పరాశరస్మృతి
అన్యే కృతయుగే ధర్మా: త్రేతాయాం ద్వాపర యుగే అన్యే కలియుగే న్రూణా౦ యుగాపానుసారత: - ఆయా యుగాల స్వరూప స్వభావభేదాలననుసారించి అన్ని యుగాలలోను ధర్మాలు భిన్నభిన్నంగా ఉంటాయి
తప: పరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే
ద్వాపరే యజ్ఞమేవాహు: దానమేవ కలౌయుగే !! – కృతయుగంలో మానవధర్మం తపస్సు, త్రేతాయుగం లో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం అయితే కలియుగ ధర్మం దానం
పరాశరస్మృతి – ఉపోద్ఘాతము
“కృతేతు మానవాధర్మాః త్రేతాయాం గౌతమస్మృతాః ద్వాపరేశంఖలిఖితాః కలౌ పరాశరాఃస్మృతాః” – మనుస్మృతి కృత యుగానికి, అలాగే కలియుగానికి పరాశర స్మృతి అన్నది ఆర్యోక్తి.
కానీ కొందరు దుష్టులు కొన్ని వేల ఏళ్ళ క్రితం నిర్దేశింపబడిన మనుస్మ్రుతిని పట్టుకుని అదే హైందవం అంటూ ఎగతాళి చేస్తున్నారు. అసలంటూ కొన్ని కొన్ని జాతులలో బట్టలు వేసుకోవడం నేర్వని కాలంలో, గొర్రెలు, అడవిపందులు తింటున్న కాలంలో, వావి వరసలు లేక పశువుల్లా అందరితో జత కడుతున్న సమయానికి మన సంస్కృతిలో ధర్మం, దిశానిర్దేశం అన్నీ ఉన్నాయి. అవి ఆ కాలానికి సరిపడ్డ నియమాలు. కాలప్రవాహంలో మార్పు సహజం. ఆ మార్పు చాలామటుకు మంచికి దోహదపడుతుంది. సమయానికి సరిపడ్డ ధర్మశాస్త్రం ఆవిష్కృతం అవుతుంది. కలియుగానికి పరాశరమహాముని విరచిత స్మృతి శిరోధార్యం. ఇంకా చెల్లుబాటు లేని వెయ్యి రూపాయల నోటు పట్టుకుని ఇదే మీ డబ్బు అన్నంత హాస్యాస్పదంగా వుంటుంది నేడు కూడా మనుస్మృతిని పట్టుకుని ఇదా మీ ధర్మం అని నిరసించే చతురులను చూస్తె.
పరాశరస్మృతి నవీనదృక్పధం ఆవిష్కరిస్తుంది. ధర్మ వివేచన కూడా కాలానుసరంగా చెయ్యాలి. పరాశరస్మృతిలో చెప్పబడిన కొన్ని విషయాలు టూకీగా:
- మానవుడు తన సంపాదనలో రాజుకు ఆరవ భాగాన్ని (1/6 = 16.6%, మన ప్రభుత్వాలు అంతకన్నా ఎక్కువే పిండుతున్నాయి మన దగ్గర), పూజాది ధర్మ కార్యాలకు 21వభాగం (1/21 = 5%), దాన ధర్మాలకు 30వ భాగం (1/30 = 3%) వినియోగించాలి.
- స్త్రీ విషయంలో కఠినమైన నియమాలు చెబుతూనే కొన్ని సమయాలలో స్త్రీలకూ పునర్వివాహం చెయ్యవచ్చని చెబుతుంది.
- స్త్రీలు రెండు అంగుళాల మేర జుట్టు కత్తిరిస్తే చాలు వెంట్రుకలన్నీ గోరగావలసిన అవసరం లేదు
- ప్రాయశ్చిత్తం స్త్రీ ఒంటరిగా చెయ్యకూడదు
- శ్రామిక జీవి అయిన శూద్రుడు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం ఉండరాదు.
- బ్రాహ్మణుడు తన ధర్మాలను సక్రమంగా నిర్వర్తించకపోతే నామధారక విప్రుడు తప్ప మరింకేమీ కాదు
- గాయత్రీ జపం చెయ్యని ద్విజుడు అపవిత్రుడు.
- అన్నకంటే ముందు తమ్ముడు వివాహం ఆడరాదు. అలా పెళ్లి చేసే ఇరువైపుల వారు పాపం మూటకట్టుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో అది తప్పులేదు
- న్యాయవిచారణ చెయ్యాలంటే 3,5, లేక 10 మంది ఉన్న పరిషత్తు అవసరం.
ఇలా ఎన్నో విషయాలను ధర్మశాస్త్రం చెబుతుంది. రోజుకు కొన్ని చొప్పున మరొక ఐదు టపాలలో పరాశర స్మృతిలో వివరాలను పరమేశ్వర అనుగ్రహం వలన అందించాలని సదుద్దేశం. ఆయన దయ.
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !!
యుగానికి యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది. ఆ విషయం టూకీగా కింద పట్టికలో ఇవ్వబడింది. పుట్టుకతో అందరూ శూద్రులే. వారు వివిధ వర్ణాశ్రమ ధర్మాలను వారు ఎంచుకున్న ధర్మం ప్రకారం పాటించాలి. వివిధ వర్ణాల వారు చెయ్యవలసిన కార్యములు.
క్షత్రియుడు:
ఆయుధాన్ని ధరించి దుష్టులకు కఠినదండన విధిస్తూ, ప్రజలను రక్షిస్తూ, శత్రుసైన్యాలను తన భుజబలంతో జయించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి.
శౌర్యము, తేజస్సు, ధైర్యం, చతురత, యుద్ధంలో ధైర్యంగా నిలబడడం, దానం చెయ్యడం, అధికార భావన
బ్రాహ్మణుడు:
షట్కర్మలు ఆచరించాలి: ఉదయస్నానం, సంధ్యావందనము, జపం, నిత్యాగ్నిహోత్రం, దేవతాపూజ, వైశ్వదేవంతో అతిధిపూజ
ఇంటికి సమయానికి వచ్చిన అతిధిని కులగోత్రాలు కానీ, విద్యా పాండిత్యాలు కానీ అడగరాదు. మన కంటికి కనిపించని దేవుడు అతిధి రూపంలో ఇంటికి వచ్చాడు. వచ్చినది చండాలుడైనా కానీ అతడిని పూజించి అతిధి సత్కారం చెయ్యాలి. ( ఇక్కడ చండాలుడు అనగా ఇత:పూర్వం బహిష్కరణకు గురైన చాతుర్వర్నాలలో ఒకడు ). ద్విజులు బ్రహ్మచర్యవ్రతాన్ని అవలంబింపక వేదాధ్యయనం చెయ్యక భిక్షాటనం చేస్తూ ఉంటె వారికి భిక్ష పెట్టకూడదు.
ప్రతిగ్రహాలు, షట్కర్మలే కాక అతడు అధ్యయన, అధ్యాపన, యాజన, యాజన, దానాలు చెయ్యాలి. స్వయంగా వ్యవసాయం చేస్తే మహాదోషాన్ని పొందుతాడు. చేస్తే 8 ఎద్దులతో మధ్యాహ్నం వరకు దున్ని వ్యవసాయం చెయ్యవచ్చు.
వైశ్యుడు:
లాభాన్ని ఆశించి పనులు చేయుట, రత్నముల వంటి వానిని అమ్ముత, కొనుట, గోవులను రక్షించుట, వ్యవసాయము, వర్తకము చెయ్యుట.
వ్యవసాయం చేయునప్పుడు చెట్లు కొట్టి, క్రిమికీటకాలను చంపి పాపం చేస్తాడు కనుక ఆ పండించిన ధాన్యాన్ని బ్రాహ్మణులకు, అనాధలకు, బీదలకు దానం చెయ్యడం వలన పాపం పోగొట్టుకుంటాడు. వైశ్యుడు తను సంపాదించిన ధనాన్ని దేవతలకు, బ్రాహ్మణులకు కొంత భాగం ఇవ్వవలెను.
శూద్రుడు:
ఉప్పు, తేనె, నూనె, పాలు, పెరుగు, చల్ల, నేయి వర్తకం. మద్యమాంసాలు అమ్మరాదు. తినకూడని వస్తువులను తినరాదు. పొందతగని స్త్రీను పొందరాదు. అతడికి కర్షక వృత్తి. పై మూడు వర్ణాలకు సహాయకరంగా కార్యాలు అతడిని ఉద్ధరిస్తాయి. అతడికి శ్రామిక జీవనం కావున వేద విచారణ చెయ్యవలసిన పని లేదు. కర్షకుడు తాను పండించిన దానిలో 16% రాజుకు, 5% దేవతలకు, దానాలకు, 4% బ్రాహ్మణులకు ఇస్తే అతడు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. నిషిద్ధకర్మలు చెయ్యరాదు.
ఇక్కడ వర్ణాలకు వారు చెయ్యవలసిన కర్మలు చెప్పారు. బ్రాహ్మణుడు అతడికి చెప్పిన కర్మలను చెయ్యాలంటే మిగిలిన వర్ణాలు అతడిని పోషించాలి. అప్పుడు కేవలం అతడికి చెప్పిన కర్మలను అందరికోసం, అందరి బాగు కోసం చెయ్యగలడు. ఎప్పుడైతే బ్రాహ్మణుని పోషించడం ఈ సమాజం మానివేసిందో, అతడు పొట్ట చేత పట్టుకుని వీధిన పడ్డాడు. ఇక తప్పని పరిస్థితులలో ఉద్యోగాలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఎప్పటికైనా బ్రాహ్మణుని వర్ణాశ్రమ ధర్మానికి దన్నుగా మిగిలిన వర్ణాలు నిలబదిగిన నాడు, మరల వారు వారికి చెప్పిన విధులు నిర్వర్తించి అందరికీ సహాయం చెయ్యగల స్థానానికి వెళ్తాడు. ఒకసారి ఈ ఉద్యోగాల వేటలో పడ్డ బ్రాహ్మణుడు చాలా శాతం అటుపోగా, వేదాన్ని నిలిపే బ్రాహ్మణులు బహు అరుదుగా మిగిలారు. ఆ వైదీకం చేసే వారికి ఎన్నో ధర్మాలు నిర్దేశింపబడ్డాయి. ఇప్పుడు జన్మత: బ్రాహ్మణుడు అయినా, క్షత్రియిడు అయినా వైశ్యుడు అయినా చాలా మంది ఇప్పుడు చేస్తున్న కర్మల పరంగా శూద్రులుగానే బ్రతుకుతున్నారు. వీరు చేస్తున్న ఉద్యోగాలతో సహా ద్విజులు అంటే ఉపనయనం చేసుకున్న వారు కనీసం సంద్యోపాసన ఇతర విధులు తప్పక పాటించి కనీసం వారికిచ్చిన వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. ధర్మో రక్షతి రక్షిత:
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!
Comments
Post a Comment