(Telugu) రోజుకో సూక్తి-మనకు కావాలి స్పూర్తి

[:te]1. లే! మేలుకో!! నీ ప్రతిపనిలో ఆచరణత్మకతను వీడకు

2. రసాయనాలను జోడించడం వరకే మన వంతు
సహజ పరిణామంలో వాటి రూపాన్ని అవే దిద్దుకుంటాయి.
ప్రజల మస్తిష్కాల్లో అలోచనలను చొప్పించడం వరకే మన వంతు
పర్యవసానాలు వారే సాధిస్తారు

3. వ్యక్తి విభజన లేదా శ్రమ విభజన అధారంగా ఏర్పడిన కుల వ్యవస్థ ఆదర్శనీయమైనదే.
వ్యక్తి తన ప్రతిభాపాటవాలతో ఉన్నత స్థితి సాధించడానికై ఈ వ్యవస్థ ఏర్పడింది.
కానీ, ధనిక-పేద; గొప్ప-చిన్న; ఇలాంటి అంతస్థుల తారతమ్యంతోనూ,
వంశ పారంపర్యత అనే పరిణామంతో, అసలు వ్యవస్థ బ్రష్టత చెంది నిరుపయోగస్థితికి చేరింది.
ఈ పరిస్థితిని సరిదిద్దగల ఒకే ఒక సాధనం విద్య.

4. విద్య: శీల సంపదను వృద్ధిచేసి , మనోబలాన్ని పెంపొందించి, బుద్ధిని వికసింపచేసి
స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచేదే విద్య అనబడుతుంది.

5. ఉన్నతస్థాయి, నైతిక పరిపూర్ణత కొరకు
అహర్నిషలు కృషి చేసేదే ఆదర్శ సమాజమౌతుంది.

6. గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.
నిగ్రహంతో, లక్ష్యంవైపు సాగిపోయే మనస్సు విముక్తిని సాధించి
విజయ శిఖరాలను అధిరోహింపచేస్తుంది.

7. భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మద్య అభిలషనీయమైన సమతుల్యత పొసగితే తప్ప
వ్యక్తికి శాంతి,సమాజానికి అభ్యుదయం సమకూరదు.

8. మొదట మీరు పవిత్రులు కండి,
అప్పుడు ప్రపంచం అంతా పవిత్రంగా కనబడుతుంది.

9. సత్యం,పవిత్రత,నిస్వార్థం
భూన భుంతరాల్లోని ఏ శక్తీ ఈ సుగుణాలతో జాజ్వలమానంగా ప్రకాశించేవారి నీడనైనా తాకలేదు.
విశ్వమంతా ఒక్కటై ఎదురించినా, వారు ప్రతిఘటించగలరు.

10. ఎదుగుదలను నిరొధించే ప్రతికూల పరిస్థితుల మద్య వికసించి పెంపొందడమే జీవితం.

11. ఆటపాటల్లో, వేష-భాషల్లో, సుఖ-ధుఃఖాల్లో; అన్ని దైనందిన అలవాట్లలో
నీతి తప్పని ధీరులై జీవించండి.

12. భారతీయ నాగరికత:
"క్రియాశీలతతో నీ శక్తిని నిరూపించుకో" అనే నినాదం పాశ్చాత్యులది.
నీ శ్రమ ద్వారా,క్షమాశీలత ద్వారా నీ శక్తిని ప్రసాదించు" అనేది భారతీయం.

13. "బలాన్ని స్మరించడమే
బలహీనత నుండి బయటపడే మార్గం"

14. వేయి ఓటములనైనా ఓర్చుకొని
పట్టుదల వదలకుండా ప్రయత్నించినప్పుడే
సద్గుణాలను, శీల సంపత్తిని సమకూర్చుకోగలం.

15. శౌర్యం అంటే యుద్ధం చెయ్యగలిగే శక్తి మాత్రమే కాక,
తన జంతు స్వభావాన్ని కూడా జయించడం.

16. మీలో దాగి ఉన్న మీకు తెలిసింది చాలా తక్కువ
అవధుల్లేని సముద్రంలా వ్యాపించిన అనంతమైన శక్తి, దివ్యత్వాలు మనకు ఆదర్శంగా ఉన్నాయి.

17. సత్యం అంటే నిజాల్ని మాట్లాడటమే కాక,
సర్వత్రా భగవంతున్ని చూడటం.

18. ఇసుమంత ఆచరణ, ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటలకన్నా చాలా ఉత్తమం.

19. లక్ష్యంపై ఉన్న శ్రద్ధ, లక్ష్యసాధనలొ సైతం చూపించాలి.
విజయ రహస్యమంతా ఇదే.

20. మన ప్రస్తుత కర్తవ్యం:
ఈ జాతీయ నౌక కోట్లమంది మానవుల జీవితమనే అగాధ జలరాశిని దాటిస్తున్నది.
కానీ, మనయొక్క తప్పిదాల ద్వారా నౌకకి చిల్లులు పడటం వలన అది లోపభూయిష్టమైనది.
ఆ కారణంగా నౌకను నిందించడం సమంజసమా?
మన మెదడులను మూతలుగా చేసి, రక్తం ధారపోసి ప్రాణాలను అర్పించి అయినా మన జాతీయ నావను నిర్మించుకుందాం.

21. అత్యున్నత లక్ష్యాన్ని చేపట్టండి.
దాన్ని సాధించేందుకు జీవితాన్నంతా ధారపోయండి.

22. చేతనైతే ఇతరులకు చేయూతనివ్వు,
కానిచో చేతులు కట్టుకొని ప్రగతిని పరిశీలించు.
ఇతరులకు సహయం చేయకపోయినా పర్లేదు, ఎవరినీ భాధించకు.

23. పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం.
అవే జీవితాన్ని మెరుగులుదిద్దేవి.
ఓటములే లేని జీవితం ఉంటుందా?

24. నిత్య వికాసమే జీవితం.
సంకుచిత తత్త్వమే మరణం.

25. అత్యున్నతమైన సంపద:
ఎల్లప్పుడూ ధర్మానికే అంటిపెట్టుకొని జీవించడం.

26. ప్రేమించడమే జీవితం
ద్వేషించడమే మరణం.

27. ఆత్మవికాసం ద్వారా సర్వం సాధించగలం.

28. శక్తిని వ్యర్థమైన మాటల్లో వృథాచేయక
మౌనంగా ధ్యానం చేయండి.
మనశ్శక్తిని సమీకరించి,
ఆధ్యాత్మిక శక్తిజనక యంత్రంగా అవతరించండి

29. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే.
కానీ, అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని.

30. విద్య: "నాకు ఈ విషయం తెలియదు" అని ప్రతి క్షణం తెలుకోవడమే.

31. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు;
వానిలోపల వజ్రాయుధ సమానమైన మనస్సు.
"బలం,పౌరుషం,క్షాత్రవీర్యం,బ్రహ్మతేజం"
ఇవి మనకు కావలసింది.

32. సాహసికులైన యువతీ, యువకుల్లారా!
మనకు కావలసింది మూడు విషయాలు:
ప్రేమ, నిజాయతి, సహనం.

33. మిత్రమా!
కార్యాచరణ మంచిదే.కానీ దానికి మూలం అలోచన.
కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో,
అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి.
రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు.

34. ఒక్కొక్క విజయం మన ఖాతాలో చేరుతున్నకొద్ది
సహన మాధుర్యపు రుచి స్పష్టం కావాలి.
సహనం అలవడితే భాషణం కొంత తగ్గి శ్రవణం పెరుగుతుంది.
ఇది మంచిదే.

35. మిత్రమా!
జీవితమంటే అభ్యున్నతి, విస్తరణ, ప్రేమ.
ప్రేమమయమే జీవితం.
ఇదే జీవిత పరమార్థం.

36. భేరీనాదంతో లోకమంతా చాటండి.
మీలో ఏ పాపమూ లేదు, దైన్యము లేదు.
మీరు అనంత శక్తి సంపన్నులు.
లేవండి! మేల్కొనండి!!
మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి.

37. మనకు భావిలేదనుకున్నా, ఇతరులకి మంచి చేయడమే జీవితం.

38. కాదు, నాకు చేతకాదు" అని ఎన్నడూ అనవద్ధు. మీరు అనంతులు.
మీ స్వభావం(నిజ శక్తి స్వరూపం)తొ పోలిస్తే దేశకాలాలు అన్నీ అల్పమైపోతాయి.
మీరు సర్వ శక్తి సంపన్నులు.
లే! మేలుకో!!

39. నిరుపేదల కోసం, అమాయక ప్రజల కోసం, అణగద్రొక్కబడిన వారికోసం వేదన చెందండి-పరితపించండి.
భగవంతుని పాదసన్నిధిలొ మీ అంతర్గత వ్యధను వెల్లడించండి.
తత్ఫలితంగా మీకు అజేయమైన శక్తి సామర్థ్యాలు, సహకారం సమకూరుతాయి.

40. పట్టుదలతొ చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది.
లే! మేలుకో!!

41. విశ్వాసం! విశ్వాసం!
ఆత్మవిశ్వాసం.
భగవంతునిపై విశ్వాసం!!

42. సంపద వల్ల ప్రయోజనం లేదు. పేరు, కీర్తితొ మనకు పని లేదు.
ప్రేమ అమూల్యమైనది. ప్రధానంగా నడతను నమ్ముకోండి.
అదే ధుర్భేద్యమైన కష్టాలనే గోడలను చేధించి సాధించిపెట్టగలదు.

43. సంపన్నులు, గొప్పవారు అనుకునేవారు మనకు వద్దు.
ధన గర్వం లేని యువ నాయకులు భారతదేశానికి అవసరం.
దృడ సంకల్పమే మనకు గొప్ప సంపద.
హృదయం లేని మేధావులైన పత్రికా విలేకర్లను,
వారు ప్రకటించే వ్యాసాల్ని లెక్కచేయకండి.

44. తనపై విశ్వాసం లేనివాడికి
భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల.

45. విశ్వాసం, సానుభూతి తీవ్ర స్థాయిలొ సంతరించుకొని;
జీవన్మరణాలకు కాని,ఆకలి-చలి బాధలను లక్ష్యపెట్టక;
భగవంతునిపై భారం వేసి, ఆయన నాయకత్వంలో లక్ష్యసాధనకు ఉద్యమించండి.
ఇక తిరుగుండదు.

46. ధనికుడు అంటే ధర్మగుణ ప్రపూర్ణుడే,
డబ్బున్నవాడు కాదు.

47. ఉద్యమంలొ ఒకరు వెనుదీయవచ్చు, మరొకరు సాహసించి పురోగమిస్తారు. సహయం కొరకు వేచి ఉండండి.
ఉద్యమాన్ని సాగించండి.

48. విధేయత, సంసిద్ధత, పని మీద శ్రద్ధాభక్తులు
ఈ మూడు మీలో ఉంటే , మిమ్మల్ని ఏ శక్తి అడ్దుకోలేదు.

49. పేదవాడు అంటే తనకున్న దానితొ తృప్తిపడని వాడు.
డబ్బు లేనివాడు కాదు.

50. ఐక్యలక్ష్యం, అచంచల మనస్థైర్యం
మనకు అత్యావశ్యకాలు.

51. జాలిపడదగినవాడు:
తన ఇంద్రియాలను అదుపు చేసుకోలేనివాడు.

52. అవహేళన, వ్యతిరేకత, తరువాతే ఆమోదం.
ప్రతి కార్యం ఈ మూడు దశలను దాటాలి.
లే! మేలుకో!!

53. ప్రతి ఒక్కరు తానుగా ఆజ్ఞలు ఇచ్చే ముందు,
ఇతరుల ఆజ్ఞలు పాటించడం నేర్చుకోవాలి.

54. విజయాన్ని కాంక్షించేవారి ప్రాథమిక లక్షణాలు:
I. మంచికి గల శక్తిపై సంపూర్ణ విశ్వాసం,
II. అసూయ, ద్వేషాలను విసర్జించడం,
III. మంచివారిని, మంచి చేయటానికి ప్రయత్నించే వారిని ప్రోత్సహించడం

55. పురోగమించు… యుగయుగాల సంఘర్షణ ఫలితంగానే సౌశీల్యం నిర్మితమౌతుంది.
అధైర్యపడవద్దు.

56. అసూయరహితమైన ప్రవర్తన చాలా అవసరం.
తోటి సహచరుల అభిప్రాయాలకు విలువనిచ్చి,
సామరస్య ధోరణిలో నడుచుకోవడం శ్రేయస్కరం.

57. ఉత్సాహంతో శ్రమించడం.
అలసటను ఆనందంగా అనుభవించడం.
ఇవి విజయాన్ని కాంక్షించేవారి ప్రాథమిక లక్షణాలు.

58. ఇది నా తలవ్రాత అని మూర్ఖుడు, పిరికివాడు మాత్రమే పలుకుతాడు.
బలవంతుదు నా తలవ్రాతకు, నేనే కారకుణ్ణి" అని ముందడుగు వేస్తాడు.

59. కార్యధీక్షలొ ఉన్న ప్రతి వ్యక్తీ,
ఆత్మ విశ్వాసంతో, దూరదృష్టితో;
పట్టుదల వీడక కార్యసాధనకు పూనుకోవాలి.

60. శ్రద్ధ అనే ఆదర్శాన్ని మరలా మనలో తీసుకురావాలి.
ఆత్మ విశ్వాసం, పునఃజాగృతం కావాలి.
అప్పుడు మాత్రమే మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలని క్రమంగా మనమే పరిష్కరించుకోగలం.

61. అభిప్రాయాలను అణగద్రొక్కి, స్వేచ్చాబావాలను అనుమతించకుండా;
వ్యక్తిని యంత్రంగా తయారుచేసే శిక్షణ విద్య అవుతుందా!
వ్యక్తిని స్వేచ్చగా అలోచించేలా చేసే విద్య చాలా ఉత్తమం

62. ఒక ధ్యేయంతో కృషిచేస్తే
నేడు కాకపొయినా రేపైనా విజయం వచ్చి తీరుతుంది.

63. శ్రద్ధలేనివాడు, అసత్యాన్ని పలకడానికి వెనుదీయడు.

64. ఈర్శ్య, అహంభావాలను వదిలి;
అఖండ శక్తి సామర్థ్యాలతో పనిచేస్తూ;
ఆదర్శం పట్ల నిష్టాగరిష్ఠత ఉంటే లక్ష్యసిద్ధి సాధ్యం.

65. పల్లెవాసులు రోజంతా పనిచేసి,
తీరిక సమయంలో గ్రామంలోని చెట్టుక్రిందనో లేక మరోచోటో కూర్చొని కాలక్షేపం చేస్తారు.
ఆ సమయాల్లో దృశ్యప్రదర్శనల ద్వారా, ఇతర పద్ధతుల్లో నైతిక విజ్ఞానం కలిగించాలి.

66. మానవుడు ఎంత గొప్పవాడైతే, అంత కఠినమైన పరిక్షలు దాటవలసి ఉంటుంది.

67. ఆదర్శాన్ని అంటిపెట్టుకొని ముందుకు సాగండి. చిన్న, చిన్న పొరపాట్లను పట్టించుకోకండి.
కార్య రణరంగంలో దోషాలనే దుమ్ము రేగవలసిందే.
దాన్ని భరించలేని సున్నిత మనస్కులను అస్త్ర సన్యాసం చేయనీయండి.

68. ఎవరైతే విద్యార్థి స్థాయికి దిగి, తన ఆత్మను విద్యార్థి ఆత్మతొ శృతిచేసి;
అతని దృష్టిలో తన దృష్టిని,
అతని వినికిడిలో తన వినికిడిని,
అతని మనస్సులో తన మనస్సుని చొప్పించగలరో వారే నిజమైన గురువు.

69. పరిస్థితులు మన ఆధీనంలో లేనివి.
కానీ, ప్రవర్తన మాత్రం స్వశక్తిపైనే అధారపడి ఉంటుంది.
ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు.

70. శక్తి అంతా మీలోనే ఉంది. దీనిని విశ్వసించండి.
లేచి నిలబడి, మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి.

71. కర్మయోగం:
నిష్కామ సత్కార్యాచరణ ద్వారా స్వాతంత్ర్య – మోక్ష సముపార్జనకు దోహదం చేసే నైతిక ధార్మిక వ్యవస్థ.

72. పవిత్రత లోపినచిన ఆలోచన అపవిత్రమైన కార్యంతో సమానం.
కోరికల్ని అదుపుచేస్తే ఉన్నత లక్ష్యాలను చేరవచ్చు.

73. లే మిత్రమా!
వేల అవరోధాలను అధిగమించినప్పుడే సౌశీల్య నిర్మాణం సాధ్యమౌతుంది.

74. స్థితప్రజ్ఞుడు:
ధుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు,
సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు,
రాగము, భయం, క్రొధము పొయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

75. మిత్రమా!
సమస్త శాస్త్రాలలోని జ్ఞానమంతా నీలోనే ఉంది.
అంతకన్నా వేయిరెట్లు ఎక్కువగా ఉంది.
ఆత్మవిశ్వాసం ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు ఏదైనా సాధించగలవు.
లే! మేలుకో!!

76. మూర్ఖున్ని మానవునిగానూ,
మానవున్ని దైవంగానూ మార్చేదే నిజమైన మతం.
77. మనం పొందే ఆనందం ఎంత ఎక్కువగా మనలోనుంచే కలిగితే అంత ఉత్తమం.
78. అంతరంగిక, బాహ్యప్రవృత్తుల సంయమనం ద్వారా
దైవత్వాన్ని లోపల ప్రతిష్టించడమే మనం సాధినచవలసిన అంతిమ లక్ష్యం.
79. ప్రాణాలను లక్ష్యపెట్టక, ప్రశ్నలేవీ అడగకుండా
పరులకు తోడ్పడటమే కర్మయోగసారం.
80. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల,
మనల్ని మనం బలవంతుల్ని చేసుకోవడనికే ఇక్కడికి వచ్చాం.
81. మీకంటూ కొన్ని అత్యుత్తమ భావాలను ఆదర్శం చేసుకొని, వాటినే ఆచరిస్తూ నిత్య జీవితాన్ని మలచుకుంటే
మొత్తం గ్రంథాలయేన్నే కంఠస్థం చేసిన వారికన్నా మీరు ఎక్కువ విద్యావంతులు.
82. ఏది స్వార్థపరమో అదే అవినీతి. స్వార్థరహితమైనదే నీతి.
83. అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులవ్వాలి. అప్పుడే లోకం నుండి ధుఃఖం నిష్క్రమిస్తుంది.
84. విత్తనం నేలలొ నాటబడింది. మన్ను, నీరు, గాలి దాని చుట్టూ ఉన్నాయి. ఆ విత్తనం మన్ను అవుతుందా? గాలి అవుతుందా? లేక నీరు అవుతుందా?
ఆత్మవిశ్వాసం నియమాన్ని అనుసరించి అభివృద్ధిచెందుతూ - గాలి, మన్ను, నీటిని జీర్ణం చేసుకొని;
వాటిని తన వృక్ష తత్త్వంగా మార్చుకొని, మొక్కగా పరిణమిస్తుంది.
85. నీ పిల్లలని నువ్వెలాంటి మనోభావంతో చూస్తావో, అలాంటి మనోభావాన్నే
నువ్వు ఉపకరించే వ్యక్తిపట్ల, నీ గ్రామంపట్ల, నీ దేశంపట్ల కలిగి ఉండు. ఎన్నడూ ప్రతిఫలం ఆపేక్షించకు. ఫలాపేక్ష ఉంటేనే బంధం కలుగుతుంది.
86. పేదలకై, అజ్ఞానుల జీవితాల్లో వెలుగు నింపేందుకై నిరంతరం పరితపించే హృదయం ఉన్నవాడే మహత్ముడు.
87. విత్తనం సజీవమై ఉండాలి, పొలం దున్నడానికి తయారై ఉండాలి;
ఈ రెండు నియమాలు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు విత్తనం మొక్కగా అవతరించగలదు. అలాగే దాత-గ్రహీత ఇద్దరూ అసాధారణ ప్రజ్ఞావంతులైనప్పుడే
అధ్యాత్మిక-సామాజిక పురొభివృద్ధి సుసాధ్యమౌతుంది.
88. వ్యర్థ కాలాయాపన మంచిది కాదు. అసూయ, అహంభావాలను పూర్తిగా విడిచిపెట్టండి. అప్రతిహతమైన శక్తితో కార్యరంగంలో దూకి సాహసవంతులుగా పనిచేయండి.
89. లే మిత్రమా!
అనేక వేలసార్లు వంచిపబడ్డా ఏమీ అడుగవద్దు. కృతజ్ఞతల కోసం ఎదురుచూడకు. పరులసేవయే జీవిత పరమార్థం అని గ్రహించు.
90. అజ్ఞాన పంకిలంలో దిగబడి తామే సర్వజ్ఞులమని భావిస్తూ, అంతటితో ఊరుకోక
తమ భుజాలపై ఇతరులను ఎక్కించుకోవడానికి సిద్ధపడితే
ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివాడికి దారి చూపించినట్లు అవుతుంది.
91. అనేక రంగుల అద్దాల నుండి వెలువడుతోంది ఒక్క కాంతే!
సత్యం వివిధ ధర్మాలను అనువర్తించేపట్ల, చిన్న చిన్న వ్యత్యాసాలు ఆవశ్యకాలై ఉన్నాయి. కానీ, అన్నిటి హృదయంలో ఒకే సత్యం ప్రదీప్తిస్తోంది.
92. నిజమైన గురువుని గుర్తించడం ఎలా?
సూర్యుణ్ణి చూడటానికి కొవ్వొత్తి వెలిగించనక్కర్లేదు
అలాగే మనల్ని ఉద్ధరించడానికి జగద్గురువు సాక్షాత్కరించినప్పుడు
సత్యం ప్రత్యక్షమైనదని మన ఆత్మ తక్షణమే గుర్తిస్తుంది. సత్యం స్వతహగా రూఢి అవుతుంది. అది స్వయంగా ప్రకాశించే పరంజ్యోతి. బ్రహ్మండమంతా ఇది సత్యం అని ఘోషిస్తుంది.
93. ధీరులూ, సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది.
94. అడుగు నీకది ఇవ్వబడుతుంది. వెతుకు నువ్వు దాన్ని కనుగొంటావు. తట్టు నీకోసం తెరవబడుతుంది. --బైబిల్
కానీ, వెతికేదెవరు? కావలసింది ఎవరికి??

