్నాడు.


ఇంద్రుడు కూడా, “ఔనౌను. అందుకే నిన్నక్కడ ఉంచాను” అని వెంటనే రంభను పిలిపించాడు. “రంభా! ఆ తపస్సు చేస్తోంది ఎవరో గాని నా రాజ్యం కోసమైనా అయుండొచ్చు. గోరంత ఆలస్యానికి కొండంత నష్టం రావొచ్చంటారు. ఇలాటి పనులకి అప్సరసలు బాగా పనికొస్తారు. వాళ్ళలోనూ నీకున్న పనితనం ఇంకెవరికీ లేదు. కనక నువ్వు వెంటనే వెళ్ళి ఆ పులిలాటి మునిని మన్మథుడికి జింకగా చెయ్యాలి. బయల్దేరు” అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు.


దానికి రంభ, “ఆ ముని ఎవరనుకుంటున్నారో! అతను నారదుడి శిష్యుడు మణికంధరుడని విన్నాను. అతన్ని ఇదివరకే చూశాన్నేను.అప్పుడే మాలాటి వాళ్ళని లెక్కచెయ్యని వాడు ఇప్పుడు ఇంత తపస్సు చేశాక లొంగుతాడని నమ్మకం లేదు” అని అనుమానంగా మాట్లాడింది.


“అలాగైతే నీకు అద్భుతమైన రూపం, సరికొత్త యవ్వనం ఇస్తున్నా. ఇంక వెళ్ళి పనిపూర్తిచెయ్యి” అని పంపాడు ఇంద్రుడు.


రంభ కూడ కొత్తగా వచ్చిన లావణ్యం, దానికి తోడు గొప్ప అలంకారాల్తో మణికంధరుడి దగ్గరికి బయల్దేరటం నేను చూశా. ఈ పాటికి అతని తపోభూమికి చేరి ఉండొచ్చు” అని తను చూసిన దాన్ని వివరించింది చిలక.


ఆనందంతో ఆ చిలకని పొగిడి పంపింది కలభాషిణి.

అప్పుడు సిద్ధుడు మళ్ళీ “ఇంతకూ నేను ఇక్కడికి వచ్చింది నీ పాట వినటానికి. ఇకనైనా వినిపిస్తావా?” అనడగటంతో, “అలాగే” అని కొంత సేపు పాడి వినిపించింది కలభాషిణి.

అదే సమయంలో

మణికంధరుడి తపోవనంలో

మెరుపుతీగల్లాగా అప్సరసలు నడుస్తుంటే మేఘాల్లాగా వాళ్ళ వెనక వస్తున్నాయి జడలు!

చేతులు, పాదాల కాంతులు అకాల సంధ్యని పుట్టిస్తుంటే, వాళ్ళ గోళ్ళ మీది చుక్కలు తారకల్లాగా మెరుస్తున్నాయి!

అలా కదిలి మణికంధరుడి దగ్గరికి చేరారు రంభా, ఆమె చెలికత్తెలూ.

అక్కడి పరిస్థితి చూస్తే వాళ్ళకు భయం వేసింది

ఆవులు నాకుతుంటే ఆనందంగా పడుకున్న పులులు;

పులుల చన్నులు కుడుస్తున్న లేళ్ళు;

లేళ్ళు ఆడుతుంటే హాయిగా చూస్తున్న సింహాలు;

సింహాలు గోకుతుంటే సంతోషిస్తున్న ఏనుగులు;

ఏనుగుల ముందు ఆడుతున్న పాములు;

పాముల్ని లాలిస్తున్న డేగలు;

డేగల్తో ఆడుకుంటున్న ఎలకలు;

ఎలకల్ని పెంచే పిల్లులు!

వాటి మధ్య మణికంధరుడు

పావనత్వం, పుణ్యం, శాంతం, తపస్సు, సత్వగుణం, వైరాగ్యం, యోగవిద్య, తత్వబోధ, వీటన్నిటి కలబోతలాగా!

ఇలాటి వ్యక్తి తపస్సునా చెడగొట్టటం?

సాధ్యమైన పనేనా?

కాని ప్రయత్నం చెయ్యక తప్పదు. ఇంద్రుడి ఆజ్ఞ!

వనవిహారం మొదలెట్టారు ఉయ్యాలలూగుతూ, ఆడుతూ, పాడుతూ, పరిహాసాలాడుతూ!

అతనికి దగ్గర్లో తారట్లాడుతోంది రంభ కొత్త అందాల్తో, తళుకు బెళుకు కులుకుల్తో!

ఎందుకు ఎలా జరిగిందో చెప్పటం కష్టం దైవ యోగం అనుకోవాలేమో!

మణికంధరుడి సమాథి స్థితి భగ్నమైంది.

వాళ్ళ రొద అతని చెవుల్లోకి దూరింది.

ఆమె రూపం అతని కళ్ళలోకి జొరబడింది.

“కృష్ణ కృష్ణ” అని కళ్ళు మూయటమే గాని కనబడుతున్నది మాత్రం రంభే!

ఇదే సమయం అని మన్మథుడు ఇద్దరి మీదా విపరీతంగా బాణాలు కురిపించేశాడు.


“ఇది రంభ లాగా ఉందే! ఇదివరకు లేని యవ్వనపు సొంపులూ అందాలూ కూడా వచ్చాయి” తో మొదలై, “ఈమె దొరకని వైకుంఠంలో ఉండటం కంటే ఈమె తాకే చెట్టునైనా మేలు” అనుకునేదాకా చేరుకున్నాడతను అలా చూస్తూండగనే!


ఇంక తపస్సుని తీసి గంగలో కలిపేసి తరుణీమణి వెంట పడ్డాడు. “ఇక్కడికెందుకొచ్చావ్‌? ఎక్కడి నుంచి వచ్చావ్‌? నా చెవుల పండగ్గా వినిపించు” అని బతిమాలాడు.

“ఆడుకోవటానికి” అంది రంభ అతన్ని ఊరిస్తూ.

“అబద్ధం! నువ్వు వచ్చింది నాకోసమే! ఔనా?”

చిరునవ్వే ఆమె సమాధానమైంది.

కొంగుపట్టుకు లాగటం అతని వంతైంది.

“ఐపోయిందైపోయింది! అయ్యగారి తపసుకీ అమ్మాయి గారి సొగసుకీ చెల్లైపోయింది!” అని నవ్వుకున్నారు రంభ చెలికత్తెలు. రంభా మణికంధరులు దగ్గర్లో ఉన్న పొదరింటికి చేరి రతిక్రీడల్లోకి దిగారు.

అదే సమయంలో

ఇక్కడ ద్వారకలో

మణిస్తంభుడు కలభాషిణి పాట వింటున్నాడు. మాటల్లో మణికంధరుడి విషయం వచ్చింది.

“మరి రంభ వచ్చాక మణికంధరుడి పరిస్థితి ఏమైందో చూస్తారా?” అనడిగింది కలభాషిణి.

అతను తన దూర దృష్టితో అటు చూసి, “ఇంకేం తపస్సు? ఇప్పుడు మణికంధరుడు ఒక పొదరింట్లో ఉన్నాడు రంభ కౌగిట్లో!” అన్నాడు నవ్వుతూ!


ఆమె ఇంకా ఆశ్చర్యపడుతూ అతన్ని పొగిడి, “మీరు నిజంగా మహానుభావులు! మా ఇంట్లో ఓ రెండు రోజులుండి వెళ్ళండి” అని ప్రాధేయపడింది.


“ఏదో నీపాట వినిపోదామని వచ్చా గాని వాళ్ళూ వీళ్ళూ లాగా పట్నాలకి వెళ్ళి మహిమలు చూపించే వాణ్ణి కాను నేను. రహస్యంగా ఐతేనే నీ ఆతిథ్యం తీసుకుంటా” అని అక్కడో రెండు మూడు రోజులున్నాడా సిద్ధుడు.


