దేవుడు-ఆధునిక విజ్ఞానం

ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులు పరమాత్ముని అనంత మహిమలను
ప్రతిపాదించే దిశలో జగత్తు యొక్క అచింత్యాద్భుత సృష్ట్యాది వ్యాపారాలను
“బహు చిత్ర జగద్బహుదా కరణాత్ పర: శక్తిరనంత గుణ: పరమ:” అని నిరూపించారు.
జగత్తులోని చిత్ర విచిత్రాల జతకు వాటి కార్య-కారణ సంబంధాలను అవలోకించి నపుడు శ్రీహరి యొక్క అసాధారణ మహిమలు యథామతిగా గోచరించకుండా
వుండదన్న సూక్ష్మ విషయాన్ని తెలిపిన శ్రీ మధ్వాచార్యుల పరంపరలో వచ్చిన మంత్రాలయ నివాసియైన శ్రీ రాఘవేంద్ర తీర్థ శ్రీపాదులు తమ విరచితాలైన వేదాంత
కృతి రత్నాలలో ఈ విషయాన్ని అనేక ప్రమాణాల సహకృతితో వ్యాఖ్యానించి,
విస్తరించి తెలిపారు. అలాంటి వాక్యాల సార రూపమే ఈ సరళ లేఖనం .

ప్రపంచంలో జడ, చేతన అనే రెండు విధాలైన వస్తువులు కనబడతాయి. వాటిలక్షణాలు ఏవంటే జ్ఞానరహితం (జడం), జ్ఞాన గ్రాహకత్వం (చేతన). అంటే ‘జ్ఞానా’న్ని గ్రహించే సామర్థ్యం జడ వస్తువుల్లో ఎక్కడా కాన రాలేదు. ఐతే
మనిషి నుండి మొదలుగొని సమస్త ప్రాణుల్లో ఈ జ్ఞాన కార్యం యొక్క వ్యాపారాలు
చూడవచ్చు. కానీ ‘దేహం’ కూడా జడమే ఐనందువల్ల వాటిలో జ్ఞానాన్నిసాక్షాత్కరింప జేయగల శక్తి గలిగిన ఒక వస్తువు వుండి తీరాలన్నది ఒప్పవలసిన విషయం. అంతేకాదు, ఆ వస్తువు ‘జడ భిన్నమై వుండాలన్నదీ ఒప్పి తీరాలి.దీనినే అతీంద్రియమైన ‘జీవీ’ లేదా చేతనా అని పిలుస్తారు. పుట్టిన తక్షణం
సమస్త ప్రాణుల్లో ఆకలి, దప్పిక, భయం, సంతోషం, భోగం, సుఖదు:ఖాలు
పుట్టుకొస్తాయి. అలాగే ఈ భావాల ప్రాప్తి మరియు నివారణ విషయాల్లో పరస్పర
కార్యాలు కూడా కానవస్తాయి. ఇలాంటి వ్యాపారాలు కేవలం జడాలైన మన్ను-కుండ
మొదలైన వాటిలో కనబడదు. అందువల్ల ఆకలి, దప్పిక మొదలైనవి ‘చేతనా’ సంబంధా లనే నిర్ణయించాలి. ఇదే రీతిలో ఇంద్రియాల ద్వారా గుర్తించే బాహ్య వస్తువుల జ్ఞానం కూడా ఇంద్రియానికి కాక, దేహంలో వుండే అతీంద్రియమైన ‘చేతనా యొక్క ధర్మం. ఇది కేవలం ఊహ కాదు. అనుభవ సిద్ధమైనది కూడా.అందువలనే అదృష్టం, జీవి, అతనికి ప్రేరకుడైన, సర్వ శక్తియైన శ్రీహరి యందు నమ్మకముంచి న వారిని ‘ఆస్తికులని’ పిలుస్తారు. ఇలాంటి అతీంద్రియ పదార్థాలలో నమ్మకముంచక,కేవల ప్రత్యక్ష గోచరమైన మానవ శక్తియే సర్వ శ్రేష్టమైనదనితెలుసుకుని,
జడశక్తి యొక్క ప్రతిపాదకుల ను”నాస్తికులని”వ్యవహరిస్తారు

