(Telugu) అప్పుగొని సేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పురయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
తాత్పర్యం: రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజురాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.
అప్పు చేసి పప్పు కూడు తరహాలో జీవించకూడదు.. అది ఎప్పటికైనా ముప్పే అని ఈ పద్యం చెప్తుంది. మన పెద్దవాళ్ళు అన్నట్టు పెళ్లి చేసుకోవడానికి కాస్త ఈడు జోడు ఉండాలి అంటూ ఉంటారు. నేననుకోడం ఏంటంటే ఈ శతకం రచనాకాలంలో కన్యాశుల్కం లాంటి దురాచారాలు ఉండేవేమో కదా... అప్పట్లో చిన్న చిన్న అమ్మాయిలని పండు ముదుసలికిచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు ధనం కోసం. అలా చేయడం ఎంత ఘాతుకమో కదా..అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ ముసలినే ఇష్టపడి అతని దగ్గరే ఉండే అవకాశం చాలా తక్కువ కదా..ఆయా మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఇవన్నీ చాలా సమస్యలకి దారి తీస్తాయి చివరికి.
ఇక పోతే ..తప్పులను కనిపెట్టని రాజు రాజ్యం.. అంటే జనాల కోసం కాకుండా తమ స్వార్ధం చూసుకునే ఈనాటి ప్రభుత్వాలు, రాజకీయనాయకుల లాగ అన్నమాట. ఇవన్నీ ఎప్పటికైనా హాని కలిగించేవేనని ఈ పద్యం లో నీతి వస్తుంది.
[:]
Comments
Post a Comment