కలభాషిణికి ఎలాగైనా నలకూబరుణ్ణి కలవాలనే కోరిక పెరిగిపోతోంది!

అడిగీ అడగనట్టుగా అతన్నడిగింది “మరి మణికంధరుడు మళ్ళీ తపస్సు మొదలెట్టాడా లేక ఇంకా రంభతోనే ఉన్నాడా? ఒక్కసారి చూసి చెప్పరూ?”


“తపస్సూ లేదు గిపస్సూ లేదు. రంభ కౌగిలే ధ్యానం” అంటూ అంతలోనే చెవులు నిక్కబొడుచుకుని జాగ్రత్తగా విని, “ఓర్నీ, యీ వేశ్యలు ఎంతకైనా తగుదురు సుమా!” అని పగలబడి నవ్వటం మొదలెట్టాడు మణిస్తంభుడు.


“ఏమిటేమిటి? ఏంజరిగింది?” అనడిగింది కలభాషిణి.

“ఏం చెప్పమంటావ్‌! నవ్వలేక చస్తున్నాను.అతని తపసునట్లా చెడగొట్టి తర్వాత రంభ ఏం చేసిందో చూశావా? మణికంధరుడితో రతిక్రీడలో ఉండగా “నేనలిసిపోయాను, ఇక చాలురా నలకూబరా!” అని మూలిగింది పరవశంతో. మణికంధరుడు పాపం మనసు చివుక్కుమని వెళ్ళిపోయాడు”.


“ఆఁ! రంభ మాత్రం ఏం చేస్తుందిలే! నలకూబరుడు ఆమెని అంత ప్రేమగా చూసుకుంటాడన్న మాట! .. ఇంతకూ మరి ఇప్పుడు నలకూబరుడెక్కడున్నాడో?”


“ఔనౌను. నీకు ముఖ్యమైంది అదే కదా! ఉండు చూడనీ! తను పక్కనుంటే రంభ వెళ్ళి తపస్సు చెడగొట్టలేదు, దాని వల్ల ఇంద్రుడికి కోపం వస్తుందని ఆ నలకూబరుడు ఇప్పుడు మణికంధరుడి తపోవనానికి దగ్గర్లోనే ఒక తోటలో చెట్టుకింద ఉన్నాడు….


అతని మీద పరాకుతో నువ్వింకేం పాడుతావు గాని ఇక నే వెళ్ళొస్తాను” అని ప్రయాణం కట్టాడు మణిస్తంభుడు.

భోరుమంది కలభాషిణి!


“నన్నిలా నట్టేట్లో ముంచి వెళ్ళొద్దు. ఎలాగైనా సరే ఈ రోజే, ఇప్పుడే, నేను అతని దగ్గరికి చేరాలి. మీరు తప్ప నాకు దిక్కు లేరు”

“వీలైతే చెయ్యనా? కానీ అది దగ్గరా దాపా? మా గురువుగారు ఎంతో చక్కగా శిక్షణ ఇచ్చిన ఈ సింహానికైనా నాలుగ్గడియలు పడుతుందే!

ఐనా నిన్ను దీని మీద ఎక్కించుకుపోవాలంటే అవ్వ! సాటి సిద్ధులంతా ముక్కున వేలేసుకోరా! అదీ గాక నేను నిన్ను తాకలేను కూడ.

ఇదంతా ఎందుగ్గాని, దూరదృష్టి, దూరశ్రవణాల్తో చెయ్యగలైగిన పని ఉంటే చెప్పు, తప్పకుండా చేస్తా”.

ఇంక కలభాషిణి నిలవలేక పోయింది.


“అయ్యా! వట్టి మాటల్తో పనిజరగదు. ఎలాగైనా నన్ను మీరు అతని దగ్గరికి చేర్చాల్సిందే! ఐనా, ఎవరేమనుకుంటే మీలాటి మహాత్ములకి ఏం తక్కువౌతుంది!” అంటూ కాళ్ళా వేళ్ళా బడింది. అతికష్టం మీద ఒప్పుకున్నాడతను.

ముందుగా తను సింహం మీద ఎక్కాడు.

“నన్ను తాకకుండా దీని నడుం మీద కూర్చోగలవా వెనక ఆ మరకొమ్ము పట్టుకుని?”

“మీ అనుగ్రహం అయింది. అదే చాలు. మీరెలా చెయ్యమంటే అలా చేస్తా” అంటూ తనూ ఎక్కింది కలభాషిణి.

“థే!” అని అదిలించటంతోటే సింహం అమాంతం అకాశానికెగిరి వేగంగా పరిగెత్తింది.

కొంత దూరం వెళ్ళారు.

హఠాత్తుగా పక్కనున్న మేఘం చాటునుంచి ఘుమ ఘుమ సువాసనలు, నవ్వులు, పాటలు!

ఎవరో కాదు, మణికంధరుడి తపస్సు చెడగొట్టటానికి రంభతో వెళ్ళిన చెలులు!

మణిస్తంభుడికి వాళ్ళతో కబుర్లు కలపాలనిపించింది.

“ఇదేమిటి మీ చెలిని వదిలేసి మీరే దేవలోకానికి తిరిగెళ్తున్నారు? ఆవిడ మణికంధరుడితో ఇంకొన్నాళ్ళు గడపబోతోందా?”

“ఇంకెక్కడి మణికంధరుడు? ఏమయ్యాడో, ఎటు పోయాడో! ఇప్పుడు రంభ నలకూబరుడితో హాయిగా ఉంది ఆ తోటలోనే! ఇన్నాళ్ళు విరహంలో ఉన్న వాళ్ళని విడదియ్యటం ఇష్టం లేక మేమే వెళ్ళిపోతున్నాం”.

తుర్రుమన్నారు వాళ్ళు, “కలికాలం కాకపోతే ఆ బీరజడల జోగికీ ఈ అందాల బొమ్మకీ జోడేమిటో! ఆమెని చూశారా, స్వర్గంలో ఒక్క నిముషం ఉంటే చాలు దేవతావిటులందర్నీ ఒకాట ఆడించేట్టుంది!” అని బుగ్గలు నొక్కుకుంటూ.

సిద్ధుడికి అర్థమైపోయింది పొరపాటు జరిగిందని.


ఇప్పుడు వాళ్ళు చెప్పింది కలభాషిణికి దుర్వార్తే!

“అమ్మాయ్‌! నీకు చింతేం వద్దు! ఇంకెంత సేపు నీ బాధంతా పోగొడతానుగా, అలా చూస్తుండు” అన్నాడు ఆమెకి ఉత్సాహం కలిగిస్తూ.

“అదెలాగ?”

“తినబోతూ రుచడగటం ఎందుకు?” అంటూండగానే

ఒక్కసారి తలపైకెత్తి చూసి టక్కుమని నిలిచిపోయింది సింహం!

ముందుకు నడిపించటానికి అతను రకరకాల ప్రయత్నాలు చేశాడు గాని తోకతిప్పుతూ వెనకడుగే తప్ప ముందడుగు వెయ్యదే!

కలభాషిణికి కంగారెత్తిపోయింది.

“ఏమైందేమైంద”ని అరిచింది భయంగా!

ఒక్క క్షణం ఆలోచించాడు సిద్దుడు.


“అబ్బే, ఏమీలేదు. మాటల హడావుడిలో ఒక ముఖ్య విషయం మర్చిపోయాను” అంటూ సింహాన్ని నేలకి దించి మేతకి విడిచి, “ఎదురుగా ఎంతో మహిమ గల కాళికాలయం ఒకటుంది. అక్కడ ఉన్న సింహానికి భయపడి ఈ దాపుల వెళ్ళటానికి జంకుతాయి ఎంత గొప్ప సింహాలైనా! మనం వెళ్ళి దేవికి నమస్కరించి వద్దాం. అంతా సక్రమంగా జరుగుతుంది” అంటూ ఒక కత్తి ఉన్న ఎలుగుబంటి చర్మపు ఒరని తీసుకుని గుడికి దారితీశాడు.