ఆస్తిక-నాస్తిక మతాలు ప్రాచీన కాలం నుండీ వచ్చినవే. వీటి పరస్పర ఘర్షణ కేవలం భారత దేశంలోనే కాక పశ్చిమ దేశాల్లో కూడా నడుస్తూనే వచ్చాయి. ఈనాడు ఆధునిక విజ్ఞానం (Science) పెరిగే కొద్దీ ఆస్తికత ప్రాయశ: మాయమౌతూ,
నాస్తిక వాదం కాంతి వేగంతో అన్నిచోట్లా ప్రవహించితల్లివేరు లా ధృఢంగా వేళ్ళూనుతోంది. ఆస్తికవాదానికి ముఖ్య విషయమైన భగవంతుడనేది కేవల భ్రమ మరియూ కల్పన మరియూ ఈ మూఢనమ్మకం యొక్క కుట్రతో జనసామాన్యాన్ని మోసగించి,
వారిని తమ వశంలో ఉంచుకునేందుకు కొన్ని మత ధర్మాలను అడ్డుపెట్టుకున్న కొద్ది
మంది ప్రజలు చేస్తున్న ప్రయత్నాలుగా వర్ణిస్తుంది నాస్తికవాదం. అంతేకాదు
సమాజానికి సైన్స్ ఇస్తున్న కానుకలను, వాటికి కారకులైన శాస్త్రవేత్తలనుకొనియాడుతుంది నాస్తికవాదం. ఐతే సమగ్ర శోధనా బుద్ధి కలిగిన వారికి
ఈనాటికి కూడా భారతీయ తత్త్వశాస్త్రంలోని జ్ఞాన మహత్తు, ఆధునిక సైన్స్,దాని జ్ఞానపు పరిచయం తెలిసి వస్తుంది. విచారశీలత లేని, కేవలకజడతత్త్వ వాదులైన (Pure Materialists) వారు దేవుడు లేడని చాటుతారు. దానికి వారిచ్చే కారణం ‘భూమి పైనుండే సమస్త వస్తువులు మన దేహంలోనిఇంద్రియాలకు
గోచరమయ్యేవి కనుక.’ వీరి మతం (Opinion), మానవ ఇంద్రియానికి దొరకనిపదార్థం లేదని.

ఐతే పాశ్చిమాత్య సుప్రసిద్ధ వైజ్ఞానికులు, తాత్త్వికులూ ఐన ఎడింగ్టన్,మర్ఫి, ప్లాంక్, రస్సెల్ మొదలైనవారు సైన్స్ దృక్కోణం నుండి తత్త్వశాస్త్రాన్ని (అతీంద్రియ తత్త్వాన్ని) పరిశీలించి, సైన్స్ ఎన్ని విధాల పురోగమించినా, జ్ఞానసముద్రం యొక్క ఒక్క బిందువును మాత్రమేగ్రహించ గలదని ఈ సమస్త భూమండలం యొక్క సృష్టి లోని చిత్ర విచిత్రాలను, వాటి
కార్య కారణ సంబంధాలను గమనించి చూచితే, ఇవన్నీ ఒక స్వతంత్ర్యుడైనచైతన్యశీలి కర వశమైనదని అభిప్రాయ పడ్డారు. తోడుగా అతీంద్రియా లైన దేవుడు,జీవి, అదృష్టం , ధర్మాధర్మాలు మొదలినవన్నీ మన సైన్స్ ప్రయోగశాలల్లో వుండే పదార్థాలు కావనీ ఒప్పుకున్నారు.

అలాగైతే అతీంద్రియ పదార్థాలున్నాయా? జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు
కారణమైన సర్వశక్త పరమ చేతనమనేది వున్నదా?ఉన్నదే ఐతేఅది నిత్యమూ,సత్యమూ,
స్వతంత్ర్యమూ,అచింత్యాద్భుత శక్తి స్వరూపమై వుండాలి కదా? ప్రతి ప్రాణి దేహంలోనూ నానా విధాలైన జ్ఞాన విశిష్ట కార్యాలను నిర్వహించే దేహభిన్న చేతనతారతమ్యాది స్వభావ ధర్మమేది?

పై ప్రశ్నలకు జవాబునివ్వడం జడతత్త్వ విజ్ఞానులకు ఎప్పటికీ సాధ్యం కాదు.
సైన్స్ ఎలాంటి శోధన చేసినా అంతిమ తత్త్వ నిశ్చయ జ్ఞానాన్ని నిర్ణయించలేదు. కేవలం ప్రయోగాలనే చేసి చేసి అందులోనే బంధింపబడడం వల్ల వారి సిద్ధాంతాలు మాటి మాటికీ మార్పు చెందుతూ వుంటాయి. అందువల్ల జీవ
విలక్షణుడైన భగవంతుడు, జడ భిన్నుడైన జీవి, వీరిద్దరికీ సంబంధించిన జ్ఞానాది అతీంద్రియ విషయాల్లో జడ వస్తువులకే పరిమితమైన సైన్స్, సాధికార స్వరంతో మాట్లాడడానికి సాధ్యమా? కాదు.

అందుకే సైన్స్ అతీంద్రియ విషయాల్లో అపూర్ణమే. ప్రస్తుతం, మన దేహంలో
నడిచే శ్వాసోచ్ఛ్వాస క్రమం, రక్తోత్పత్తి, రక్త ప్రసరణ, నాడీ మండలపు పనితనం, వాటి ప్రకంపనాలను, అహారాన్ని అరిగించే జీర్ణరసాలు, వాటి పనితనం, మెదడు, శరీరంలో చక్కెరశాతం, ఖనిజలవణాలు, దేహ వ్యర్థాలను బైటకు పంపే
వ్యవస్థ, శక్తిని విడుదల చేసే ఎంజైమ్స్ యొక్క విచిత్ర వ్యవహార రీతులు మరియు వాటి యొక్క నియమానుసార ఉత్పత్తి మొదలైన వాటిని సైంటిస్టులు చెప్పవచ్చు. వాటి కార్య వేగాన్ని హెచ్చు, తగ్గులు చేయగల వాటి గురించి
తెలుసుకుని వుండవచ్చు. ఐతే ఆయా వ్యవస్థలు (Systems) ఆయా నియమాలనే ఎందుకు
పాటిస్తాయి? ఆ వ్యవస్థలను మనమే తయారు చేసుకొన్నామా? అని అడిగితే ఇప్పటికీ సమాధాన మివ్వలేరు. అందువల్ల సదరు వ్యవస్థలన్నీ ఒక సర్వశక్త చేతనం యొక్క అధీనాలనే చెప్పక తప్పదు. ఒకవేళ ఈ వ్యవస్థలన్నీ పాంచభౌతికమైన శక్తి చేతిలోనిదే ఐతే నిర్జీవమైన శవంలో అవి ఎందుకు కార్యాన్ని నిర్వహించవు?
అందువల్ల ఈ దేహంలో దానికి అతిరిక్తుడైన జీవి వుండి తీరాలి. అలాంటి జీవిని
నియమించే, నియంత్రించే మహాద్భుతమైన మరొక చేతన వుండి తీరాలి. అది నిత్యమూ, శాశ్వతమైనందు వల్లే నశ్వర దేహధారియైన జీవి నుండి భిన్నుడై వుండాలి. అట్టి సర్వ సమర్థుడైన ఈశ్వరుని చేతిలో ఈ సృష్టి ఒక బొమ్మలాంటిదనేది స్పష్టమైన విషయం.

మనిషి మరణించినమరుక్షణం దేహం యొక్క సర్వ క్రియలూ నిలచిపోతాయి. చివరి
క్షణం వరకూ నానా వ్యాపారా లను నిర్వహించిన ఆ దేహం తక్షణంలో నిశ్చేష్టితమవడం దేనికి? దేహం నిర్వహించే నానా క్రియలకూ కారణమైన ‘చేతన, అక్కడ నుండి నిష్క్రమించడాన్నే కారణంగా చెప్పాలేగానీ మరొకటి చెప్పలేం. సైంటిస్టులు నిరూపించే విధంగా వివిధాలైన ప్రాకృతిక, పాంచభౌతిక శక్తుల
యొక్క సమ్యోగంతో ‘చేతన శక్తి పుట్టేటైతే ఆ శక్తి హఠాత్తు గా అదృశ్యమవడానికి కారణమేమి? ఈ విషయలో సైన్స్ నానా ఊహలతో నిరూపించబోయికారణాలను ఇచ్చినప్పటికీ వారికి చైతన్య శక్తి మూలాన్ని తెలుసుకోవడం
సులభసాధ్యం కాదు. పాంచ భౌతిక తత్త్వాలతో సర్వ ప్రాణి దేహాల నిర్మాణం అలాగే
ప్రకృతిలో కనబడే అన్ని పదార్థాల నిర్మాణం జరిగింద నడంలో ఎలాంటి సందేహం
లేదు. ఇది సత్యమైన విషయమే. కానీ పాంచభౌతిక తత్త్వాలతోనే జీవి యొక్క
ఉత్పత్తిని ఆస్తిక మతం ఒప్పుకోదు. విచిత్రమేమంటే పంచభూతాలలోని ఆకాశం ,
గాలి అతీంద్రియాలు. భూమి (మట్టి), నీరు, అగ్ని మాత్రమే ఇంద్రియాలు. వీటి మిలనంతో జీవుల దేహోత్పత్తి అయ్యేట్టైతే ఈ పంచభూతాల అంశాలను ఒక పరీక్షనాళికలో వేసి సంయోగం చేయిస్తే, పాంచ భౌతిక శరీరాన్ని సృష్టించడం
సైంటిస్టులకు సాధ్యమా? ఐతే ఇదే కార్యం మానవ గర్భంలోనే కాక ఇతర ప్రాణుల గర్భాల్లో కూడా నడుస్తున్నది. చర్మం , జుత్తు, ఎముకలు, మాంసం , రక్తం, జీర్ణరసాలు, పాలు, ఒక ఆకారానికి సీమితమైన మెదడు, గుండె, శ్వాసకోశం ,
కళ్ళు, చెవి, ప్రేవులు ఇలా అనేక అవయవాల రూపురేఖలు తల్లి గర్భంలో ఎలా ఏర్పడుతున్నాయి? ఈ కార్యం ఎప్పుడు, ఎలా ఆరంభమయింది? మాంసపు ముద్దగా భావింపబడే ఈ దేహంలో జ్ఞాన సంబంధాలైన అనేక చర్యలు ఎలా ఆరంభ మయ్యాయి?అతీంద్రియమైన ‘చేతనా (జీవి) సంబంధం ఈ దేహంలోకి ఎలా ఒదిగింది? అన్న విశ్లేషణలు సైన్సుకు అందేవి కావు.

‘From what we know abou the exceptional character of protoplasm, it seems that its origin required the concurrence of highly improbable
circumstances about the origin of life we know nothing!’

అతీంద్రియాలైన జీవుల మూలాన్ని ఏ ఇంద్రియంతోనూ చూసేందుకు మనకు సాధ్యం
కాదు. దాని గురించి మనకేమీ తెలియదు అని అంటాడు ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త “జీన్ రోస్టెడ్.”

ప్రకృతిలో కనిపించే సర్వ ఫల పుష్పాలలోని రుచి, వాసనలు ఒకదానికొకటి తాదాత్మ్యా లైనవి. భూమిలో సర్వ రసాలున్నవని సిద్ధాంతం . మామిడి, వేప, నేరేడు, కొబ్బరి, అరటి లాంటి చెట్లను ఒకే పరిసరంలో వేసినప్పటికీ
వాటివేయైన రసాలను భూమి నుండి గ్రహిస్తాయి. పుష్పించి, ఫలాలనిస్తాయి. అంతే
కాదు ఒక్కొక్క వృక్ష జాతి ఒక్కొక్క రీతిలో భూరస సేకరణను చేస్తాయి. కొన్ని
చేట్లు ఆకుల ద్వార, కొన్ని వేర్ల ద్వారా, కొన్ని కాండాల ద్వారా ఇలా అనేక వైవిధ్య భరితమైన చర్యల ద్వారా రస సేకరణ జరుగుతుంది. అలాగే అన్ని చెట్లూ ఒకే చోటులో పెంచలేం. అంటే చెట్లలోని వైవిధ్యభరిత మైన స్వభావ ధర్మాలను అవి
తమంత తాముగా నిర్మించు కోలేవు. వీటి వెనుక ఒక పరమ శక్తియుతమైన మరొకఉత్కృష్ట చేతనాన్ని ఒప్పి తీరాలి.

విశ్వంలో సూర్య, చంద్రాది గ్రహాలు, గురుత్వాకర్షణ మొదలైన శక్తులన్నీ ఒకానొక జ్ఞానపూర్వక నియమానికి బద్ధులైనట్టు ప్రవర్తించడాన్ని చూస్తూనే ఉన్నాం. విద్యుచ్ఛక్తి లాంటివి కూడా ఎప్పుడూ తమకు నియమితమైన ధర్మాలను మీరి ప్రవర్తించవు. గ్రహ, నక్షత్రాలు తమ కక్ష్యలను మార్చుకోవు. ఈ అద్భుత
నియమ పాలన ఆయా వస్తువుల స్వభావాలు మాత్రమే అని చెప్పడం పూర్ణమైన జవాబుఅవగలదా? చాలా బరువైన చెట్టుకాండాలు నీటిపై తేలుతాయి. చిన్నరాయి ముక్క కూడా నీటిలో మునిగి పోతుంది. కానీ రామప్ప దేవాలయంలోని ఇటుక నీటి పై తేలుతుంది. ఈ వస్తువుల సాంద్రతల వల్లనే ఆ క్రియలు నడుస్తాయని సైంటిస్టులు
నిరూపించవచ్చు. ఐతే ఆ వస్తువుల సాంద్రతలో ఆ భిన్నత ఎలా వచ్చింది? అన్నది
తీర్మానించడం సాధ్యం కాదు. నీటిలో తేలే చెట్టు, మునిగే రాయి మొదలైన వస్తువుల స్వభావధర్మాలతో చివరి వరకూ కూడివుండేట్టుగా ఉంచే వాటి అణురచన
వైచిత్ర్యాన్ని నియంత్రించే శక్తి మరొకటి వుండి తీరాలి. ఆ శక్తియే ఈ విశ్వానికి చేతన. స్ఫూర్తి.

కొన్ని ప్రాణులు కంటితో చూడలేవు. కొన్ని భూమిపై వుండి చూడలేవు. కొన్నిటికి పగలు, కొన్నింటికి రాత్రిపూట దృష్టి మందగిస్తుంది. కొన్ని
ప్రాణులు నీటిలోను, భూమి పైనా చూడగలవు. రెక్కలు లేకుండానే ఎగిరే జంతువులు ఉన్నాయి. కొన్నింటికి విశాల మైన రెక్కలున్నా ఎగురలేవు. కొన్ని ప్రాణులు కంటితో శబ్ద తరంగాలను గ్రహిస్తాయి. కొన్ని చెవుల ద్వారా చూస్తాయి. ఆవు మేసిన గడ్డి పాలగా రూపాంతరం చెందుతుంది. కస్తూరి మృగపు మలం, పునుగు పిల్లి చెమట సుగంధ ద్రవ్యాలౌతాయి. స్త్రీ పురుష సంయోగం వల్ల ఉత్పత్తియైన పిండం కొలదికాలంలోనే నానా అవయవాలను సంతరించు కుంటుంది. వీటన్నిటికీ కేవలం పాంచభౌతిక శక్తులే కారణాలు కావు, కాలేవు. అందువల్లే ఈ
ప్రపంచానికి అతీతమైన మరో మహాశక్తిని ఒప్పి తీరాలి.

సకల జీవులు శ్వాక్రియ వల్లనే బ్రతికి వుంటాయి. ఐతే ఊపిరి ని పీల్చే విధానంలో తేడాలు ఉండవచ్చు. దేహానికి ఆక్సిజన్ ముఖ్యం. కానీ మనిషికి అదే ఆక్సిజన్ను నేరుగా రక్తానికి ఎక్కించలేము. నీటిలో కలిపి పానీయంగా సేవించలేము.
ప్రకృతిధర్మం ప్రకారం శ్వాసక్రియ ద్వారానే తీసుకోవాలి. జడపదార్థమైన గాలి ప్రాణాన్ని నిలిపేదైతే శవంలో గాలి ఆ క్రియను నిర్వర్తించదెందుకు? అలాగని
శవానికి ఆక్సిజన్ సిలెండరును అమర్చితే అది లేవాలి కదా! లేవకపోవడానికికారణమేమి? అంటే దేహభిన్నమైన, అతీంద్రియమైన జీవి ఆ శవం లో లేదనేదే కారణమైఉండాలి. ఎందుకంటే ఈ దేహమే జీవీ యైతే శవం అన్న పదమే మన నిఘంటువుల్లో ఉండకూడదు. మానవ స్వభావం సైన్స్ యొక్క వ్యాప్తి నుండి సుదూరంగా నిలచేవిషయం.

దేహసామర్ధ్యం, ధైర్య సాహసాలు, బుద్ధి-శక్తులు మనిషి నుండి మనుషికి ఒకే
రీతిలో ఉండవు. వాటి మధ్య ఘర్షణలు ఎల్లప్పుడూ నడుస్తూనే వుంటాయి. భోగ
వస్తువులు ఉన్నప్పటికీ అన్ని చోట్లా, అన్ని కాలాల్లో అందరికీ సుఖ మెందుకు లభించదు?

మనశ్శాంతే సుఖానికిమూలం. సుఖమన్నది ఆంతరంగికమైన విషయమే గానీ బైటనుండి
వచ్చేది కాదు. సైన్స్ బాహ్య ప్రవృత్తిని పెంచుతుందే తప్ప
అంతర్ముఖత్వానికి కారణం కాలేదు. ఆమ్లజనకం, జల జనకాల గుణాలను తెలిపే
సైన్స్, మనిషికి అత్యావశ్య కాలైన శాంతిజనక,తృప్తిజనక, జ్ఞానజనకాదులను ఎప్పటికీ సృష్టించలేదు. సకల జగత్తు యొక్క వ్యాపారాలను లీలామాత్రంగా నడిపే అవ్యక్త, స్వతంత్ర్య,నిత్య,అచింత్యాద్భుత శక్తిస్వరూపమైన భగవంతుడు స్వేచ్ఛగా తన భక్తులకు మాత్రమేగోచరిస్తాడు. ఈ అనుభవం ప్రయోగశాలల్లో
దొరికేది కాదు. సైన్స్ సమీకరణాలకు బద్ధమైంది కాదు. అందువల్ల అతీంద్రియ
విషయాల్లో సైన్స్ ఎప్పటికీ అపూర్ణమే.

** ||శ్రీ కృష్ణార్పాణమస్తు|| **

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము