వాతాపి జీర్ణం అని పాలు తాగిన చిన్న పిల్లల పొట్ట పామే విధానం ఎలా వచ్చింది ?
వాతాపి, ఇల్వలుడు…. ఇద్దరూ అన్నదమ్ములు. రాక్షసులు. తాపసులవలె వేషాలు వేసుకొని, దారిన పోయే బాటసారులను అతిథులుగా పర్ణశాలకు పిలిచేవారు. వాతాపి మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ మేకను వధించి, వండి బాటసారికి పెట్టేవాడు. బాటసారి తృప్తిగా తిన్నతరువాత "వాతాపీ" అని గట్టిగా కేక వేసేవాడు. బాటసారి పొట్టలో మేకమాంసరూపంలో ఉన్న వాతాపి నిజరూపాన్ని ధరించి, ఆ బాటసారి పొట్టను చీల్చుకొని వచ్చేవాడు. ఆ మృతకళేబరాన్ని రాక్షసులిద్దరూ భక్షించేవారు. ఇలా ఎందరో అభాగ్యులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
ఈ సంగతి తెలిసి అగస్త్యమహాముని ఆ మార్గాన వచ్చాడు. యధావిధిగా వాతాపి, ఇల్వలుల నాటకం జరిగింది. తృప్తిగా తిన్న అగస్త్యుడు పొట్ట నిమురుకుంటూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అన్నాడు. వాతాపి నామరూపాలు లేకుండా ఋషిపొట్టలో జీర్ణం అయిపోయాడు.
ఇల్వలుడు "వాతాపీ, వాతాపీ" అని కేక వేశాడు. "ఇంకెక్కడి వాతాపి? ఎప్పుడో జీర్ణం అయిపోయాడు" అని తాపీగా జవాబిచ్చాడు ముని. తన తపోమహిమతో ఇల్వలుని కూడా నశింపచేశాడు.
అప్పటి నుండి పిల్లలకు ఆహారం పెట్టి, లేదా పాలు పట్టి పొట్ట నిమురుతూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అంటే శుభ్రంగా అరిగిపోతుందని మనకు నమ్మకం ఏర్పడింది. ఆ మాటకి యింకా కొనసాగింపు ఉంది.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
ఏనుగులు తిన్న వెలక్కాయలు జీర్ణం
గుర్రాలు తిన్న గుగ్గుళ్ళు జీర్ణం
మా అబ్బాయి తాగిన పాలన్నీ జీర్ణం
Comments
Post a Comment