“నువ్విక్కడే ఉండు. నే వెళ్ళి పూలు కోసుకొస్తాను” అని పక్కనున్న పూలతోటలోకి పరిగెత్తాడు సిద్ధుడు.

అయోమయంగా దిక్కులు చూస్తూ నిలబడింది కలభాషిణి.

హఠాత్తుగా కసువు బుట్టలాగా నెరిసిన జుట్టుతో మన్మధుడు ఖాళీ చేసి వెళ్ళిన పాడుమేడ లాటి ఓ ముసలావిడ వచ్చిందక్కడికి.

ఆమెలో విపరీతమైన ఆందోళన!

“అయ్యయ్యో! ఎక్కడ్నించి వచ్చావు నువ్వు? బావురుబిల్లిని నమ్మిన చిలకలాగా ఉన్నావే! ప్రాణాల మీద ఆశ ఉంటే వాడు తిరిగిరాక ముందే నువ్విక్కడ్నించి పారిపో! పో!” హడావుడిగా మాట్లాడేస్తోందామె.

 

 కళాపూర్ణోదయం -3: రంభా గర్వభంగం

 

సాహితీమిత్రులారా!

కళాపూర్ణోదయం మూడవ భాగం ఆస్వాదించండి

(జరిగిన కథ ద్వారకలో కృష్ణుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు నారదుడు. అతని శిష్యుడు మణికంధరుడు, వాళ్ళకి ద్వారకలో పరిచయమైన కలభాషిణి కూడ సంగీతవిద్యలో ప్రవీణులయ్యారు.

నారదుడు రంభకి గర్వభంగం చెయ్యాలనుకున్నాడు.

నారదుడి ఉపదేశంతో మణికంధరుడు తీర్థయాత్రలకు బయల్దేరాడు.

కలభాషిణి మేడ తోటలో ఆకాశం నుంచి దిగాడో సిద్ధుడు. అతని ద్వారా తన ప్రియుడు నలకూబరుణ్ణి కలుసుకోవాలని అతన్తో బయల్దేరింది కలభాషిణి. వాళ్ళిద్దరూ ఓ దేవి ఆలయం దగ్గర ఆగారు. పూలు తేవటానికి సిద్ధుడు వెళ్తే ఓ ముసలమ్మ వచ్చి కలభాషిణిని అక్కణ్ణించి పారిపొమ్మని హడావుడి చేస్తుంది. ఇక చదవండి.)

 

కలభాషిణికి ఒక్క క్షణం ఆమె ఏమంటున్నదీ అర్థం కాలేదు. కానీ వెంటనే తనున్న పరిసరాలు, ఆ సిద్ధుడు వచ్చిన దగ్గర్నుంచి జరిగిన విషయాలు గుర్తొచ్చేసరికి మెల్లగా అర్థం కావటం మొదలుపెట్టింది తన పరిస్థితి. “ఇప్పుడే నీ బాధంతా పోగొడతాను” అన్న మాటకి అర్థం ఏమిటో తెలుస్తోంది!

 

ఆమెకి తన గత జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళముందు మెదిలింది. అలాటి బతుక్కి ఇలాటి చావా?

 

“అమ్మా, నువ్వన్నది నిజం. వీడు మాయావే, అనుమానం లేదు. అమాయకంగా వీడి ద్వారా నా కోరికొకటి సాధించుకుందామని వీడి చేతికి నేను చిక్కాను. కాని ఇప్పుడు పారిపొమ్మంటే ఎక్కడికి పోగల్ను? దూరదృష్టితో చూసి ఎక్కడున్నా పట్టుకోగలడు కదా!”

“వాడి దూరదృష్టీ దూరశ్రవణాల విషయం నీకూ తెలుసన్నమాట!”

“అదేగా ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టింది?” అంటూ తన కథంతా ఆమెతో చెప్పుకుంది కలభాషిణి, ఇలాగైనా తనకి వస్తున్న ఆపద గురించి మరిచిపోవచ్చని.

“నాకూ ఇప్పుడర్థమౌతోంది. కష్టపడి దూరదృష్టి సాధించిన దగ్గర్నుంచి “దీనికి తోడు రాజ్య సంపదలు కూడా ఉంటే ఎంత బావుండునో!” అనుకుంటూ, “అద్భుతమైన గానం, మిరుమిట్లు గొలిపే సౌందర్యం కలిసున్న వేశ్య ఎక్కడన్నా ఉంటుందా?” అని దూరదృష్టితో వెదకటం గమనించాను నేను. ఒక చిన్న కిన్నర పట్టుకుని ఎప్పుడూ వాయించుకుంటాడు కూడ అలాగ అద్భుతమైన గానాన్ని పోల్చుకోవచ్చునని.”

“ఐతే ఇక్కడనే సంపాయించాడా దూరదృష్టి కూడ? దానికి ఎంతమందిని బలిచ్చాడో కదా ఈ దుష్టుడు! వాడొచ్చే లోగా కనీసం ఆ కథైనా చెప్పు వింటా. ఇంక చేసేదేముంది గనక?”

“ఎంత ధైర్యవంతురాలివి! అదే నీకు మేలు చేస్తుంది. ఇక వాడి విషయం చెప్తా విను. అదృష్టవశాత్తూ దూరదృష్టి దూరశ్రవణాల కోసం వేరే ఎవర్నీ బాధించక్కర్లేదు. తన్ని తనే బాధించుకోవాలి. తన కళ్ళు తనే పీక్కుని, చెవుల్లో పదునైన నారసాలు పొడుచుకుని సాధించాడు వాటిని. ఇదుగో, ఆ వ్యవహారమంతా చూద్దువు రా!” అంటూ మంటపం చివర, సింహవాహనం దగ్గర శిలాస్తంభానికి వేలాడగట్టిన శస్త్రాల్ని, చురకత్తిని, గండకత్తెరనీ చూపించింది.

“అదుగో, ఆ రాతిస్తంభం మీద ఫలానా కోరిక తీరాలంటే ఫలానా మార్గం అని రాసుంది. ఆ లిపి నీకర్థమౌతుందేమో చూడు” అని అటు తీసుకెళ్ళిందా వృద్ధురాలు.

 

అక్కడ ఇలా రాసుంది

“ఇక్కడ రెండేళ్ళ పాటు జితేంద్రియులై భువనేశ్వరీ మంత్రం జపిస్తే దేవి అన్ని కోరికలూ ఇస్తుంది!

అలా కాదంటే దూరదృష్టి కావలసిన వాళ్ళు ఈ గోరుగంటితో కళ్ళు పొడుచుకోవాలి!

దూరశ్రవణం కావలసిన వాళ్ళు ఈ ఘోరమైన నారసాన్ని చెవిలో పొడుచుకోవాలి!

సాహిత్యంలో గొప్పవాళ్ళు కావాలంటే ఈ చురకత్తితో నాలిక కోసేసుకోవాలి!

ఈ తళతళలాడే గండకత్తెరతో నడుం నరుక్కునే సాహసుడు ఒళ్ళు మళ్ళీ అతుక్కుని బతకటమే కాకుండా తనని చంపబోయేవాళ్ళని తనే చంపుతాడు!

గొప్ప అందం, సంగీతం ఉన్న వేశ్యను బలి ఇచ్చిన వాడు మహారాజౌతాడు!”

ఆ వాక్యంతో కలభాషిణి సందేహాలు పూర్తిగా తీరిపోయాయి.

“పైనున్న వాటిలో ఏదీ చెయ్యలేని వృద్ధులు ఈ దేవి ముందు నిర్భయంగా మరణిస్తే వాళ్ళకి మళ్ళీ యవ్వనం వస్తుంది. వాళ్ళు మరణవేళ కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది!” అని అదంతా చదవటం పూర్తి చేసింది కలభాషిణి.

 

చివరిభాగం విని నవ్వుతూ అన్నదా ముసలమ్మ “ఆ చివరి ముక్క వినే నేను ఇక్కడ ఉంటున్నది. అసలు నా పేరు సుముఖాసత్తి. కాశ్మీరంలో ప్రఖ్యాతమైన శారదా పీఠాన సరస్వతిని పూజించే పూజారి కూతుర్ని”.

 

ఇంతలో సిద్ధుడక్కడికి వచ్చాడు పూజాసామాగ్రితో! “అమ్మాయ్‌! మనం త్వరగా పూజ ముగించుకుని వెళ్దాం. పద పద”.

 

కలభాషిణిని ఒక్కసారిగా చావుభయం పట్టుకుంది. “ఒంటిగా పోలేను. నువ్వు కూడా నాతో రా” అన్నదా ముసలమ్మతో, వణుకుతూ!

 

సిద్ధుడికి విషయం అంతా అర్థమైంది.

“ఈ ముసిలివగ్గు నీకు తోడేమిటి? నేనున్నాగా!” అంటూ వాడు ఆమె కొప్పు పట్టుకు లాగబోతుంటే

కలభాషిణి ప్రాణ భయంతో “ఓ అవ్వా, నీ బిడ్డ లాటి దాన్ని, కాపాడు” అని ఆమె వెనక నక్కుతుంటే

ఆ ముసలమ్మ కూడా మనసు కరగ్గా “చంపొద్దు చంపొద్దు” అని వాడి చేతులు పట్టుకుంటే

“లోపలికి రాకుండా అడ్డం పడితే ఆగుతానా? ఇది మాత్రం దేవి ఎదటేగా!” అంటూ ఆమె చేతులు పక్కకి నెట్టేసి ఒక చేత్తో కలభాషిణి జుట్టు పట్టుకుని రెండో చేత్తో ఒరలోంచి కత్తి దూసి

“దేవీ! నీకిది అర్పణం” అని వాడు దేవతకి కత్తి చెయ్యెత్తి మొక్కి నరకబోయేంతలో

“దీన్ని చంపితే ఆ దేవి మీదొట్టు” అంటూ కలభాషిణి మెడకి తన మెడని అడ్డం పెడుతూ ఆ ముసలమ్మ “ఓయ్‌ సిద్ధుడా! నా ఒట్టు దాటితే నీ కోరిక తీరదు గుర్తుంచుకో! ఓ మహాశక్తీ! నా మాట నిజమయ్యేట్టు చెయ్యి” అంటూండగా

వాడు మహారోషంతో ముందు ఆ ముసలమ్మ మెడ నరికి

విచిత్ర వేగంతో కలభాషిణి కొప్పు పట్టుకుని కత్తినెత్తే సరికి

ఆ దేవి తన మీది ఒట్టుని దాటబోతున్న వాడెత్తిన చేతిని ఎత్తినట్టే పట్టుకుని వాణ్ణి దూరంగా విసిరెయ్యటంతో

ఇంతలో కత్తి దెబ్బకి తన ముసలి శరీరం పోగా సుముఖాసత్తి విచిత్రంగా సరికొత్తగా యవ్వనంతో ప్రాణం పోసుకుని

ఒక చేత్తో కత్తినీ ఇంకో చేత్తో కలభాషిణి జుత్తునీ పట్టుకుని దూరంగా ఎగిరిపోతున్న సిద్ధుణ్ణి, వాడితో కలభాషిణినీ చూసి, ఆ అమ్మాయి అవస్థ ఇంకా తీరలేదని బాధ పడుతూ క్రమంగా “సృష్టి క్రమం ఇంతే” అని గ్రహించి ఆ దుఃఖం తగ్గించుకుని దేవి వరంతో కలిగిన యవ్వనాన్ని వృథా చెయ్యకుండా ఆ దేవినే గురువుగా భావించి అక్కడే యోగవిద్యాభ్యాసం చేస్తుండగా

 

కొన్నాళ్ళకి

మళ్ళీ అక్కడికి వచ్చింది కలభాషిణి!

 

అక్కడున్న అందమైన యువతిని చూసి ఆశ్చర్యంగా, “ఎవర్నువ్వు? ఎక్కడ్నించొచ్చావ్‌?” అనడిగింది కలభాషిణి. ఆమె నవ్వుతూ, “నేను ఇదివరకు నిన్ను రక్షించబోయి ఆ సిద్ధుడి కత్తికి బలై పోయిన సుముఖాసత్తినే! ఈ దేవి కరుణ వల్ల ఇలా మారా. నువ్వు ఎంతో దూరాన వెళ్ళి పడి కూడా ఏమీ హాని జరక్కుండా రావటమే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది” అంది కలభాషిణితో.

“నిజంగా ఆశ్చర్యం అంటే దేవిని మెప్పించి నువ్వు ఇలా యవ్వనాన్ని పొందటం! అలాటి నీ కరుణ ఉండగా నేను హాయిగా తిరిగిరావటంలో ఆశ్చర్యం ఏముంది? ఐనా జరిగినదంతా చెప్తాను విను” అని కలభాషిణి తన అనుభవాలు చెప్పబోతూ ఉండగా బుజాన వీణతో, రత్నమాలికతో కట్టిన పొడవాటి జుట్టుతో, గంభీరంగా వచ్చాడక్కడికి మణికంధరుడు!

 

సంతోషం, విస్మయంతో తడబడుతూ అతనికి నమస్కరించింది కలభాషిణి. మణికంధరుడు కూడా ఆనందంలో తలమునకలయ్యాడు. “ఓహోహో! నిన్ను చూస్తే నా చుట్టాలందర్నీ చూసినట్లుంది! ఎప్పుడైనా నేను గుర్తొస్తానా? ద్వారకెక్కడ, ఈ ఆలయం ఎక్కడ? అంతా క్షేమమే కదా! ద్వారకలో విశేషాలేమిటి?” అంటూ పాతజ్‌ నాపకాలన్నీ కలబోసుకున్నా రిద్దరూ.

“అన్నట్టు, అప్పుడు నీ మనసులో ఒక కోరిక ఉన్నట్టు గుర్తు. దాన్ని పెంచుకుంటూ వీణని వదిలేశావా ఏమిటి?” అని గుర్తు చేశాడు మణికంధరుడు.

 

ఒక్క క్షణం పాటు సిగ్గుతో మొగ్గయ్యింది కలభాషిణి.

కాని అంతలోనే తన పరిస్థితి తల్చుకుని, “ఏం చెప్పేది? దాని వల్లనే కదా నా వాళ్ళందర్నీ ద్వారకలో వదిలి నేనీ దిక్కు మాలిన చోట పడరాని పాట్లు పడింది?” అన్నది బాధగా. వాళ్ళు ద్వారక బయట విడిపోయిన దగ్గర్నించి సుముఖాసత్తి తనని దేవికి బలి కాకుండా కాపాడటం వరకు తన కథ చెప్పి, “ఈమే ఆ పుణ్యాత్మురాలు” అని ఆమెని చూపించింది. తర్వాత, “మరి నీ విషయం ఏమిటి? రంభ నీ తపస్సు చెడగొట్టటం గురించి మణిస్తంభుడు చెప్పాడు. అప్పట్నుంచి ఏమైందో వినాలని కుతూహలంగా ఉంది” అనడిగిందతన్ని.

 

అంతలోనే అక్కడికి వచ్చాడు మణిస్తంభుడు!

“ఇతనే నేను చెప్పిన సిద్ధుడు!” అన్నది కలభాషిణి మణికంధరుడితో.

“ఇతనా?” ఎగతాళిగానూ, ఆశ్చర్యంగానూ అన్నాడు మణికంధరుడు అతనెవరో అదివరకే తెలిసినట్లు!

అదెలా సాధ్యం?

