ఇక్కడ స్త్రీలను దుర్గాదేవిగా పూజిస్తారు
ఈ అనంత ప్రకృతిలోని స్త్రీశక్తికి ప్రతిరూపంగా మనం దుర్గాదేవిని భావిస్తాము. ఆ దేవిని కొలుచుకునేందుకు శరన్నవరాత్రులను నిర్వహిస్తాము. కానీ కేరళలోని ఒక గుడిలో దుర్గాదేవిని కొలవడమే కాదు... ఆ దుర్గకు ప్రతీకగా స్త్రీలకు కూడా పూజలను నిర్వహిస్తారు. ఇలాంటి విశేషాలు ఎన్నో కలిగిన ఆ ఆలయమే అలప్పుజా జిల్లాలో ఉన్న ‘చక్కులత్తుకవు’ అమ్మవారి ఆలయం.
శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన విషయం తెలిసిందే! ఆ దుర్గాదేవే ఇక్కడి పంపానదీ తీరాన చక్కులత్తుకవు అమ్మవారిగా వెలిసిందని నమ్ముతారు. ఈ అమ్మవారు చాలా శక్తిమంతమైనదనీ... ఆమె ముందు ఎలాంటి కోరికను ఉంచినా చిటికెలో నెరవేరుతుందనీ భక్తుల నమ్మకం. అందుకే కేరళ నలుమూలల నుంచీ భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు.
ప్రతిమాసంలోనూ వచ్చే తొలి శుక్రవారాన్ని అమ్మవారికి మరింత విశిష్టంగా భావిస్తారు. మద్యం, గంజాయి లాంటి వ్యసనాల నుంచి తప్పించుకోలేని వ్యక్తులను ఈ తొలి శుక్రవారం రోజున ఆలయానికి తీసుకువస్తారు. వ్యసనాన్ని మానేస్తామంటూ వారి చేత శపథం చేయిస్తారు. ఆ రోజున వారికి ఆలయ నిర్వాహకులు ‘ఔషధ వెల్లం’ అనే ఓ ప్రత్యేకమైన తీర్థాన్ని అందిస్తారు. అనేక ఔషధాలతో చేసిన ఈ తీర్థాన్ని అమ్మవారి ముందు ఉంచగానే... సదరు తీర్థానికి అద్భుతమైన ప్రభావం లభిస్తుందట. ఆ తీర్థాన్ని తాగిన భక్తులు తమ వ్యసనం నుంచి ఇట్టే దూరమైపోతారట.
ఈ ఆలయంలో జరిగే నారీపూజది మరో విశేషం. ఆ సందర్భంగా స్త్రీలను సాక్షాత్తు ఆ అమ్మవారిగా భావించి ఆమెకు పాదపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వేలాదిమంది ఆడవారు వచ్చేస్తారు. ఇక డిసెంబరులో జరిగే ‘పొంగలా’ ఉత్సవానిది మరో ప్రత్యేకత. చాలా ఏళ్ల క్రితం ఒక వేటగాడి కుటుంబం ఉండేదట. పగలంతా అడవిలో గడిపే ఆ వేటగాడు... సాయంవేళకి ఇంటికి చేరుకుని ఆహారాన్ని వండుకుని అమ్మవారికి నివేదించేవాడు. ఒక రోజున అడవిలో తిరుగుతున్న వేటగాడు సమయం మించిపోతున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. సాయంవేళకి చీకట్లు ముసురుకోవడంతో... ఆ వేళ అమ్మవారికి ఆహారాన్ని నివేదించలేకపోయానే అని బాధతో క్రుంగిపోయాడు. ఆ బాధతో అతను ఇంటికి చేరుకోగానే... అక్కడ ఆహారపదార్థాలన్నీ సిద్ధంగా ఉండటం కనిపించింది. ‘నా భక్తులైన మీ కోసం నేనే స్వయంగా ఈ ఆహారాన్ని వండాను’ అన్న అమ్మవారి మాటలూ వినిపించాయి. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఏటా భక్తులు అమ్మవారి ఆలయం ముందు పొంగలి వండి ఆమెకు సమర్పిస్తూ వస్తున్నారు. ‘పొంగలా’ సందర్భంగా పొంగలి వండేందుకు కూర్చునే స్త్రీల వరుస కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ఉంటుందట. ఆలయపూజారి గుడిలోంచి అందించే పవిత్రాగ్నితో ఆడవారు ఒకరికొకరు అందించుకుంటూ ఈ పొంగలి వంటకాన్ని వండుతారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక గద్ద తిరుగుతుండటాన్ని కూడా గమనించవచ్చునట.
ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ అమ్మవారిని అసంఖ్యాకంగా భక్తులు వస్తుంటారు. అయ్యప్పస్వామిలాగానే ఈ అమ్మవారి కోసం కూడా ఇరుముడి కట్టి 12 రోజుల పాటు నిష్టగా ఓ దీక్షని పాటిస్తుంటారు.
సతీదేfr శరీరభాగాలు పడిన శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. కానీ వేర్వేరు గ్రంథాలలో ఈ సంఖ్య వేర్వేరుగా కనిపిస్తుంది. 4, 51, 55, 108... ఇలా వేర్వేరుగా ఈ శక్తిపీఠాలను పేర్కొంటారు. చాలా సందర్భాలలో వాటిలో ‘హింగ్‌లాజ్‌దేవి’ ని కూడా ఓ శక్తిపీఠంగా పేర్కొనడం గమనించవచ్చు. పాకిస్తాన్‌లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ హింగ్‌లాజ్ దేవి ఆలయం.
స్థలపురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు. ఒక చిన్నగుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని ‘హింగళము’ అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్‌లాజ్‌మాత అన్న పేరు వచ్చిందని అంటారు.
మరో ఐతిహ్యం ప్రకారం ఒకప్పుడు హింగులుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగులుడు ఈ గుహలోకి ప్రవేశించాడు. అతని వెనకే గుహలోకి వెళ్లిన అమ్మవారు, హింగులుడిని సంహరించారు. అలా అమ్మవారికి హింగ్‌లాజ్ దేవి అన్న పేరు స్థిరపడింది.
హింగ్‌లాజ్‌దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్య ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంత కష్టపడనవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే... భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా... హింగ్‌లాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని ఓ నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ తల్లి కులదైవం. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్‌లాజ్‌దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకని వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు.
హింగ్‌లాజ్‌దేవిని హిందువులు కొలవడం సరే! కానీ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించడం ఓ విశేషం. వారంతా ఈ ఆలయాన్ని ‘నానీ కీ మందిర్’ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. స్థానికులలో ఇలాంటి భక్తి ఉండబట్టే... పాకిస్తాన్‌లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా ‘హింగ్‌లాజ్ మాత’ ఆలయం మాత్రం ఇంకా చెక్కుచెదరకుండానే ఉంది.
జీవితంలో అందరికీ అన్నీ ఉండవు. అన్ని చోట్లా ఒకే తరహా ఫలితాలు రావు. ఈ విషయాలు మనకి తెలిసినవే! కానీ ఇలా వేర్వేరు ఫలితాల వెనక ఏదన్నా లెక్క ఉందా అన్న ఆలోచన కలిగింది ‘పేరెటో’ (pareto) అనే ఇటాలియన్ ఆర్థికవేత్తకి. మన జీవితంలో కనిపించే 80 శాతం ఫలితాలకు 20 శాతం కారణాలే ఉంటాయని ఆయన ఓ సూత్రం రూపొందించాడు. ఆ తర్వాత కాలంలో ఆయన పేరు మీదగానే ఈ సూత్రం pareto principle పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ సూత్రాన్ని కాస్త జాగ్రత్తగా పాటిస్తే మన జీవితాలే మారిపోతాయని ఓ నమ్మకం.
Pareto principleకి 80:20 rule అన్న పేరు కూడా ఉంది. ఏ రంగంలో చూసినా ఈ సూత్రం పనిచేస్తూ ఉంటుందని అంటారు. ఉదాహరణకు సంపదనే తీసుకోండి! మన సమాజంలో ఉండే సంపదలో 80 శాతం సంపద 20 శాతం మంది దగ్గరే కనిపిస్తుంది. సాఫ్టవేర్ రంగంలో 20 శాతం తప్పుల వల్లే 80 శాతం సమస్యలు తలెత్తుతాయని తేలింది. ఆఖరికి మన చుట్టూ జరిగే 80 శాతం నేరాలకి కారణం 20 శాతం మంది నేరస్తులే అని కూడా వెల్లడయ్యింది.
ఈ 80:20 సిద్ధాంతాన్ని పరిశ్రమలకి కూడా అన్వయించవచ్చు. ఆఫీసుల్లో వచ్చే 80 శాతం ఫలితాలకి అందులో పనిచేసే 20 శాతం మందే కారణం అవుతుంటారట. ఆ 20 శాతం మందినీ గుర్తించి ప్రోత్సహించడం, మిగతా కార్మికులని మరింత జాగ్రత్తగా నియంత్రించడం చేస్తే... మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నది నిపుణులు సూచిస్తున్నారు.
ఈ pareto principleని తొలిసారిగా ఎప్పుడో 1896లో ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. కంప్యూటర్లు వచ్చాయి, ప్రపంచీకరణ జరిగింది. అయినా ప్రతి కొత్త రంగంలోనూ ఈ సిద్ధాంతం పనిచేయడం ఆశ్చర్యకరమే! అందుకే ఓ అడుగు ముందుకు వేసి అసలు ప్రకృతిలోనే ఈ సూత్రం ఇమిడి ఉందని అంటున్నారు. మన కంటి ముందు కనిపించే 80% పంటలకు కారణం, 20% విత్తనాలే అన్న వాదనా ఉంది.
ఇంత ప్రత్యేకమైన ఈ 80:20 సిద్ధాంతం మన నిజజీవితంలో కూడా ఉపయోగపడుతుందన్నది ఓ వాదన. ఉదయాన్న లేచిన వెంటనే మనం ఆలోచించే తీరు మిగతా రోజునంతా ప్రభావితం చేస్తుందట. ఏదన్నా పనిచేసే ముందు, ఆ పని ఎలా పూర్తిచేయాలా అని కాసేపు ప్రణాళిక వేసుకోవడం వల్ల 80 శాతం పని సులువుగా సాగిపోతుందట. ఏదన్నా నిర్ణయం తీసుకునేముందు అసలు మన ముందు ఉన్న ఎంపికలు (choices/ directions) ఏమిటి అని కాసేపు ఆలోచిస్తే... 80 శాతం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందట. అంటే ఓ 20 శాతం పరిస్థితులను మనం జాగ్రత్తగా అదుపుచేయగలిగితే, 80 శాతం ఫలితాలు దక్కితీరతాయన్నమాట. ఇదేదో బాగానే ఉంది కదా!
తిరుమల బ్రహ్మోత్సవాలలో ఐదోరోజున ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతర రోజులలో స్వామివారు ఏదన్నా వాహనం మీద ఊరేగితే.... ఐదవ రోజున మోహినీ అవతారంగా మారి పల్లకీ మీద ఊరేగుతారు. లోకకళ్యాణం కోసం స్వామివారు అసంఖ్యాకమైన అవతారాలు ధరిస్తూ ఉంటారు. కానీ వాటిలో మోహినీ అవతారానిది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే...
మోహానికి ప్రతిరూపమే మోహిని. ఈ అవతారపు మూలాలు క్షీరసాగరమథనంలోనే కనిపిస్తాయి. రాక్షసులకు అమృతం దక్కకుండా, వారి దృష్టిని మరల్చేందుకు విష్ణుమూర్తి దాల్చిన రూపే ‘మోహిని’. ఆ మోహిని మాయలో పడిన రాక్షసులు అమృతాన్ని సైతం పోగొట్టుకుంటారు. పైకి సరదాగా కనిపించే ఈ కథ వెనుక జీవితపు సత్యం కూడా గోచరిస్తుంది. క్షీరసాగరమథనాన్ని సంసారపు జంఝాటాలతో పోలుస్తారు. ఇందులో మోహానికి కనుక లోబడిపోతే, మనిషిలోని తామస తత్వం రాక్షస స్థాయికి దిగజారిపోతుంది. ఆ మోహాన్ని దాటుకుంటేనే జన్మరాహిత్యం అనే అమృతం దక్కేది.
మోహినీ అవతారం క్షీరసాగరమథనంలోనే కాకుండా ఇతర సందర్భాలలో కూడా ప్రస్తావన వస్తుంది. భస్మాసురుడనే రాక్షసుని మోహితుడిగా చేసి, తన చేత్తో తనే భస్మమయ్యేట్లుగా చేస్తుంది మోహిని. గణేశుని పురాణంలో విరోచనుడనే రాక్షసుని సంహరించడంలో కూడా మోహిని పాత్ర వహించినట్లు తెలుస్తుంది.
మోహిని అంటేనే సమ్మోహనం కలిగించేది అని అర్థం. ఆ సమ్మోహనానికి శివుడు సైతం ఆకర్షితుడు కాక తప్పనేలేదు. అలా ఆ పరమేశ్వరునికీ, మోహినికీ మధ్య జన్మించినవాడే ‘అయ్యప్ప’. అందుకే ఆయనను హరిహరసుతునిగా పిలుస్తారు. హరిహరులు మధ్య బేధం లేదని నిరూపించే వృత్తాంతమే అయ్యప్ప జననం. కొన్ని పురాణాలలో హనుమంతుని సైతం హరిహరసుతునిగానే పేర్కొంటారు. హరిహరుల కలయిక భౌతికదృష్టిలో విచిత్రంగా తోచినా... వారిరువురూ ఒక్కటే అని చాటి చెప్పడమే ఇలాంటి కథలలోని పరమార్థంగా తోస్తుంది.
కొన్ని ప్రదేశాలలో మోహినిని శివుని భార్యగానే కొలుస్తారట. మహారాష్ట్రలో శివుని అవతారమైన ఖండోబా భార్యను ‘మహల్సా’ అని పిలుస్తారు. ఆమె మోహినీయే! సాయి ముఖ్య భక్తుని పేరు ‘మహల్సాపతి’. అంటే మోహినీదేవి భర్త అని అర్థం. ఇక మన తెలుగునాట కూడా మోహినీకి తగిన స్థానమే కనిపిస్తుంది. మోహినీదేవి జడ నుంచి ఒక పూవు ‘రాలి’ పడిందట. ఆ ‘రాలి’ అన్న పదం నుంచే గోదావరి జిల్లాలోని ‘ర్యాలి’ అనే క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి ముందుభాగాన పురుషునిగానూ, వెనక మోహినిగానూ కనిపిస్తారు.
తత్వవేత్తల దృష్టిలో విష్ణుమూర్తి మాయావిలాసమే మోహిని అవతారం. ఆయన ఈ లోకాన్ని నడిపించే స్థితికారుడు. మరి ఈ లోకం నిజమే అన్న భ్రాంతిలో జీవులు మనుగడ సాగించాలంటే ‘మాయ’ ఉండాల్సిందే కదా! ఆ మాయకు ప్రతిరూపమే మోహిని! అందుకనే ఈ రూపుని విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటిగా ఎంచరు. ఇదీ మోహినీ అవతారపు ప్రత్యేకత.
ఇక బ్రహ్మోత్సవాల ఘట్టానికి తిరిగివస్తే.... ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంగా ఊరేగే వేంకటేశుడు, సాయంవేళలో తన నిజవాహనుడైన గరుడుని ప్రతిరూపం మీద ఊరేగుతారు. గరుడుని స్వామివారి తొలిసేవకునిగానూ, పరమభక్తునిగానూ ఎంచుతారు. అందుకే తమిళురు ఆయనను గరుడాళ్వారుగా పిలుస్తారు.
బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయాన స్వామి హనుమంత వాహనం మీద ఊరేగుతారు. త్రేతాయుగంలో రామునిబంటుగానూ, ద్వాపరయుగంలో కృష్ణుని తోడుగానూ నిలిచిన హనుమంతుడు... కలియుగంలోనూ స్వామి సేవలో ఉంటాడనేందుకు ప్రతీకే హనుమంత వాహనం. రాముడు, కృష్ణుడూ ఆ వేంకటేశుడే అని తేల్చి చెప్పడమే ఈ సేవలోని ఆంతర్యం. ఆరవరోజు సాయంవేళ స్వామి గజవాహనం మీద ఊరేగుతారు.
గజవాహనం అనగానే గజేంద్రమోక్షపు ఘట్టం గుర్తుకురాక మానదు. ఎంతటివారైనా, ఎలాంటి ఆపదలో ఉన్నా... ఆ విష్ణుమూర్తిని తల్చుకోగానే ఉన్నఫలంగా బయల్దేరివస్తాడని ‘గజేంద్ర మోక్ష ఘట్టం’ సూచిస్తుంది. అంతేకాదు! ఏనుగు అలవికాని శక్తికీ, మదానికీ సూచన. స్వామి ఆరాధన భక్తికీ, నమ్రతకూ చిహ్నం. ఆ భక్తితోనే మనలోని పశుమదాన్ని జయించగలం అన్న తత్వమూ గజవాహనంలో కనిపిస్తుంది.
తెలుగునాట అమ్మవారి దసరా ఎంత వేడుకగా సాగుతోందో... తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు కూడా అంతే ఘనంగా జరుగుతుంటాయి. తిరుమల అనగానే వేంకటేశ్వరుని వైభవంతో పాటుగా, ఆ వైభవాన్ని కొనియాడిన అన్నమాచార్యులవారూ గుర్తుకు రాక మానరు. అన్నమాచార్యునికి తెలుగునాట తొలి వాగ్గేయకారునిగా గుర్తింపు ఉంది. కానీ ఆయన భార్య తిరుమలమ్మ తెలుగులో తొలి కవయిత్రి అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు.
15వ శతాబ్దానికి చెందిన తిరుమలమ్మ ‘సుభద్రా కళ్యాణం’ అనే ద్విపద కావ్యాన్ని రాశారు. భర్త అన్నమయ్య ప్రభావమో, తిరుమలేశుని మీద ఉన్న భక్తి భావమో కానీ తిరుమలమ్మ ఈ కావ్యాన్ని చాలా అద్భుతంగా రాశారని అంటారు. 1100లకు పైగా పాదాలతో సాగే ఈ కావ్యంలో అర్జునుడే కథానాయకుడు. కానీ ఇందులోని కథనం అంతా తెలుగునాట సాగుతున్నట్లే కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయాలు ఇందులో ఎదురుపడతాయి. దక్షిణాది పుణ్యక్షేత్రాలైన తిరుపతి, అహోబిళం, కంచి, కావేటి క్షేత్రాల ప్రసక్తీ ఉంటుంది.
శ్రీరమావల్లభులు - శ్రీకృష్ణు లెలమి/ ద్వారకాపట్టణము - తమ రేలుచుండ/ శ్రీకాంతపతికృపను - జెలగి పాండవులు/ ప్రాకటంబుగను ద్రౌ - పదిని బెండ్లాడి/ రంతే నింద్రప్రస్థ - మను పట్టణమున/ సంతసంబున నున్న – సమయంబునందు/ సురముని యేతెంచె - సుదతి పూజించె... అంటూ పాండవులు ఇంద్రప్రస్థములో ఉన్న ఘట్టంతో ఈ కావ్యం మొదలవుతుంది. ఆ తర్వాత సుభద్ర అర్జునుల మధ్య ప్రేమ చిగురించడం, అది అనేక అడ్డంకులను దాటుకుని పరిణయానికి దారి తీయడంతో కావ్యం ముగుస్తుంది.
సుభద్రా కళ్యాణం నిజంగా తిమ్మక్క (తిరుమలమ్మకు మరో పేరు) రాసినదేనా అనే విషయం మీద కొంత వాదోపవాదాలు ఉన్నాయి. అయితే కావ్యం చివరలో ‘ఆసుభద్రాదేవి - ఆ యర్జునుండు/ సంతోషమున నుండ్రి - సర్వ కాలమ్ము/ అవనిలో తాళ్ళపాకాన్నయ్య గారి/ తరుణి తిమ్మక చెప్పె - దాను సుభద్ర/ కళ్యాణ మను పాట - కడు మంచి తేట’ అంటూ సాగే ద్విపదలు, ఈ రచన తిమ్మక్కదే అని చెప్పకనే చెబుతున్నాయి. పైగా ఈ కావ్యంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే, ఇది ఒక స్త్రీ చేసిన రచనే అని స్పష్టమవుతుంది.
తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన భార్య తిమ్మక్కే కాదు... వారిద్దరికీ పుట్టిన నరసింహయ్య కూడా గొప్ప కవి అంటారు. ఈయన ‘కవికర్ణ రసాయనం’ అనే కావ్యాన్ని రాశాడట. ఇలా అన్నమయ్య వంశవృక్షాన్ని గమనిస్తూ పోతే చాలామంది కవులే తేలుతారు. వారికి మూలపురుషునిగా అన్నమయ్య దంపతులు కనిపిస్తారు.
ఓ పిల్లవాడు తరగతిలో అందరికంటే వెనకబడిపోయి ఉంటాడు. ఒకో తరగతీ దాటే కొద్దీ అతను మొద్దుగా పేరు తెచ్చేసుకుంటాడు. ఇక అతన్ని బాగు చేయడం ఎవరి తరమూ కాదని అంతా నిశ్చయించుకుంటారు. ఇంతలో ఒక ఉపాధ్యాయుడి దృష్టి ఆ పిల్లవాడి మీద పడుతుంది. కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లవాడు ఓ ఆణిముత్యంగా మారతాడన్న ఆశ ఉపాధ్యాయుడికి ఏర్పడుతుంది. అంతే! అక్కడి నుంచి ఆ పిల్లవాడి జీవితమే మారిపోతుంది. ఎందుకూ పనికిరానివాడు కాస్తా... అద్భుతమైన ఫలితాలు సాధించడం మొదలుపెడతాడు.
వినడానికి ఇదంతా ఏదో సినిమాకథలాగా తోస్తోంది కదా! కానీ నిజజీవితంలో ఇది నూటికి నూరుపాళ్లూ సాధ్యమే అంటున్నారు. ఈ ప్రభావానికి ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్’ అన్న పేరు కూడా పెట్టారు. పిగ్మేలియన్ ఒక గ్రీకు పురాణ పాత్ర పేరు. అతను ఓ గొప్ప శిల్పకారుడట. ఏ అమ్మాయి వంకా కన్నెత్తయినా చూడని, చూసినా ఆకర్షింపబడని ప్రవరాఖ్యుడట. అలాంటి పిగ్మేలియన్ ఓ అందమైన అమ్మాయి శిల్పాన్ని చెక్కుతాడు. తాను చెక్కిన శిల్పాన్ని చూసి తనే మనసు పారేసుకుంటాడు. చివరికి దేవుడి కరుణతో ఆ శిల్పానికి ప్రాణం వస్తుంది. అలా ప్రాణం వచ్చిన శిల్పాన్ని పిగ్మేలియన్ వివాహం చేసుకోవడంతో అతని కథ సుఖాంతం అవుతుంది. మన ఆశలకు అనుగుణంగా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం అన్న ఆలోచనతో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్’ అన్న పేరు పెట్టారన్నమాట!
రోసెంతాల్, జాకబ్‌సన్ అనే ఇద్దరు పరిశోధకులు 1968లో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్’ ప్రతిపాదన చేశారు. తమ ప్రతిపాదనని నిరూపించడం కోసం వారు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలని ఎంచుకొన్నారు. ఆ పాఠశాలలో పిల్లలందరి ఐక్యూలని నమోదు చేశారు. ఆ తర్వాత వారి ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి వారిలో కొందరు పిల్లలు ఐక్యూ చాలా అద్భుతంగా ఉందనీ... ఆ పిల్లలు ఎప్పటికైనా మంచి ఫలితాలు సాధిస్తారనీ చెప్పారు. నిజానికి వాళ్లు సేకరించిన వివరాలు వేరు, ఉపాధ్యాయులకు చెప్పిన వివరాలు వేరు. కానీ పరిశోధకులు చెప్పిన వివరాలను నమ్మిన ఉపాధ్యాయులు, తమ నమ్మకానికి అనుగుణంగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. తెలిసో, తెలియకో అద్భుతాలు సాధించగలరు అనే పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఉపాధ్యాయులు దృష్టి పెట్టిన పిల్లలు నిజంగానే మంచి ప్రతిభను కనబరిచారు.
ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్ కేవలం బడిలోనే కాదు- ఆఫీసులో, ఇంట్లో, రాజకీయాల్లో... ఇలా మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సత్ఫలితాలను సాధిస్తుందని చెబుతున్నారు. ఎదుటివ్యక్తి పనికిమాలినవాడు అన్న భావనతో ఉంటే, అతనితో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. అలా కాకుండా అతనేదో సాధించగలడు అన్న నమ్మకంతో ఉంటే, అతని పట్ల మన ప్రవర్తించే తీరు మారిపోతుంది. మన ఆకాంక్షలు అతని మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు, అవతలివ్యక్తి కూడా ఓ నాలుగడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తాడు. పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం కాదు. ఒకోసారి మనమీద మనం నమ్మకాన్ని ఏర్పరుచుకున్నప్పుడు కూడా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం. దీన్నే self-fulfilling prophecy అంటారు.
పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఏ మేరకు పనిచేస్తుంది? అది అనవసరమైన ఆకాంక్షలకు కారణం అవుతుందా! ఎదుటివ్యక్తి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తుందేమో! లాంటి సందేహాలు లేకపోలేదు. అయితే జీవితంలో ఏమీ సాధించలేము అని నిరాశ చెందే సందర్భాలలోనూ, అవతలి వ్యక్తి ఎందుకూ పనికిరాడన్న అభిప్రాయానికి వచ్చేసినప్పుడూ ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ని కాస్త పరీక్షిస్తే తప్పకుండా భిన్నమైన ఫలితం వచ్చి తీరుతుందంటున్నారు.
ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా! అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహత్తుని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు. నవరాత్రుల సందర్భంగా ఆ లలితా సహస్రనామానికి చెందిన ప్రత్యేకతలు కొన్ని...
- అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలోనూ అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి ‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు.
- లలితాసహస్రనామం ఆరంభంలోనే ‘ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టిస్థితిలయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి.
- చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాదు! మరియు, ఇంకా లాంటి ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.
- లలితాసహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో, మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే! ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తోంది.
- లలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్, అంగన్యాసమ్, కరన్యాసమ్, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది. ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత.
- సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి... ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి.
- అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా.... వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు. వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. తమిళురు అగస్త్యుని తొలిసిద్ధునిగా ఆరాధిస్తారు. మరి వీరికే ఆరాధ్యనీయమైన ఈ స్తోత్రం, సామాన్యులకెంత మేలు చేస్తుందో కదా!
- లలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైనవారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞానమార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు. అమ్మవారి బీజాక్షరాలు, సృస్టిరహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి.
ఎంత చెప్పుకొన్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా... ఆ నామాలను శ్రద్ధగా పఠించినా, విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.
21వ శతాబ్దం వచ్చేసింది. ప్రపంచీకరణ పుణ్యమా అని అందరికీ అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్యపరంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడపిల్లల పట్ల వివక్షత తగ్గిందన్న అంచనాలూ ఉన్నాయి. నిజానికి ఆడపిల్లల జీవితాలు ఏమాత్రం మారలేదంటూ ఓ పరిశోధన వెలువడింది.
ఇంగ్లండులోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆడపిల్లల మనస్థితి మీద ఒక అధ్యయనం చేశారు. ఒకటీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గణాంకాలను సేకరించారు. ఇందుకోసం 2000-2001లో జన్మించిన దాదాపు పదివేల మంది పిల్లలను నిశితంగా గమనించారు. 3, 5, 7, 1, 14 ఏళ్లలో వారి మనస్తత్వం ఎలా ఉందో అంచనా వేసే ప్రయత్నం చేశారు. అనేక ప్రశ్నాపత్రాల ద్వారా పిల్లల మనస్థితిని గమనించారు.
మగపిల్లలైనా, ఆడపిల్లలైనా చిన్నప్పుడు అంతా సంతోషంగానే కనిపించారు. వారి మనసుల్లో పెద్దగా కలత కనిపించలేదు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ... ఆడపిల్లల మనసు కుంగిపోవడాన్ని గమనించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... పధ్నాలుగో ఏడు వచ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడపిల్లలలో డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించాయి. అదే మగపిల్లలో అయితే కేవలం పదిశాతం లోపుమంది పిల్లలలోనే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. కుటుంబ ఆర్థికపరిస్థితులు కనుక బాగోలేకపోతే.... డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండటం మరో విషాదం.
సాధారణంగా పిల్లలు తమ మనసులోని దుగ్ధను స్పష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్దలే, పిల్లల మనసులోని విచారాన్ని ఊహించే ప్రయత్నం చేయాలి. దురదృష్టవశాత్తూ మగపిల్లలని మనసుని పసిగట్టేసే పెద్దలు, ఆడపిల్లల మనసులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేకపోతున్నారట. దాంతో ఆడపిల్లల మనసుని సాంత్వన పరిచే పరిస్థితులు లేక, వారు మరింతగా డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఎదుర్కొనే పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మానసికంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా వారి మనసుల మీద చెరగని గాయం చేస్తాయి.
మగపిల్లలతో పోలిస్తే, ఆడపిల్లలని మరింత కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన గుర్తుచేస్తోంది. దీనిని తల్లిదండ్రులు ఓసారి జాగ్రత్తగా గమనిస్తే... ఆడపిల్లల భవిష్యత్తు మరింగ బాగుంటుందేమో!
అష్టాదశ శక్తిపీఠాల వెనక ఉన్న కథ అందరికీ తెలిసిందే! దక్షుని యజ్ఞంలో జరిగిన అవమానానికిగాను తనని తాను దహించివేసుకున్న సతీదేవి శరీరాన్ని చేపట్టి, శివుడు తాండవాన్ని ఆడసాగాడు. ఆ శరీరాన్ని విడదీసి, శివుని సాధారణస్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ శరీరభాగాలు పడిన ప్రాంతాలను మనం అష్టాదశ పీఠాలుగా కొలుస్తున్నాము. వాటిలో ఒకటి ఒడిషా రాష్ట్రంలో ఉన్న బిరాజదేవి. ఈమెనే గిరిజాదేవిగా కూడా పిలుస్తారు. ఆ క్షేత్ర విశేషాలు...
ఒడిషాలోని భువేనేశ్వర్‌కు 120 కిలోమీటర్ల దూరంలో జైపూర్ అనే పట్నం ఉంది. ఆ పట్నాన్ని ఒకప్పుడు జగతి కేశరి అనే రాజు పాలించాడట. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆ జగతి కేశరే ఇక్కడి గిరిజా అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించారని అంటారు. అష్టాదశ శక్తిపీఠంగానే కాకుండా ఈ క్షేత్రానికి ఇతరత్రా ప్రత్యేకతలు కూడా చాలానే కనిపిస్తాయి. వాటిలో కొన్ని...
- మహాభారత యుద్ధానంతరం ఇక్కడ భీముని గద ఉండిపోయిందట. అందుకే దీనిని గదాక్షేత్రంగా పిలుస్తారు.
- గయాసురుడు అనే రాక్షసుని దేవతలు సంహరించినప్పుడు... ఆయన తల గయలోనూ, పాదాలు పిఠాపురంలోనూ, నాభి ఇక్కడి జైపూర్‌లోనూ పడ్డాయని ఐతిహ్యం. అందుకే పిఠాపురాన్ని పాదగయగానూ, జైపూర్ క్షేత్రాన్ని నాభిగయగానూ పేర్కొంటారు.
- ఈ జైపూర్ పట్నం చివర వైతరణి నది ప్రవహిస్తోంది. ఆ వైతరణి నది తీరాన బ్రహ్మదేవుడు అమ్మవారి కోసం యజ్ఞం చేసినప్పుడు, అమ్మవారు పార్వతీదేవి ప్రత్యక్షం అయ్యిందట.
ఇక్కడ గిరిజాదేవి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో కనిపిస్తుంది. అయితే అమ్మవారి అలంకారం తర్వాత కేవలం, ఆమె మోము మాత్రమే కనిపిస్తుంది. ఈ అమ్మవారిని పూజించేందుకు ఏడాది పొడవునా ఏదో ఒక ప్రత్యేక సందర్భాలు ఉంటూనే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు మాఘ అమావాస్యకి అవతరించారని అంటారు. అందుకే ఆరోజున త్రివేణీ అమావాస్య పేరుతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక దసరా సమయంలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఏకంగా పదహారు రోజుల పాటు ఇక్కడ దసరా మహోత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారిని 16 కళలకు అధినేత్రిగా పేర్కొంటారు కదా! బహుశా అందుకనే ఇలా 16 రోజుల పండుగను నిర్వహిస్తారేమో. ఆ సమయంలో సింహధ్వజం మీద అమ్మవారిని ఊరేగించే వేడుకను చూసేందుకు లక్షలాది మంది జనం తరలివస్తారు.
బిరజాదేవి ఆలయంలో కనిపించే మరో ప్రత్యేకత అక్కడి పిండప్రదానం. బిరజాదేవి ఆలయానికి సమీపంలో ఒక బావి ఉంటుందట. ఆ బావిలో పెద్దలకు తర్పణాలను విడవడం శుభస్కరం అని ఓ నమ్మకం. ఇలా విడిచిన తర్పణాలు నేరుగా కాశీకి చేరతాయట. ఒకప్పుడు ఒడిషా ప్రాంతాన్ని ఉత్కళదేశంగా పేర్కొనేవారు. అప్పట్లో బిరజాదేవిని ఆ ఉత్కళదేశాన్ని చల్లగా కాచుకునే రాజ్యదేవతగా భావించేవారు. కాలం మారినా, రాజ్యాలు చెదిరినా కూడా ఇప్పటికీ బిరజాదేవి అమ్మవారిని తమ జీవితాలను పాలించే అనుగ్రహదేవతగానే నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే లక్షలాది మంది జనం ఏటా బిరజాదేవి ఆలయాన్ని చేరుకుంటారు. వారి నమ్మకాలు ఎప్పుడూ వమ్ము కాలేదన్నది భక్తుల మాట.
పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే!
దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే!
‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు.
అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది.
రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు.
రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది.
ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు.
రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు.
స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా!
నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ అలంకారాలలో కొలుచుకుంటారు. ఈ అలంకారాలలో ఒక ఆలయానికీ మరో ఆలయానికీ పొంతన ఉండి తీరాలన్న నియమం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయా సంప్రదాయాలను బట్టి సాగుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అమ్మవారిని దుర్గాదేవి రూపంలోనే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందుకనే దసరాను అక్కడ దుర్గాపూజ అని పిలుస్తుంటారు. ఈ దుర్గాపూజలోని తొమ్మిది రోజులలోనూ అమ్మవారిని నవదుర్గల రూపంలో అలంకరిస్తుంటారు. అమ్మవారు దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఎత్తిన అవతారమే దుర్గాదేవి అవతారం. ఈమెలోని తొమ్మిది విభిన్న తత్వాలే నవదుర్గలు. ఇవే వారి పేర్లు!
శైలపుత్రి – దక్షయజ్ఞంలో తనకు జరిగిన అవమానానికి, శివుని భార్య సతీదేవి దహనమైపోయిన సంగతి తెలిసిందే! అలా మరణించిన సతి, పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆమే శైలపుత్రి లేదా పార్వతి. వృషభవాహనం మీద త్రిశూలం ధరించి ఉన్న ఈమెను ఆరాధిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు.
బ్రహ్మచారిణి – పార్వతిగా జన్మించిన సతీదేవి పరమేశ్వరుని తన భర్తగా పొందేందుకు తీవ్రమైన తపస్సుని సాగించింది. పాదచారియై... కుడిచేత జపమాలను, ఎడమచేతిలో కమండలాన్నీ ధరించిన రూపం ఈమెది. ఈ రూపాన్ని ఆరాధించేవారు ధ్యానంలో అత్యున్నత స్థితిని పొందగలరనీ, మోక్షాన్ని సాధించగలరనీ నమ్మకం.
చంద్రఘంట – ఈ అమ్మవారి శిరస్సు మీద ఉండే చంద్రుడు ఘంటాకృతిలో కనిపిస్తాడు. అందుకనే ఈమెను చంద్రఘంటగా పిలుస్తారు. సింహవాహనం మీద ఉండే ఈ అమ్మవారు ఎనిమిది చేతులలో దర్శనమిస్తారు. దుష్టశిక్షణ కోసం గద, విల్లంబు, త్రిశూలం, ఖడ్గాలని ధరించి కనిపిస్తారు. అదే సమయంలో తన భక్తులకు మోదాన్ని కలిగించేందుకు కమలము, అభయముద్ర, కమండలము, జపమాలతో దర్శనమిస్తారు.
కూష్మాండ – ఈ లోకాన్ని సృష్టించిన తల్లి అని ఈ పేరుకి అర్థం. మరి సూర్యుడు లేకపోతే ఈ లోకంలో అంధకారమూ, ఆకలీ, అనారోగ్యాలూ ప్రబలుతాయి కదా! అమ్మవారి తేజస్సే ఆ సూర్యుడు అని అంటారు. అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి ఆ సూర్యుని ధరించి కనిపిస్తారు. ఈ దేవిని కొలిచినవారి ఆయురారోగ్యాలకు లోటు ఉండదని అంటారు.
స్కందమాత – ఈ అవతారంలో బాలకుమారస్వామి (స్కందుడు) ఒడిలో ధరించిన రూపులో అమ్మవారు కనిపిస్తారు. శివగణాలకు స్కందుకు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే ఇరువురి ఆశీస్సులూ లభిస్తాయని అంటారు.
కాత్యాయని – పూర్వం కాత్యాయనుడే మహర్షి అమ్మవారు తన ఇంట జన్మించాలనే కోరికతో ఆమెను ఆరాధించాడట. అలా ఆయన ఇంట జన్మించిన తల్లే కాత్యాయని. అభయవర ముద్రలతో పాటుగా ఒక చేత ఖడ్గాన్నీ, మరో చేత పద్మాన్నీ ధరించి ఈ అమ్మవారు కనిపిస్తారు. ఖడ్గం ఆపదలను ఎదుర్కొనడానికి సూచన కాగా, పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయని అన్నమాట!
కాళరాత్రి – నల్లని రూపుతో, విరబోసుకున్న కేశాలతో, మెరుపులు చిమ్మే హారంతో కాళరాత్రిని తలపించే దేవి ఈమె. తనని ఆరాధించినవారి మనసులోని సకల భయాలనూ రూపుమాపగల చల్లని తల్లి. గార్ధభ వాహనం మీద కనిపించే ఈ తల్లి పేరు వింటే భూతప్రేతాలు సైతం దరిచేరవని అంటారు.
మహాగౌరి – తెలుపు లేదా ఎరుపు రంగుని గౌరవర్ణం అంటారు. పార్వతీదేవి, శివుని కోసం ఘోర తపస్సు చేయగా... ఆ వేడిమికి ఆమె శరీరం నలుపెక్కి పోయిందట. అంతట ఆ పరమేశ్వరుడు ఆమెను గంగాజలంతో అభిషేకించగానే తిరిగి గౌర వర్ణాన్ని పొందింది. అలాగే ఈ తల్లినా ఆరాధించే భక్తులు సకల పాపాలు, సకల భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని నమ్మకం.
సిద్ధిదాత్రి – ఈ ఎనిమిది రూపులనూ దాటిన తర్వాత కనిపించే అమ్మవారు సిద్ధిదాత్రి. అంటే సకల సిద్ధులనూ ప్రసాదించే తల్లి అని అర్థం. సిద్ధులంటే కేవలం ఇహపరమైన సిద్ధులే కాదు... కుండలినిలోని అన్ని ద్వారాలనూ ఛేదించుకుని సాధించే మోక్షాన్ని మించిన పరమసిద్ధి ఏముంటుంది. అందుకు సూచనగానే అమ్మవారు వికసించిన కమలం మీద ఆశీనురాలైనట్లు దర్శనమిస్తుంది.
ఈ నవదుర్గలో ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన రంగు, మంత్రం, గ్రహం ఉంటాయి. అంత లోతులకి వెళ్లేందుకు సాధ్యం కాకపోతే ఓం దేవీ శైలపుత్రైనమః, ఓం దేవీ బ్రహ్మచారిణైనమః... అంటూ ఆయా దేవతల పేరు మీదుగా వారిని తల్చుకోవచ్చు. లేదా ఈ క్రింది శ్లోకం ద్వారా ఆ నవదుర్గలనూ ఒకేసారి స్మరించవచ్చు..
‘ప్రథమం శైల పుత్రీతిచ ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ పంచమా స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ సప్తమా కాళరాత్రీచ అష్టమాచాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చేతి నవదుర్గా ప్రకీర్తితా’
పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి!
ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు.
ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు.
ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది.
దేశ విభజన ముందు ఇప్పటి పాకిస్తాన్‌లో కూడా లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు ఉండేవి. హిందూ, ముస్లిం తారతమ్యాలు లేకుండా స్థానికులంతా వాటిని ఆదరించేవారు. కానీ ప్రత్యేక దేశం ఏర్పడిన తర్వాత హిందూ ఆలయాలు జీర్ణావస్థకు చేరుకోసాగాయి. స్థానికుల స్వార్థం వల్లనో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానో ఘనత వహించిన ఆలయాలెన్నో శిథిలమైపోయాయి. వాటిలో ఒకటే ‘చూరియా దుర్గ’ ఆలయం.
పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ‘నంగర్‌పార్‌కర్’ అనే ఊరు ఉంది. ఒకప్పుడు అక్కడ అంతా నీరు ఉండేదట. ఆ నీటిని దాటుకుని ఆవలి ఒడ్డుకి చేరుకుంటేనే నాగరికత కనిపించేదట. అందుకనే ఈ ప్రాంతానికి ‘పార్‌కర్’ (దాటి వెళ్లాలి) అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఊరిలో ‘చూరియా జబల్’ అనే గ్రానైటు కొండ ఉంది. మిగతా ఎక్కడా కనిపించని విధంగా ఈ కొండరాయి ఎర్రటి రంగులో ఉండటం ఓ విశేషం. వేసవిలో ఈ కొండ నుంచి చిత్రవిచిత్రమైన శబ్దాలు రావడం మరో వింత. ఇవన్నీ కూడా ఆ కొండ మీద వెలిసిన అమ్మవారి మహత్తే అని కొందరి నమ్మకం.
చూరియా జబల్ కొండ మీద వెలసిన దేవిని ‘చూరియా దుర్గ’ అని పిలుస్తారు. చూరియా అంటే సింధీ భాషలో ‘గాజులు’ అని అర్థం. హిందూ సంప్రదాయంలో గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి, ఇక్కడి అమ్మవారికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. పేరు పెట్టడమే కాదు, ఈ కొండ చుట్టుపక్కల ఉండే జనం గాజుల తయారీ మీదే ఆధారపడుతూ ఉంటారు. తమ వృత్తిని ప్రతిబింబించేలా ఒంటినిండా గాజులు వేసుకుని కనిపిస్తారట.
చూరియా జబల్ ఆలయం భారత సరిహద్దుకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి పాకిస్తాన్లోని హిందువులు మాత్రమే కాకుండా... ఇండియా, నేపాల్ దేశాల నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారిని చూసేందుకు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా దసరా, శివరాత్రి సందర్భాలలో ఈ ఆలయానికి లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు.
అసలే హిందూ దేవాలయం, పైగా అరుదైన గ్రానైటు కొండ మీద ఉంది. దాంతో స్వార్థపరుల చూపు దీని మీద పడనే పడింది. 2011 శివరాత్రి తర్వాత ఈ కొండని తవ్వడం మొదలుపెట్టారు. వారి తవ్వకాలలో అమ్మవారి గుడిని చేరుకునే మార్గం కూడా ధ్వంసమైపోయింది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ విధ్వంసకాండని చూస్తూ ఊరుకుంది. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి ఆలయమైతే ఉంది కానీ... అది కూడా అతి త్వరలో అది కూడా కూలిపోయే ప్రమాదం లేకపోలేదు.
నంగర్‌పార్‌కర్‌లో దుర్గామాత ఆలయమే కాదు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన జైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఊళ్లో జైనులు చాలా ఎక్కువగా ఉండేవారట. పార్కర్ జైనులంటే గొప్ప పేరు ఉండేదట. దేశవిభజన తర్వాత జైనులు కాస్తా వలస వెళ్లిపోయారు. వారు నిర్మించిన దేవాలయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇలా ఒకటీ రెండూ కాదు... 14 అరుదైన జైన ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. యునెస్కో సైతం వీటిని సాంస్కృతిక సంపదగా గుర్తిస్తోంది. కానీ ఇవి కూడా శిథిలమైపోతున్నాయని వేరే చెప్పాలా!

పాకిస్తాన్‌లో శక్తిపీఠం – హింగ్‌లాజ్ మాత!

జీవితాన్ని మార్చేసే - Pareto principle

వేంకటేశ్వరుడు ధరించే స్త్రీ రూపం – మోహిని!

అన్నమయ్య భార్యా తక్కువేం కాదు!

ప్రతిభను పెంచే - Pygmalion effect

లలితా సహస్రనామం ప్రత్యేకత!

ఆడపిల్లల మనసు మరింత జాగ్రత్త!
21వ శతాబ్దం వచ్చేసింది. ప్రపంచీకరణ పుణ్యమా అని అందరికీ అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్యపరంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడపిల్లల పట్ల వివక్షత తగ్గిందన్న అంచనాలూ ఉన్నాయి. నిజానికి ఆడపిల్లల జీవితాలు ఏమాత్రం మారలేదంటూ ఓ పరిశోధన వెలువడింది.
ఇంగ్లండులోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆడపిల్లల మనస్థితి మీద ఒక అధ్యయనం చేశారు. ఒకటీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గణాంకాలను సేకరించారు. ఇందుకోసం 2000-2001లో జన్మించిన దాదాపు పదివేల మంది పిల్లలను నిశితంగా గమనించారు. 3, 5, 7, 1, 14 ఏళ్లలో వారి మనస్తత్వం ఎలా ఉందో అంచనా వేసే ప్రయత్నం చేశారు. అనేక ప్రశ్నాపత్రాల ద్వారా పిల్లల మనస్థితిని గమనించారు.
మగపిల్లలైనా, ఆడపిల్లలైనా చిన్నప్పుడు అంతా సంతోషంగానే కనిపించారు. వారి మనసుల్లో పెద్దగా కలత కనిపించలేదు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ... ఆడపిల్లల మనసు కుంగిపోవడాన్ని గమనించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... పధ్నాలుగో ఏడు వచ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడపిల్లలలో డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించాయి. అదే మగపిల్లలో అయితే కేవలం పదిశాతం లోపుమంది పిల్లలలోనే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. కుటుంబ ఆర్థికపరిస్థితులు కనుక బాగోలేకపోతే.... డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండటం మరో విషాదం.
సాధారణంగా పిల్లలు తమ మనసులోని దుగ్ధను స్పష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్దలే, పిల్లల మనసులోని విచారాన్ని ఊహించే ప్రయత్నం చేయాలి. దురదృష్టవశాత్తూ మగపిల్లలని మనసుని పసిగట్టేసే పెద్దలు, ఆడపిల్లల మనసులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేకపోతున్నారట. దాంతో ఆడపిల్లల మనసుని సాంత్వన పరిచే పరిస్థితులు లేక, వారు మరింతగా డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఎదుర్కొనే పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మానసికంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా వారి మనసుల మీద చెరగని గాయం చేస్తాయి.
మగపిల్లలతో పోలిస్తే, ఆడపిల్లలని మరింత కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన గుర్తుచేస్తోంది. దీనిని తల్లిదండ్రులు ఓసారి జాగ్రత్తగా గమనిస్తే... ఆడపిల్లల భవిష్యత్తు మరింగ బాగుంటుందేమో!
అంతులేని విశేషాలకు నిలయం - బిరాజదేవి ఆలయం
అష్టాదశ శక్తిపీఠాల వెనక ఉన్న కథ అందరికీ తెలిసిందే! దక్షుని యజ్ఞంలో జరిగిన అవమానానికిగాను తనని తాను దహించివేసుకున్న సతీదేవి శరీరాన్ని చేపట్టి, శివుడు తాండవాన్ని ఆడసాగాడు. ఆ శరీరాన్ని విడదీసి, శివుని సాధారణస్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ శరీరభాగాలు పడిన ప్రాంతాలను మనం అష్టాదశ పీఠాలుగా కొలుస్తున్నాము. వాటిలో ఒకటి ఒడిషా రాష్ట్రంలో ఉన్న బిరాజదేవి. ఈమెనే గిరిజాదేవిగా కూడా పిలుస్తారు. ఆ క్షేత్ర విశేషాలు...
ఒడిషాలోని భువేనేశ్వర్‌కు 120 కిలోమీటర్ల దూరంలో జైపూర్ అనే పట్నం ఉంది. ఆ పట్నాన్ని ఒకప్పుడు జగతి కేశరి అనే రాజు పాలించాడట. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆ జగతి కేశరే ఇక్కడి గిరిజా అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించారని అంటారు. అష్టాదశ శక్తిపీఠంగానే కాకుండా ఈ క్షేత్రానికి ఇతరత్రా ప్రత్యేకతలు కూడా చాలానే కనిపిస్తాయి. వాటిలో కొన్ని...
- మహాభారత యుద్ధానంతరం ఇక్కడ భీముని గద ఉండిపోయిందట. అందుకే దీనిని గదాక్షేత్రంగా పిలుస్తారు.
- గయాసురుడు అనే రాక్షసుని దేవతలు సంహరించినప్పుడు... ఆయన తల గయలోనూ, పాదాలు పిఠాపురంలోనూ, నాభి ఇక్కడి జైపూర్‌లోనూ పడ్డాయని ఐతిహ్యం. అందుకే పిఠాపురాన్ని పాదగయగానూ, జైపూర్ క్షేత్రాన్ని నాభిగయగానూ పేర్కొంటారు.
- ఈ జైపూర్ పట్నం చివర వైతరణి నది ప్రవహిస్తోంది. ఆ వైతరణి నది తీరాన బ్రహ్మదేవుడు అమ్మవారి కోసం యజ్ఞం చేసినప్పుడు, అమ్మవారు పార్వతీదేవి ప్రత్యక్షం అయ్యిందట.
ఇక్కడ గిరిజాదేవి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో కనిపిస్తుంది. అయితే అమ్మవారి అలంకారం తర్వాత కేవలం, ఆమె మోము మాత్రమే కనిపిస్తుంది. ఈ అమ్మవారిని పూజించేందుకు ఏడాది పొడవునా ఏదో ఒక ప్రత్యేక సందర్భాలు ఉంటూనే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు మాఘ అమావాస్యకి అవతరించారని అంటారు. అందుకే ఆరోజున త్రివేణీ అమావాస్య పేరుతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక దసరా సమయంలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఏకంగా పదహారు రోజుల పాటు ఇక్కడ దసరా మహోత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారిని 16 కళలకు అధినేత్రిగా పేర్కొంటారు కదా! బహుశా అందుకనే ఇలా 16 రోజుల పండుగను నిర్వహిస్తారేమో. ఆ సమయంలో సింహధ్వజం మీద అమ్మవారిని ఊరేగించే వేడుకను చూసేందుకు లక్షలాది మంది జనం తరలివస్తారు.
బిరజాదేవి ఆలయంలో కనిపించే మరో ప్రత్యేకత అక్కడి పిండప్రదానం. బిరజాదేవి ఆలయానికి సమీపంలో ఒక బావి ఉంటుందట. ఆ బావిలో పెద్దలకు తర్పణాలను విడవడం శుభస్కరం అని ఓ నమ్మకం. ఇలా విడిచిన తర్పణాలు నేరుగా కాశీకి చేరతాయట. ఒకప్పుడు ఒడిషా ప్రాంతాన్ని ఉత్కళదేశంగా పేర్కొనేవారు. అప్పట్లో బిరజాదేవిని ఆ ఉత్కళదేశాన్ని చల్లగా కాచుకునే రాజ్యదేవతగా భావించేవారు. కాలం మారినా, రాజ్యాలు చెదిరినా కూడా ఇప్పటికీ బిరజాదేవి అమ్మవారిని తమ జీవితాలను పాలించే అనుగ్రహదేవతగానే నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే లక్షలాది మంది జనం ఏటా బిరజాదేవి ఆలయాన్ని చేరుకుంటారు. వారి నమ్మకాలు ఎప్పుడూ వమ్ము కాలేదన్నది భక్తుల మాట.
ఎలా బతకాలని అనుకుంటున్నారు!
పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే!
దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే!
‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు.
అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది.
రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు.
రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది.
ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు.
రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు.
స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా!
నవదుర్గలను ఆరాధిస్తే కలిగే ఫలితాలు!
నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ అలంకారాలలో కొలుచుకుంటారు. ఈ అలంకారాలలో ఒక ఆలయానికీ మరో ఆలయానికీ పొంతన ఉండి తీరాలన్న నియమం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయా సంప్రదాయాలను బట్టి సాగుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అమ్మవారిని దుర్గాదేవి రూపంలోనే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందుకనే దసరాను అక్కడ దుర్గాపూజ అని పిలుస్తుంటారు. ఈ దుర్గాపూజలోని తొమ్మిది రోజులలోనూ అమ్మవారిని నవదుర్గల రూపంలో అలంకరిస్తుంటారు. అమ్మవారు దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఎత్తిన అవతారమే దుర్గాదేవి అవతారం. ఈమెలోని తొమ్మిది విభిన్న తత్వాలే నవదుర్గలు. ఇవే వారి పేర్లు!
శైలపుత్రి – దక్షయజ్ఞంలో తనకు జరిగిన అవమానానికి, శివుని భార్య సతీదేవి దహనమైపోయిన సంగతి తెలిసిందే! అలా మరణించిన సతి, పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆమే శైలపుత్రి లేదా పార్వతి. వృషభవాహనం మీద త్రిశూలం ధరించి ఉన్న ఈమెను ఆరాధిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు.
బ్రహ్మచారిణి – పార్వతిగా జన్మించిన సతీదేవి పరమేశ్వరుని తన భర్తగా పొందేందుకు తీవ్రమైన తపస్సుని సాగించింది. పాదచారియై... కుడిచేత జపమాలను, ఎడమచేతిలో కమండలాన్నీ ధరించిన రూపం ఈమెది. ఈ రూపాన్ని ఆరాధించేవారు ధ్యానంలో అత్యున్నత స్థితిని పొందగలరనీ, మోక్షాన్ని సాధించగలరనీ నమ్మకం.
చంద్రఘంట – ఈ అమ్మవారి శిరస్సు మీద ఉండే చంద్రుడు ఘంటాకృతిలో కనిపిస్తాడు. అందుకనే ఈమెను చంద్రఘంటగా పిలుస్తారు. సింహవాహనం మీద ఉండే ఈ అమ్మవారు ఎనిమిది చేతులలో దర్శనమిస్తారు. దుష్టశిక్షణ కోసం గద, విల్లంబు, త్రిశూలం, ఖడ్గాలని ధరించి కనిపిస్తారు. అదే సమయంలో తన భక్తులకు మోదాన్ని కలిగించేందుకు కమలము, అభయముద్ర, కమండలము, జపమాలతో దర్శనమిస్తారు.
కూష్మాండ – ఈ లోకాన్ని సృష్టించిన తల్లి అని ఈ పేరుకి అర్థం. మరి సూర్యుడు లేకపోతే ఈ లోకంలో అంధకారమూ, ఆకలీ, అనారోగ్యాలూ ప్రబలుతాయి కదా! అమ్మవారి తేజస్సే ఆ సూర్యుడు అని అంటారు. అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి ఆ సూర్యుని ధరించి కనిపిస్తారు. ఈ దేవిని కొలిచినవారి ఆయురారోగ్యాలకు లోటు ఉండదని అంటారు.
స్కందమాత – ఈ అవతారంలో బాలకుమారస్వామి (స్కందుడు) ఒడిలో ధరించిన రూపులో అమ్మవారు కనిపిస్తారు. శివగణాలకు స్కందుకు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే ఇరువురి ఆశీస్సులూ లభిస్తాయని అంటారు.
కాత్యాయని – పూర్వం కాత్యాయనుడే మహర్షి అమ్మవారు తన ఇంట జన్మించాలనే కోరికతో ఆమెను ఆరాధించాడట. అలా ఆయన ఇంట జన్మించిన తల్లే కాత్యాయని. అభయవర ముద్రలతో పాటుగా ఒక చేత ఖడ్గాన్నీ, మరో చేత పద్మాన్నీ ధరించి ఈ అమ్మవారు కనిపిస్తారు. ఖడ్గం ఆపదలను ఎదుర్కొనడానికి సూచన కాగా, పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయని అన్నమాట!
కాళరాత్రి – నల్లని రూపుతో, విరబోసుకున్న కేశాలతో, మెరుపులు చిమ్మే హారంతో కాళరాత్రిని తలపించే దేవి ఈమె. తనని ఆరాధించినవారి మనసులోని సకల భయాలనూ రూపుమాపగల చల్లని తల్లి. గార్ధభ వాహనం మీద కనిపించే ఈ తల్లి పేరు వింటే భూతప్రేతాలు సైతం దరిచేరవని అంటారు.
మహాగౌరి – తెలుపు లేదా ఎరుపు రంగుని గౌరవర్ణం అంటారు. పార్వతీదేవి, శివుని కోసం ఘోర తపస్సు చేయగా... ఆ వేడిమికి ఆమె శరీరం నలుపెక్కి పోయిందట. అంతట ఆ పరమేశ్వరుడు ఆమెను గంగాజలంతో అభిషేకించగానే తిరిగి గౌర వర్ణాన్ని పొందింది. అలాగే ఈ తల్లినా ఆరాధించే భక్తులు సకల పాపాలు, సకల భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని నమ్మకం.
సిద్ధిదాత్రి – ఈ ఎనిమిది రూపులనూ దాటిన తర్వాత కనిపించే అమ్మవారు సిద్ధిదాత్రి. అంటే సకల సిద్ధులనూ ప్రసాదించే తల్లి అని అర్థం. సిద్ధులంటే కేవలం ఇహపరమైన సిద్ధులే కాదు... కుండలినిలోని అన్ని ద్వారాలనూ ఛేదించుకుని సాధించే మోక్షాన్ని మించిన పరమసిద్ధి ఏముంటుంది. అందుకు సూచనగానే అమ్మవారు వికసించిన కమలం మీద ఆశీనురాలైనట్లు దర్శనమిస్తుంది.
ఈ నవదుర్గలో ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన రంగు, మంత్రం, గ్రహం ఉంటాయి. అంత లోతులకి వెళ్లేందుకు సాధ్యం కాకపోతే ఓం దేవీ శైలపుత్రైనమః, ఓం దేవీ బ్రహ్మచారిణైనమః... అంటూ ఆయా దేవతల పేరు మీదుగా వారిని తల్చుకోవచ్చు. లేదా ఈ క్రింది శ్లోకం ద్వారా ఆ నవదుర్గలనూ ఒకేసారి స్మరించవచ్చు..
‘ప్రథమం శైల పుత్రీతిచ ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ పంచమా స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ సప్తమా కాళరాత్రీచ అష్టమాచాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చేతి నవదుర్గా ప్రకీర్తితా’
పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి!
ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు.
ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు.
ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది.
పాకిస్తాన్‌లోని ‘గాజుల అమ్మవారు’
దేశ విభజన ముందు ఇప్పటి పాకిస్తాన్‌లో కూడా లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు ఉండేవి. హిందూ, ముస్లిం తారతమ్యాలు లేకుండా స్థానికులంతా వాటిని ఆదరించేవారు. కానీ ప్రత్యేక దేశం ఏర్పడిన తర్వాత హిందూ ఆలయాలు జీర్ణావస్థకు చేరుకోసాగాయి. స్థానికుల స్వార్థం వల్లనో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానో ఘనత వహించిన ఆలయాలెన్నో శిథిలమైపోయాయి. వాటిలో ఒకటే ‘చూరియా దుర్గ’ ఆలయం.
పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ‘నంగర్‌పార్‌కర్’ అనే ఊరు ఉంది. ఒకప్పుడు అక్కడ అంతా నీరు ఉండేదట. ఆ నీటిని దాటుకుని ఆవలి ఒడ్డుకి చేరుకుంటేనే నాగరికత కనిపించేదట. అందుకనే ఈ ప్రాంతానికి ‘పార్‌కర్’ (దాటి వెళ్లాలి) అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఊరిలో ‘చూరియా జబల్’ అనే గ్రానైటు కొండ ఉంది. మిగతా ఎక్కడా కనిపించని విధంగా ఈ కొండరాయి ఎర్రటి రంగులో ఉండటం ఓ విశేషం. వేసవిలో ఈ కొండ నుంచి చిత్రవిచిత్రమైన శబ్దాలు రావడం మరో వింత. ఇవన్నీ కూడా ఆ కొండ మీద వెలిసిన అమ్మవారి మహత్తే అని కొందరి నమ్మకం.
చూరియా జబల్ కొండ మీద వెలసిన దేవిని ‘చూరియా దుర్గ’ అని పిలుస్తారు. చూరియా అంటే సింధీ భాషలో ‘గాజులు’ అని అర్థం. హిందూ సంప్రదాయంలో గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి, ఇక్కడి అమ్మవారికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. పేరు పెట్టడమే కాదు, ఈ కొండ చుట్టుపక్కల ఉండే జనం గాజుల తయారీ మీదే ఆధారపడుతూ ఉంటారు. తమ వృత్తిని ప్రతిబింబించేలా ఒంటినిండా గాజులు వేసుకుని కనిపిస్తారట.
చూరియా జబల్ ఆలయం భారత సరిహద్దుకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి పాకిస్తాన్లోని హిందువులు మాత్రమే కాకుండా... ఇండియా, నేపాల్ దేశాల నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారిని చూసేందుకు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా దసరా, శివరాత్రి సందర్భాలలో ఈ ఆలయానికి లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు.
అసలే హిందూ దేవాలయం, పైగా అరుదైన గ్రానైటు కొండ మీద ఉంది. దాంతో స్వార్థపరుల చూపు దీని మీద పడనే పడింది. 2011 శివరాత్రి తర్వాత ఈ కొండని తవ్వడం మొదలుపెట్టారు. వారి తవ్వకాలలో అమ్మవారి గుడిని చేరుకునే మార్గం కూడా ధ్వంసమైపోయింది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ విధ్వంసకాండని చూస్తూ ఊరుకుంది. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి ఆలయమైతే ఉంది కానీ... అది కూడా అతి త్వరలో అది కూడా కూలిపోయే ప్రమాదం లేకపోలేదు.
నంగర్‌పార్‌కర్‌లో దుర్గామాత ఆలయమే కాదు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన జైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఊళ్లో జైనులు చాలా ఎక్కువగా ఉండేవారట. పార్కర్ జైనులంటే గొప్ప పేరు ఉండేదట. దేశవిభజన తర్వాత జైనులు కాస్తా వలస వెళ్లిపోయారు. వారు నిర్మించిన దేవాలయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇలా ఒకటీ రెండూ కాదు... 14 అరుదైన జైన ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. యునెస్కో సైతం వీటిని సాంస్కృతిక సంపదగా గుర్తిస్తోంది. కానీ ఇవి కూడా శిథిలమైపోతున్నాయని వేరే చెప్పాలా!
Comments
Post a Comment