95. దేశంలోని ప్రతి ఇంటినీ ధర్మసత్రంగా మార్చవచ్చు. నేలనంతటిని ఆసుపత్రులతో నింపవచ్చు. కాని, మనిషి నడువడి మారనంత వరకు అతడి ధుఃఖం సమసిపోదు.
96. సహనం ఉన్న వ్యక్తికి మిత్రులు ఉన్నా లేకపొయినా శత్రువులు మాత్రం ఉండరు. సహనమే సంస్కృతి.
97. సహనం అనుభవంతో వస్తుంది. సహనం బాధ్యతలతో అర్థమౌతుంది.
98. పాత వ్రాతప్రతులను చూపగానే నమ్మవద్దు. దేశీయులంతా నమ్మినా నమ్మవద్దు. ఆలోచించి చూడు. బాగా పరిశీలించిన పిదప విశ్వశ్రేయస్కరమని నీకు అనిపించిన దానిని నమ్ము. అదే లక్ష్యంగా బ్రతుకు.
99. మనం చేసే ప్రతి కార్యమూ, ప్రతి ఆలోచన మనస్సుపై ప్రభావం చూపి మనల్ని సంస్కారవంతుల్ని చేస్తాయి. ఈ సంస్కారాలు పైకి మనకి కనపడక పొయినా
అంతర్గతంగా ఉండి మనల్ని ఉద్ధరించడానికి తగినంతగా శక్తిమంతాలై ఉంటాయి.
100. ఇతరులు నీ తప్పులు ఎత్తి చూపకూడదంటే, ఇతరుల తప్పులు నీవు ఎత్తిచూపకు

101. ప్రతి ఒక్కరిలోనూ ఒకే దివ్యత్వం దాగి ఉంది. ఈ ఆశయం నుండే నీతికి మూలం ఏర్పడింది.
102. మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
103. ఒక ఉత్తమ కార్యసాధనకై భగవంతుడు మనల్ని ఎన్నుకొన్నాడని విశ్వసించి ఉత్సాహంగా ఉండండి. మనం వాటిని సాధించే తీరుతాం.
104. సుఖాలు అనేవి శాశ్వతం కావు. ధుఃఖాలు శాశ్వతం కావు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
105. లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలం, పరిపూర్ణతల గురించి భావించి మనలోని శక్తిని ప్రతి క్షణం జాగృతం చేసుకోవాలి.
106. ప్రతి మనిషిలో దివ్యత్వం దాగి ఉంది. దాన్ని వెలికితీసి తన ప్రవర్తనలో వ్యక్తపరచడం సాధ్యమే. అదే మానవ జీవిత లక్ష్యం.
107. ఇతరులకు ద్రోహం చేయకు. అఖిల విశ్వం ఒక్కటే కాబట్టి ,
నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లు ప్రతి జీవిని ప్రేమించు.
108. మరొకరికి కీడు చేయడంలో నాకు నీనే కీడు చేసుకుంటున్నాను. మరొకరిని ప్రేమించడంలో నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను.
109. మనస్సు శాంతితో, ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో ఉపయోగపడగలదు. ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుర జీవితచరిత్రలను చదివితే
వారంతా అసాధారణ స్థిరచిత్తులని గ్రహించగలరు.
110. జీవన్ముక్తి:
మాయ తొలగిపోయాక కూడా కొంత కాలం ఈ దేహం ఉంటే అలాంటి స్థితినే జీవన్ముక్తి అంటారు. ఉదా: రమణ మహర్షి

111. మనస్సు ఎంత నిర్మలమైతే దానిని నిగ్రహించడం అంత సులభమౌతుంది. మనస్సుని నిగ్రహించాలంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.
112. పరమ పూజ్యుడు, నిస్సంగుడు అని నువ్వు భావించే ఒక పవిత్ర పురుషుని లేదా ఒక మహత్ముని హృదయాన్ని ధ్యానించు. ఆ రాగరహితమైన హృదయాన్ని ధ్యానించడం వల్ల మనస్సు శాంతిని పొందుతుంది.
113. మతం అంటే జీవించడం. మతం అంటే సాధించడం. మతం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే.
114. పాపం అనేది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే:
నీవు దుర్భలుడవని లేదా ఇతరులు దుర్భలురని అనడం

115. మీరు మీ కృషితో ఏ స్థితికి చేరగలరో ఆ స్థితే మీరు. నీ పవిత్రతను రక్షించుకో, స్వార్థరహితుడు అవ్వు. అదే అన్ని మతాల సారం.
116. స్వార్థరహితుడు:
స్వర్గానికి వెళ్ళేవారిలో నేను ఆఖరివాణ్ణిగా ఉంటాను. నేను నరకానికి పోవడం వల్ల నాతోటి అనుచరులకు ప్రయోజనం సిద్ధిస్తే
నేను నరక ప్రాప్తిని ఆనందంగా ఆహ్వనిస్తాను

117. తోటి మానవుల అభివృద్ధికి దోహదం చేసేదే ధర్మం. మన పతనానికి దారితీసేదే అధర్మం.
118. నీ ధుఃఖానికై ఎవరినీ నిందించవద్దు. నీ కాళ్ళమీద నీవు నిలబడి బాధ్యతనంతా నీవే వహించు. నీవు అనుభవిస్తున్న ఈ ధుఃఖం నీ కర్మఫలం అని తెలుసుకో!
ఈ దుఃఖం నీ వలననే నివారింపబడగలదని నిరూపించు.
119. మనిషికి,మనిషికి గల తేడా విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమి కాదు. ఒక వ్యక్తిని ఉన్నతుణ్ణిగానూ లేక దుర్భలునిగానూ చేసేది ఈ విశ్వాసమే.
120. బ్రహ్మనంద, సచ్చిదానంద స్థితి:
మంటలేని ప్రజ్వలనం. అవ్యాజమైన ప్రేమ. దైన్యమునకు తావులేని స్థితి

121. భగవత్సాన్నిద్యాన్ని చేరడానికి మనం ఎంచుకొనే మార్గం, గమ్యం రెండిటిని కలిపి "యోగ" అంటారు.
122. పాపమనగా వ్యక్తి తన స్థాయిని దిగజార్చుకోవటమే. కనుక ప్రతి వ్యక్తి తన ఆత్మ స్థాయిని ఉన్నత స్థితిలోనే ఉండేలా సదా ప్రయత్నం చేయాలి.
123. అసాధ్యం అన్నది లేనే లేదు. సాధనే సమస్యకి పరిష్కారం

124. ప్రతి వ్యక్తి తనలో ఇతరులందరిని, ఇతరులలో తనని చూడగల్గినప్పుడు అతడు ఇతరులకి హని తలపెట్టడు. అందరిలో ఉన్న భగవత్స్వరూపం ఒక్కటే అన్న జ్ఞానం వ్యక్తిని మహర్షిగా మారుస్తుంది.
125. నీవు ఒకేసారి జీవిస్తావు. కానీ, నువ్వు చేయవలసింది ఇప్పుడే చేస్తే చాలు
--మథర్ థెరిసా

126. నీవు రాజభవనంలో రాజువైనా,
వీధుల్లోని భిచ్చగాడివైనా,
చదువురాని వాడివైనా, బలిష్టుడివైనా;
అందరిలోని చైతన్యం ఒక్కటే అన్న జ్ఞానంతో ప్రవర్తించు

127. మనం మార్పు చెందితే సమాజం కూడా మార్పు చెందుతుంది. సమాజం అంటే మానవ సమూహమే కదా!

128. అహం నశిస్తే తప్ప సోహం స్థితి కలుగదు.
129. సుఖం, ధుఃఖం అనే కిరీఠాన్ని ధరించి మన దగ్గరకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు, ధుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరాల్సిందే

130. ప్రభూ! నా హృదయం ఆనంద సముద్రంగా మార్చు. మనస్సు కరిగి, మౌనం వెలిగి జ్యోతిర్మయుడవై సదా నా యందు ఉండు

131. ప్రభూ!
లోకవిద్యలన్నీ అంతరించే మార్గం చూపుతున్నవి. తరించే ఆత్మ విద్యను నేర్పించు.
132. ప్రతి కర్తవ్యమూ పవిత్రమైనదే. శ్రద్ధాసక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణే పరమోత్కృష్టమైన ఈశ్వరుని ఆరాధన

133. ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్థపరులో;
వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు.
134. ఎవరైతే పాఠశాల తలుపులు తెరుస్తారో,
వారు నిజానికి జైలు తలుపులు మూసివేస్తున్నారు
--విక్టర్ హ్యూగో
135. మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం
ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే

136. విద్య అనేది వృత్తిలో ఆనందాన్ని, పనిలో పరిపూర్ణతని ఇస్తుంది. --అరిస్టాటిల్
137. ప్రతి విద్యార్థి నేర్చుకుంటాడు. కానీ, అది ఒకేరోజు మరియు ఒకే మార్గంలో మాత్రం కాదు. --జార్జ్ ఎవాన్స్
138. ప్రతి వ్యకి సొంత ఆదర్శాన్ని తీసుకొని, దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించే ఆశలేని, ఇతరుల ఆదర్శాన్ని ఆచరించటం కంటే;
తాను తీసుకున్న ఆదర్శాని సాధించే వరకూ ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం.
139. కష్టమైన పనులను సులువుగా చేసేవాడే విద్యావేత్త

140. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు

141. విద్య సమాజానికి ఆత్మలాంటిది. అది ఒక తరం నుండి మరో తరానికి ప్రవహిస్తూనే ఉంటుంది

142. విద్య ఉత్తమమైనదే. అయితే సంభాషణ తీరే మనిషిని ఉత్తమున్ని చేస్తుంది

143. కళాశాల అంటే కాలక్షేపానికి వెళ్ళే ప్రదేశం కాదు. ప్రతి క్షణం అమృతతుల్యమని భావించి నీ కర్తవ్యాన్ని తెలుసుకో!
మొదట వినయాన్ని నేర్చుకో!!

144. నేను ఎవరికి ఏమి భోధించను. కాని, వారిని ఆలోచించేలా చేస్తాను
--సోక్రటిస్

145. రేపే చనిపోతానేమో అన్నట్లు బ్రతుకు!
ఎప్పటికి బ్రతికుంటానన్నట్లు నేర్చుకో!!
--మహత్మ గాంధి
146. నీవెప్పుడైనా ఏ పనైనా చేస్తానని వాగ్దానం చేస్తే,
దానిని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి. లేదంటే ప్రజలు నీపట్ల విశ్వాసాన్ని కోల్పోతారు.
147. ప్రియ సోదరీమణుల్లారా!
రాజసంలో-గాంధారివై,
ప్రేమలో- కుంతివై,
అంకితభావంలో-ద్రౌపదియై,
ఆధ్యాత్మికతలో- గార్గివై,
దాంపత్యంలో- సీతామాతవై జీవించు.
148. మిత్రమా!
నాయకుడిని తయారుచేయగలమా?
సమర్థుడైన నాయకుడిగా వ్యవహరించడం చాలా కష్టం. అతడు దాసస్య దాసుడై- సేవకులకు సేవకుడిగా ఉండాలి. ఇసుమంతైనా స్వార్థం, అసూయ ఉండరాదు.
149. మాటలను ప్రోగుచేసేది విద్యకాదు. ప్రజ్ఞను పెంపొందిచేదే విద్య. సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యకులకు ఇచ్చే శిక్షణే విద్య.
150. ప్రతిరోజూ ఎన్నొ శరీరాలు కాలి బూడిదవుతున్నా, తమ శరీరం శాశ్వతం అనుకొంటారు. ఇదే మాయ.
151. ఒకరికేపాటి సంపద లభిస్తుందో, అంత ఆపద మరొకరికి ఆపాదిల్లి తీరుతుంది. ఇది లోక ధర్మం.
152. మీపైన ఎవరైనా రాళ్ళు విసిరితే పారిపోకండి!
వాటిని మీ ఆశయసాధన పునాదికై వాడుకొని, ఆశయం అనే కోటను నిర్మించుకోండి. --బి.వి. పట్టాభిరాం
153. ధీరాత్ములారా! ముందుకు సాగండి. మనం విజయం సాధించి తీరుతాం

154. అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల.
ఇవే సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు.
155. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ
ఈ మూడు మీలో ఉంటే, మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు.
156. మంచిని తీసుకుందాం. చెడును గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఒకవేళ చెడు ఉంటే స్వతహగా విడిచిపెడదాం.
157. పవిత్రంగా, నిస్వార్థంగా ఉండటానికి సదా ప్రయత్నించు. అన్ని మతాల సారమిదే.
158. హృదయానికి, మెదడుకి సంఘర్షణ కలిగినప్పుడు
హృదయాన్నే అనుసరించు.
159. కీర్తిపై ఆకాంక్ష ఉంటే ఏదో ఒకరోజు ఇతరులను ద్వేషించే స్థితి వస్తుంది. విశ్వజనీన ప్రేమ గలవాడు
తనను, ఇతరులనూ సమంగా ప్రేమించగలడు.
160. ఆలోచన, నేర్చుకోవడం కోసం అయి ఉండాలి. నేర్చుకోవడం, మరింత ఆలోచించేలా చేయాలి.
161. గురిపెట్టి బాణం విడవాలి. బాణం విడిచాక గురి చూసినా ప్రయోజనం లేదు.
162. ఆలోచించి మాట్లాడాలి. మాట కత్తి కంటే పదునైనది.
163. మాట్లాడేటప్పుడు వినాలి. వినిన దాన్ని గురించి ఆలోచించాలి. ఆలోచించిన దాన్నే ఆచరించాలి.
164. సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం.
165. స్నేహితుడిని ధుఃఖంలో, యోధుడిని యుద్ధంలో, భార్యని పేదరికంలో;
గొప్ప వ్యక్తిని వినయంలో పరిక్షించాలి.
166. ఎక్కడైనా ఏవైనా మంచి విషయాలు ఎదురైతే వాటిని నేర్చుకోవటం మన ఆశయం. గురువులంతా ఒక్కటే. వారంతా భగవంతుని అంశలూ, కిరణాలే.
167. ఇతరుల ఆలోచనల్లో తప్పుల్ని ఎత్తి చూపకు. దానికి బదులు, వాటిలో పరిణితి సాధించే మార్గాలను వారికి తెలియజేయి.
168. లక్ష్యం పై ఉన్న శ్రద్ధాసక్తుల్ని లక్ష్యసాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే.
169. సత్సంకల్పం, చిత్తశుద్ధి, అపారమైన ప్రేమ ఇవి ప్రపంచాన్నే జయించగలవు. ఇవే మన ఆయుధాలు.
170. ప్రేమ చాలా దివ్యమైనది, ఉన్నతమైనది. కానీ, వ్యక్తి యొక్క చాందసభావాల వలన దాని రూపమే మారిపోవచ్చు.
171. అసహనంతో ఒరిగే ప్రయోజనం ఏమి లేదు. ఓర్పు వహించండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.
172. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే. కానీ, అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని. నిన్ను నీవు జయిస్తే, విశ్వమంతా నీకు స్వాధీనమౌతుంది.
173. నీ మనస్సు నీవారియందు పెట్టుకో, అది ధర్మం. నీ మనస్సుని భగవంతునిపై పెట్టుకొని అందరిని ప్రేమించు. నిర్మలత్వం వస్తుంది.
174. సహకరించు-నిరోధించకు. సామరస్యం, శాంతి మాత్రమే. లే! మేలుకో!!
175. వేళ్ళు బురదలో ఉండి కూడ తన స్వచ్చతను కోల్పోనివిధంగా,
వ్యక్తి ప్రపంచంలో జీవిస్తూ ప్రపంచానికి సంబంధించనివాడిగా మెలగాలి. తోటి మానవులు మనపట్ల ఎలా ప్రవర్తించినా మనం ప్రేమను మాత్రమే అందించాలి.
176. నీకొరకు నీను. నా కోసం కాదు.
177. మనలో మలినం ఉంటే తప్ప,
బాహ్య ప్రపంచంలో మలినాన్ని చూడలేము

178. నరకప్రాయమైన ప్రపంచంలో కనీసం ఒక వ్యక్తికి , ఒక్కరోజైనా
శాంతిని, సంతోషాన్ని సమకూర్చగలిగితే అదే నిజమైన సేవ.
179. మనం ఏదికామో అదిగా మనల్ని భావించాలని మన శక్తిని ఖర్చుపెడతాం. కానీ, ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకున్నామో దానికోసం వినియోగించడం ఉత్తమం.
180. ఇతరులకు స్వేచ్చను ఈయకపోతే, తాను కూడా దానిని అనుభవించలేడు.
181. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్నీ సాధించలేం.
182. వృధావ్యధలకు, ప్రయాసలకు లోనై మన శక్తిని వ్యర్థం చేయకుండా,
ప్రశాంతంగా నిర్మాణాత్మకమైన కార్యం కోసం శ్రమిద్ధాం.
183. లోకం బలవంతుల్ని, శక్తిమంతుల్ని మాత్రమే ఆదరిస్తుంది.
184. మంచి భగవంతునిచే చేయబడింది. చెడు నీకై నీవు సృష్టించుకున్నావు.
185. ఏ జాతి అయినా, మానవుడైనా ఉన్నత స్థితి చేరాలంటే మూడు ధర్మ సూత్రాలు పాటించాలి:
1. మంచితనానికున్న శక్తిలో విశ్వాసం. 2. అసూయ, అనుమానం లేకుండా ఉండటం. 3. మంచి వారికి, మంచి చేయాలనుకునే వారికి చేయూతనివ్వడం.
186. తన ప్రాపంచిక విధులన్నీ ముగించాక భగవద్ధ్యానం చేద్దామనుకొనేవాడు,
అలలన్నీ ఆగిపోయాక స్నానం చేద్దామనుకొనేంత మూర్ఖుడు.
187. నిన్ను నీవు ఇతరులకు ఎంతగా అర్పిస్తావో
అంతాగా ఆనందం, శాంతి, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
188. పాపం-పుణ్యం, మంచి-చెడు, ధర్మం-అధర్మం; ఏవీ వద్దు. నిత్యం భగవంతున్ని సేవించడమే మన లక్ష్యం.
189. శరీరం, దాని బాధలు గురించి దానినే జాగ్రత్త వహించని. ఓ మనసా! నీవు మాత్రం ఆనందంలో మునిగి ఉండు

190. మనస్సు కాఠిన్యాన్ని అంగీకరించనంత వరకూ
ఎక్కడున్నా గౌరవంగా జీవించగలం.
191. అమాయకులు ముళ్ళ మొక్కల్ని తింటూ,
రక్తం మొక్కల నుండి వస్తోంది అనుకుంటారు

192. యోగాన్ని బౌతిక సంపదల కోసం, ప్రాపంచిక సుఖాల కోసం ఉపయోగించే వారు
భోగులే కానీ యోగులు కాదు.
193. జీవితం ఒక సినిమా వంటిది. తెర(ఆత్మ) ఎప్పుడూ ఉంటూనే ఉంది
కానీ, దానిమీద ఎన్ని రకాల సినిమాలు వస్తుంటాయో!?

194. నువ్వు దేహనివైతే, ప్రపంచమూ ఉంది. నువ్వు ఆత్మ అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే.
195. ఎవరికి వారే ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించుకొని,
ఇతరులతోనూ, లోకంతోనూ సంబంధం పెట్టుకోవడం వలనే ధుఃఖం కలుగుతుంది.
196. నీ సంగతిని నువ్వు చూసుకో,
ప్రపంచం సంగతి ప్రపంచానికి వదిలిపెట్టు
నీ ఆత్మను తెలుసుకో!

197. తాను కేవలం ఒక వ్యక్తిననే భావం పోయే వరకూ, బాధ పోదు.
198. నీలో నీకు శాంతి ఉంటే అంతటా శాంతి ఉంటుంది.
199. కోరనూ వద్దు, త్రోసిపుచ్చనూ వద్దు. లభించిన దానిని స్వీకరించు. దేనివల్లా బాధించపడకుండా ఉండటమే స్వాతంత్ర్యం. సహినచినంత మాత్రాన చాలదు. అసంగుడవు కావాలి.
200. ఆకాశానికి లేని నీలి రంగు వలే,
బాధ కూడా ఊహలొ తప్ప మరెక్కడా లేదు.
201. అన్ని జన్మలకి ప్రథమ కారణం అజ్ఞానం ఒక్కటే.
202. నీ ప్రశాంతతకు భంగం కలిగేలా ఇతరుల ప్రవర్తనను స్వీకరించకు.
203. బలహీనతకు విరుగుడు కేవలం బలం గురించి ఆలోచించడమే.
204. నేను అనే ఆలోచన యొక్క పుట్టుకే వ్యక్తి యొక్క జననం కూడా.. దాని మరణం అంటే వ్యక్తి మరణమే. మిగిలేది ఆత్మ ఒక్కటే.
205. ఇతరులు ఏమి చేసినా, ఏమి చేసినా సరే
నీవు మాత్రం నీ పావనత్వాన్ని, నైతికతను, భగవద్భక్తి యొక్క స్థాయిని దిగజార్చుకోకు.
206. ఇక్కడ, ఇక్కడ .. అనేది జ్ఞానం. అక్కడ, అక్కడ… అనేదే అజ్ఞానం.
207. చెట్టు నీడలో ఉన్న ఒక వ్యక్తి కావాలనే నీడ నుండి బయటకి వచ్చి,
ఎండ వేడిని అనుభవించి, విశ్వప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి వచ్చి,
సంతోషంతో హమ్మయ! ఇప్పటికైనా నీడను చేరుకున్నాను
అన్నట్టే ముక్తి కూడా.
208. మనిషిని బలహీనపరిచి భయాన్ని కలిగించేదాన్ని మాత్రమే, చెడుగా భావించి తిరస్కరించాలి.
209. ప్రపంచం ఎక్కడో ఉందని, అందులో బాధ ఉందని నీవు అనుకోవడంలోనే సమస్యంతా ఉంది. కానీ ప్రపంచమూ, బాధ నీలోనే ఉన్నాయి. లోపలిగి చూసుకో, మిగిలేది నిత్యానందమే.
210. కాంతి లేనప్పుడే సినిమాలో బొమ్మలను చూడగలవు. దీపాలు వెలిగిస్తే ఇక బొమ్మలు కనబడవు. అలాగే ఆత్మ అనే జ్యోతి వెలుగులో అన్నీ మాయమౌతాయి.
211. కలలో ఆకలితో ఉన్న తోటి మానవులకి కలలోనే అన్నం పెట్టాలి. కలని-మేల్కొని ఉన్న అవస్థలను కలపాలనుకోవడం వృథాప్రయాసే.
212. జ్ఞానోదయమై మాయ తొలగిపోయేంత వరకూ,
ఎక్కడ బాధ కనపడినా దానిని నివారించడానికి ప్రయత్నించాలి. అప్పుడైనా నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేయాలి. నేను భగవంతుని పనిముట్టుని మాత్రమే అని గ్రహించాలి.
213. ఇతరులకి ఇచ్చేదంతా తమకే ఇచ్చుకుంటున్నామని తెలిసి ఉన్న వారంతా సజ్జీవులే.
అటువంటి వారు ఇతరులకి సహయపడకుండా ఉంటారా ?

214. ప్రతిఘటన, వ్యతిరేఖత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా ?

215. వ్యక్తిత్వం శరీర సంభందమైనది అయితే, అప్పుడది నశిస్తుంది కదా?
కన్ను పోయినా, చెవిపోయినా నా వ్యక్తిత్వంలో లోపం ఉండాలి. త్రాగుబోతు త్రాగుడు మానరాదు! అలాగే దొంగ మంచివాడు కారాదు!!
కాబట్టి, వ్యక్తిత్వమనేది పరిపూర్ణతలో తప్ప మరెక్కడా లేదు.
216. అనిత్య వస్తువుల్లో మనసుంచి జీవించడమంటే, మరణం వైపు పరుగులు పెట్టడటమే.
217. బంధం ప్రశక్తి లేకుండా కర్మ చేయాలి.
218. జగత్తులొ ఒక్క జీవైనా సరే జీవించి ఉన్నంత కాలం, నేను కూడా జీవించే ఉంటాను. ఈ సత్యాన్ని జీవితంలో అనుసరిస్తే మరణభీతిని జయింపగలం.
219. మిత్రమా! ఏడుస్తున్నావేల?
నీకు జనన మరణాలు లేవు.వ్యాధి, ధుఃఖాలు లేవు. నీవు అనంతమైన ఆకాశంలాంటి వాడివి. రంగు రంగుల మబ్బులు దానిని ఆవరించి ఒక్క క్షణం మాత్రమే క్రీడించి మాయమౌతాయి. కానీ, ఆకాశమెప్పుడూ నిత్య నిర్మలమే!

220. విశ్వంతో ఒక్కటై..,
అందరితో ఏకీభావ బుద్ధితో గడిపిన కొద్ది కాలమే మనం జీవించినట్లు.
221. ఇతరుల ప్రవర్తనను వారి ఆదర్శాల ప్రకారమే విచారించాలి. మన ఆదర్శాల ప్రకారం కాదు.
222. పడవ నీటిలో ఉండవచ్చు. కానీ, పడవలో నీరు ఉండరాదు. అలా జరిగితే పడవ మునిగిపోతుంది. కాబట్టి, ఎక్కడున్నా మన వ్యక్తిత్వాన్ని కోల్పోరాదు.
223. సహృదయం నుండి భగవద్వాణి వినిపిసుంది. సంకుచితమైన బుద్ధి నుండి వెలువడేది స్వార్థమే.
224. ప్రతి పనిని అత్యంత శ్రద్ధతో చేయండి. అయితే ఆ కర్మఫలాన్ని అవసరం ఉన్నవారి ప్రయోజనానికై త్యజించండి.
225. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టుగాక. అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది.
లే! మేలుకో!!

226. ప్రేమకి-మోహనికి;
స్వేచ్చకి- తప్పించుకోవడానికి;
చలనానికి-గమనానికి;
ప్రక్కకి జారడానికి-ప్రవహించడానికి;
వీటికి గల వ్యత్యాసం ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవించాలి.
227. భక్తుని హృదయమే భగవంతుని నివాసం. అక్కడ మీరు భగవంతునితో ముఖాముఖిగా సంభాషించవచ్చు.
228. మీరు చిన్న బుడగలాంటి వారై ఉండవచ్చు. ఇంకొకరు శిఖరాగ్రమంత ఎత్తయిన కెరటమే కావచ్చు. అయినా అపరితమైన సముద్రమే ఆ రెండిటికీ ఆధారం.

229. సంసారంలొ జీవించండి. దాని వలన ఏ హాని కలుగదు. కానీ, సంసారాన్ని నీలో చేరనివ్వద్దు. ఎక్కడున్నా నీ పవిత్రతను కోల్పోవద్దు.
230. అనంతమైన ఆనందం పొందాలంటే అల్ప సుఖాలను వదిలివేయండి.
231. పాశ్చాత్య ప్రపంచంలో జీవితం పైకి నవ్వులమయంగా ఉంటుంది. కానీ, లోపలంతా విషాదం. చివరికి అది వేదనగా పరిణమిస్తుంది. భారతీయ సమాజం నిరాశ, నిస్పృహలు ఆవరించినట్లు కనిపిస్తుంది. కానీ, లోపలంతా ఉదాసీనత, ఉల్లాసాలతో నిండి ఉంటుంది.
232. మనిషి ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ప్రశాంతత కలిగి ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే మాట తిన్నగా ఉంటుంది. మానవ సంబంధాలు బలపడత్తయి.
233. ఏదో ఒక వస్తువుతో సంబంధం కలిస్తే తప్ప ఇంకో వస్తువుకి ఉనికి లేదు. కావున, మొదట నీలో భగవంతున్ని దర్శిస్తే ఇతరులలో కూడా భగవంతున్ని చూడగలవు.
234. అత్యున్నతమైన దాన్ని మాత్రమే ఎల్లప్పుడూ కోరండి. దానిలోనే శాశ్వతానందం దాగి ఉంది.
235. దారింటి వెళ్తున్నప్పుడు తెల్లని వస్త్రం పై బురద పడితే వెంటనే శుభ్రం చేసుకుంటం కదా!
అదే విధంగా సత్యాన్వేషణలో ఉన్నప్పుడు,
ఏదేని వస్తువు వల్ల కావచ్చు, వ్యక్తి వలన కావచ్చు మలినం అంటుకుంటే
వెంటనే మనస్సుని శుభ్రపరచి పవిత్రమైన మనస్సుతో యథావిధంగా సత్యానేషణ సాగించాలి.
236. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో,
వేయిసార్లు విఫలమైనా మరోసారి ప్రయత్నించండి.
237. మార్గం పదునైన కత్తి అంచులా నిశితమై ఎన్నో అవరోధాలతో నిండినదైనా , నిస్పృహ చెందకండి. లేవండి! మేల్కొనండి!!

238. నీవు నిజంగా ఇతరుల మంచిని కోరితే, స్వార్థం నీలో లవలేశమైనా లేకపోతే.,
విశ్వమంతా ఏకమై ఎదిరించినా, నీలోని దైవ శక్తి ముందు నిలువలేక నశించిపోవలసిందే.
239. ఆత్మసిద్ధికి గురువు చాలా అవసరం. గురువు నిన్ను ప్రతి పనిలోనూ, నీకు తెలియకుండానే ఉన్నత స్థితికి చేరుస్తాడు.
240. ఈ మిథ్యా ప్రపంచంలో ఇంద్రియాలకు వశమై సుఖపడతాను అనుకోవడం చాలా తప్పు. ఇప్పటివరకూ, ఎండమావులు ఎవరి దాహన్ని తీర్చలేదు.
241. బానిసలా కాకుండా యజమానిలా కార్యాలను నిర్వర్తించు. నిరంతరం కర్మ చెయ్యి.. కానీ, బానిసలా కాదు.
242. ప్రేమ శబ్ధార్థాన్ని గ్రహించడం చాలా కష్టం. స్వాతంత్ర్యం ఉంటేగానీ ప్రేమ ఎన్నడూ కలుగదు. బానిసలో నిజమైన ప్రేమ ఉండదు.
243. బానిసల విధంగా లౌకిక విషయాల కోసం కర్మ చేస్తే మనలో ప్రేమ ఉండదు. మన కర్మ నిజమైన త్యాగశీల కర్మ కాబోదు. మిత్రుల కోసం, బంధువుల కోసం మాత్రమే కాదు.,
మన కోసం మనం చేసే కర్మ కూడా దాసునిలా స్వార్థపరమైనదే.
244. ప్రేమ సంజనితమైన ప్రతి కార్యమూ ఆనందాన్ని, విశ్వశాంతిని కలిగిస్తుంది. లేవండి! మేల్కోనండి!! ప్రేమతో ముందుకెళ్ళండి.
245. చిల్లు పడిన జేబులో ఎంత డబ్బు వేసినా నిలువదు. ఆత్మశోధన వైపు అడుగులు వేయకపోతే మోక్షం లభించదు.
246. అర్జునా! క్షణామైనా నేను కర్మను విరమిస్తే సర్వ ప్రపంచం నశిస్తుంది. కర్మ చేస్తే నేను పొందే లాభం రవ్వంత కూడా లేదు. నేను ఏకేశ్వరుణ్ణి. మరి నేనెందుకు కర్మ చేయాలి?
జగత్తుని ప్రేమిస్తాను కాబట్టి. --భగవద్గీత(కర్మయోగం)
247. నిజమైన ప్రేమ మనల్ని అసంగుల్ని చేస్తుంది. ఎక్కడా సంగమున్నా, ప్రాపంచిక విషయాల పట్ల మమకారం ఉన్నా,
అది రెండు శరీరాలను సదా ఆకర్షిస్తూ.,
అవి సన్నిహితులు కాజాలనప్పుడు బాధ కల్గిస్తుంది.
248. పంచశీలములు:
1. జీవహింస చేయనని ప్రతిజ్ఞ చేయి. 2. దొంగతనం చేయనని ప్రతిజ్ఞ చేయి. 3. వ్యభిచారాం చేయనని ప్రతిజ్ఞ చేయి. 4. అసత్యం మాట్లాడనని ప్రతిజ్ఞ చేయి. 5. మత్తు పదార్థాలను తీసుకోనని ప్రతిజ్ఞ చేయి. -- గౌతమ బుద్ధుడు
249. సమ్యగ్ దృష్టి:
అసమంజసమైన భావాలతో గాక, విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం.
250. సమ్యగ్సంకల్పం:
ఉన్నతమైన, గంభీరమైన భావాలతో ఉండటం.
251. సమ్యగ్వాక్కు:
సత్యాన్ని సౌమ్యంగా, కరుణతో చెప్పడం.
252. సమ్యగ్ కర్మ:
శాంతం, శుద్ధం, ధార్మికం అయిన కర్మలను ఆచరించడం.
253. సమ్యగ్ జీవం:
జీవహింస చేయకుండా, సచ్చీలంతో జీవించడం.
254. సమ్యగ్ వ్యాయామం:
నిత్యం యమ నియమాది సాధనలను ఆచరించడం.
255. సమ్యగ్ స్మృతి:
సునితమైన పరిశీలన, తీక్షణమైన బుద్ధి కలిగి ఉండటం.
256. సమ్యగ్ సమాధి:
జీవిత లక్ష్యాలైన తాత్త్విక విషయ మననం, నిధి ధ్యాసనం కలిగి ఉండటం.
257. మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం,
ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే.
258. సత్యమని, విశ్వ శ్రేయస్కరమని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.
259. ఎంత చిన్న పనినైనా శ్రద్ధతో నిర్వర్తిస్తే , మహాద్భుత ఫలితాన్నిస్తుంది.
260. నీవెప్పుడైనా ఏ పనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే,
దానిని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి. లేదంటే ప్రజలు నీ పట్ల విశ్వాసాన్ని కోల్పోతారు.
261. నీ బాధకు ఏది కారణమైనా కూడా, ఇతరులకు మాత్రం బాధ కల్గించకు.
262. నా స్వంత సౌఖ్యం కొరకు విశ్వజనీనం అయిన ఔదర్యాన్ని నేను ఆచరించడం లేదు. ప్రాణులందరి సౌఖ్యాన్ని చేకూర్చే కోరికతో చేస్తున్నాను. -- గౌతమ బుద్ధుడు.
263. ఏ ప్రాణి విషయంలో అయినా జాలి చూపలేక ఎవడు ప్రాణులను హింసిస్తాడో, వాటికి బాధ కల్గిస్తాడో
అతడు బహిష్కరింపబడిన అస్పృశ్యుడని తెలుసుకో.
264. నీ ఆత్మశక్తిని మరల మరలా కూడబెట్టుకో,
వెలుగు వచ్చే తీరుతుంది.
265. ప్రాణాన్నైనా తెగించి తన ఏకైక సంతానాన్ని తల్లి రక్షించుకున్నట్లు,
సత్యాన్ని గుర్తించిన వ్యక్తి , జీవులపై అమిత ప్రేమను కలిగి ఉంటాడు.
266. ఇతరులకు దానం చేసేవాడు, రణరంగానికి వెళ్ళే ధర్మవీరుడే

267. క్రొధ, ద్వేష, మాత్సర్యాలను పారద్రోలే ఏకైక మార్గం
ప్రశాంత చిత్తంతొ , పరుల సేవలో గడపడమే.
268. లోకానికి బుద్ధుని మొదటి హెచ్చరిక:
జవసత్వాలు ఉడిగిపోయి, వెన్ను వంగిపోయి, కర్ర సాయంతో తిరుగుతూ, రోగ బాధ కలిగి, పండ్లు ఊడి, జుట్టు నెరసి, ముడతలు బడ్డ చర్మంతో 80 లేదా 90 సం..లు గల స్త్రీ లేదా పురుషున్ని నీవెన్నడూ చూడలేదా?
నీవు కూడా ఇలగే జీర్ణిస్తావు అని, ఈ అవస్థను నువ్వు కూడా తప్పించుకోలేవు అన్న ఆలోచన నీకెన్నడూ కలుగలేదా?

269. లోకానికి బుద్ధుని రెండవ హెచ్చరిక:
వ్యాధితో బాధపడుతూ, ప్రమాద స్థితిలో, స్వీయ మలంలో మునిగి తేలుతున్న పురుషుడు/స్త్రీ గాని కొందరిచేత ఎత్తబడి మరికొందరిచే పక్కపై పడుకోబెట్టబడటం నువ్వు ఈ లోకంలో ఎన్నడూ చూడలేదా?
నీవు కూడా వ్యాధిగ్రస్థుడవు కావచ్చని, ఈ స్థితిని తప్పించుకోలేననే ఆలోచన నీకెన్నడూ కలుగలేదా?

270. లోకానికి బుద్ధుని మూడవ హెచ్చరిక:
మరణించి రెండు/మూడు రోజులకు ఊరి, నీలి రంగుతో దుర్వాసనతో నిండిన శవాన్ని నువ్వు ఈ లోకంలో ఎన్నడూ చూడలేదా?
నువ్వు కూడా మరణిస్తావని, చావుని తప్పించుకోలేననే ఆలోచన నీకు ఎన్నడూ కలుగలేదా?

271. మరణమనేది శరీర సంబంధమైనది. మీరు ఆత్మ స్వరూపులు. ధీరులై ఉండండి. లేవండి! మేల్కొనండి!!

272. బుద్ధుని ఉపదేశాలు:
1. నీ ఉద్వేగాన్ని ఉబుకనీయకు. 2. వస్త్ర దానం వలన సౌందర్యం, అన్నదానం వలన బలం చేకూరుతాయి. 3. దయాపూరితమైన హృదయంతో, మాత్సర్యం ఏ మాత్రం లేకుండా సదా కరుణమయుడవై ఉండు.
273. ఏకంతం అంటే మనస్సుని ఇంద్రియ సుఖాల నుండి విముక్తి చేయడం.
274. లేవండి! మేల్కొనండి!!
ఉత్పన్నమైన దుష్టగుణాలను పారద్రోలండి.
275. మీ నైజాన్ని అర్థం చేసుకొని,
ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకొని, దానికే అంటిపెట్టుకొని జీవించండి. -- స్వామి వివేకానంద

276. ఇంతవరకూ నిరుద్దమై ఉన్న శుభాన్ని ఉత్పన్నమయ్యేటట్టు చేయి. లే! మేలుకో!!

277. ఓర్పుతో , పట్టుదలతో అన్వేషించు.. చివరికి సత్యాన్ని కనుగొంటావు.
278. నన్ను ద్వేషిస్తున్నారు, నమ్మడం లేదు, అపార్థం చేసుకుంటున్నారు, మోసగిస్తున్నారు
అనే భావాలను చిత్తంలో నిలుపుకొని జీవించే వ్యక్తి,
తనను నాశనం చేసే హేతు ప్రత్యయాల నుండి ఎన్నటికీ విముక్తుడు కాలేడు.
279. ప్రపంచానికి భారతదేశ కానుక:
తనకి కీడు జరిగినా, కీడుకి ప్రతిగా మేలునే చేస్తుంది. మన దేశంలో ఊపిరి పోసుకుంటున్న ఈ ఉత్తమ ఆదర్శాన్ని ఆచరణలో పెడదాం. నెమ్మదైనా, మంచితనం, సహనం, సత్ప్రవర్తనలదే అంతిమ విజయం. ఇదే నా భారతదేశం.
280. అభ్యాస శూన్యత సమాధికి మాలిన్యం;
అశుచిత్వం శరీరానికి మాలిన్యం;
సోమరితనం ఇంద్రియాలకు మాలిన్యం;
కలత చెందడం మనస్సుకి మాలిన్యం.
281. స్త్రీ వృద్ధురాలైతే నీ తల్లిగా ; యువతి అయితే నీ సోదరిగా ; పాప అయితే నీ పుత్రికగా భావించు. -- గౌతమ బుద్ధుడు

282. హత్య, దొంగతనం, వ్యభిచారం అనేవి శరీరం చేసే పాపాలు. అసత్యం, అపవాదులు, దూషణ, వ్యర్థభాషణం అనేవి నాలుక చేసే పాపాలు. లోభం, ద్వేషం, భ్రమ అనేవి చిత్తజనితమైన పాపాలు

283. పరమానందాన్ని పొందే మార్గం : సదా నిస్వార్థంగా జీవించడం.
284. భయంకర అగ్ని జ్వాలలకు వృక్షం ఆహుతి అవుతున్నప్పుడు ఆ చెట్టుపై పక్షులు ఎలా నివశిస్తాయి?
అలాగే కామ, మోహలు ఉన్న చోట సత్యం వుండదు.
285. కార్య శక్తి కంటే , కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే , ప్రేమకి ఉన్న శక్తి అనంత రెట్లు ప్రభావశీలమైనది.
286. క్రోధంలో పలికే మాట పదునైన కత్తిలాంటిది. లుబ్దత్వం- మహ కాలకూటవిషం. మోహం- భయంకర దావానలం. అజ్ఞానమే గాఢ అంధకారం.
287. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే, దానిని నియంత్రించడం అంత సులభం.
288. జయం ద్వేషాన్ని ఉత్పన్నం చేస్తుంది. పరాజితుడు బాధలో జీవిస్తాడు. జయాపజయాలను రెండిటినీ వదిలిన శాంతుడు సుఖంగా జీవిస్తాడు.
289. భగవంతుడనే గమ్యాన్ని చేరేందుకు ఈ లోకం ఒక సాధనమైతే
అదే ఆధ్యాత్మికతకు నాంది.
290. అంతా పురుష ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది. లేవండి! మేల్కోనండి!!

291. పూర్తిగా దూషింపబడే వాడు, పూర్తిగా పొగడబడే వాడు మునుపెన్నడూ జన్మించలేదు. ఇప్పుడు జన్మించి ఉండలేదు. ఇక ముందు కూడా జన్మించబోడు.
292. తండ్రిని ఋణం, మొదలగు వాటి నుండి పుత్రులు విడిపింపగలరు. కానీ, బంధాన్ని విడిపించగల శక్తి ఒక్క గురువుకే కలదు.
293. నేను శరీరం కంటే భిన్నుడను కనుక.. జన్మ, వార్థక్యం, చావు లాంటి వికారాలు నాకు లేవు. ఇంద్రియ రహితుడిని కనుక, శబ్ధరసాల వంటి ఇంద్రియ విషయాల పట్ల నాకు ఆశక్తి లేదు. --జగద్గురు ఆది శంకరాచార్య

294. నువ్వొక పనిని చేస్తున్నప్పుడు దానిని మించి వేరే దేనినీ ఆలోచించవద్దు. దాన్నే మహోన్నత ఆరాధనగా ఒనర్చు.
295. నీవెవడు? నేనెవణ్ణి? ఎక్కడి నిండి వచ్చాను? నాతల్లి ఎవరు? నా తండ్రి ఎవరు?
ఇలా చింతన చేస్తూ పోతూ అవన్నీ కల్పనలని చూచి, సంసారాన్ని స్వప్నతుల్యంగా భావించు.
296. క్షణికానందానికై కామానికి లొంగే వాడు, శరీర వ్యాధులను ఆహ్వానిస్తున్నాడు. పర్యవసానం మరణమే అయినా, పాప చింతనను మూర్ఖుడు వదలడు.
297. లే! శారీరక, మానసిక అన్ని దౌష్ట్యాలనూ ఎదుర్కో!!
ఈ ప్రతిఘటనలో సఫలత పొందగానే నీకు అనంత శాంతి లభిస్తుంది.
298. ఎంతగా నిస్వార్థులమైతే, అంతగా విజయానికి చేరువవుతాం.
299. నీలో, నాలో అన్నిటిలో ఉన్నది పరమాత్మ మాత్రమే. నువ్వు ప్రకటించే అసహనానికి, కోపానికి అర్థం లేదు. అందరిలో నిన్నే చూసుకుంటూ వైవిధ్య భావనను పరిహరించు.
300. సర్వ జీవులలో ఆత్మను చూస్తున్నాని,
అదే సమయంలో తనకి శత్రువులు ఉన్నారని భావించేవాడు, అగ్నిని శీతలంగా తలంచేవాడు.
301. నిరంతరం ఆత్మ ధ్యానంలో గల వ్యక్తికి కాలం మొదలగు వాటితో నిమిత్తం లేదు. కాలం, దేశం, దిక్కులాంటి కారణాలతో ఆత్మకు ఏ విధమైన సంబంధమూ లేదు.

302. దేని జ్ఞానం వలన ఇక జ్ఞేయ విషయం మిగలదో, దానిని బ్రహ్మమని ఎరుగు.
303. బ్రహ్మం శాశ్వతమవడం చేత దానిని పొందడానికి, అవిద్య నాశనం తప్ప వినా మార్గం లేదు.
304. దేని ఆనందం వలన ఇక వాచనీయమైన ఆనందం ఉండదో,
ఏది ప్రాప్తించుట వలన ఇక ప్రాప్యయే ఉండదో,
దానిని బ్రహ్మమని ఎరుగు.
305. లే! నీవు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రత, సత్సంకల్పం ఇవే నిజమైన శక్తి.
306. నేను బ్రహ్మాన్ని చుట్టు ఉన్న ఈ దృశ్య ప్రపంచాన్ని కాదు. అనే సత్యాన్ని కృపామయమైన గురు వాక్యాలతోనే తెలుసుకోగలము.
307. నీటియందు కరిగిన ఉప్పు కణిక కంటికి కనిపించదు. కానీ, నాలుకచే తెలియ వస్తుంది. అట్లే, హృదయాకాశాన ప్రకాశించే నిత్య సత్యమైన బ్రహ్మన్ని బాహ్యేద్రియాలు చూడలేవు.
308. మన్ను-కుండల మధ్య కార్యకారణ సంబంధం సతతం ఉనంట్లే
బ్రహ్మ-దృశ్య ప్రపంచాల మధ్య అట్టి సంబంధమే ఉంది.
309. సత్యమైన ఒక్క మాట కూడా వృధాపోదు. సత్యం నాశరహితమైనది. ధర్మం నాశరహితమైనది. పవిత్రత నాశరహితమైనది.
310. తన దేహం పట్ల అత్యంత ఆతురత కలిగి ఆత్మ సాక్షాత్కారం పొందగోరే వ్యక్తి,
మొసలిని దుంగగా భ్రమించి , దానిపై కూర్చొని నదిని దాటాలని ప్రయత్నించేంత మూర్ఖుడు.
311. ఎందెందు నా మనస్సున్నా, అందందు నీ రూపముండుగాక!
ఎందెందు నా శిరమున్నా, అందందు నీ పాదపద్మములు ఉండుగాక!!

312. మేడ మీదికి ఎక్కాలంటే మెట్లు ఎక్కి పోవాలి. పైకి ఎక్కడానికి ఆ మెట్లు సహయపడతాయి. ఆ మెట్లను చూసి అవే అడ్డంకులు అనుకుంటే మనల్ని ఎవరూ రక్షించలేరు.

313. లేవండి! మేల్కొనండి!!
ఆత్మవిశ్వాసం నిరంతరం పెంపొందించుకోండి. అధికార దాహం, అసూయ.,
ఈ రెండిటి పట్ల జాగ్రత్త వహించండి.
314. అందరికన్నా ఎక్కువ పట్టుదల ఉన్నవాడికే విజయం లభిస్తుంది.
315. తనను తాను మరిచిపోయి సహజ స్వభావంతో ముందడుగు వేసి పని చేయడమే సరైన పద్ధతి.
316. సిగ్గుతో ముడుచుకు పోయే మనుష్యులు నిజానికి లోలోపల అహంకారాన్ని కలిగి ఉంటారు.
317. ఫలితాల గురించి బెంగ పెట్టుకున్నవాడే, పని కష్టంగా ఉందని వంకలు పెడతాడు.
318. బయటి విషయాలకన్నా, మన ఆలోచనలే నిజానికి మనల్ని బంధిస్తాయి.
319. ఇతరుల తప్పుల చిట్టా విప్పడం వలన మీకేమైనా ఒరుగుతుందా?
అది మీకే హాని కల్గిస్తుంది. --శ్రీ శారదా మాత

320. అగ్గిపుల్లకి తలకాయ ఉంటుంది. కానీ, మెదడు ఉండదు. అందువల్లనే కొద్ది రాపిడికే భగ్గున మండుతుంది. మరి మనకు మెదడు ఉంది కదా! అందువల్ల మనం మండిపడరాదు.
321. నిజమైన గొప్పతనం లేవడంలో లేదు. కానీ, క్రింద పడిన ప్రతిసారి మళ్ళీ పైకి లేవడంలో ఉంది.
322. తనను సృష్టించిన భగవంతునికి తాను బిడ్డనని నమ్మి,
తనకు తాను మాత్రమే విలువకట్టగలనని నమ్మే మనిషిని బంధించడం చాలా కష్టం.
323. ఏ పనీ చేయకుండా గడిపిన జీవితం కన్నా,
పని చేస్తూ, పొరపాట్లు చెయ్యడంలో గడిపిన జీవితమే ఎంతో గౌరవించదగినది. ప్రయోజనకరమైనది.
324. మంచి పనిమంతుడు నిలకడతనం, ఉత్సాహం అనే లక్షణాలను కలిగి ఉంటాడు.
325. వ్యకిత్వం = చేతలు/మాటలు

326. శీలం=(చేతలు+మాటలు)/ఆలోచనలు

327. అగ్ని ఎన్నడూ పైకే లేస్తుంది. అలాగే బలమైన వ్యక్తిత్వం, సచ్చీలం ఉన్నవాణ్ణి
నిరుత్సాహపరచలేరు సరికదా, కనీసం అడ్డగించలేరు.
328. గడిచిపోయిన ప్రతిరోజునూ పూర్తిగా మరిచిపోండి. మీరు చెయ్యగలిగినంత మీరు చేశారు.
329. ఒక దేశంలో మనుష్యులు ఎంత గొప్పవారైతే ఆ దేశం అంత గొప్పదౌతుంది. ఒక దేశం దిగజారిపొయిందంటే కారణం ఆ సమాజం గొప్ప వ్యక్తుల్ని తయారు చేయలేకపొయిందని అర్థం.
330. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చే మార్పుల ద్వారా, మనమే పరిణితి చెందుతాం. 331. ఏ ధీరుడు త్యాగాన్నే కవచంగా చేసుకొని, జ్ఞానాన్నే ఖడ్గంగా చేసుకొని ఉన్నాడో వాడే ధీరుడు.
332. సత్యానికి, నీ దేశానికి, సమస్త మానవాళికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు.
333. క్షమించడమే తపస్సు. క్షమించలేకపొతే కనీసం మరిచిపోండి. మనకి క్షమించేటంత సాధుత్వం ఉండకపోవచ్చు. కానీ, దాన్ని మరిచిపోవచ్చు కదా?

334. కలిసి పనిచేదాం!
చేతివేళ్ళలో ఏ ఒక్కటి లెకపొయినా మరొకదానికి బలం లేదు. అన్ని వేళ్ళూ కలిస్తేనే పిడికిలి.
335. భారతదేశం నా అత్యున్నత స్వర్గసీమ. భారతదేశ అభ్యున్నతే నా అభ్యున్నతి.
336. సమరంలో వందమంది పడిపోయినా సరే, ఆశయ పతాకం లాక్కొని ముందుకు వెళ్ళు. "తాను పడిపోయినా, పతాకం ముందుకు పోవడానికి ఇంకొకరి చేతికి అందించుగాక"
పతాకం కు పతనమే లేదు. నీ ఆశయానికి తిరుగే లేదు.
337. వైకుంఠానికై వేచి ఉండటం ఎందుకు?
ఇక్కడే గావించు. ఇహంలోనే, ఇప్పుడే దివ్యజీవనాన్ని ఆరంభించి మోహాన్ని ఎందుకు మానుకోకూడదు.
338. సిం హాన్ని తెలుసుకునేది ఏనుగే కాని, ఎలుక కాదు. భగవంతున్ని తెలుసుకునేది సదా భగవంతున్ని ప్రార్థించేవాడే కాని, లౌకిక బుద్ధి కలవాడు కాదు.
339. అంగిని అదుపులో ఉంచిన వాడికే, అంగాలూ అదుపులో ఉంటాయి.
340. ఏ పని అయితే మనిషిని దివ్యత్వం వైపు నడిపిస్తుందో అదే మంచి పని. అదే మనిషి బాధ్యత,
ఏ పని అయితే మనిషిని దిగజార్చుతుందో అదే చెడ్డ పని. అది మనిషి బాధ్యత కానేరదు.
341. పరమోన్నత శీలమంటే త్యాగం

342. ఒకరికి బాధ కలిగినా కలుగకున్నా సదా ధీరంగా సత్యం పలుకు

343. ఏది ధ్యేయమో అదే ధ్యానం కావాలి. ఈ రెండిటి మధ్య సంబంధమే జీవేశ్వరుల సంబంధం.
344. కృతనిశ్చయుడి బుద్ధి పెడదారి పట్టదు. కనుక బుద్ధినెరిగి ప్రవర్తించే వాడు తనలోని శక్తినంతటినీ కేంద్రీకరించగలగాలి. అలా కేంద్రీకరించబడ్డ బుద్ధి ఒకే రీతిగా ప్రసరించి ఒక ఉత్కృష్ట కార్యసాధన దిశగా పనిచేస్తుంది.
345. పరులలో తననే చూసుకుంటూ శరీరాల్ని ఆహుతి చేసుకున్న వారే ధన్యులు.
346. బుద్ధికే నీవు శరణాగతుడు కావాలి. నీ జీవిత ప్రయాణాన్ని ఇంద్రియాల అధీనంలో కాక, నీలోని శుద్ధ తేజోమయ బుద్ధి ఆధీనంలో సాగించు.
347. బంధం లేని కర్మాచరణం ఆదిలో కొంత భారంగా తోచవచ్చు. అయినప్పటికీ నమ్మకంతో దానిని సాధించవచ్చు.
348. జీవితంలో ఒక ఆనందం నుండి మరో ఆనందంలోకి వెళ్ళలి. అంతేగాని, విసుగు నుండి ఆనందంలోకి కాదు.
349. బ్రహం కన్నా అన్యంగా వేరేది లేదు అని తెలుసుకోవడమే మోక్షం.
350. మెదడే మనిషి కానీ, మనిషి మెదడు కాదు.
351. బంధానికైనా, మోక్షానికైనా మనస్సే కారణం.
352. తృప్తి కోసం కర్మ కాదు. తృప్తితో కర్మ చేయాలి.
353. అవస్థ పడటానికే ఈ నీను అనే వ్యవస్థ. ఓ మనసా! ఈ వ్యవస్థ నుండి బయటపడు.
354. ప్రకృతిని వదిలేసి భగవంతున్ని చేరడం కాదు. ప్రకృతిలో ఉంటూ భగవంతున్ని దర్శించే స్థితికి ఎదగాలి.
355. శరీరం సుఖాన్ని చూస్తొంది. శరీరాన్ని కాలం చూస్తుంది. శరీరం సుఖాన్ని పొందుతుందో? శరీరాన్ని కాలం హరిస్తుందో??
మరి నీలోని జీవి సంగతేంటి???

356. ఒక చక్రవర్తి ఆయాగ్రామాలకు పోయి వాటిని పరిపాలించండి అని తన సేవకుల్ని నియమిస్తాడు. అదే విధంగా ప్రాణం తన సేవకులైన ఇంద్రియాలను వాటి వాటి పనులను నెరవేర్చడానికి నియమిస్తుంది. సేవకులు తమ నియమాన్ని హద్ధులు దాటితే , వారికే కాదు చక్రవర్తికి కూడా ప్రమాదమే.
357. మనస్సు అప్పుడే ఉతికిన ఒక తెల్లటి వస్త్రం లాంటిది. దానిని ఏ రంగులో ముంచితే ఆ రంగులోకి మారిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనస్సుని శుభ్రపరుచుకోవాలి.
358. అజ్ఞాన జనితాలైన స్థూల, సూక్ష్మ, కారణ దేహలు జ్ఞానాగ్ని వలన దహ్యమై
జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది.
359. మేఘాలు సూర్యున్ని కప్పివేశాయి అన్నప్పుడు అవి మన కళ్ళకు, సూర్యునికి మధ్య ఉన్నాయి. కానీ, అవి సూర్యున్ని పూర్తిగా ఆవరించలేదు. అదేవిధంగా బంధం, మోక్షం అనేవి బుద్ధికి సంబంధించినవే తప్ప ఆత్మకి సంబంధించినవి కావు.
360. కుండలో ఉన్న ఆకాశం, కుండ పగిలినప్పుడు బాహ్యంగా ఉన్న ఆకాశంలో కలిసిపోయినట్లు.,
పైపైన ఉన్న ఉపాధులు తొలగిపొయినప్పుడు, బ్రహ్మ జ్ఞాని బ్రహ్మలోనే లీనమైపోతున్నాడు.
361. వస్తువుని గుర్తించడానికి కంటికి సహయంగా కాంతి ఉంటే చాలు. అలాగే, బ్రహ్మన్ని గుర్తించడానికి జ్ఞానమనే కాంతి ఒక్కటి చాలు.
362. తన స్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మనందరసాన్ని తెంపు లేకుండా ఆస్వాదిస్తున్న వానికి
నిర్వాసనా స్థితి కన్నా ఆనందమైనది మరొక్కటి లేదు.
363. నాలో అనంతమైన ఆనందసాగరం ఉంది. మాయ అనే వాయువు ఆ సాగరంలో అలలను సృష్టిస్తున్నది. ఆ అలలే చరాచర జగత్తులన్న అనుభూతులు.
364. కలలు కను. స్వప్నమే జీవితానికి కారణం. కాబట్టి, కలతో కలను అంతం చెయ్యి.

365. చావు తప్పనప్పుడు సత్కార్యం కోసం ప్రాణత్యాగం చేయడం ఉత్తమం.
366. దేవాలయంలో దేవున్ని పూజించడం,
సమాజంలో జీవున్ని సేవించడం;
రెండూ ఆధ్యాత్మిక సాధనలే.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత