(Telugu) నరసింహ శతకము - శేషప్పకవి

[:te]
  *  అడవి పక్షులకెవ్వఁ డాహారమిచ్చెను - మృగజాతికెవ్వఁడు మేఁతఁ బెట్టె?
వనచరాదులకు భోజనమెవ్వడిప్పించెఁ - జెట్లకెవ్వఁడు నీళ్ళు చేది పోసె?
స్త్రీలగర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె - ఫణులకెవ్వఁడు పోసెఁ బరఁగపాలు?
మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించెఁ - బసులకెవ్వఁడొసంగెఁ బచ్చిపూరి?

జీవ కోట్లనుఁ బోషింప నీవెగాని,
వేఱెయొక దాత లేఁడయ్య వెదకిచూడ!
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అతిలోభులను భిక్ష మడుగబోవుట రోత - తన ద్రవ్య మొకరింట దాచ రోత
గుణహీనుడగువాని కొలువుఁ గొల్చుట రోత - యొరుల పంచల క్రింద నుండ రోత
భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోత - గుఱిలేని బంధులగూడ రోత
యాదాయములు లేక యప్పుఁదీయుట రోత - జారచోరుల గూడి చనుట రోత

యాదిలక్ష్మీశ! నీ బంటు నైతినయ్య!
యింక నెడబాపు జన్మం బదెన్న రోత
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే - పసుల నార్జించుట పాడి కొరకె
సతినిఁ బెండ్లాడుట సంసారసుఖముకే - సుతులఁ బోషించుట గతుల కొరకె
సైన్యమున్ గూర్చుట శత్రు భయంబుకే - సాము నేర్చుటలెల్లఁ జావు కొరకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే - ఘనముగా చదువుట కడుపు కొరకె

యితర కామంబుఁ గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకె
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని - పాటిగా సత్యముల్ బలుకనేర
సత్కార్యవిఘ్నముల్ సలుప నేర్చితిఁ గాని - యిష్టమొందగ నిర్వహింపనేర
నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితిఁ గాని - చెలువుగా ధర్మంబు సేయనేర
ధనము లీయంగ వద్దనంగ నేర్చితిఁ గాని - శీఘ్ర మిచ్చెడునట్లు చెప్పనేర

పంకజాతాక్ష! నే నతి పాతకుడను
దప్పులన్నియు క్షమియింపఁ దండ్రి వీవె
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అధిక విద్యావంతు లప్రయోజకులైరి - పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె - వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసనపరుల్ దారిద్ర్యమొందిరి - పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి - దుష్టమానవులు వర్ధిష్ణులైరి

పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తి లేదాయె! నిక నీవె చాటు మాకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అమరేంద్ర వినుత! నిన్ననుసరించినవారు - ముక్తిఁ బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను - నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాచి రక్షించు నన్ గడతేర్చు వేగమే - నీ సేవకుని జేయు నిశ్చయముగ
కాపాడినను నీకు గైంకర్యపరుడనై - చెలగి నీ పనులను జేయువాడ

ననుచుఁ బలుమారు వేడెద నబ్జనాభ!
నాకుఁ బ్రత్యక్షమగు! నిన్నె నమ్మినాను!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అమరేంద్రవినుత! నేనతి దురాత్ముడనంచుఁ - గలలోన నైనను గనులఁ బడవు
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె - దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి - నీ స్వరూపము జేసి నిలుపుకొంచు
ధూపదీపము లిచ్చి తులసితోఁ బూజించి - నిత్య నైవేద్యముల్ నేమముగను

నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలిగె నా కింతె చాలు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* అర్థివాండ్రకు నీక హాని జేయుటకంటె - తెంపుతో వసనాభిఁ దినుట మేలు
ఆడుబిడ్డల సొమ్ము లపహరించుటకంటె - బండఁ గట్టుక నూతఁ బడుట మేలు
పరుల కాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె - బడబాగ్నికీలలఁ బడుట మేలు
బ్రతుకజాలక దొంగపనులు సేయుటకంటె - కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు

జలజదళనేత్ర! నీ భక్తజనుల తోడి
జగడమాడెడు పనికంటెఁ జావు మేలు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అవనిలో గల యాత్రలన్ని చేయగవచ్చు - ముఖ్యుడై నదులందు మునగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వగవచ్చు - తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు విరిచి చెప్పగవచ్చు - శ్రేష్ఠయాగములెల్ల జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు - నైష్ఠికాచారముల్ నడపవచ్చు

చిత్త మన్యస్థలంబున జేరకుండ
నీ పదాంభోజములయందు నిలపరాదు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఆ (2)

* ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ - బలుకనేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి - ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరు లెంత దండివారైనను - నిన్నుఁ గాననివారి నే స్మరింప
మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి - చెంతఁ జేరగబోను శేషశయన!

పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుడనుజుమీ ధాత్రిలోన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని - కలుగజేసెడి కార్యకర్త వీవె
చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్ఠాధి - కార మొందించెడి ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి - పేరు రప్పించెడు పెద్ద వీవె
బలువైన వైరాగ్య భక్తి జ్ఞానము లిచ్చి - ముక్తిఁ బొందించెడు మూర్తి వీవె

అవనిలో మానవుల కన్ని యాస లిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడివాడ వీవె
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఇ (4)

* ఇభకుంభముల మీది కెగిరెడి సింగంబు - ముట్టునే కుఱుచైన మూషికమును?
నవచూతపత్రముల్ నమలెడి కోయిల - కొఱకునే జిల్లేడుకొనలు నోట?
నరవింద మకరంద మనుభవించెడి తేటి - పోవునే పల్లేరుపూల కడకు?
లలితమైన రసాలఫలము కోరెడి చిల్క - మెసవునే భ్రమను నుమ్మెత్తకాయ?

నిలను నీ కీర్తనలు బాడ నేర్చినతడు
పరుల కీర్తన బాడునే యరసిచూడ?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* ఇభరాజవరద! నిన్నెంత పిల్చినగాని - మారుపల్కవదేమి మౌనితనమొ
మునిజనార్చిత! నిన్ను మ్రొక్కి వేడినగాని - కనుల జూడవదేమి గడుసుదనమొ
చాల దైన్యమునొంది చాటుఁ జొచ్చినగాని - భాగ్య మీయవదేమి ప్రౌఢతనమొ
స్థిరముగా నీ పాదసేవఁ జేసెదనన్న - దొరకజాలవదేమి ధూర్తతనమొ

మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనుని
గష్టపెట్టిన నీకేమి కడుపునిండు?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* ఇలలోన నే జన్మ మెత్తినప్పటినుండి - బహు గడించితినయ్య పాతకములు
తెలిసి చేసితి కొన్ని, తెలియజాలక చేసి - బాధ నొందితినయ్య పద్మనాభ!
అనుభవించెడునప్పు డతి ప్రయాసంబంచు - ప్రజలు చెప్పగ చాల భయము గలిగె
నెగిరిపోవుటకునై యే యుపాయంబైన - జేసి చూతమటన్న జేతఁగాదు

సూర్యశశినేత్ర! నీ చాటుఁ జొచ్చినాడ
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న - దేహ మెప్పటికిఁ దా స్థిరతనొంద
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు - నొక్కతీరున నుండ దుర్విలోన
బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను - మూటిలో మునిగెడి మురికి కొంప
భ్రాంతితో దీని గాపాడుదమనుకొన్నఁ - గాలమృత్యువు చేతఁ గోలుపోవు

నమ్మరాదయ్య! యిది మాయనాటకంబు
జన్మమిక నొల్ల! నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఈ (0)

ఉ (1)

* ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు - మాయసంసారంబు మరగి నరుడు
సకల పాపములైన సంగ్రహించునుగాని - నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు
తుదకు కాలునియొద్ద దూత లిద్దరు వచ్చి - గుంజుకచని వారు గ్రుద్దుచుండ
హింస కోర్వగలేక యేడ్చి గంతులు వేసి - దిక్కులేదని నాల్గు దిశలు చూడ

తన్ను విడిపింప వచ్చెడి ధన్యుడెవడు?
ముందె నీ దాసుడైయున్న ముక్తి కలుగు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఊ (0)

ఋ (0)

ౠ (0)

ఎ (0)

ఏ (0)

ఐ (1)

* ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు - ద్రవ్యమిమ్మని వెంటఁ దగులలేదు
కనకమిమ్మని చాలఁ గష్టపెట్టగలేదు - పల్లకిమ్మని నోటఁ బలుకలేదు
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు - పసుల నిమ్మని బట్టుఁ బట్టలేదు

నేను గోరిన దొక్కటే నీలవర్ణ!
చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఒ (0)

ఓ (0)

ఔ (0)

అం (2)

* అంత్యకాలమునందు నాయాసమున నిన్ను - దలతునో! దలపనో! దలతు నిపుడె
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ! - దానవాంతక! కోటి భానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ! - పన్నగాధిపశాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ! - నీలమేఘశరీర! నిగమ వినుత!

యీ విధంబున నీ నామ మిష్టముగను
భజన సేయుచునుందు నా భావమందు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* అందరేమైన నిన్నడుగ వచ్చెదరంచు - క్షీరసాగరమందుఁ జేరినావు
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై - భయదసర్పము మీదఁ బండినావు
భక్తబృందము వెంటఁబడి చరించెదరంచు - నెగసిపోయెడి పక్షి నెక్కినావు
మౌనులు నీ ద్వార మాశింపకుంటకు - మంచియోధుల కావలుంచినావు

లావు గలవాడవైతి; యేలాగు నేను
నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

అః (0)

క (7)

* కమలలోచన! నన్ను గన్నతండ్రివి కాన - నిన్ను నేమరకుంటి నేను విడక
యుదరపోషణకునై యొకరి నే నాశింప - నేర, నాకన్నంబు నీవ నడపు
పెట్టలేనంటివా పిన్నపెద్దలలోనఁ - దగవు కిప్పుడు దీయఁ దలచినాను
ధనము భారంబైన దలకిరీటము లమ్ము - కుండలంబులు, పైడిగొలుసు లమ్ము

కొనకు నీ శంఖచక్రముల్ కుదువఁబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపట ముడిగి
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* కర్ణయుగ్మమున నీకథలు సోఁకినఁ జాలు - పెద్దపోగుల జోళ్ళు పెట్టినట్లు;
చేతులెత్తుచుఁ బూజసేయఁ గల్గినఁ జాలు - తోరంపు కడియాలు దొడిగినట్లు;
మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు - చెలువమైన తుఱాయి చెక్కినట్లు;
గళము నొవ్వఁగ నామస్మరణ గల్గినఁ జాలు - వింతగా గంఠీలు వేసినట్లు;

పూని నినుఁ గొల్చుటే సర్వభూషణంబు,
లితర భూషణముల నిచ్చగింపనేల?
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* కాయ మెంత భయానఁ గాపాడినంగాని - ధాత్రిలో నది చూడ దక్కబోదు
యేవేళ నే రోగ మేమరించునొ? సత్త్వ - మొందగఁజేయు మే చందమునను
యౌషధంబులు మంచి వనుభవించినగాని - కర్మ క్షీణంబైన గాని విడదు
కోటివైద్యులు గుంపుఁ గూడి వచ్చినగాని - మరణమయ్యెడు వ్యాధి మానుపలేరు

జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* కువలయశ్యామ! నీ కొలువు చేసిన నాకు - జీత మెందుకు ముట్టఁజెప్పవైతి?
మంచిమాటల చేతఁ గొంచెమీయగలేవు - కలహమౌ నికఁ జుమ్మి ఖండితముగ
నీవు సాధువు గాన నింతపర్యంతంబు - చనువుచే నిన్నాళ్ళు జరుపవలసె
నింక నే సహింప! నీ విపుడు నన్నేమైన - శిక్ష చేసినఁ జేయు సిద్ధమయితి

నేడు కరుణింపకుంటివా నిశ్చయముగ
తెగబడితిఁ జూడు నీతోడ జగడమునకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* కూటి కోసరము నే గొఱకాని జనులచేఁ - బలు గద్దరింపులు బడగవలసె!
దార సుత భ్రమఁ దగిలియుండగ గదా - దేశదేశము లెల్లఁ దిరుగవలసె!
పెనుదరిద్రత పైని బెనగియుండగ గదా - చేరి నీచుల సేవఁ జేయవలసె!
నభిమానములు మది నంటియుండగ గదా - పరులఁ జూచిన భీతిఁ బడగవలసె!

నిటుల సంసారవారిధి నీదలేక
వేయి విధముల నిన్ను నే వేడుకొంటి
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* కూర్మావతారివై కుధరంబు క్రిందను - గోర్కెతో నుండవా కొమరు మిగుల?
వారాహమూర్తివై వనభూములం జొచ్చి - శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య - కశిపుని ద్రుంచవా కాంతి మీఱ?
వామనరూపివై వసుధలో బలిచక్ర - వర్తి నణంపవా వైరముడిగి?

యిట్టి పనులెల్లఁ జేయగా నెవ్వరికిని
దగును నరసింహ! నీకిది తగును గాక!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* కోతికి జలతారు కుళ్ళాయి యేటికి? - విరజాజి పూదండ విధవ కేల?
ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల? - యద్దమేమిటికి జాత్యంధునకును?
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్? - క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
రంకుబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు? - వావి యేటికి దుష్టవర్తనునకు?

మాటనిలకడ సుంకరి మోటు కేల?
చెవిటివానికి సత్కథా శ్రవణ మేల?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఖ (0)

గ (3)

* గరుడవాహన! దివ్య కౌస్తుభాలంకార! - రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత హేమ మకుటాభరణ! చారు - మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచీ విభూషిత! - సురవరార్చిత! చంద్రసూర్య నయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత! - రాక్షసాంతక! నాగరాజశయన!

పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* గార్దభంబున కేల కస్తూరి తిలకంబు? - మర్కటంబున కేల మలయజంబు?
శార్దూలమున కేల శర్కరాపూపంబు? - సూకరంబున కేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? - గుడ్లగూబల కేల కుండలములు?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? - బకసంతతికి నేల పంజరంబు?

ద్రోహిచింతనఁ జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీ నామమంత్రమేల?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* గౌతమీస్నానానఁ గడతేరుద మటన్న - మొనసి చన్నీళ్ళలో మునగలేను
దీర్థయాత్రలచేఁ గృతార్థుడౌద మటన్న - బడలి నేమంబు లే నడపలేను
దానధర్మముల సద్గతిని జెందుదమన్న - ఘనముగా నాయొద్ద ధనము లేదు
తప మాచరించి సార్థకము నొందుదమన్న - నిమిషమైన మనస్సు నిలపలేను

కష్టముల కోర్వ నాచేతఁగాదు; నిన్ను
స్మరణఁ జేసెద నా యథాశక్తి కొలది
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఘ (0)

ఙ (0)

చ (1)

* చిత్తశుద్ధిగ నీకు సేవఁ జేసెదఁ గాని - పుడమిలో జనుల మెప్పులకుఁ గాదు
జన్మపావనతకై స్మరణ జేసెదఁ గాని - సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁ గాదు
ముక్తి కోసము నేను మ్రొక్కివేడెదఁ గాని - దండిభాగ్యము నిమిత్తంబు గాదు
నిన్నుఁ బొగడ విద్య నేర్చితినే గాని - కుక్షి నిండెడు కూటి కొరకుఁ గాదు

పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ
గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఛ (0)

జ (2)

* జందె మింపుగ వేసి సంధ్య వార్చిననేమి - బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను - విష్ణు నొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిననేమి - శంభు నొందక కాడు శైవజనుడు
కాషాయవస్త్రాలు కట్టి కప్పిననేమి - యాశ పోవక కాడు యతివరుండు

యిట్టి లౌకికవేషాలు గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి దొరకబోదు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక - కమలారి యతి కళంకమును బడసె!
సొగసైన నీ నేత్రయుగ్మముతో సరిరాక - నళినబృందము నీళ్ళ నడుమఁ జేరె!
కరిరాజవరద! నీ గళముతో సరిరాక - పెద్ద శంఖము బొబ్బ పెట్టఁదొడగె!
శ్రీపతి! నీ దివ్యరూపుతో సరిరాక - పుష్పబాణుడు నీకు పుత్రుడయ్యె!

యిందిరాదేవి నిన్ను మోహించి విడక
నీకుఁ బట్టంపు సతి యయ్యె నిశ్చయముగ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఝ (0)

ఞ (0)

ట (0)

ఠ (0)

డ (0)

ఢ (0)

ణ (0)

త (6)

* తనువులో బ్రాణముల్ దరలిపోయెడివేళ - నీ స్వరూపమును ధ్యానించునతడు
నిమిషమాత్రములోన నిన్ను జేరునుగాని - యముని చేతికిఁ జిక్కి శ్రమలఁ బడడు
పరమసంతోషాన భజనఁ జేసెడివాని - పుణ్యమేమనవచ్చు భోగిశయన!
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని - నరక మెక్కడిదయ్య నళిననేత్ర!

కమలనాభుని మహిమలు గానలేని
తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* తల్లిగర్భమునుండి ధనము తేఁడెవ్వఁడు - వెళ్ళిపోయెడి నాఁడు వెంట రాదు;
లక్షాధికారైన లవణమన్నమెగాని - మెఱుఁగు బంగారంబు మ్రింగబోడు;
విత్తమార్జన జేసి విఱ్ఱవీగుటేగాని - కూడఁబెట్టిన సొమ్ము గుడువఁబోడు;
పొందుగ మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దాన ధర్మము లేక దాఁచి దాఁచి

తుదకు దొంగల కిత్తురో, దొరలకగునొ?
తేనె జుంటీఁగలియ్యవా తెరువరులకు?
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ - మరదు లన్నలు మేనమామగారు
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైనఁ - దాను దర్లగ వెంటఁ దగిలిరారు
యముని దూతలు ప్రాణ మపహరించుకపోగ - మమతతో పోరాడి మానుపలేరు
బలగ మందరు దుఃఖపడుట మాత్రమె కాని - యించుక యాయుష్య మీయలేరు

చుట్టముల మీది భ్రమదీసి చూరఁ జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* తాపసార్చిత! నేను పాపకర్ముడ నంచు - నాకు వంకలఁ బెట్టబోకుజుమ్మి
నాటికి శిక్షలు నన్ను జేయుటకంటె - నేడు సేయుము నీవు నేస్తమనక
అతిభయంకరులైన యమదూతలకు నన్ను - నొప్పగింపకుమయ్య యురగశయన!
నీ దాసులను బట్టి నీవు దండింపంగ - వద్దువద్దన రెంత పెద్దలైన

తండ్రివై నీవు పరపీడఁ దగులఁజేయ
వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* తార్ష్యవాహన! నీవు దండిదాత వటంచుఁ - గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్థిమార్గమును నే ననుసరించితినయ్య! - లావెనుబదినాల్గు లక్షలైన
వేషముల్ వేసి నా విద్యాప్రగల్భతఁ - జూపసాగితి నీకు సుందరాంగ!
యానందమైన నే నడుగవచ్చిన దిచ్చి - వాంఛఁ దీర్చుము నీలవర్ణ! వేగ

నీకు నా విద్య హర్షంబు గాకయున్న
తేపతేపకు వేషముల్ దేనుజుమ్మి!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* తిరుపతి స్థలమందుఁ దిన్నగా నేనున్న - వేంకటేశుడు మేత వేయలేడె?
పురుషోత్తమునకుఁ బోయినఁ జాలు జ - గన్నాథు డన్నంబుఁ గడపలేడె?
శ్రీరంగమునకు నే జేరబోయిన జాలు - స్వామి గ్రాసము పెట్టి సాకలేడె?
కాంచీపురము లోనఁ గదిసి నే కొలువున్న - గరివరదుడు పొట్ట గడపలేడె?

యెందుఁ బోవక నేను నీ మందిరమున
నిలిచితిని; నీకు నామీద నెనరు లేదు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

థ (0)

ద (3)

* దనుజసంహార! చక్రధర! నీకు దండంబు - లిందిరాధిప! నీకు వందనంబు
పతితపావన! నీకు బహు నమస్కారముల్ - నీరజాతదళాక్ష! నీకు శరణు
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు - మందరధర! నీకు మంగళంబు
కంబుకంధర! శార్జ్జధర! నీకు భద్రంబు - దీనరక్షక! నీకు దిగ్విజయము

సకల వైభవములు నీకు సార్వభౌమ!
నిత్యకళ్యాణములు నగు నీకు నెపుడు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* దనుజారి! నావంటి దాసజాలము నీకు - కోటిసంఖ్య గలరు, కొదువ లేదు
బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను - మరచిపోకుము భాగ్యమహిమ చేత
దండిగా భృత్యులు తగిలి నీకుండంగ - బక్కబంటేపాటి పనికి నగును!
నీవు మెచ్చెడి పనుల్ నేను జేయగలేక - యింత వృధాజన్మ మెత్తినాను

భూజనులలోన నే నప్రయోజకుడను
గనుక నీ సత్కటాక్షంబుఁ గలుగజేయు!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* దేహమున్న వరకు మోహసాగరమందు - మునుగుచుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వర్యముల్ శాశ్వతం బనుకొని - షడ్భ్రమలను మానజాలరెవరు
సర్వకాలము మాయసంసార బద్ధులై - గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి - నిందఁజేయక తాము నిలువలేరు

మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ధ (3)

* ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు - ధన మెప్పటికి శాశ్వతంబు గాదు
దార సుతాదులు తన వెంట రాలేరు - భృత్యులు మృతిని దప్పింపలేరు
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు - బలపరాక్రమ మేమి పనికిరాదు
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు - గోచిమాత్రంబైన గొంచుబోడు

వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడివారికి పరమసుఖము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* ధరణిలోపల నేను తల్లి గర్భమునుండి - పుట్టినప్పటినుండి పుణ్యమెఱుగ
నేకాదశీవ్రతం బెన్నడుండగ లేదు - తీర్థయాత్రలకైన దిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయగలేదు - భిక్షమొక్కనికైన బెట్టలేదు
జ్ఞానవంతులకైన బూని మ్రొక్కగలేదు - యితర దానములైన నీయలేదు

నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* ధీరతఁ బరుల నిందింప నేర్చితి గాని - తిన్నగా నిను బ్రస్తుతింపనైతి
పొరుగుకామినులందు బుద్ధి నిల్పితి గాని - నిన్ను సంతతము ధ్యానింపనైతి
బొరుగుముచ్చటలైన మురిసి వింటిని గాని - యెంచి నీ కథ లాలకించనైతి
కౌతుకంబున బాతకము గడించితి గాని - హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి

నవనిలో నేను జన్మించినందు కేమి
సార్థకము కానరాదాయె స్వల్పమైన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

న (16)

* నరసింహ! నా తండ్రి! నన్నేలు! నన్నేలు! - కామితార్థము లిచ్చి కావు! కావు!
దైత్యసంహార! చాల దయయుంచు! దయయుంచు! - దీనపోషక! నీవె దిక్కు! దిక్కు!
రత్నభూషితవక్ష! రక్షించు! రక్షించు! - భువనరక్షక! నన్ను బ్రోవు! బ్రోవు!
మారకోటిసురూప! మన్నించు! మన్నించు! - పద్మలోచన! చేయి పట్టు! పట్టు!

సురవినుత! నేను నీ చాటు జొచ్చినాను
నా మొరాలించి కడతేర్చు నాగశయన!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె - సుగుణ మొక్కటిలేదు చూడఁబోవ
నన్యకాంతల మీద నాశ మానగలేను - ఒరుల క్షేమముఁ జూచి యోర్వలేను
యిటువంటి దుర్బుద్ధు లిన్ని నాకున్నవి - నేను జేసెడివన్ని నీచకృతులు
నావంటి పాపిష్టినరుని భూలోకాన - బుట్టఁజేసితివేల భోగిశయన!

అబ్జదళనేత్ర! నా తండ్రివైన ఫలము
నేరములు కాచి రక్షించు! నీవె దిక్కు!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - దురితజాలములెల్లఁ దోలవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - దండహస్తుని బంట్లఁ దరుమవచ్చు

భళిర! నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠపదవి సాధింపవచ్చు
భూషణ వికాస! శ్రి ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నరసింహ! నీవంటి దొరను సంపాదించి - కుమతిమానవుల నే గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను - బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనము గాదిది నీకుఁ గరుణను బోషింపఁ - గష్ట మెంతటి స్వల్పకార్యమయ్య?
పెట్టజాలక యేల భిక్ష మెత్తించెదు - నన్ను బీదను జేసినా వదేమి?

విమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగ
కన్నులకుఁ బండువై నీకుఁ గానబడునె?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* నరసింహ! నే నిన్ను నమ్మినందుకు చాల - నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టె - నింకనైన గటాక్ష మియ్యవయ్య!
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు - భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠనగరమందే యుంచు - నరకమందే యుంచు నళిననాభ!

యెచట నన్నుంచినంగాని యెపుడు నిన్ను
మరచిపోకుండ నామసంస్మరణ నొసగు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నవసరోజదళాక్ష! నన్ను బోషించెడి - దాతవు నీవంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకు తండ్రి! - మేలు నా కొనరింపు నీలదేహ!
భళిభళి! నీయంత ప్రభువు నెక్కడ జూడఁ - బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందు చేసిన పాపమును నశింపగజేసి - నిర్వహింపుము నన్ను నేర్పుతోడ

పరమ సంతోషమాయె నా ప్రాణములకు
నీ రుణముఁ దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నా తండ్రి! నా దాత! నా యిష్టదైవమా! - నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీదఁ దప్పులన్ని క్షమించి - నిగమగోచర! నాకు నీవె దిక్కు
నే దురాత్ముడనంచు నీ మనంబున గోప - గింపబోకుము స్వామి! కేవలముగ
ముక్తిదాయక! నీకు మ్రొక్కినందుకు నన్ను - గరుణించి రక్షించు కమలనాభ!

దండి దొరవంచు నీవెంటఁ దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* నాగేంద్రశయన! నీ నామ మాధుర్యంబు - మూడుకన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల - భారతీపతియైన బ్రహ్మ కెరుక
మధుకైటభారి! నీ మాయాసమర్థత - వసుధలో బలిచక్రవర్తి కెరుక
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు - దశశతాక్షుల పురందరున కెరుక

వీరి కెరుకగు నీ కథల్ వింతలెల్ల
నరుల కెరుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు - లెస్సగా పూజింపలేను సుమ్మి
నాకుఁ దోచిన భూషణములు బెట్టెదనన్న - గౌస్తుభమణి నీకు కలదు ముందె
భక్ష్యభోజ్యముల నర్పణము జేసెదనన్న - నీవు పెట్టితి సుధ నిర్జరులకు
కలిమి కొద్దిగగాను కల నొసంగెదనన్న - భార్గవీదేవి నీ భార్య యయ్యె

నన్ని గలవాడ వఖిలలోకాధిపతివి
నీకు భూషాదులను బెట్ట నెంతవాడ?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన - యజ్ఞకర్తగు సోమయాజియైన
ధరణి లోపల ప్రభాతస్నానపరుడైన - నిత్య సత్కర్మాది నిరతుడైన
నుపవాస నియమంబునొందు సజ్జనుడైన - గావివస్త్రము గట్టు ఘనుడునైన
దండి షోడశ మహాదానపరుండైన - సకల యాత్రలు సల్పు సరసుడైన

గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్షసామ్రాజ్యమొందడు మోహనాంగ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* నీ కథల్ చెవులలో సోకుట మొదలుగాఁ - బులకాంకురము మేనఁ బుట్టువాడు
నయమైన నీ దివ్యనామ కీర్తనలోన - మగ్నుడై దేహంబు మరచువాడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ - బ్రేమతో దండ మర్పించువాడు
హా పుండరీకాక్ష! హా రామ! హరి! యంచు - వేడ్కతోఁ గేకలు వేయువాడు

చిత్తకమలంబునను నిన్ను జేర్చువాడు
నీదు లోకంబునందుండు నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నీ భక్తులను గనుల్ నిండఁ జూచియు రెండు - చేతుల జోహారు చేయువాడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ - వినయమొందుచుఁ జాల వినెడివాడు
తన గృహంబునకు నీ దాసులు రాఁజూచి - పీటపైఁ గూర్చుండబెట్టువాడు
నీ సేవకుల జాతినీతులెన్నక చాల - దాసోహమని జేరదలచువాడు

పరమభక్తుండు, ధన్యుండు భానుతేజ!
వానిఁ గనుగొన్న బుణ్యంబు వసుధలోన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నీకు దాసుడనంటి, నిన్ను నమ్ముకయుంటిఁ - గాన నాపై నేడు కరుణఁ జూడు
దోసిలొగ్గితి నీకు, ద్రోహమెన్నగబోకు - పద్మలోచన! నేను బరుడఁ గాను
భక్తి నీపై నుంచి భజనఁ జేసెదఁ గాని - పరుల వేడనుఁ జుమ్మి, వరములిమ్ము
దండి దాతవు నీవు, తడవు సేయక కావు - ఘోర పాతకరాశిఁ గొట్టివైచి

శీఘ్రముగఁ గోర్కె లీడేర్చు, చింతఁ దీర్చు
నిత్యమును నన్నుఁ బోషించు, నెనరు నుంచు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* నీమీద కీర్తనల్ నిత్యగానముఁ జేసి - రమ్యమొందింప నారదుడగాను
సావధానముగ నీ చరణపంకజ సేవ - సలిపి మెప్పింపంగ శబరిగాను
బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ - గలుగను బ్రహ్లాద ఘనుడగాను
ఘనముగా నీమీద గ్రంథముల్ గల్పించి - వినుతిసేయను వ్యాసమునినిగాను

సాధువును, మూర్ఖమతిని, మనుష్యాధముడను
హీనుడను జుమ్మి, నీవు నన్నేలుకొనుము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు - కమలవాసిని మమ్ముఁ గన్న తల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ - నీ కటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనలు మాకు లోకప్రపంచంబు - నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య - నీ పదధ్యానంబు నిత్యజపము

తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* నేనెంత వేడిన నీకేల దయ రాదు? - పలుమాఱు పిలిచిన బలుకవేమి?
పలికిన నీకున్న పదవేమి పోవును? - మోమైన బొడచూపవేమి నాకు?
శరణు జొచ్చినవాని సవరించవలె గాక - పరిహసించుట నీకు బిరుదు గాదు
నీ దాసులను నీవు నిర్వహింపకయున్న - బరు లెవ్వరగుదురు పంకజాక్ష!

దాత, దైవంబు, తల్లియుఁ, దండ్రి వీవె!
నమ్మియున్నాను నీ పాదనళినములను
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ప (12)

* పంజరంబున గాకిఁ బట్టియుంచిన లెస్స - పలుకునే వింతైన జిలుకవలెను?
గార్ధభంబును దెచ్చి కళ్ళె మింపుగ వేయ - తిరుగునే గుఱ్ఱంబుతీరుగాను?
ఎనుబోతు నొగి మావటీడు శిక్షించిన - నడచునే మదవారణంబువలెను?
పెద్దపిట్టకు మేతఁ బెట్టి పెంచిన గ్రొవ్వి - సాగునే వేటాడు డేగవలెను?

కుజనులను దెచ్చి నీ సేవ కొఱకుఁ బెట్ట
వాంఛతోఁ జేతురే భక్తవరులవలెను?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* పక్షివాహన! నేను బ్రతికినన్ని దినాలు - కొండెగాండ్రను గూడి కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి యాదరింపుము నన్ను - గన్నతండ్రివి నీవె కమలనాభ!
మరణమయ్యెడినాడు మమతతో నీయొద్ద - బంట్లఁ దోలుము ముందు బ్రహ్మజనక!
యినజభటావళి యీడిచికొనిపోక - కరుణతో నాయొద్దఁ గావలుంచు

కొనకు నీ సన్నిధికిఁ బిల్చుకొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య శేషశయన!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* పచ్చి చర్మపుతిత్తి పసలేదు దేహంబు - లోపల నంతట రోయ రోత
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త - మాంసముల్ కండలు మైలతిత్తి
బలువైన యెండ వానల కోర్వదెంతైనఁ - దాళలే దాకలి దాహములకు
సకల రోగములకు సంస్థానమయియుండు - నిలువ దస్థిరమైన నీటిబుగ్గ

బొందిలో నుండి ప్రాణముల్ బోయినంత
కాటికేగాని కొఱగాదు గవ్వకైన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* పద్మలోచన! సీసపద్యముల్ నీమీదఁ - జెప్పబూనితినయ్య! చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణము జూడగలేదు - పంచకావ్య శ్లోక పఠన లేదు
అమరకాండత్రయం బరసి చూడగలేదు - శాస్త్రీయగ్రంథముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించెదఁ గాని - ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప

తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనె?
చెరకునకు వంకపోయినఁ జెడునె తీపి?
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* పద్మాక్ష! మమతచేఁ బరము నందెదమంచు - విఱ్ఱవీగుదుమయ్య వెఱ్ఱి పట్టి
మా స్వతంత్రంబైన మదము కండ్లకుఁ గప్పి - మొగముపట్టదు కామమోహమునను
బ్రహ్మదేవుండైన బైడిదేహముఁ గల్గఁ - జేసివేయక మమ్ముఁ జెరిచెనతడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకల తోడ - ముఱికిచెత్తలు జేర్చి మూటకట్టె

యీ శరీరాలు పడిపోవు టెఱుగ కేము
కాముకులమైతి మిక మిమ్ము గానలేము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* పరుల ద్రవ్యము మీద భ్రాంతినొందినవాడు - పరకాంతల నపేక్ష పడెడువాడు
అర్థుల విత్తంబు లపహరించెడువాడు - దానమీయంగ వద్దనెడువాడు
సభల లోపల నిల్చి చాడి చెప్పెడువాడు - పక్షపు సాక్ష్యంబు పలుకువాడు
విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడువాడు - ధర్మసాధుల దిట్టఁ దలచువాడు

ప్రజల, జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచేఁ గష్టమొందు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* పలు రోగములకు నీ పాదతీర్థమెగాని - వలపుమందులు నాకు వలదు
చెలిమి సేయుచు నీకు సేవఁ జేసెదగాని - నీ దాసకోటిలో నిలుపవయ్య!
గ్రహభయంబునకుఁ జక్రముఁ దలంచెదగాని - ఘోరరక్షలు గట్టఁ గోరనయ్య!
పాముకాటుకు నిన్ను భజన జేసెదగాని - దాని మంత్రము నేను దలపనయ్య!

దొరికితివి నాకు దండివైద్యుడవు నీవు
వేయి కష్టాలు వచ్చిన వెఱువనయ్య!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* పలుమాఱు దశరూపములు ధరించితివేల? - నేకరూపము బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ధి నడుమఁ జేరితివేల? - రత్నకాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రుని మీదఁ బవ్వళించితివేల? - జలతారు పట్టెమంచములు లేవె?
రెక్కలు గల పక్షి నెక్కసాగితివేల? - గజ తుర గాందోళికములు లేవె?

వనజలోచన! యిటువంటి వైభవములు
సొగసుగా నీకుఁ దోచెనో సుందరాంగ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* పసరంబు పంజైన బసులకాపరి తప్పు - ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు - తనయుడు దుడుకైన దండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు - కూతురు చెడుగైన మాత తప్పు
యశ్వంబు దురుసైన నారోహకుని తప్పు - దంతి మదించ మావంతు తప్పు

యిట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పుడీ యవనిజనులు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* పాంచభౌతికము దుర్భరమైన కాయం బి - దెప్పుడో విడుచుట యెరుకలేదు
శతవర్షములదాక మితముఁ జెప్పిరి కాని - నమ్మరాదా మాట నెమ్మనమున
బాల్యమందో, మంచి ప్రాయమందో, లేక - ముదిమియందో, లేక ముసలియందో
యూరనో, యడవినో, యుదకమధ్యముననో - యెప్పుడో, యేవేళ, నే క్షణంబో

మరణమే నిశ్చయము; బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో మిమ్ముఁ దెలియవలయు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* పుండరీకాక్ష! నా రెండు కన్నుల నిండ - నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య?
వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు - సొగసుగా నీ రూపు చూపవయ్య!
పాపకర్ముని కంటఁబడక పోవుదమంచు - పరుషమైన ప్రతిజ్ఞ్జఁ బట్టినావె?
వసుధలో పతితపావనుడ వీవంచు నే - బుణ్యవంతుల నోటఁ బొగడ వింటి

యేమిటికి విస్తరించె నీ కింత కీర్తి?
ద్రోహినైనను నాకీవు దొరకరాదె?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* ప్రహ్లాదు డేపాటి పైడి కానుకలిచ్చె? - మదగజం బెన్నిచ్చె మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె నగలు రత్నంబు? ల - హల్య నీ కే యగ్రహారమిచ్చె?
నుడుత నీ కేపాటి యూడిగంబులు సేసె? - ఘనవిభీషణు డేమి కట్నమిచ్చె?
పంచపాండవు లేమి లంచమిచ్చిరి నీకు? - ద్రౌపది నీ కెంత ద్రవ్యమిచ్చె?

నీకు వీరంద రయినట్లు నేను గాన!
యెందుకని నన్ను రక్షింప విందువదన!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఫ (1)

* ఫణులపుట్టల మీదఁ బవ్వళించినయట్లు - పులులగుంపున జేరఁబోయినట్లు
మకరివర్గంబున్న మడుగుఁ జొచ్చినయట్లు - గంగదాపున నిండ్లు గట్టినట్లు
చెదలభూమిని జాప చేర బఱచినట్లు - తోలుతిత్తిని బాలు పోసినట్లు
వెఱ్ఱివానికి బహు విత్త మిచ్చినయట్లు - కమ్మగుడిసె మందుఁ గాల్చినట్లు

స్వామి! నీ భక్తవరులు దుర్జనులతోడ
జెలిమిఁ జేసిన యటులైన జేటు వచ్చు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

బ (1)

* బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని - మరణకాలమునందు మరతునేమొ!
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి - ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ కప్పగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు - పిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ!

నాటికిప్పుడు చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య! ధైర్యముగను
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భ (4)

* భావంబు నీ నామభజన గోరుచునుండు - జిహ్వ నీ కీర్తనల్ సేయఁగోరు
హస్తయుగ్మంబు నిన్నర్చించఁ గోరును - గర్ణముల్ నీమీది కథను గోరు
తనువు నీ సేవయే ఘనముగా కోరును - నయనముల్ నీ దర్శనంబుఁ గోరు
మూర్ధమ్ము నీ పదంబుల మ్రొక్కగాఁ గోరు - నాత్మ నీదైయుండు నరసిచూడ

స్వప్నములనైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందుఁ బూనియుండు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* భుజబలంబున బెద్దపులులఁ జంపగవచ్చు - పాము కంఠముఁ జేతఁ బట్టవచ్చు
బ్రహ్మరాక్షసకోట్లఁ బారద్రోలగవచ్చు - మనుజుల రోగముల్ మాన్ పవచ్చు
జిహ్వ కిష్టముగాని జేదు మ్రింగగవచ్చు - పదనుఖడ్గముఁ జేత నదుమవచ్చు
కష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు - తిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చు

పుడమిలో దుష్టులకు జ్ఞ్జానబోధఁ దెలిపి
సజ్జనులఁ జేయలేడెంత చతురుడైన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* భువనరక్షక! నిన్ను బొగడనేరని నోరు - ప్రజకు గోచరమైన పాడుబొంద
సురవరార్చిత! నిన్ను జూడగోరని కనుల్ - జలములోపల నెల్లి సరపుగుండ్లు
శ్రీరమాధిప! నీకు సేవఁజేయని మేను - కూలి కమ్ముడువోని కొలిమితిత్తి
వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన - గఠినశిలాదులఁ గలుగు తొలులు

పద్మలోచన! నీమీద భక్తిలేని
మానవుడు రెండు పాదాల మహిషమయ్య!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* భువనేశ! గోవింద! రవికోటి సంకాశ! - పక్షివాహన! భక్త పారిజాత!
యంభోజభవ రుద్ర జంభారి సన్నుత! - సామగాన విలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్స కౌస్తుభవక్ష! - శంఖ చక్ర గదాసి శార్జ్జ హస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్య వినాశ! - నారదార్చిత! దివ్య నాగశయన!

చారు నవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధ వందిత పాదాబ్జ! విశ్వరూప!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

మ (3)

* మందుడనని నన్ను నింద జేసిన నేమి? - నా దీనతను జూచి నవ్వ నేమి?
దూరభావము లేక తూలనాడిన నేమి? - ప్రీతి సేయక వంకబెట్ట నేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? - తీవ్రకోపము చేతఁ దిట్ట నేమి?
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి? - చేరి దాపట గేలి సేయ నేమి?

కల్పవృక్షంబు వలె నీవు కల్గనింక
ప్రజల లక్ష్యంబు నా కేల పద్మనాభ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* మత్స్యావతారమై మడుగు లోపలఁ జొచ్చి - సోమకాసురు ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల, మెచ్చ దేవతలెల్ల - బ్రహ్మ కిచ్చితి వీవు భళి యనంగ
నా వేదముల నంది యాచారనిష్ఠల - ననుభవించుచునుందు రవనిసురులు
సకల పాపంబులు సమసిపోవు నటంచు - మనుజులందరు నీదు మహిమఁ దెలియ

కుందు రరవిందనయన! నీ యునికిఁ దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* మాన్యంబు లీయ సమర్థు డొక్కడు లేడు - మాన్యముల్ చెఱుప సమర్థులంత
యెండిన యూళ్ళ గో డెఱిగింప డెవ్వడు - పండిన యూళ్ళకుఁ బ్రభువులంత
యితడు పేద యటంచు నెఱిగింప డెవ్వడు - కలవారి సిరు లెన్నగలరు చాల
తన యాలి చేష్టలఁ దప్పెన్న డెవ్వడు - పెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత

యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

య (0)

ర (0)

ల (2)

* లక్ష్మీశ! నీ దివ్య లక్షణ గుణముల - వినజాల కెప్పుడు వెర్రినైతి
నా వెర్రిగుణమును నయముగా ఖండించి - నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితర దైవముల నే - నమ్మలేదెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె, కష్టపెట్టిన నీవె - నీ పాదకమలముల్ నిరతి నేను

నమ్మియున్నాను; నీ పాదనళిన భక్తి
వేగ దయచేసి రక్షింపు వేదవేద్య!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* లోకమందెవడైన లోభిమానవుడున్న - భిక్ష మర్థికిఁ జేతఁ బెట్టలేడు
తాను బెట్టకయున్న దగవు పుట్టదు కాని - యొరులు బెట్టగజూచి యోర్వలేడు
దాత దగ్గర జేరి తన ముల్లె చెడినట్లు - జిహ్వతో చాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసము నందు - మేలు కల్గిన జాల మిడుకుచుండు

శ్రీరమానాథ! యిటువంటి క్రూరునకును
భిక్షుకులశత్రువని బేరుఁ బెట్టవచ్చు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

వ (8)

* వనరుహనాభ! నీ వంకఁ జేరితి నేను - గట్టిగా నను గావు; కావుమనుచు
వచ్చినందుకు వేగ వరము లీయకగాని - లేవబోయిన నిన్ను లేవనియ్యఁ
గూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగఁ బట్టి - పుచ్చుకొందును జూడు భోగిశయన!
యీవేళ నీ కడ్డ మెవరు వచ్చినగాని - వారికైనను లొంగి వణకబోను

కోపగాడను, నీవు నా గుణము దెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* వసుధాస్థలంబున వర్ణహీనుడు గాని - బహుళ దురాచారపరుడు గాని
తడసి కాసియ్యని ధర్మశూన్యుడు గాని - చదువనేరని మూఢజనుడు గాని
సకల మానవులు మెచ్చని కృతఘ్నుడు గాని - చూడ సొంపును లేని శుంఠ గాని
యప్రతిష్ఠలకు లోనైన దీనుడు గాని - మొదటికేమెఱుగని మోటు గాని

ప్రతిదినము నీదు భజనచేఁ బరగునట్టి
వాని కే వంక లేదయ్య! వచ్చు ముక్తి!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* వాంఛతో బలిచక్రవర్తి దగ్గఱఁ జేరి - భిక్షమెత్తితి వేల బిడియపడక?
యడవిలో శబరి తియ్యని ఫలాలందియ్యఁ - జేతు లొగ్గితి వేల సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ విదురు నింటికి నేగి - విందు గొంటి వదేమి వెలితిపడక?
నటుకు లల్పము కుచేలుడు గడించుకఁ జేర - బొక్కసాగితి వేల లెక్కగొనక?

భక్తులకు నీవు బెట్టుట భాగ్యమగును
వారి కాశించితివి తిండివాడవగుచు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* విద్య నేర్చితినంచు విర్రవీగగలేదు - భాగ్యవంతుడనంచుఁ బలుకలేదు
ద్రవ్యవంతుడనంచుఁ దరచు నిక్కగలేదు - నియతి దానములైన నెరపలేదు
పుత్రవంతుడనంచుఁ బొగడుచుండగలేదు - భృత్యవంతుడనంచుఁ బెగడలేదు
శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు - కార్యవంతుడనంచుఁ గడపలేదు

నలుగురికి మెప్పుగానైన నడవలేదు
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* వెర్రివానికి నేల వేదాక్షరంబులు? - మోటువానికి మంచి పాటలేల?
పసులగాపరి కేల పరతత్త్వబోధలు? - విటగాని కేటికి విష్ణుకథలు?
వదరుశుంఠల కేల వ్రాతపుస్తకములు? - తిరుగు ద్రిమ్మరి కేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల దాతృత్వగుణములు? - దొంగబంటుకు మంచి సంగతేల?

క్రూరజనులకు నీమీదఁ గోరికేల?
ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* వేదముల్ జదివెడు విప్రవర్యుండైన - రణము సాధించెడు రాజులైన
వర్తక కృషికుడౌ వైశ్యముఖ్యుండైన - బరిచరించెడి శూద్రవర్యుడైన
మెచ్చు ఖడ్గము బట్టి మెఱయు మ్లేచ్ఛుండైన - బ్రజల కక్కఱపడు రజకుడైన
చర్మ మమ్మెడు హీన చండాలనరుడైన - నీ మహీతలమందు నెవ్వడైన

నిన్ను గొనియాడుచుండెనా నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ వసుధలోన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* వేమారు నీ కథల్ వినుచునుండెడివాడు - పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను బొగడనేర్చినవాడు - చెడ్డమాటల నోటఁ జెప్పబోడు
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాడు - ధనమదాంధుల వెంటఁ దగులబోడు
సంతసంబున నిన్ను స్మరణ జేసెడివాడు - చెలగి నీచుల పేరుఁ దలపబోడు

నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగ
కోరి చిల్లరవేల్పులఁ గొల్వబోడు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* వ్యాసు డే కులమందు వాసిగా జన్మించె? - విదురు డే కులమందు వృద్ధిఁ బొందె?
కర్ణు డే కులమందు ఘనముగా వర్ధిల్లె? - నా వసిష్ఠుం డెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబున బుట్టె? - గుహుడను బుణ్యు డే కులమువాడు?
శ్రీశుకు డెచ్చటఁ జెలగి జన్మించెను? - శబరి యే కులమందు జన్మమొందె?

నే కులంబున వీరంద ఱొచ్చినారు?
నీ కృపాపాత్రులకు జాతి నీతులేల?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శ (3)

* శేషప్ప యను కవి చెప్పిన పద్యముల్ - చెవుల కానందమై చెలగుచుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము గలుగు
చెలగి యీ పద్యముల్ చేర్చి వ్రాసినవారు - కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగాఁ బుస్తకం బెపుడు బూజించిన - దురితజాలంబులు దొలగిపోవు

నిద్ది పుణ్యాకరంబని యెపుడు జనులు
కష్టమనక పఠించినం గలుగు ముక్తి
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* శ్రవణరంధ్రముల నీ సత్కథల్ పొగడంగ - లేశ మానందంబు లేనివాడు
పుణ్యవంతులు నిన్ను బూజసేయగఁ జూచి - భావమం దుత్సాహపడనివాడు
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ - తత్పరత్వములేక తొలగువాడు
తన చిత్తమందు నీ ధ్యాన మెన్నడులేక - కాలమంతయు వృధా గడుపువాడు

వసుధలోనెల్ల వ్యర్థుండు వాడె యగును
మరియుఁ జెడుగాక యెప్పుడు మమతనొంది
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* శ్రీమనోహర! సురార్చిత! సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశిపునాశక! శూర! - సాధురక్షణ! శంఖచక్రహస్త!
ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! లసద్భ్రమరకుంతలజాల! - పల్లవారుణ పాదపద్మయుగళ!

చారు శ్రీచందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ష (0)

స (4)

* సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు - శూరుడై రణమందుఁ బోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు - హేమ గోదానంబు లియ్యవచ్చు
గగనమందున్న చుక్కల నెంచగావచ్చు - జీవరాసుల పేర్లు జెప్పవచ్చు
నష్టాంగయోగంబు లభ్యసింపగవచ్చు - కఠినమౌ రాల మ్రింగంగవచ్చు

తామరసగర్భ హర పురందరులకైన
నిన్ను వర్ణింపఁ దరమౌనె నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* సర్వేశ! నీ పాద సరసిజద్వయమందుఁ - జిత్త ముంచగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలచియుండెడునట్లు - చేసి నన్నిపుడేలు! సేవకుడను!
వనజలోచన! నేను వట్టి మూర్ఖుడఁ జుమ్మి - నీ స్వరూపముఁ జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి బోసినయట్లు - భక్తిమార్గంబను పాలు బోసి

ప్రేమతో నన్ను బోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీ దాసగణములోన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు - కవులతో వైరంబుఁ గాంచఁ గీడు
పరమదీనులఁ జిక్కఁ బట్టికొట్టినఁ గీడు - బిచ్చగాండ్రను దుఃఖపెట్టఁ గీడు
నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు - పుణ్యవంతుల దిట్టఁ బొసగుఁ గీడు
సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు - గురుని ద్రవ్యము దోచుకొనినఁ గీడు

దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

* స్తంభమం దుదయించి దానవేంద్రుని ద్రుంచి - కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు
మకరిచేఁ జిక్కి సామజము దుఃఖింపంగఁ - గృపయించి వేగ రక్షించినావు
శరణంచు నవ్విభీషణుడు నీ చాటున - వచ్చినప్పుడె లంక నిచ్చినావు
ఆ కుచేలుడు చేరె డటుకు లర్పించిన - బహుసంపదల నిచ్చి పంపినావు

వారివలె నన్ను బోషింప వశముగాదె
యింత వలపక్షమేల శ్రీకాంత! నీకు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

హ (2)

* హరి! నీకుఁ బర్యంకమైన శేషుడు చాలఁ - బవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు - గొప్ప పామును నోటఁ గొరుకుచుండు
నదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి - దినము పేరంటంబు తిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు సేసి - ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుంద్రు

స్పష్టముగ నీకు గ్రాసము జరుగుచుండ
కాసు నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

* హరిదాసులను నిందలాడకుండిన జాలు - సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింపకుండిన జాలు - జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండిన జాలు - నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు - గనకకంబపు గుళ్ళు గట్టినట్లు

యొకరి వర్షాశనము ముంచకున్నను జాలు
బేరుకీర్తిగ సత్రముల్ బెట్టినట్లు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము