(Telugu) మంచి జీవితానికి నిపుణుల చిట్కాలివీ

[:te]
కన్ను తెరచింది మొదలు... కన్ను మూసే వరకు ఆగని ప్రయాణమే జీవితం. 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే'.. అన్న చందంగా ఉంటే కాలగర్భంలో తెరమరుగైపోతాం. అలా కాకుండా... ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు మనతో మనం పోటీ పడాల్సిందే. సామాన్యులు ఎందరో మన కళ్లముందే పలు రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఓ పట్టు పట్టాలేగాని... మీరూ అంతే! అందుకు ఏం చేయాలో తెలుసుకోవాలని ఉందా? చదవండి మరి...


జీవితంలో స్థిరపడి ఉన్నత స్థితికి చేరుకోవాలనే లక్ష్యం యువకులు అందరి ముందు ఉంటుంది. ఇదే లక్ష్యంతో ఎంతోమంది భాగ్యనగరికి వస్తుంటారు. చాలామంది ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపకంలో మునిగిపోయి రాజీ పడతారు. అయితే అనుకున్నది సాధించడానికి రాజధానిలో అనువైన పరిస్థితులు, వసతులు ఎన్నో ఉన్నాయి. మరిన్ని విజయాలు మూటగట్టుకోవాలన్నా, మంచి కొలువు కొట్టేయాలన్నా, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నా... కార్యరూపానికి ఆమడ దూరంలో ఆగిపోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. లక్ష్యసాధన దిశగా మనం నడవడం ప్రారంభిస్తే విజయాలు మీ వెంట పరుగులు తీస్తాయి.


'ది బెస్ట్‌' ఎలా?

జ్ఞానం, శక్తి, సామర్థ్యాలను ఉపయోగిస్తే మనం ఎంత ఉన్నతంగా ఉండాలో ఆ స్థాయిలో ఉంటున్నామా? లేదా? అన్నది బోధపడుతుంది. 'అదే చేస్తే ఈ పాటికి ఎక్కడుండాల్సిన వాడినో!' అని కూడా తరచూ అనుకొంటుంటాం. ఇప్పుడు మనం చేయాల్సిందదే. ముందు మానసికంగా మనల్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత కార్యరంగంలో దూసుకుపోవాలి. ఫలితం ఇప్పుడు కాకపోతే రేపొస్తుంది. మొక్కను నాటితే ఫలాలిస్తుంది. బాగా చదివి రాస్తే మంచి మార్కులొస్తాయి. ప్రతిభ వెంట ప్రతిష్ఠ, దానివెనుక అష్త్టెశ్వర్యాలు, సర్వసుఖాలు పరుగు తీస్తాయి.

ఇలా చేయండి...

1. మీతోనే మీకు పోటీ: మీరు మీతో పోటీ పడాలి. ఔను.. ఇదే జపనీయుల విజయ సూత్రం. పక్కవారితో పోల్చుకుని పోటీ పడితే చివరికి నిరాశే మిగులుతుంది. వారి పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మరి పోలిక ఎలా కుదురుతుంది? అందుకే నిన్నటి మీతో.. ఈరోజు మీరు ఎలా ఉన్నారో పోల్చుకోండి. నేటి మీతో రేపటి మీరు ఎలా ఉండాలో నిర్దేశించుకోండి. స్వీయ అనుభవం, చదువు ద్వారా మనకెన్నో విషయాలు తెలుస్తాయి. వీటిని అక్కడితో వదిలేయకుండా, అవసరమైనప్పుడు లోకజ్ఞానం జోడించి క్షేత్రస్థాయిలో ప్రతిభ చూపాలి.


2. లక్ష్యాల నిర్దేశన: కాలంతోపాటే లక్ష్యాలు మారుతుంటాయి. వాటిని స్పష్టంగా నిర్దేశించుకుని, పటిష్ఠ ప్రణాళిక రూపొందించుకోవాలి. సమర్థ ఆచరణ మిమ్మల్ని గమ్యస్థానం చేర్చుతుంది. అసమర్థత కారణంగా మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మానసిక శక్తిని కూడదీసుకుని విజయానికి బాటలు వేసుకోండి. అందుకు అవసరమైన సామర్థ్యాల అభివృద్ధికి కృషి చేయండి. అవసరమైతే మీ రంగానికి సంబంధించిన నిపుణులను సంప్రదించి, శిక్షణ తీసుకోండి.


3. ఆత్మవిశ్వాసం అవసరం: మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీలోని మంచి గుణాలు, సామర్థ్యాల జాబితా రాసుకుని చదువుకుంటే మీపై మీకు ప్రేమ పుడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆల్‌ ఈజ్‌ వెల్‌... అంతా మన మంచికే అనుకోవాలి. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి. పెదవిపై చిరునవ్వు చెరగనీయవద్దు. మీ ముఖంపై చిరునవ్వు మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది.


4. సమభావన: పరాజయం... విజయం కోసం చెల్లించే ట్యూషన్‌ ఫీజులాంటిదే. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చేసిన తప్పు మళ్లీ చేయవద్దు. మంచి, చెడులు జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించాలి. ప్రతి ఒక్కరికీ సమాన సామర్థ్యాలుంటాయి. వాటిని ఏ స్థాయిలో వినియోగించుకున్నారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది.


5. నిజాయతీ: వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధికి ఇది ఎంతో కీలకం. మీకు మీరు నిజాయతీగా ఉండండి. తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. దాటవేత ధోరణి వద్దు. నేడు మీరెలా వ్యవహరిస్తున్నారన్న దానిపైనే రేపటి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మీకు మీరే జవాబుదారీ. సాకులతో కాలహరణం చేయకుండా, బాధ్యతగా నిజాయతీతో లక్ష్యసాధనకు కృషి చేయాలి.


6. పరిష్కారం: సమస్యలు అందరికీ ఉంటాయి. మీ సమస్యలకు ఇతరులను, పరిస్థితుల్ని నిందించొద్దు. నిజానికి సమస్యలు దాగి ఉన్న అవకాశాలని గుర్తించాలి. పరిష్కారంపై దృష్టి నిలపాలి. అవసరమైతే, ఇతరుల సహకారం తీసుకోవాలి. చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూడకుండా, సర్దుబాటు ధోరణిని అలవరచుకోవాలి. మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదించడం తప్పు. ఎదుటివారు చెప్పే దానిలో వాస్తవాన్ని అంగీకరించాలి. ఇతరులు చెప్పేది ఓపికగా వినాలి. భిన్నాభిప్రాయాలు ఉంటే సున్నితంగా వివరించాలి. ఫలితం ఎలా ఉండబోతుందో చెప్పాలి.


7. నిత్యానందం: ఆరోగ్యమైన దేహంలో ఆరోగ్యవంతమైన ఆలోచనాశక్తి ఉంటుంది. నిత్యం యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరించాలి. చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కంటి నిండా నిద్రపోతే ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ అవుతారు.
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము