(Telugu) ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకుప్రాణభయంతో కూడినదే సుమా!
ఎలాంటి యజమాని కొలువు చేయకూడదో.. ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పని చేయకూడదనీ, అలా చేస్తే పాము నీడలో బ్రతికే కప్పలాగా ఎప్పుడూ అపాయమేనని అంటున్నారు.
ఏంటోనండీ.. ఈ పద్యం లో ఇలా ఉంది కానీ, అసలు అలాంటి ఉత్తమమైన బాస్ లు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారండీ బాబూ? అవునా కాదా...? మీరే చెప్పండి. అసలు ఉద్యోగం దొరకడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాస్ చాలా మంచి వాడవ్వాలని కోరుకుంటే మనకి ఇంక ఉద్యోగాలొచ్చినట్టే... కదా... :( అంటే నా ఉద్దేశ్యం బాసులందరూ విలన్లని కాదు గానీ..ప్రతీ బాస్ లో కొంచమైనా విలనిజం ఉంటుదని అన్నమాట...అంతే కదా మరి...హ్హ హ్హ హ్హ... అసలు టీ టైములో టీ తాగడం కంటే కూడా సహోద్యోగులందరూ సేద తీరేది బాస్ ని తిట్టుకునే కదా.. :)
ఏది ఏమైనప్పటికీ ఈ పద్యం మన ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా అన్వయించుకోడం కష్టమే అనిపిస్తుంది. పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా మనం బాస్ వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమంటాను. మా స్నేహితులు కొంతమంది డాక్టరేట్ కోసం పరిశోధన చేస్తున్నారు. వాళ్ల అనుభవాలు కొన్ని విన్న తరువాత ఎవరికైనా అనిపిస్తుంది మనం ఉద్యోగం సంతోషంగా చేయడానికి బాస్ వ్యక్తిత్వం కూడా ఒక ముఖ్యమైన అంశం అని. బాస్ వచ్చి ప్రతీ అర గంటకీ ఇప్పుడేమి చేస్తున్నావు, అది వచ్చిందా, ఇది ఏమయింది, ఇందాక అయిదు నిమిషాలేమిచేసావు, ఎనిమిది గంటలకి ఒక పది నిమిషాలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, టీ తాగడానికి అయిదు నిమిషాలకంటే ఎక్కువ ఎందుకెళ్ళావు ....ఈ రకంగా కాదేదీ హింసకి అనర్హం అన్నట్టుగా...పీల్చి పిప్పి చేసేసే తింగరి బాస్ లు చాలామంది ఉంటారండీ బాబు...!! మీకు మాత్రం ఇలాంటి బాస్ లు లేకపోతే చాలా అదృష్టవంతులనుకొని దేవుడికొకసారి ధన్యవాదాలు చెప్పండి. ఒకవేళ ఇలాంటి చట్రంలో మీరు మాత్రం ఇరుక్కుపోయి ఉంటే మాత్రం.. మిమ్మల్ని ఆప్రభువే కాపాడాలి.. :) అలా ఉంటే మాత్రం, వెంటనే పరిగెత్తుకుని బయటికి వచ్చెయ్యండి. బతికుంటే బలుసాకు తినయినా బతకచ్చు. మరీ అంత నరకమైన ఉద్యోగం చేసి బతికేంత దుస్థితి ఎందుకులెండి...
మనకెవ్వరికీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పనిలో పనిగా మీరందరూ కూడా ఒకసారి 'తథాస్తు' అనేయ్యండి. సరేనా..!
[:]
Comments
Post a Comment