 

కలభాషిణి, మణికంధరుడు అక్కడే ఉండటం, సుముఖాసత్తికి యవ్వనం రావటం మణిస్తంభుడికి ఇదంతా మాయగా ఉంది, ఇంద్రజాలంలా ఉంది! (కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది అతనికి అంత ఆశ్చర్యం ఎందుకో!)

 

“సిద్ధుడా! నువ్వూ కలభాషిణీ ఎగిరి వెళ్ళి ఎక్కడ పడ్డారు? అక్కడేం జరిగింది? చూస్తే మీ అందరి దగ్గరా తలో కథ వున్నట్టుంది” అంది సుముఖాసత్తి కుతూహలంగా.

“తప్పకుండా చెప్తాను. అబ్బో, ఎన్నెన్ని విచిత్రాలు చూశాననుకున్నావ్‌! ఇప్పుడు వెంటనే అదంతా ఎవరికన్నా చెప్పకపోతే నా పొట్ట ఉబ్బిపోయేట్టుంది తెలుసా?” అంటూ తను చూసిన వింతలు విడ్డూరాల కథని వినిపించటం మొదలెట్టాడు మణిస్తంభుడు.

 

“నేను కన్నూ మిన్నూ కానకుండా నువ్వు దేవి మీద వేసిన ఒట్టుని కూడ లెక్కచెయ్యకుండా ఈ కలభాషిణిని చంపబొయ్యాను కదా! దేవి ఆ చేతినలా పట్టుకుని విసిరేసింది నన్ను. ఐతే నేనొక చేత్తో జుట్టు పట్టుకుని ఉన్నందువల్లనేమో, ఈమె కూడ నాతో పాటు ఎగిరొచ్చింది. అలా వెళ్ళి ఈమే, నేనూ ఇంకెక్కడా చోటు లేనట్టు వెళ్ళి వెళ్ళి ఈ మణికంధరుడి తపోవనంలో ఒక మెత్తటి పూలపాన్పు మీద పడ్డాం, అదేం చిత్రమో గాని! నిజంగా దేవి దయచూపించి అలా పడేసింది గాని లేకపోతే ఏమయ్యేవాళ్ళమో మేము! అలా ఒక చేత్తో కత్తి పట్టుకుని నేనింకా రెండో చేత్తో ఆమె జుత్తు పట్టుకుని ఉండటంతో ఈ కలభాషిణి గడగడ వణకటం మొదలెట్టింది.

 

అంత దగ్గరగా ఆమెని అలా చూసేసరికి చెప్పొద్దూ నాలో మదన వికారం కలిగి వెంటనే ఆమెని కౌగిలించు కున్నాను చేసిన పాపం చెప్తే పోతుందంటారు.

దాంతో కలభాషిణి రక్షించండని కేకలు పెట్టింది.

అప్పుడేమయిందీ “భయం వద్దు, నేనొస్తున్నా. ఎవడ్రా అక్కడ అసహాయురాలైన స్త్రీని బలాత్కరిస్తున్న వాడు! వాడెక్కడున్నా పట్టుకుని వాడి మెడ విరిచేస్తా” అనే మాటల్తోటే పరిగెత్తుకొచ్చాడక్కడికి నలకూబరుడు!

 

అతన్ని చూడ్డంతోటే ఈమెని వదిలేసి నేను పారిపోయా. ఐనా ఊరుకోక నన్ను తరిమి పట్టుకుని, “ఎవడ్రా నువ్వు? పద, నువ్వు బలాత్కరిస్తున్న స్త్రీ ఎక్కడుందో చూపించు. అప్పుడు నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తా” అని నన్ను ఈడ్చుకొస్తూంటే ఎదురుగా వచ్చింది

రంభ!

చెదిరిన బట్టలు సర్దుకుంటూ, జారిన జుట్టు ముడేసుకుంటూ, ముఖం మీద పడ్డ వెంట్రుకులు సరిజేసుకుంటూ!

రావటమే “నీకెన్ని సార్లు చెప్పినా వినవు కదా! చేతులో క్తౖతెనా లేకుండా ఇలా పరిగెత్తటమేనా? బాగానే ఉంది సంబడం” అంటూ నన్ను చూసి, “వీడేనా ఆ అన్యాయం చెయ్యబోయింది? ఐనా మన్మథుడి దెబ్బకి ఎవరికైనా మతిపోతుందిలే! ఇంతకీ అదెక్కడ?” అంది రంభ.

“అందుకేగా వీణ్ణి లాక్కొస్తున్నది!” అని నలకూబరుడంటే,

“సరే, ఎక్కడికీ పోడు గాని అతని చెయ్యి వదిలెయ్యి” అని నన్ను విడిపించింది.

అందరం కలభాషిణిని వెదుక్కుంటూ తిరిగాం గాని ఎక్కడా ఆమె కనిపించనే లేదు!

నలకూబరుడు నా కత్తి తీసుకుని “ఆవిడని ఏం చేశావ్‌ చెప్పు” అని నన్ను గద్దించాడు.

రంభ కల్పించుకుని, “పోన్లే. తనే ఎక్కడికో వెళ్ళుంటుంది. మనం వెదుకుదాం పద” అంటూ అతన్ని దగ్గరగా లాక్కుని తీసుకెళ్ళింది. అతను నా కత్తిని ఎక్కడన్నా వదుల్తాడేమో తీసుకోవచ్చునని నేను కూడా జాగ్రత్తగా వాళ్ళ వెనకనే వెళ్ళా.

 

అలా వెళ్తూనే నా దూరదృష్టితో ప్రపంచం అంతా వెదికినా ఎక్కడా కూడ కనపడ లేదనుకో ఈ కలభాషిణి, ఎలా మాయమయ్యిందో గాని!

తర్వాత వాళ్ళిద్దరూ రతిక్రీడల్లోకి దిగారు. నేను దూరంగా ఉండి గమనిస్తున్నా.

 

ఇంతలో జరిగింది నా మతిపోయే సంఘటన!

అలా నే చూస్తుండగానే అక్కడికి వచ్చింది ఇంకొక రంభ!

బిత్తరపోయింది అక్కడి పరిస్థితి చూసి!

నలకూబరుడూ ఆశ్చర్యపోయాడు ఆమెని చూసి!

వాళ్ళందర్నీ చూసి నాకు కళ్ళు తిరిగాయి!

 

నలకూబరుడు వాళ్ళిద్దర్నీ ఎగాదిగా చూశాడు చాలా సేపు. కానీ, వాళ్ళలో ఏమాత్రం తేడా కనిపించలేదతనికి!

“ఏమిటీ ఇటూ అటూ చూస్తున్నావ్‌! ఏమిటి నీ ఉద్దేశ్యం?” అని గద్దించిందతని పక్కనున్న రంభ.

“ఒకరికొకరు ప్రతిబింబాల్లా ఉన్నారు మీరు! నువ్వు నా పక్కనే లేకపోతే మీలో ఎవరు ఎవరో చెప్పటం కూడా అసాధ్యంలా ఉంది” అన్నాడతను తన్లో తను మాట్టాడుకుంటున్నట్టు.

“అట్లైతే నిన్ను వదలకుండా అంటి పెట్టుకునే ఉంటాను. అదివరకో రాక్షసి సీతనీ రాముడినీ విడగొట్టటానికి వచ్చిన కథ వింటాం కదా! అలాటిదే ఇదీ! ఈ చుట్టుపక్కల లేకుండా వెళ్ళగొడదాం పట్టు. కాని నువ్వు మాత్రం కదలొద్దు” అంటూ అతన్ని కౌగిలించుకుంది.

ముక్కున వేలేసుకుని తల విదిలించి ఉసూరు మన్నది కొత్తగా వచ్చిన రంభ.

ఆమెని చూసి నలకూబరుడు “ఎవర్నువ్వు? నా ప్రేయసి రూపంలో ఎందుకున్నావ్‌ ? ఎందుకీ నిట్టూర్పులు? నువ్వు రాక్షసివా పిశాచివా చప్పున చెప్పు నీ విషయమేమిటో!” అన్నాడు.

“ఏమంటానికీ ఏముంది? దానికీ నాకూ తేడా చూపించే ఉపాయం ఆలోచిస్తున్నా. ఇదెవరో సరిగ్గా నాలానే ఉంది! చల్లటి సురపొన్న చెట్టుకింద పూల పానుపు మీద మనం ఉంటే పడమట నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడి నువ్వు పరిగెత్తావు. నేనూ నీతో వద్దామని బయల్దేరి అంతలో ఎదురుగా ఒక జింక వస్తే అపశకునం అని కాసేపు దాన్ని చూస్తూ అలాగే నిలబడ్డా. ఇంతలో ఇది నా వేషం ఎలా వేసిందో నాకర్థం కావటం లేదు” అందా రెండో రంభ ఆలోచిస్తూ.

 

“చూశావా, మన విషయం అంతా చూసినట్లే చెప్పేస్తోంది! కన్ను తెరిచుండగానే కనుపాపని దొంగతనం చేసేంత మునిముచ్చు లాగా ఉంది. దీని దగ్గర ఉండటమే మనకి మంచిది కాదు. ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్దాం పద” అంటూ తొందర చేసింది తొలి రంభ.

“ఆహా! ఇల్లలగ్గానే పండగయిందా? అతన్ని అంత తేలిగ్గా వదిలేసుకుంటాననుకున్నావా! అతన్ని వదిలి పక్కకి రా ముందు, నీ అంతు చూస్తాను” అంటూ యుద్ధానికి దిగింది రెండో రంభ.

మొదటి రంభ కూడ ఇంక ఊరుకోలేకపోయింది!

ఇద్దరూ మూతులూ తిప్పుకుంటూ మెటికలు విరుచుకుంటూ నువ్వెంతంటే నువ్వెంతని తిట్టుకున్నారు నలకూబరుడు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.

 

ఈ పోట్లాటతో తన ఆకలి తీరుతోందని ఆనందిస్తూ అక్కడికి వచ్చాడు

నారదుడు హాయిగా వీణ మీటుకుంటూ!

 

ముగ్గురూ వెళ్ళి అతనికి నమస్కరింఛారు.

నారదుడికి మహా ఉల్లాసంగా ఉంది!

ఔను మరి తన ముందు మిడిసిపడ్డ రంభకి పొగరు అణుగుతోంది!

“నలకూబరా! వదలని ప్రేమతో వర్ధిల్లండని మిమ్మల్ని దీవించాలని ఉందయ్యా! మరి వీళ్ళలో నీ ప్రేయసి ఎవరో చెప్తే ఆపని చేసేసి నా దారిన నేను పోతా. కానీ, ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందే! తనకంటే నీకింకో ప్రేయసి లేదని రంభకి గర్వంగా ఉందని నువ్వే రెండో రంభని సృష్టించావో లేకపోతే నీతో ఆనందాలు అనుభవించటానికి ఒక్క శరీరం చాలటం లేదని రంభే సృష్టించిందో గాని మొత్తానికి ఇద్దరికీ భలే పోట్లాటపెట్టావయ్యా! చాలా సేపట్నుంచి ఆకాశంలో నిలబడి చూస్తున్నాను మీ వ్యవహారం అంతా!” అన్నాడు నారదుడు చిలిపిగా.

 

“అయ్యో స్వామీ!నేనేం పోట్లాడించాను? ఎవరెవరో తెలీక సతమతమౌతూ వుంటే!” అని వాపోయాడు నలకూబరుడు.

తన పక్కనే ఉన్న రంభను చూపించి, “ఈమే ఇంతకు ముందు వరకు నాతో ఉన్నది; ఆ రెండో ఆమె తర్వాత వచ్చింది. వీళ్ళలో ఎవరు ఎవరో నాకేమీ అర్థం కావటం లేదు” అన్నాడు.

 

అప్పుడు రెండో రంభ, “మహానుభావా! మీరప్పుడు ద్వారకలో అన్న మాటల వల్లనే ఇంతా జరిగింది!” అంది నిష్టూరంగా. మొదటి రంభ కూడ, “ఔను స్వామీ! మీరప్పుడు ద్వారకలో అన్న మాటల వల్లనే ఇంతా జరిగింది!” అన్నది.

 

హాయిగా నవ్వుతూ అన్నాడు నారదుడు, “ఔను. మీరిద్దరన్నదీ నిజమే!” అని.

నలకూబరుడి ఓపిక నశిస్తోంది.

“ఇద్దరిదీ నిజమెలా ఐందో కాస్త చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది!” అనడిగాడతన్ని.

“ఏముందీ, వీళ్ళలో ఒకతె గర్వంగా మాట్లాడితే చూడలేక నీకు ముందు ముందు సవతి రావొచ్చులే అన్నాను. ఈవిధంగా అది నిజమైంది. ఇక రెండవది రంభ రూపంలో తన ప్రియుణ్ణి కలవాలనుకుని ఒక సందర్భంలో నా దగ్గర వరం తీసుకుంది. ఆమె విషయంలో ఇప్పుడా వరం నిజమైంది” అన్నాడు నారదుడు యుక్తిగా! (ఒక్క క్షణం ఆగుదాం ఇక్కడ! ఇప్పటికి ఆ ఇద్దర్లో ఒకరు రంభ, మరొకరు ???? అని తెలిసిపోయింది కదా! అనుమానం ఉంటే కథ మొదటికి వెళ్ళి చూడండి!)

 

“సరే స్వామీ! బాగానే ఉంది. ఐతే వీళ్ళలో ఎవరి విషయంలో ఏది నిజమైందో చెప్తే అప్పుడు ఎవరో నిజమో ఎవరో కాదో తెలిసి పోతుంది” అన్నాడు నలకూబరుడు ఆశగా.

అంత తేలిగ్గా దొరుకుతాడా నారదుడు!

“ఈ ప్రపంచంలో నిజమేమిటీ అబద్ధమేమిటి? ఆ మాటకొస్తే నీ రూపం నిజమైందా? అంతా మాయ. ఏమైనా అదృష్టం అంటే నీది. ఈ ఇద్దర్లో ఒకరికొకర్ని పోటీగా ఉంచి ఇద్దర్నీ నీ అదుపులో ఉంచుకోవచ్చు, ఇద్దరితోటీ హాయిగా ఉండొచ్చు!”.

 

వ్యవహారం దూరం వెళ్తున్నదని వెంటనే నారదుణ్ణి అక్కడ్నించి పంపదల్చుకున్నాడు నలకూబరుడు.

“స్వామీ! మీలాటి పెద్దల్ని ఎక్కువ సేపుంచి ఏంమాట్లాడితే ఏమొస్తుందో! ఇప్పటికే చాలా సేపు ఉంచాం మిమ్మల్ని” అనటంతో నారదుడు విలాసంగా నవ్వుకుంటూ “అలాగే, నీ జాగ్రత్తలో నువ్వుండు మరి!” అని అక్కడ్నించి నిష్క్రమించాడు.

 

అప్పుడిక నలకూబరుడు మొదటి రంభని తీసుకుని, “ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం పద” అంటూ రెండో రంభతో, “నీవన్నీ మాయలుగా కన్పిస్తున్నాయి.నిజం తేల్చగలిగే సాక్షి ఎవరన్నా ఉంటే తెచ్చుకో పో” అని తిరస్కారంగా అంటే

మొదటి రంభ కూడ “ఒక జంట ఏకాంతంగా ఉన్నప్పుడు యిట్లా వచ్చి అల్లరి చెయ్యటానికి సిగ్గు లేదూ? ఆశకైనా అంతుండాలి” అని యీసడిస్తే

కోపం వచ్చిన రెండో రంభ, “నాకేం, కుబేరుడు లేడా, ఇంద్రుడు లేడా, బ్రహ్మ లేడా, ధర్మం నిలబెట్టటానికి ఒక్కరైనా ముందుకు రారా?” అంటే

మొదటి రంభ గర్వంగా “నీ దిక్కున్న చోట చెప్పుకో పో! నీ అరిచేతికి పళ్ళొచ్చినప్పుడు కరుద్దువ్‌ లే నన్ను” అనటంతో

రోషంతో రెండో రంభ “తొందర పడకు, నీ నెత్తినే పొద్దు పొడిచిందా! చూస్తా!” అని కొద్ది అడుగులు వేసి అతని వియోగం భరించలేక ఆగి, ఆలోచించి, “నువ్విక్కడ అతన్తో కులుకుతుంటే నే వెళ్ళి వాళ్ళకీ వీళ్ళకీ ఎందుకు మొర పెట్టుకోవాలి? నువ్వూ రా దేవసభకి! వెళ్ళి అక్కడే తేల్చుకుందాం” అని మొదటి రంభ కొంగు పట్టుకుని తీవ్రంగా లాగుతుంటే,

“చూశావా దీని ఆగడం, యిది రాక్షసి కాక స్త్రీనా? అసలు దీంతో ఇంతసేపు మాట్టాడ్డం మనదే తప్పు” అని మొదటి రంభ అంటే,

“మనకేం! పెద్దల సభలోనే దాని అంతు తేలుద్దాం పద” అని నలకూబరుడు కూడా అనటంతో కొంత ఉత్సాహం పుంజుకున్న రెండో రంభ “నిన్ను వదుల్తాననుకున్నావా? కదులు, దేవసభకి రావాల్సిందే!” అని గద్దించటంతో

కొంచెం ఆలోచించి మొదటి రంభ “ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చచ్చినట్టు అప్సరసల్లో అందరికన్నా గొప్పదాన్నై ఉండి, ఊర్వశీ మేనకల్లాంటి వాళ్ళ చేత మర్యాదలు చేయించుకుంటూ ఎప్పుడూ ఎవరి చేతా వేలెత్తి చూపించుకోకుండా బతికిన నేను యిప్పుడీ సవతి పోరు తీర్చమని ఇంద్రసభకి వెళ్ళాలా? నా బతుకింత నవ్వుల పాలు కావాల్సిందేనా? ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ నేను భూమిని విడిచిపెట్టి రాను” అని ఖరాఖండిగా తీర్మానించటంతో

రెండో రంభ ఇంకా విజృంభించి, “చూశావా దీని టక్కులు? వస్తే తన మోసం బయటపడుతుందని దేవసభకి రానంటున్నది; అసలు దీనికి ఆకాశగమనం ఉన్నదో లేదో కూడా అనుమానమే! ఇంతసేపూ దీన్ని నమ్మినందుకు నిన్ననాలి” అని ఊదరగొట్టెయ్యటంతో

నలకూబరుడిక్కూడా పరిస్థితి అర్థమై మొదటి రంభని “ఓసి మాయలాడీ!” అని మెడబట్టి నెట్టటం,

రెండో రంభ “ఇంత సేపూ నన్ను మన్మథుడి కత్తికి బలిచేశావు గనక నువ్వు కత్తివేటుకే చస్తావ్‌!” అని శపించటంతో

ఆ వ్యవహారం ఓ కొలిక్కి చేరింది.

 

నలకూబరుడింకా ఆ మాయ రంభని “ఎవర్నువ్వు? నీ పేరేమిటి?” అని గద్దిస్తుంటే అసలు రంభ “దాన్నిక పోనీయ్‌! నా కోరిక సంగతి చూడు ముందు” అంటూ అతన్ని లాక్కుపోయింది”

అంటూ వాళ్ళకి మణికంధరుడి తపోవనంలో తను చూసిన వింతలూ విడ్డూరాలు చెప్తున్న మణిస్తంభుణ్ణి “ఇది వరకెప్పుడూ కనీ వినీ ఎరగని కథ చెప్తున్నావ్‌! మరి ఆ తర్వాత ఏంజరిగింది?” అనడిగింది సుముఖాసత్తి.

 

“అప్పుడే ఏమైంది? అసలు కథ ఇంకా ముందుంది!” అంటూ మళ్ళీ ప్రారంభించాడు మణిస్తంభుడు ఉత్సాహంగా!

 

“అలా రంభానలకూబరులు వెళ్ళి ఒక పూలపానుపు మీద మదనక్రీడల్లో ఆనందిస్తూ ఉండగా

ఇంకో నలకూబరుడు వచ్చాడక్కడికి, “నా రూపంలో ఎవడ్రా రంభతో ఉన్నాట్ట!” అని కేకలేస్తూ.

 

చెప్పొద్దూ, ఇదంతా చూస్తున్న నాకు ఒళ్ళు జలదరించింది.

ఒకదాని వెంట ఒకటిగా ఇలా మాయలు జరిగిపోతుంటే ఈ ప్రపంచం ఏమౌతుందో అని భయమేసింది!

 

అతనలా వచ్చేసరికి రంభ నలకూబరుడితో, “చూశావా, నీలాటి వాడొకడొస్తున్నాడు! ఇప్పటి దాకా నారూపంలో వచ్చి మనల్ని తిప్పలు పెట్టింది చాలక ఎవడో రాక్షసుడు రకరకాల మాయలు పన్నుతున్నట్టున్నాడు” అంటూండగా,

“అదేమిటి రంభా ఆ మాటలు? అసలు నలకూబరుణ్ణి నేను! వాడెవడో మాయావి. నామాట నమ్మనంటావా, చూస్తుండు ఇప్పుడే నా కత్తితో వీణ్ణి తెగనరుకుతా. ఆ తర్వాత తేల్చుకుందూ గాని నేనో వాడో” అని రెండో నలకూబరుడు గర్జించేసరికి

రంభ భయంతో తన ప్రియుడి కంఠం కౌగిలించుకుని “దేవతలారా, రక్షించండి! ఎవడో రాక్షసుడు నిరాయుధుడిగా ఉన్న నా ప్రియుణ్ణి చంపబోతున్నాడు” అని ఏడ్చి గగ్గోలు పెడుతుండగా

రెండో నలకూబరుడు నవ్వి “అరరే, నన్నే రాక్షసుణ్ణి చేశావా! భయ పడకు, నిరాయుధుణ్ణి చంపను. కావాలంటే తన కత్తి తెచ్చుకోమను. యుద్ధం అంటే ఎవరు గెలుస్తారో ఎవరు చస్తారో నిజం నలకూబరుడు చస్తే ఎలాగ అని నీకు భయమైతే మాలో ఎవరు నిజమో తెలిసే దాకా ఆగి అప్పుడే యుద్ధం చేస్తాలే. ఈ లోగా నువ్వు రహస్యాలడిగో, మాలో తేడాలు పరికించి చూసో తేల్చు… ఐతే ఒక మాట. నా ఎదురుగా నువ్వు వాణ్ణి కౌగిలించటం నేను భరించలేక పోతున్నా! కనక నాకు ఆవేశం వచ్చి వాణ్ణి చంపకుండా ఉండాలంటే నువ్వు వాడికి దూరంగా ఉండు” అంటే ఎందుకైనా మంచిదని రంభ ఇద్దరికీ మధ్య దూరంలో నిలబడి ఎంత చూసినా ఏమీ తేడా కనపడక బిత్తరపోయి చూస్తుంటే

 

రెండో నలకూబరుడన్నాడు, “ఇంద్రుడు పంపితే నువ్వు మణికంధరుడి తపస్సు చెడగొట్టటానికి వచ్చావు కదా! వాణ్ణి ఏ అడివికి తోలేశావు? మధ్యలో వీడెక్కడ తగులుకున్నాడు? దేవకార్యం చెడుతుందని నేను నీ విరహంతో చస్తూ చివరికి ఏమన్నా కానీ అని వచ్చి ఇక్కడికి దగ్గర్లోనే ఒక తోటలో నీ కోసం ఎదురుచూస్తూ ఉంటే నువ్విక్కడ వీడితో గడుపుతున్నావ్‌! ఇంతకు ముందే నారదుడు వచ్చి “నువ్విక్కడ విరహంలో మునుగుతూ కూర్చుంటే అక్కడెవడో నీలాటి వాడే రంభతో సుఖాలు అనుభవిస్తున్నాడ”ని చెప్పేదాకా తెలీలేదు. ఇప్పుడు చెప్పు వీడు ఎప్పుడు ఎక్కడ దాపరించాడు నీకు?”

అని తన సొద చెప్పుకుంటే ఏమీ తోచని రంభ

“ఏం చెప్పమంటావ్‌?” అని మొదటి నలకూబరుడి వంక చూస్తే అతను,

“ఏమిటలా చూస్తున్నావ్‌? గుర్తులేదా నీకు అదివరకు నారదుడన్నాడు కదా నీలాటిది నిన్నూ నాలాటి వాడు నన్నూ పట్టుకుని తిప్పలు పెడతారని! ఆ మాట ఇలా నిజమైంది. నీకేం భయం వద్దు. నేనిప్పుడే వెళ్ళి నా కత్తి తీసుకొచ్చి వీడి అంతు చూస్తాను” అని బయల్దేరబోతుంటే రెండో వాడు,

“అంత పోటుగాడివైతే ఇప్పుడే రా, నా కత్తి కూడా పారేస్తాను,నీ సంగతేమిటో చూస్తాను” అంటూ కత్తి పారేసి మల్ల యుద్ధానికి దిగటంతో ఇద్దరూ హోరాహోరీ బాహాబాహీ ముష్టాముష్టీ తలపడితే

 

వాళ్ళలో పచ్చ దట్టీ ఉన్నవాడు తన ప్రియుడనీ చంద్రకావి దట్టీ ఉన్నవాడు రెండో వాడనీ గుర్తు పెట్టుకుని రంభ చూస్తూండగా రకరకాల విన్యాసాల్తో ఎంతో సేపు పోరాడి ఇద్దరూ అలిసిపోయి చతికిల పడగా

రంభకి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది!

 

“మీ యుద్ధం ఆపండింక! నేనొక రహస్యవిషయం అడగబోతున్నా. దాన్ని బట్టి ఎవరు నిజమో తెలుస్తుంది” అని ఇద్దర్నీ విడివిడిగా తీసుకెళ్ళి,

“మనం కళాపూర్ణుడి విషయం ఏ సందర్భంలో మాట్లాడుకున్నాం?” అని అడిగేసరికి రెండో వాడు! టక్కుమని సమాధానం చెప్పాడు!

 

ఆమె అప్పటి దాకా నిజం నలకూబరుడు అనుకుంటున్న మొదటి వాడు తెల్లబోయి నిలబడ్డాడు!

 

“అయ్యయ్యో! ఇందాకట్నుంచి నువ్వే అసలు నలకూబరుడివనుకున్నా కదా! ఓరి మాయావీ!” అని రెండో వాడి దగ్గరికి పరిగెత్తింది రంభ కంగారుగా.

 

మహాకోపంతో వాణ్ణి అల్పాయుష్కుణ్ణి కమ్మని శపించాడు నలకూబరుడు!

 

రంభ “అసలెవరివి నువ్వు? ఎందుకీ వేషం వేశావ్‌?” అనడుగుతుంటే, “ఐన ఆలస్యం చాలకనా ఇంకా వాడితో మాటలు? పద పోదాం” అని నలకూబరుడు ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు.

 

మాయానలకూబరుడు కొంతసేపు నిట్టూరుస్తూ నిలబడి మణికంధరుడి పర్ణశాల వైపుకి వెళ్తుంటే అతను వదిలేసిన నా కత్తిని తీసుకుని ఆనందంగా ఇక్కడికి వచ్చాన్నేను! పైగా నా గురువు గారు ఈ కత్తిని నాకిస్తూ దీంతో నువ్వు ఎవర్ని చంపబోతావో వాళ్ళని ఎప్పటికైనా ఈ కత్తే చంపుతుందన్నారు. నేను దీంతో కలభాషిణ్ణి చంపాలనుకున్నా గనక అప్పటికి తప్పించుకున్నా …” అని ఆపైన అనటానికి నోర్రాక దిక్కులు చూడసాగాడు మణిస్తంభుడు.

 

“నీకు జంకేం అక్కర్లేదు. ఎలా జరగాలో అలా జరుగుతుంది లే!” అంది కలభాషిణి ధైర్యంగా.

“వివేకవంతురాలివి గనక అలా అనగలిగావ్‌! సరే గాని, మరి నీ కథేమిటో చెప్పు. నిన్ను వదిలేసి నేను పారిపోయాక ఎక్కడ వెదికినా కనపడలేదు నువ్వు! ఏమయ్యావ్‌, ఎలా మాయమయ్యావ్‌?” అనడిగాడు మణిస్తంభుడు.

 

నవ్వింది కలభాషిణి, “నా కథంతా నువ్వే చెప్పేశావ్‌! ఇంక నేను చెప్పాల్సింది ఏముంది?” అంటూ!

 

“ఆ నలకూబరుడు నన్ను చూపించమని నిన్ను లాక్కొస్తుంటే మీకు ఎదురు పడ్డ రంభ ఎవరో కాదు, నేనే!

నిన్ను విడిపించి అతన్ని తీసుకెళ్ళి అతన్తో కొంతసేపు రతిక్రీడలు సాగించా. ఇంతలో అసలు రంభ అక్కడికి రావటం, ఆమెతో పోట్లాడి చివరికి బయటపడి కత్తి వేటుతో చచ్చే శాపం తెచ్చుకోవటం అన్నీ నువ్వే చెప్పేశావ్‌!” అని చెప్పింది కలభాషిణి అందర్నీ ఆశ్చర్యంలో ముంచుతూ!

 

“అలానా! మరి రంభగా మారే శక్తి నీకెలా వచ్చింది?” అనడిగాడు మణిస్తంభుడు నమ్మలేక పోతూ!

“అది నారదుడిచ్చిన వరం. జింక ఎదురొచ్చి రంభ నలకూబరుడి వెంట వెళ్ళకుండా ఆగటంతో ఇదే సమయమనుకుని నేను ఆమె రూపంలో అతన్ని దక్కించుకున్నాను. పాపం, ఆ నారదుల వారు కూడ నా మొహం చూసి నేనెవర్నో బయటపెట్టకుండా వెళ్ళిపోయారు. … చివరికి ఎలాగూ శాపం రానే వచ్చింది గనక అదేదో ఈ దేవి దగ్గరే అనుభవిద్దామని ఇక్కడికొచ్చానిప్పుడు. మీ గురువు గారి మాట నిజం కావటానికేనేమో నువ్వూ నేనూ కూడా ఇక్కడికే చేరాం!” అన్నది కలభాషిణి తన్లో తను మాట్టాడుకుంటున్నట్టు!

 

అంతలోనే ఆమెకి మరో విషయం గుర్తొచ్చింది.

దాన్తో పాటు ఒక పెద్ద నిట్టూర్పు కూడ బయటికొచ్చింది.

“నేను పడ్డ ప్రయాసకి కనీసం నలకూబరుడన్నా దక్కాడని ఆనందిస్తుంటే, ఆ తరవాత అసలు నలకూబరుడొచ్చి నాతో ఉన్నవాణ్ణి శపించాడని చెప్తున్నావ్‌ నువ్వు! ఇంతకూ ఆ మాయలమారి మోసగాడు ఎవడో!” అని కలభాషిణి అంటూంటే

 

“అట్టె, అట్టె! ఇంకేమీ అనొద్దు!

అలా నలకూబరుడి రూపంలో ఉంది ఎవరో గాదు నేనే!” అన్నాడు మణికంధరుడు నవ్వుతూ!
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము